గీ. ఎన్ని కార్యముల్ చేసినా ,ఎన్ని సుఖము
లనుభవించినా, యొక్కటి యనుగమింప,
దా మరణ కాలమున యందు – నాత్మ భక్తి
యొక్కటే దప్ప – రఘువీరుడొకడు దప్ప!!
ఎన్ని పనులుచేసినా, ఎన్ని సుఖాలనుభవించినా, మరణకాలంలో, ఆత్మ అలవరచుకున్న భక్తి, అదీ రఘువీరుడొక్కడు దప్ప ఇవేవీ అనుగమింపవు” అన్నది ఆ పరమతారకనామోపాసిని దృఢ విశ్వాసం.
ఒక్క బుద్ధునితోనే భారతోర్వి వేయి సంవత్సరములుగా అఖండ కీర్తినార్జించింది. ఈ నవయుగ బుద్ధుని తీవ్ర తపస్సు ఫలితంగా మరో వేయి సంవత్సరాలు, సులభంగా కీర్తిమంతమౌతుందని అంటూ గాంధీజీ ఉపదేశాలనెప్పుడూ మరువకూడదని అంటూ కవయిత్రి లేఖిని
గీ. హరిజనులు మీవలెనె మస్త హస్తములతొ
ఉన్న నరులని జ్ఞాపకముంచుకొనుడు,
విశ్వమెల్ల బ్రేమించిన విమల మతము
మీది, మదులందు నీ సత్యమూదికొనుడు!!
అలాగే ‘ప్రేమతో గౌరవము సమర్పించుగాని, జులుము తో నరుడెప్డు వశ్యుండుగాడు” అనికూడ జ్ఞప్తికుంచుకోవలె!!’ అంటారామె!! త్యాగగుణమే అమృతత్వమునకు మార్గము. మార్పు రావలె గానీ, మార్పువలన మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అన్నది కూడా ముఖ్యంగా గమనించవలె!! నవనవంబైన ఫాశ్చాత్య నాగరికత ‘కాగితపు పూలమాల” సుమా!! అహింసే గొప్ప తపస్సు!! సర్వ ధర్మాలకూ మూలము. తులసీ రామాయణము, బైబిలు, ఖురాను – సదమలమైన గీత – వీనిని మరువ కూడదు. ఇవన్నీ మహాత్ముని సూక్తులే!! పరమ కారుణ్య రూపుడై ఇల వెలసిన ఆ నిర్వాణ రూపునికి కన్నీటి ముత్యాల కానుకలను మనసారా అర్పిస్తారు!! ఆయన గతింపనేరడు, అఖిల జనుల మదులలో నిలిచే ఉన్నాడు, తపముచేగాని, ఆయనను తెలియనేరము గాన, ఋషి సంతతికి చెందిన మీరు, తపమొనర్చండి!!” అని హితబోధ చేస్తారు!! వారికి ప్రియాతి ప్రియమైన గోవు వలెనే, దేవతావళికి ఆధారమైన వాడు. ‘అరిగి అరుగనివాడు (ఆయన వెళ్ళిపోయినట్టే కనిపించినా, ఇక్కడే ఉన్నాడు సుమా!!) అన్న అద్భుత ప్రయోగంతో ఆ ప్రేమాభిధానునికి నివాళర్పించి ప్రణమిల్లిన కనకమ్మ దేశభక్తికి కళ్ళు చెమర్చాయి వారికి!!
మునీంద్రులకు, ఆత్మ స్వరూపులకు, వందన శతములను సమర్పిస్తూ, ఆ లక్షణాలన్నీ మన బాపూలో ఉన్నాయని అన్యాపదేశంగా చెబుతున్న కనకమ్మ పాండిత్యాన్ని మరింత లోకానికి పరిచయం చేయాలని ఆ క్షణమే అనుకున్నారు పుట్టపర్తి. !!
రోజులిలా యధారీతిని గడిచిపోతున్నా, పుట్టపర్తి మనసు జీవిత గమనం గురించి ఆలోచనలు చేసుకుంటూనే ఉన్నది.
ఒకరోజు స్కూల్ నుంచి సాపాటు వేళకు ఇంటికి వచ్చి సాపాటు చేసిన తరువాత, చెయ్యి తుడుచుకుంటుంటే, ఆ తుండు గుడ్డ పర్రున చినిగిపోయింది. కోపం నసాళాని కంటింది.’ఏమే, కనకా, చూసుకునేది లేదా?? చినిగిపోయిన టవల్ నా మొఖాన కొట్టింది, నన్ను కించపరచేందుకే కదా??’ అని గట్టిగా అరచిన వెంటనే, కనకమ్మ నొచ్చుకుంటూ, ఇంట్లో ఉన్న తులజామాత (మూడవ బిడ్డ) ను పురమాయించగా, పరుగు పరుగున మరో టవల్ అందించింది. కాస్త పరీక్షగా చూస్తే, తెలిసింది. దానిలో ఇంతకు ముందు వాడిన టవల్ కంటే కాస్త తక్కువ చిల్లులున్నాయంతే!! మొత్తానికి చిరుగుల సంసారం తనది!!’ అనిపించి ఉసూరు మనిపించి, అదే భావన ముప్పిరిగోగా నడుం వాల్చి, కళ్ళు మూసుకున్నాడో లేదో, మళ్ళీ ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి. ‘పాపం కనకవల్లి మాత్రం ఏమి చేయగలదు?? ఊహించని సంఘటనల వల్ల తన జీవితం, దానివల్ల ప్రభావితమై కుటుంబ పరిస్థితులు కూడా మారిపోవటం , ఇప్పుడు, యీ విధంగా, చివరికి కడపలో రామకృష్ణా హైస్కూల్ లో తెలుగు పండితునిగా కాళ్ళు నిలదొక్కుకుని ఉండగలుగుతున్నది, సంసారం!! దీనికి ఒక రకంగా, తనకు ఎదురైన పరిస్థితులు, వచ్చిన అవకాశాలూ, మళ్ళీ వాటిలో పరీక్షా సమయాలు – ఇన్నిటి మధ్యా తన కుటుంబం చెక్కు చెదరలేదంటే, దానికి సూత్రధారి కనకమ్మే కదా!! మొదటి నుంచీ, తనది ఎగిరే గాలిపటం వంటి జీవితమే!! అనంతపురం, తిరువనంతపురం, ఢిల్లీ – అన్ని చోట్లా వచ్చిన అవకాశాలు చాలా మంచివే!! కానీ వాటి వెన్నంటి వచ్చిన సమస్యల వల్ల, వదిలి వేయవలసే వచ్చింది. అన్ని సమయాల్లోనూ స్థిర చిత్తంతో ఉంటూ, కాపురాన్నీ, పిల్లలనూ కాపాడుకుంటూ, సమస్యల సముద్రం లో యీది, ఒక తీరాన చేర్చింది తన అర్ధాంగి కనకమ్మే!!
ఇంతటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆమె సప్తసర్గగా సుందర కాండ పారాయణం మాత్రం వదిలిపెట్టనేలేదన్న సంగతి ఆలస్యంగా గమనించాడు తాను!! వాల్మీకి రామాయణం, అందునా సుందర కాండ అంటే, ఆమెకు అపారమైన గౌరవాదరాలు. ఏ రోజు కూడా ఆ పారాయణం ఆమె మానుకున్న ప్రసక్తే తాను గమనించలేదు ఇంత వరకూ!!
తనకేమో కృష్ణ తత్వమంటే తెగ పిచ్చి. కృష్ణ నామం వింటే మనసు పురివిప్పి నాట్యం చేస్తుంది. తాను ఉత్తర హిందూస్తాన్లో ఎక్కువగా పర్యటించటం కూడా కారణం కావచ్చు. అంతే కాదు, సూరదాస్, రసఖాన్ వంటి కృష్ణ భక్తుల ప్రభావమూ తన పై ఎక్కువే!! భాగవత ప్రభావం ఎటూ ఉంది. అష్టాక్షరీదైవతం తన ఉపాసనా మూర్తి. రాధాతత్వం తనకు ఇష్టమైన తత్వం. ప్రొద్దుటూరు లో ఉండగా, నిరంతరాయంగా సాగిన తన అష్టాక్షరీ కీర్తనలలో రాధాతత్వం గురించి, ఎన్నో కీర్తనలు వ్రాసుకున్నాడు కూడా!! మలహరి రాగంలో ‘రాధాదేవీ, రాస విహారిణీ, క్రమముగ మది వక్రత బోద్రోలుము..’ అంటూ, అందులో ఆమెను ,’మధు మథన హృదాహ్లాదినీ శక్తి..’ గా వర్ణించుకున్నాడు. మేఘ రంజి రాగంలో ఒక కీర్తనలో, అడుగడుగున రాధ, పుడికి కన్నులు మూయ, అడుగులు దలతూ,ఆది మునులు జీవ..అంటూ ఆ అష్టక్షరీ పతి పట్ల రాధకున్న ఆరాధనను ఆక్షరీకృతం చేసి మురిశాడు తాను!!
అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణంలో మరాఠీ భక్తి సంత్ జ్ఞానదేవ్ ప్రభావం ఇందులో భాగమే!! అష్టాక్షరీ కృతులలో పండరీ నాథుణ్ణి సంబోధిస్తూ, తనను తరింపజేయమంటూ వేడుకున్నాడు పరిపరి విధాల!! చక్రవాక రాగంలో ‘పరుగిడి రారా పండరి నాథా..’ యదుకుల కాంభోజి లో ‘మకర కుండల శోభితా..’ బిలహరి లో ‘ఎవరు మాటాడితేనేమీ..’ మయూర ధ్వని రాగంలో (ఆందోళిక) ‘రాకపోడూ పండరినాథుడూ..’.. ఇలా తన జీవ సంబంధమైన ఆర్తికి అక్షర రూపం ఇచ్చి, తనను బ్రోవమని వేడుకున్న ఫలితం, ఆ రంగని దర్శనం ఇంకా కాకపోగా, పరీక్షలు మాత్రం అనేకం వచ్చి పడ్డాయి. ఈ పరీక్షలు ఎప్పటికి ముగిసేనో?’ నిట్టూరుస్తూ, కాలెండర్ వైపు యధాలాపంగా చూశారు పుట్టపర్తి.
అవును ..ఇది శ్రావణ మాసం కదా!! సాక్షాత్తూ మహా విష్ణువే తనివితీరా వాత్సల్య రసాన్ని గ్రోలాలనే తపనతోనే, ఇలపైకి కోరి మరీ అవతరించిన శ్రావణ మాసం!! అంతే కాదు. శ్రావణ మంగళవారం నోములూ, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాల సందడీ..ఇలాంటి ఎన్నెన్నో పర్వాల సమాహారం. ముఖ్యంగా, భారత స్వాతంత్య్ర దినోత్సవం కూడా శ్రావణ మాసంలోనే!!’ ఈ సంగతి గుర్తుకు వచ్చేసరికి పుట్టపర్తి మనసు సముద్రం వలె ఉప్పొంగింది. ‘చూద్దాం, ఈ శ్రావణం, ఎటువంటి అనుభూతులనిస్తుందో??’ ఆలోచనల్లో ఎప్పుడో కాస్త కునుకు పట్టింది.
ఓ గంట గడిచింది. ఇంతలో, ‘పిలువరె శ్రీలక్ష్మినీ, మాయమ్మలారా, పిలువరె వరలక్ష్మినీ..’ అని చిన్నగా కనకవల్లి గొంతు కమ్మగా వినబడింది. మెత్తటి ఆ గొంతు, సాదా సీదాగా గమకాలు లేకుండా పాడుతున్నా – ఏదో మాధుర్యం చెవుల ద్వారా మనసులో నిండుకుంది. ఇదేదో పాతకాలం ఆడవారి సంప్రదాయ గీతం వలె లేదే?? మగతగా కళ్ళుమూసుకుని ఉన్న, ఆ పాట మూలాల గురించి ఆలోచనలో వారి మనసులో మరింత కుతూహలం మొదలైంది.
పాట కొనసాగుతూనే ఉంది.
పిలువరె శ్రీ లక్ష్మినీ మాయమ్మ లారా,
పిలువరె వరలక్ష్మినీ..
పిలువరె సంకటములను తొలంగించు
జలజాక్షి వరలక్ష్మి చల్లని దయగోరి..పిలువరె శ్తీలక్ష్మినీ..
తెలతెల్లవారగ కలహంస నడకల
కనుములనీనెడి కలికి చూపులతోడ
నిలువెల్ల సౌందర్య నిలయమై చనుదెంచు
జలజాక్షి వరలక్ష్మి చల్లని దయ గోరి..పిలువరె శ్రీలక్ష్మినీ..
నట్టింట వెలసిన నవరత్న ఖచితమై
నట్టి ఆసనమున మెట్టి కూర్చుండియు,
పట్టు పీతాంబరముగట్టి, జగముల నేలు
నట్టి కన్నతల్లి కమలాలయను మీరు..పిలువరె.. శ్రీలక్ష్మినీ..
కళ్ళు మూసుకుని వింటూ ఉంటే, ఆనందభైరవి రాగ మాధుర్యమంతా తొణికిస లాడుతున్న పాట, బహుశా కనకవల్లి స్వీయ రచనే అని గట్టిగా తోచింది. స్త్రీ సహజమైన అందమైన భావాలు, సంప్రదాయానుగుణమైన పదజాలం, ఎన్నుకున్న అనువైన రాగం – ఇవన్నీ చూస్తుంటే, కనకమ్మను యీ మార్గంలో కూడ ప్రోత్సహించాలని గట్టిగా అనుకుంటూ, మధ్యాహ్నపు కునుకు నుండీ హుషారుగా లేచి, గట్టిగా అన్నారు, ‘కనకా, కాఫీ!!’అని!!
*****
(సశేషం)
పాట చాలా బాగుంది. పాడితే ఇంకెంత బాగుంటుందో!🙏
ఒక మధుర దృశ్యకావ్యం లా ఉంది.తండ్రికి తగ్గ
తనయ రచయిత్రి.