మా కథ (దొమితిలా చుంగారా)- 34

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          లాస్ యుంగాస్ ఒక ఉష్ణ ప్రాంతం. అక్కడ కాఫీ గింజలు, నారింజ, అరటి మొదలైన అన్ని రకాల పళ్ళు పండిస్తారు. అది మా పర్వత ప్రాంతానికి చాల దూరం.

          ఆ తర్వాత డిఐసి వాళ్ళు ఆస్పత్రికి వచ్చి నన్ను బెదిరించారు. నేను బైటికి వెళ్ళాక జైల్లో ఏం జరిగిందో ప్రచారం చేస్తే, నన్నిప్పుడు విడిపిస్తున్న కల్నల్ తన రివాల్వర్ తో మూడే మూడు దెబ్బల్లో మా నాన్న పని పడతాడని అన్నారు. అప్పుడా కల్నల్ నా దగ్గరికొచ్చి నేను అమాయకురాలినని తను నమ్మడం లేదన్నాడు. “మీ నాన్నంటే ఉన్న గౌరవంతో, మీ తల్లిలేని పిల్లలందర్నీ పెంచి పెద్ద చెయ్యడానికి ఆ దౌర్భాగ్యుడు పడ్డ బాధలన్నీ చూసి ఉన్నాను గనుక, ఆయనతో స్నేహం వల్ల నిన్ను తాత్కాలికంగా విడుదల చేయమని వీళ్ళను ఒప్పించాను. కాని జాగ్రత్తగా విను – నీ విడుదల కోసం నేను నా బతుకును పణంగా పెడుతున్నాను. నా ప్రతిష్టతో పందెం కాస్తున్నాను. నిన్ను విడుదల చేయించడానికి నా హోదాను వాడుకుంటున్నాను. నువు మళ్ళీ లా యుంగాస్ నుంచి వెనక్కొచ్చి సైగ్లో-20లో ఉపన్యాసాలు మొదలు పెట్టావో, నేను చేయగల పని ఒక్కటే మిగులుతుంది. మీ నాన్నను దొరకబట్టుకొని నా రివాల్వర్ తీసి దాంట్లో ఉన్న మూడు గుళ్ళూ మీ నాన్న శరీరంలో ఖాళీ చేస్తాను. ఇక నీ ఇష్టం….” అన్నాడాయన.

          అలా వాళ్ళు నన్ను బలవంతాన ఒక ట్రక్ ఎక్కించారు. ఆ ట్రక్ లో పరిచి ఉన్న ఒకపడకమీద నన్ను పడుకో బెట్టారు. డాక్టర్ నాకో చిన్న మందుల పెట్టె ఇచ్చి “వెళ్ళిరామ్మా!… ఈ మాత్రలు తీసుకో. ఇవి వేసుకుంటే నీకు బాలింత రోగం రాదు… ఆ పెట్టెలోనే అవి ఎలా వాడాలో కూడా వివరంగా రాసి పెట్టాను….” అని చెప్పాడు.

          ఇప్పటికీ నాకా ఆస్పత్రి ఏమిటో తెలియదు. నాకు తెలిసిందల్లా ఆ ఆస్పత్రి ఒరురోలో ఉందన్న విషయం మాత్రమే. “ఆ ఆస్పత్రి పేరేమిటో నీకెందుకు? అంత మంది దుర్మార్గుల మధ్య కూడ నీకు సాయం చేసేటందుకు కనీసం ఒక్క మంచి మనిషి ఉన్నాడని సంతోషించు. అంతే…” అనే వాడు నాన్న.

కుదురుగా ఉండేందుకు లాస్ యుంగానికి

          మేం ప్రవాసంలోకి వెళ్తున్నామని నాకు తెలియదు. ట్రక్ కదలగానే నేను నిద్రపోయాను. మళ్ళీ నాకు మెలకువ వచ్చేసరికి వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. చుట్టూ చాల వేడిగా ఉంది. ‘కియూ-కియూ’ అని పక్షుల పాటలు వినిపిస్తున్నాయి. ఎటు చూసినా, చూపు పరుచుకున్న’ మేరకు చెట్లు కనిపించాయి. “ఎక్కడ ఉన్నాం మనం?” అని గాభరాగా అడిగాను. అప్పుడు నా భర్త “గాభరాపడకు అంతా బాగానే ఉంది” అన్నాడు. ఆయన మెల్లగా నాతో మాట్లాడడం మొదలెట్టాడు. “నీకు బావుండే చోటికి, నీ ఆరోగ్యం బాగుపడే చోటికి వెళ్తున్నాం. ఆందోళనపడకు”అంటూ చెప్తూపోయాడు. “ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను?” అని నేను గట్టిగా అరిచాను. అప్పుడు రెనె ట్రక్ ఆపించి ముందుసీట్లో కూచున్న నాన్నను పిలుచుకొచ్చాడు. నాన్న నన్ను దగ్గరికి తీసుకొని, కన్నీళ్ళు పెట్టుకొని “ఇప్పుడు నీకు నీ బతుకు కాపాడుకోవడమే అన్నిటికన్న ముఖ్యం. దేవుడెంత గొప్పవాడో చూశావా? నువు బతికుండడానికి అనుమతించాడు. ఆ కరుణామయుడే నువ్వు క్షేమంగా ఉండడానికి కూడా అనుమతిస్తాడు. మనం ఇప్పుడు వెళ్ళేచోట నువు ఆవేదన చెందే అవకాశమే ఉండదు. మనం ఇప్పుడు లాస్ యుంగాస్ వెళ్తున్నాం. నువ్వు కోలుకున్నాక మళ్లీ అందరం సైగ్లో-20 వెళ్లి పోదాం ” అని నన్ను బుజ్జగించాడు.

          మొత్తంమీద మేం లాస్ యుంగాస్ చేరాం. మాకున్న కొద్దిపాటి డబ్బుతో మేమో చిన్న ఇల్లు కొనుక్కున్నాం. వ్యవసాయం చెయ్యడానికింత మడిచెక్క కొనుక్కున్నాం. అప్పుడు నా భర్త పిల్లల్ని తీసుకు రావడానికి సైగ్లో-20 వెళ్ళాడు.

          నాకక్కడ తెలిసిందేమిటంటే నేను ప్రతిరోజు స్థానిక డిఐసి కార్యాలయంలో సంతకం చేయాలి. నేనా ఊరువదిలి వెళ్ళలేదనడానికది రుజువన్నమాట. అంటే, మరో మాటల్లో నేను నా కుటుంబంతో సహా లాస్ యుంగాకు ప్రవాసం పంపబడ్డాను. నాకక్కడి నుంచి బైటికి కదిలే వీలులేదు.

          అక్కడ వైద్య సౌకర్యాలేమీ ఉండేవికావు. డాక్టర్ నాకు రాసిచ్చిన . అంటీ బయాటిక్ ఇంజక్షన్లు ఇవ్వడానికి కూడ అక్కడెవరూ లేరు. అక్కడ నేను మా ప్రాంతంలో ఎన్నడూ చూడని ఎండలుండేవి. నల్లులుండేవి. అప్పటికే నా ఒంటి నిండా ఉన్న పుళ్ళు ఈ వాతావరణానికి ఘోరంగా రసికారడం మొదలెట్టాయి. అక్కడ నేనట్లాగే మగ్గిపోవాల్సి వచ్చింది. నా వంటి నుంచి దుర్వాసనతో చీముకారుతూ ఉండేది. నేనిక చనిపో బోతున్నానని నాకర్థమైంది. మరోవైపు నుంచి జలుబు మొదలైంది. . నాకు చిరాకు ఎంత ఎక్కువై పోయిందంటే ఆ పిచ్చిలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకోవలసిన మందులు టీలో కలుపుకుని తాగేశాను. రోజుకు ఎన్నోసార్లు చన్నీళ్ళ స్నానం చేయడం మొదలెట్టాను. ఒంటిమీదెప్పుడూ తడిబట్టలు ఉండేలా చూసుకున్నాను. అలా అప్పుడు నేనెన్ని బాధలనుభవించానని! ఎంత నరకం చవిచూశానని! ఈ బాధకుతోడు నా చనిపోయిన బాబు కలల్లో రావడం ప్రారంభించాడు. రెనె సైగ్లో-20కి వెళ్ళిన ఆ రోజుల్లో బాబును ‘తలచుకుంటూ, ఏడుస్తూ, పిచ్చిగా రాత్రంతా రోడ్లమీద తిరుగుతుండేదాన్ని. నేనప్పుడు నా బాబును నా కళ్ళముందర రూపుకట్టించుకునేదాన్ని… ఎంత ఘోరం… వాణ్ని చేరుకోడానికి నన్నేదో అణచిపడున్నట్లు నాకనిపించేది… నన్ను చిత్రహింసలు పెట్టిన దుర్మార్గుల మొఖాలు కనిపించేవి… వాళ్ళ క్రూరమైన నవ్వు వినబడేది… వాళ్ళు నా బిడ్డను తింటున్న దృశ్యం కళ్ళకు కట్టేది… నేను పిచ్చిదాన్నయి పోవడానికి ఆమాత్రం చాలు…! పిచ్చి! అప్పుడప్పుడు ఏదైనా ఎత్తయిన కొండ శిఖరం మీదికెక్కి కిందికి దూకేద్దామా అనిపించేది. అప్పుడే గనుక, మిగతా పిల్లల్ని చూడాలనే బలీయమైన కోరికే లేకపోయి ఉంటే నన్ను నేను చంపేసుకునే దాన్నే! నిజంగానే నేను తుడిచేయబడ్డాను. నా వ్యక్తిత్వాన్ని వాళ్ళు హరించారు. నేను లెక్కలోకి రాకుండా చేయబడ్డాను. నేనింక ఈ బాధలు ఎంతమాత్రమూ పడదలచుకోలేదు. మెలకువతో ఉంటే పుళ్లు సలుపుతుండేవి. పడుకుంటే ‘ దారుణమైన కలలు వచ్చేవి. ‘ అది నిజంగా ఒక భయభీతావహ వాతావరణం.

          అప్పుడే నా భర్త పిల్లల్ని తీసుకుని వచ్చేశాడు. .వాతావరణంలోకి కొంచెం ఉత్సాహం వచ్చింది. ఆయన కొన్ని మందులు, కొన్ని పట్టీలు పట్టుకొచ్చాడు. వాటితో, చాలా కాలం తీసుకున్నా మొత్తం మీద నేను బాగు పడ్డాను.

          మా పద్ధతులకూ, లాయుంగాస్ పద్ధతులకూ చాల తేడా ఉండేది. మా ప్రాంతంలో మేం మాంసం, రొట్టె, పంచదార ఎక్కువగా వాడుకునే వాళ్ళం. లాయుంగాస్ లో యుక్కా గింజలు, అరటిపళ్లు లాంటి మా కలవాటులేని పదార్థాలు తినవలసి వచ్చేది. ఈ ఇబ్బందులు చూసి నా భర్త ఎప్పుడూ చిరాకు పడుతుండేవాడు. ఇదంతా నా తప్పుల ఫలితమేనని అంటుండేవాడు. గనిలో ఎలా బతికినా కనీసం రోజుకో పూట మాంసం తిండైనా దొరికేదికాదా అనేవాడు. పిల్లలకు బట్టలు లేవంటే వెళ్ళి గృహిణుల సంఘాన్ని అడుగుపో అనేవాడు. లేదా యూనియన్ను  అడగమనే వాడు. బాధలకు గురయ్యాక ఈ చిరాకు సహజమే గదూ?!

          పిల్లలు కూడా తండ్రినే వెనకేసుకొస్తుండేవారు. వాళ్ల ఏడుపల్లా మాంసం ముక్క లేదనీ, ఆదివారం పూట చాకొలెట్ లేదనీ, కనీసం ఆదివారమైనా ఓ గ్లాసుడు పాలు దొరకడం లేదనీ…

          వీళ్ళ నిష్టూరాలు నన్ను మరిన్ని బాధలకు గురిచేశాయి. అప్పటికి నాకు ఇప్పటంత చైతన్యం లేదు. అందుకే కొన్ని బలహీన క్షణాల్లో నేనంతకు ముందు చేసిన పనులన్నిట్నీ సందేహించేదాన్ని. అలా నేను దాదాపుగా లొంగిపోయాను. రాజీ పడ్డాను. ఇక నేనప్పుడు ఏదైనా పని దొరుకుతుందేమోనని గ్రామంలోకి వెళ్ళాను. అక్కడ నా అరచేతుల్నుంచి రక్తాలు ధారలు కట్టేవరకు పని చేశాను. ఈ కష్టంతో నేను సమస్యలు మరచిపోయేదాన్ని. నన్ను నేను శ్రమతో. హింసించుకొని కొన్ని పెన్నీలు సంపాదించే దాన్ని. సాయంకాలానికి రెక్కలు ముక్కలైపోయి నిస్త్రాణగా ఇల్లు చేరేదాన్ని. నన్ను నేను నేరస్తురాలిగా భావించుకునేదాన్ని. మొత్తానికి నేను నేరం చేశాననీ కించపడేటట్లు చేయడంలో ఆ డిఐసి కొట్ల ఒంటరితనమూ, హింసా విజయం సాధించాయి… నేనిక గృహిణుల సంఘంలో పాలు పంచుకున్నందుకు చింతించేదాన్ని. నేనెందుకు మాట్లాడాను, నేనెందుకు ఉపన్యాసాలిచ్చాను, నేనెందుకు అన్యాయాన్ని ఎదిరించాను, నేనెందుకిందులో ఇరుక్కున్నాను అని నాకు – నేనే ప్రశ్నలు వేసుకునేదాన్ని, నాలో నేనే మధన పడే దాన్ని….. ఇక ఇది చివరి తప్పనీ, చేసిన తప్పులకు పశ్చాత్తాప పడాలనీ, అందుకే ఈ బాధలనీ అనుకునేదాన్ని. మరికొన్నిసార్లు ‘నా దగ్గర ఒక్క డైనమైటయినా ఉంటే ఎంత బాగుండును, పిల్లలతో సహా పేల్చుకొని ఈ బాధాగీతానికి ముగింపు పలక వచ్చును గదా’ అనుకునేదాన్ని.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.