మిట్ట మధ్యాహ్నపు మరణం- 10

– గౌరీ కృపానందన్

          ఆనంద్ ఉమకేసి కాస్త భయంగా చూశాడు.

          “అన్నయ్య గురించి నాకు అంతగా తెలియదు వదినా?”

          “హత్య చేసేటంత బద్ద శత్రువులు మీ అన్నయ్యకి ఎవరున్నారు?”

          “తెలియదు వదినా.”

          మూర్తి శవాన్ని అతని తల్లి తండ్రులు కారులో ఎక్కించారు. శవాన్ని ఎక్కించడంలో మణి సహాయం చేశాడు. మణి ఎప్పుడూ సాయానికి ముందుంటాడు. మణి – దివ్యా… మాయా! ఎందుకోసం ఇనస్పెక్టర్ అలా ఆలోచించారు?

          ఉమ దివ్య వైపు చూసింది. ఆమె పెదవిని పంటి కింద నొక్కి పెట్టి మౌనంగా రోదిస్తోంది. మణి, దివ్య ఇద్దరూ ఒకే సమయంలో బెంగళూరుకి ఎలా వచ్చారు? ఛ… ఛ… ఎంత అసంబద్దమైన ఊహ! అమ్మా, నాన్న, మణి, దివ్య ఒక వైపుగా నిలబడ్డారు. కారులో మూర్తి అమ్మా, నాన్న, అతని తమ్ముడు ఆనంద్ కూర్చున్నారు.
ఉమ రెండు కార్లకి మధ్య నిలబడింది. ఆమె ఎటువైపు వెళ్ళాలి? అత్తగారింటి వైపా? పుట్టింటి వైపా?

          ఉమ నాన్నగారు ఉమ దగ్గరికి వచ్చారు. “ఉమా! వాళ్ళు ఈ రోజు రాత్రే వెళ్లి పోతున్నట్లున్నారు. మణి ఎక్కడమ్మా?”

          “ఇనస్పెక్టర్ ఏవో ప్రశ్నలు అడగాలని పిలిచారు నాన్నా.”

          అంతలో ఆనంద్ దగ్గిరకి వచ్చాడు. “వదినా! మేము బయలుదేరుతున్నాము.”
“ఎక్కడికి బాబు?”
“చెన్నైకి.”

          “ఏంటిది? మీ ప్లాన్ ఏమిటో ఒక్క మాట అయినా మాతో చెప్పకూడదా?”

          “ఇందులో ప్లాన్ ఏముంది? ఏదో వచ్చాము. అన్నయ్య శవాన్ని తీసుకుని వెళు తున్నాము.”

          “అంటే ఉమ మీతో రానక్కరలేదా?”
          “రావాలంటే రావచ్చు. అలా కాదూ, తనని మీరు తీసుకుని వస్తాము అన్నా సరే. ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు.”

          “మీ నాన్నగారు ఏమంటున్నారు?”

          “ఏదైనా చెప్పగలిగే స్థితిలో ఆయనెక్కడ ఉన్నారు? వదినా! వెళ్తాను.”

          “ఆనంద్! కాస్త ఆగు. కారులో చోటు ఉందా?”

          “ఎవరికి?”

          “నాకే. నేనూ మీ ఇంటి మనిషినే కదా. మీతోనే వస్తాను” అంది పట్టుదలగా.

          ఉమ నాన్నగారు దిగులుగా కూతురి వైపు చూశారు.

          ఆనంద్ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. “రండి” అన్నాడు.

          ముఖం చిటపట లాడుతుండగా మణి అక్కిడికి వచ్చాడు. “అక్కయ్యా! నేను ఈ రోజు మీతో రావడానికి కుదరదు.”

          “ఏమయ్యింది?”

          “ఆ ఇనస్పెక్టర్ మళ్ళీ ఎంక్వయిరీ చేస్తాడట. ఉమా! నువ్వు అతనితో ఏమని చెప్పావు?”

          “ఏమీ చెప్పలేదే?”

          “మరి నన్ను ఊరికి వెళ్ళకూడదు అన్నాడెందుకు? ఇంకా పై ఆఫీసర్లు విచారణ జరుపుతారట. రెండు రోజులు ఆగి వెళ్ళమన్నాడు.” మణి దివ్య వైపు తిరిగాడు. “దివ్యా! నిన్ను కూడా ఏదో అడగాలట. పిలవమన్నారు నిన్ను. వెళ్లిరా.”

          “నన్నా?” దివ్య ఆశ్చర్యపోయింది.

          “అవును. ఉమా! నువ్వు ఏం చెప్పావో తెలియదు కానీ, మళ్ళీ మళ్ళీ ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు. ఈ రోజు ప్రొద్దుటి నించి ఎక్కడ ఉన్నావు? ఏం చేశావు? పన్నెండు గంటలకి ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించి మరీ చంపుతున్నాడు. పన్నెండు గంటలకి హోటల్లో భోజనం చేశాను అంటే, మెనూ ఏమిటో చెప్ప మంటున్నాడు. అన్నీ గుర్తుండి చస్తాయా? నన్నేదో క్రిమినల్ ని చూసినట్లు ఆ చూపులూ వాడూనూ. మీరు అడిగే ప్రశ్నలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి, అని గట్టిగా అన్నాను. లేకపోతే ఆ ప్రశ్నలకి అర్థం పర్థం ఉందా? మూర్తి లేకపోతే మీరు ఉమని పెళ్లి చేసుకుని ఉండే వారు కదా అని అంటున్నాడు. వెధవ ప్రశ్నలూ వాడూను.”

          “ఆఖరున ఏమైయ్యింది?”

          “లాయర్ని కన్సల్ట్ చేసిన తరువాత మాట్లాడతానన్నాను.” రెండు రోజులు ఇక్కడే ఉండమన్నాడు. ఇప్పుడు అందరూ బయలు దేరుతున్నారా?”

          “అవును.”

          “ఉమ ఎందుకు వాళ్ళతో నిలబడి ఉంది?”

          “తను వాళ్ళతోనే వెళ్తుందట.”

          “ఇదేం పిచ్చి పని? ఇంకా వాళ్ళతో ఉమకేం సంబంధం?” మణి ఉమ వైపు నడిచాడు.

          “ఉమా! వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా?”

          “అవును.”

          “ఎందుకు?”

          “ఇదేం ప్రశ్న? నేను వాళ్ళింటి కోడలిని.”

          “అతనే చచ్చి పోయాడు. అక్కడేం పెట్టి ఉంది నీకు? ఇన్స్యూరెన్స్, పి.ఎఫ్. లలో కూడా నామినేషన్ నీ పేరు మార్చి ఉండడు. ఆ ఇంటితో నీకేమీ సంబంధం లేదు ఉమా.”

          “సంబంధం లేదని ఎలా చెప్పగలవు మణీ? ఒక వేల నేను కన్సీవ్ అయి ఉంటే ఏం చేయను?”

          దెబ్బతిన్న వాడిలా చూశాడు మణి. అతని ముఖం పాలి పోయింది.

          “సరే వెళ్ళు.”

          “ఆనంద్! రూములో మూర్తి తాలూకు లగేజ్ అన్నీ ఉన్నాయి. పోలీసులు క్లియర్ చేసి ఇస్తే, తీసుకుని వెళ్లి పోదాం” అంది ఉమ.

          ఆనంద్ భయంగా ఉమ వైపు చూశాడు. ఏ క్షణంలో అయినా పేలడానికి సిద్దంగా ఉన్న బాంబు లాగా ఉంది ఆమె. కారు బయలు దేరేటప్పటికి రాత్రి ఒంటి గంట దాటింది.
ఉమ మనస్సులోనే నిశ్చయించుకుంది. మూర్తికి ఎవరెవరు స్నేహితులు? శత్రువులు ఎవరు? అతని పాత ఉత్తరాలను చదివి తెలుసుకోవాలి. కారులో అందరూ మౌనంగా ఉన్నారెందుకు? నా నుంచి ఏదైనా దాచి పెడుతున్నారా? అదేమిటో అడిగి తెలుసు కోవాలి. ఎండిపోయిన కన్నీళ్లు ఆమె చెంపల మీద చారికలుగా ఏర్పడ్డాయి.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.