వ్యాధితో పోరాటం-6
–కనకదుర్గ
“హాయ్ డియర్! ఐ హావ్ టు టేక్ వైటల్ సైన్స్,” అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. కొత్త టెక్నిషియన్ వచ్చింది. రాత్రి పదకొండు దాటుతుంది. మళ్ళీ నర్సులు, టెక్స్ మార్తారు. కానీ మోరా 7 గంటల నుండి పొద్దున 7 వరకు రెండు షిఫ్ట్స్ కలిపి చేస్తున్నానని చెప్పింది.
బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్, పల్స్, అన్నీ చెక్ చేసి నోట్ చేసుకుని వెళ్ళిపోయింది టెక్.
ఇంటి నుండి ఫోన్ వచ్చింది.
“అదేంటి ఇంకా పడుకోలేదా? పొద్దున వాడికి స్కూలుంది…” “గుడ్ నైట్ అమ్మా! ఇదిగో పడుకుంటున్నాను. ‘మిల్లీ’ ఇపుడు లేచింది. నిద్రపోదేమో చాలా సేపటి దాకా! నువ్వు త్వరగా పడుకో అమ్మా! రెస్ట్ తీసుకుంటే నీకు నొప్పి త్వరగా హీల్ అయిపోతుంది తెలుసా?”
“నేను పడుకుంటాను. నువ్వు పడుకో కన్నా! మళ్ళీ బస్ మిస్ అయితే నాన్న తీసుకెళ్ళాలి. అపుడు చెల్లిని తీసుకెళ్ళాలి ఇంత చలిలో.”
“నేను పడుకుంటానమ్మా! మిల్లీని మీరెవ్వరూ ఆ పేరుతో పిలవట్లేదు. నువ్వు, నాన్న స్ఫూర్తి అనే అంటున్నారు. తనకెట్లా తెలుస్తుంది మిల్లీ అని పేరు పెట్టామని?
“నాకు ముద్దు పేర్లు పెట్టి పిలిస్తే పెద్దయినా అలాగే పిలుస్తారు. నన్ను చూడు ఇప్పుడు కూడా నన్నందరూ చిన్ని అనే అంటారు. మా బందువుల్లో చాలా మందికి నా పేరే తెలియదు. అందుకని నీకు కూడా ముద్దు పేర్లు పెట్టలేదు కదా! కానీ ఇక్కడ వాళ్ళు పూర్తి పేరు పలకకుండా ’చై’, అని ’ఛాయ్,’ అని పిలుస్తారు. అయినా కొన్ని రోజులు మిల్లీ అని స్ఫూర్తి అని పిలిచి చూద్దాం, ఏ పేరుకి తల తిప్పి చూస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇంకా చాలా చిన్నది. కొన్ని నెలలైతే అపుడు చూస్తుంది. సరేనా!”
“ఓకే, గుడ్ నైట్. లవ్ యూ అమ్మా!
శ్రీని తీసుకున్నాడు ఫోన్. “పాప లేచిందా? రాత్రి జాగారమా? బాగా విసిగిస్తుందా?”
” చా అదేం లేదు, అస్సలు విసిగించదు. ఆకలేస్తే కొంచెం ఏడుపు మొదలుపెడుతుంది, నేను పాలు త్రాగిస్తే చక్కగా త్రాగేసి హాయిగా పడుకుంటుంది. నిద్ర రాకపోతే లైట్స్ చూస్తూ ఆడుతుంది. నిజంగా విసిగించే పిల్ల అయితే చాలా కష్టం అయ్యేది. నువ్వు మందు తీసుకున్నావా? తీసుకొని బాగా పడుకో. నువ్వు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత త్వరగా హీల్ అవుతుంది తెలుసా!”
“తీసుకుంటాను. తీసుకొని పడుకుంటాను. “నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా టీ.వి లో ఏదైనా పాత సినిమా వస్తుంటే చూస్తూ పడుకో!” “సరే, బుజ్జి తల్లి చెవి దగ్గర ఫోన్ పెట్టు ప్లీజ్… దానికి నా గొంతు వినిపించాలి కదా! లేకపోతే మర్చిపోతుందేమో!”
” ఏం మర్చిపోదు. ఇదిగో.. మాట్లాడు..”
” నీలాల కన్నుల్లో మెల మెల్లగా నిదురా రావమ్మా రావే…. నెమ్మదిగా రావే…”
కాసేపు పాడి ఫోన్ పెట్టేసాను. చాలా ఏడుపొచ్చింది… దిండులో తల దాచుకుని కాసేపు ఏడుస్తునే వున్నాను.
పాపకి తనే స్నానం పోయాలనుకుంది. చైతు అపుడు అమ్మ వాళ్ళింట్లో వుంటే రాములమ్మ పెద్ద కూతురు కమలమ్మ వచ్చి నూనెతో మర్ధన చేసి, వేడి నీళ్ళతో స్నానం పోసేది. సాంబ్రాణి పొగ వేసి పాలు త్రాగిస్తే హాయిగా పడుకునేవాడు. మగవాళ్ళు అటువైపు రావడం జరిగేది కాదు. శ్రీని శని, ఆదివారాలు వచ్చి బాబుతో గడిపి వెళ్ళేవాడు. తను వున్నపుడు కమలమ్మ బాబుకి స్నానం ఎలా పోస్తుంది చూసేవాడు. కమలమ్మ, “మీరెళ్ళండయ్యా! ఇది ఆడాళ్ళ పని మీరెందుకు ఇక్కడ?” అనేది.
“ఏం ఆడాళ్ళే పోయాలా? మేమెందుకు పోయకూడదు?” అన్నాడు నవ్వుతూ.
“ఊరుకోండయ్యా! మీరెక్కడ స్నానం పోస్తారు? మగవాళ్ళకు చానా రోజుల వరకు సంటి బిడ్డలను ఎత్తుకోవడం రాదు.” అన్నది.
నేను టవల్ తీసుకొచ్చే వరకు అమ్మ సాంబ్రాణి రెడీ చేస్తున్నది. స్నానం కాగానే బాబుని నేను తీసుకున్నాను. శ్రీని, “నేను సాంబ్రాణి వేస్తాను అత్తయ్య! మా ఇంటికెళ్ళాక కూడా వేయాలి కదా! అలవాటవుతుంది.” అన్నాడు సాంబ్రాణి కోసం చేతులు జాపుతూ.
“మీ అమ్మగారు చేస్తార్లేండి. మీకెందుకు?” అంది అమ్మ సాంబ్రాణి ఇవ్వకుండా.
“పర్వాలేదు ఇవ్వమ్మా! మా అత్తగారు బిజీగా వుంటే శ్రీని సాయం చేస్తాడు.” అన్నాను.
అయిదు నెల్ల తర్వాత శ్రీని వాళ్ళ ఇంటికి వెళినపుడు మొదట అత్తగారు స్నానం పోయడానికి కానీ, సాంబ్రాణి వేయడం కానీ చేసేవారు. కానీ రాను రాను శైలజ తనకు సాంబ్రాణి వేయమని, అదే సమయానికి తనకి చాయ్, బిస్కెట్లు కావాలని గోల పెట్టడంతో, నేను శ్రీని కల్సి తను ఆఫీసుకెళ్ళే లోపల చైతుకి స్నానం పోసి నేనూ స్నానం చేసేసేదాన్ని. శ్రీనికి, శైలజకి ప్రతి రోజు గొడవ జరిగేది. అన్న కన్నా ముందు తను స్నానం చేయాలని, శ్రీని ఏమో ఆఫీసుకి లేట్ అవుతుంది తను ముందు చేసి వెళ్ళాలని. కొన్ని రోజులు ఇలా గొడవలు జరిగాక, అత్తగారు, మామగారు ఒకరోజు శైలజ తో మాట్లాడి తను ముందు స్నానం చేయాలంటే అందరి కంటే ముందు తను లేచి స్నానం చేస్తే గొడవ ఉండదని నచ్చ చెప్పగా, చెప్పగా ఒప్పుకుంది శైలజ.
ఇది ఆడ పని, మొగ పని అని వేరు చేసి మగవాళ్ళని చాలా ఇంటి పనుల్లోకి రానివ్వరు ఇంట్లోని ఆడవాళ్ళే. శ్రీని చిన్నప్పట్నుండి తల్లికి అన్నీ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇల్లు క్లీన్ చేయడం, వంట పనుల్లో సాయం చేయడమే కాదు చాలా బాగా వండుతాడు కూడా.
అపుడు చైతుకి స్నానం పోయడం అంటే 5 నెలలు అయ్యాక, నేను నూనె రాసి మర్ధన చేస్తే తను పైన నీళ్ళు పోసేవాడు. అక్కడలా కాళ్ళమీద పడుకోబెట్టి పోయలేక పోయినా చంటి పిల్లలకు స్నానం పోసే చిన్న టబ్ లో పోయొచ్చు. కొంత మంది ఇండియా నుండి వచ్చిన అమ్మమ్మలు, నానమ్మలు, అక్కడలానే ఇక్కడ బాత్రూంల్లో పెద్ద టబ్ లో కూర్చొని కాళ్ళమీద పడుకోబెట్టుకుని స్నానం పోస్తారు. మేము చిన్న టబ్ కొనే వుంచాము, కిచెన్ సింక్ బాగా క్లీన్ చేసి అందులో అ చిన్న టబ్ పెట్టి వేడి నీళ్ళు, ఎంత వేడి కావాలో చూసుకొని తిప్పుకుని పోయొచ్చు. చైతు కూడా సాయం చేసాడట… ఎంత బాగా పోసారో తండ్రి కొడుకులు కలిసి అనుకున్నాను. వాళ్ళు పోసినందుకు సంతోషంగానే వున్నా, ఈ జబ్బు సంగతి త్వరగా తేలకపోతే ఇలా ఎన్ని విషయాలు మిస్ అవ్వాల్సి వస్తుందో, అన్న ఆలోచన రాగానే దు:ఖం ముంచుకొచ్చింది.
*****