మెరుపులు-కొరతలు
మెర్సీ మార్గరెట్ కథ “వర్షం సాక్షిగా”
– డా.కే.వి.రమణరావు
ఒక క్రిస్టియన్ యువకుడు మరణించాక అతనికి చేయాల్సిన ఉత్తరక్రియల్లో అదే మతంలో రెండు విశ్వాసాలను అనుసరించే రెండు వర్గాలు విభేదించడం గురించి చెప్పడం ఈ కథ ఉద్దేశం.
కథాంశం చాలా స్థూలంగా ఇది. కథ చెప్తున్న మనిషి గ్రేసి. ముందురోజు సాయంకాలం నుంచి మరుసటిరోజు సాయంకాలం వరకు జరిగిన సంఘటనలను కాలనుక్రమంలో వరుసగా గ్రేసి వర్ణించడమే కథ. కథా కాలమంతా సన్నగా వర్షం పడుతూనే ఉంటుంది. గ్రేసి పిన్నికూతురు మార్తక్క, మేనబావ జార్జిల కొడుకు, బిటెక్ పూర్తిచేసిన ‘చిన్నిగాడు’ అనారోగ్య కారణాలవల్ల అర్ధాంతరంగా చనిపోయాడని గ్రేసి మేనమామ (చిన్నిగాడి తాత) లాజరు దగ్గర్నుంచి ఆ సాయంకాలం ఫోను వస్తుంది. ఆరాత్రి హైదరాబాదు నుంచి గ్రేసి తన తల్లితో సత్తుపల్లి బస్సులో బయలుదేరి పొద్దునకు వీ.యెం.బంజర చేరుతుంది. రావలసిన బంధువులు, ఊర్లోవాళ్లు వచ్చిన తరువాత చిన్నుగాడి అంత్యక్రియల కార్యక్రమం మొదలౌతుంది.
గ్రేసి తల్లి తరఫు బంధువులు ఆవూరి వాళ్లలాగే క్యాథలిక్ విశ్వాసులు. ఆమె తండ్రి వైపువాళ్లు ముందు తరంలోనే ప్రొటెస్టెంటులుగా మారిపోయి వుంటారు. పిల్లవాడి తాత లాజరు మాత్రం ఏ విశ్వాసం లేని నాస్తికుడు, కమ్యూనిస్టు.
ఐతే కొంతకాలంగా గ్రేసి అన్నయ్య (పిన్నికొడుకు) స్టీవెన్ ప్రొటెస్టెంటు (హేబ్రోను) గా మారి, తన అక్కాబావలైన మార్తక్క, జార్జిలను కూడా (అనధికారికంగా) ఆ విశ్వాసంలోకి మార్చివుంటాడు.
ఆవూరివాళ్లు, మిగతా అక్కడి చుట్టాలు అంత్యక్రియల కార్యక్రమం కోసం ఆవూరి క్యాథలిక్ చర్చి ఫాదరును తీసుకొస్తారు. అవూరి వాళ్లంతా క్యాథలిక్ విశ్వాసులు. స్టెవెన్ బయటి నుంచి (ప్రొటెస్టెంటు) పాస్టర్నే కాక హైదరాబాదు నుంచి పదిహేను మంది హేబ్రోను సహవాసులను కూడా ఒకవ్యానులో తెస్తాడు. వాళ్లంతా పాటలుపాడుతూంటారు.
ఇలా రెండు విశ్వాసాలవాళ్లు రావడంతో, అంత్యక్రియలు ‘ఎవరి సమూహ విశ్వాస ప్రాతిపదికన చేయాలనే చర్చ’ మొదలై, గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్లూ వీళ్లూ కూడా ఒకరి తరువాత ఒకరు కార్యక్రమాలు చేస్తూంటారు. వాద ప్రతివాదాలతో ఏదీ తేలక సమయం చాలా గడచిపోతుంది. ఒకవైపు ఆగి ఆగి కురుస్తున్నసన్నటి వర్షం, ఎప్పుడైనా పెద్ద వర్షం వచ్చే సూచనలు.
అనేక వాదవివాదాల తరువాత మొత్తంమీద సాయంత్రమౌతూండగా కాఫిన్ బాక్సుని వాహనంలో ఎక్కిస్తారు. దారిలో ఊరివాళ్ల బలవంతం మీద అక్కడి క్యాథలిక్ చర్చికి తీసుకెళ్తారు. చివరికి బాక్సుని పూడ్చేటప్పుడు కూడా వివాదంవల్ల ఆలస్యమై చివరికి పెద్ద వర్షం మొదలవడంవల్ల లాజరు చొరవ తీసుకుని మొత్తానికి పని పూర్తి చేయిస్తాడు.
సంప్రదాయ శిల్పంలో రాసిన ఈ కథ సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చాలా వివరంగా రాయబడింది. కొన్నిచోట్ల కొన్ని వివరాలు అనవసరమనో లేక పునరావృతమైనట్టో అనిపిస్తాయి, మరికొన్నిచోట్ల ఇంకా చెప్పాల్సివుందేమో అన్నట్టుంటాయి. కథ నడక కూడా అంతే. వీటికి బ్రెవిటి (క్లుప్తత) లేకపోవడమో లేక కథ పెద్దదై ఎడిట్ చెయ్యడమో కారణం అయివుండాలి. ఐతే ఇవన్నీ చిన్నవిగా ఉండి కథనానికి అడ్డురాక పోవడం విశేషం. కథనం ఆసక్తికరంగా ఉంటుంది.
మతానికి చెందిన కార్యక్రమాలను, సమూహంలోని మాటలను, వారి వ్యక్తీకరణలను వివరించడంలో రచయిత్రి చక్కగా సరిపోయే భాషను ఉపయోగించారు. ఆ కార్యక్రమాలతో పరిచయం లేనివాళ్లకు కూడా విషయం అర్థమయ్యేట్టు క్లుప్తంగానే ఐనా చక్కగా వర్ణించారు. టీచరులా కొత్తవాళ్లకి కార్యక్రమాలను వివరించకుండా జాగ్రత్త పడ్డారు. పెద్దగా సంభాషణలు, లేకపోయినా పాత్రలను బాగా వ్యక్తపరిచారు.
ఒకే మతానికి చెందిన వారిలో సంప్రదాయాల విషయంలో సయోద్య, సఖ్యత ఉండాలని చెప్పడం రచయిత్రి ఉద్దేశమనిపిస్తుంది. అయితే చివరి నిముషంలో నాస్తికుడు, కమ్యూనిస్టైన పిల్లవాడి తాత అన్నీ తనచేతిలోకి తీసుకోవడం రచయిత్రి ఎందుకు కల్పించారు అనే సందేహం వస్తుంది (ఈ పాత్రకు కథలో పెద్ద ప్రమేయం ఉండదు).
ఈ కథలో మొదటి నుంచి చివరి వరకూ వర్షం ప్రసక్తి సమాంతరంగా వస్తూనే ఉంటుంది. కథ పేరే ‘వర్షం సాక్షిగా.’ ఈ ప్రతీకను రచయిత్రి ఎందుకు అంత బలంగా చెప్పారు అనేది కూడా బోధపడడం కష్టం. ఒకటి రెండు చోట్ల అంతర్లీనంగా హాస్యం ఉందనిపిస్తుంది. కాని అది ఉద్దేశించి రాయబడిందని ఇదమిద్దంగా చెప్పలేం.
ఐతే పై లోటుపాట్లేవీ కథ నాణ్యత మీద అంత ప్రభావం చూపించలేదు. కథ మొత్తం పాఠకులు నిమగ్నమై చదువుతారు. రచయిత్రి సందేశాన్ని బాగా అర్థం చేసుకుంటారు.
వర్ణనలు ఎక్కువ లేనప్పటికీ అర్థవంతంగా ఉన్నాయి. ఉదా;
‘ఎడతెరిపిలేని వర్షం. హృదయంలోపల ఎక్కడో మూసున్న గది తలుపులు వర్షాన్ని ఇష్టపడక గొణుక్కుంటూనే ఉన్నాయి. ఆ ముసురు భాష ఒక పట్టాన అర్థంకాదు.’
‘వర్షం ఎప్పుడూ ఏదో మాట్లాడుతూనే ఉంటుంది, ఎంత భారాన్ని మోసుకు తిరుగుతుందో. ఎక్కడెక్కడి సంగతుల్నీ కడుపునిండా నింపుకుని వస్తుందో, ధారాపాతంగా అది కురిసేటప్పుడు ఆగకుండా కబుర్లు చేప్పే చంటి పిల్లాడిలాగో, రోజంతా ప్రియుడి కోసం ఎదురు చూసిన ప్రేయసిలానో అనిపిస్తుంది… కానీ ఇవ్వాళ్ల మా బాధని పంచుకుంటున్న మా మార్తక్క స్నేహితురాలిలాగే అనిపించింది.’
కొన్ని చోట్ల రచయిత్రి తను చెప్పదల్చున్న అంశాన్ని పదునైన భాషలో చెప్పారు. ఉదా;
‘చావు కబురు, చావు ఇల్లు చల్లగా ఉండవు. చాలా దుఖమయంగా గుండెను నిలువునా కోస్తున్నట్టు, నిప్పుల కొలిమిలా ఉంటాయి.’
‘చావులు, శుభకార్యాలకు తప్ప ఊరి నుంచి, బంధువుల నుంచి ఫోన్లు రావడంలేదు. మనుషులం దూరమయ్యామో, దూరమే బంధుత్వాల మధ్యకే వచ్చిందో తేలీదు.’
‘బతుకును నిర్ణయించుకునే మనం చావుని గూర్చి ఏనాడూ ఆలోచించుకోం. యే విలువలు చావుకు కీర్తిని నిర్ణయిస్తాయోననే లెక్కలు కూడా ఉంటాయని తెలుసుకోలేం.’
రచయితలు ఒక అంశం సృజించేప్పుడు ఒక్కోసారి ఆ అంశంపైన వారికున్న నిబద్ధత, భావతీవ్రత వల్ల అది వారికి తేయకుండానే శిల్ప పరిధులను దాటి పోతుంటుంది. ఈ కథలో అలాంటిది జరిగిందేమోనని పాఠకులకు సందేహం వచ్చే అవకాశం ఉంది.
ఇలాంటివి చిన్నవి మినహాయిస్తే కథ అసక్తికరంగా ఉంది. రచయిత్రి తను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పగలిగారు. ఈ కథా సందేశం రచయిత్రి వ్యక్తిగతమైనా దాన్ని చెప్పిన విధానం బావుండి ఒక సాహితీ సృజనగా కథకు బలాన్నిచ్చింది.
*****