చాతకపక్షులు  (భాగం-17)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

          రోజులు ఎప్పుడూ ఒక్కలాగే జరగవు. జరిగితే కథే లేదు.

          ఒకరోజు జేమ్స్ వచ్చేక, గాయత్రి మామూలుగా బాంకుకి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి చిత్ర ఇంట్లో లేదు. గాభరా పడిపోతూ, అయినవాళ్లకీ కానివాళ్లకీ ఫోనుమీద ఫోను చేసింది ఎవరైనా ఎక్కడయినా చూసేరేమోనని. తపతికి కూడా చేసింది. తపతి హడావుడిగా జేమ్స్ సెక్షనుకి వెళ్లి చూసింది. అతను వారం రోజులు శలవు పెట్టేడన్నారు.

          తపతి నిర్ఘాంతపోయింది ఏం జరిగివుంటుందో వూహించుకునే వేళకి. గాయత్రిగారికి ఎలా చెప్పడం ఈ సంగతి? చెప్పకుండా వుండడం మాత్రం ఎలా సాధ్యం?

          తపతి పదినిముషాలు ఆలోచించి ఫోను తీసి, మళ్లీ పెట్టేసింది. గాయత్రిగారింటికి బయల్దేరింది స్వయంగా చెప్పడానికి. దారిపొడుగునా ఆలోచిస్తూనే వుంది. జేమ్స్ ఎందుకిలా చేసేడు? తనతో మాట మాత్రం ఎందుకు చెప్పలేదు? గాయత్రికి ఎలా చెప్పడం జేమ్స్ చిత్రని లేవదీసుకు పోయేడని? ఆవిడ బాధలో ఎన్ని మాటలేనా అనొచ్చు. తను భరించగలదా? భరించక చేసేది మాత్రం ఏముంది? ఇప్పుడు చెయ్యవలసిన కార్యం ఏమిటి? … ఆలోచిస్తూ వాళ్లింటికి చేరింది.

          గాయత్రి హాల్లో కూర్చుని వుంది కుమిలిపోతూ. సోమలింగం ఫోనులు చేస్తున్నాడు. జేమ్స్ చిత్రని షాపుకో బజారుకో తీసికెళ్లేడేమో సరదాగా అని వాళ్ల ఆశ.

          తపతిని చూసి గాయత్రి మండిపడింది. “నువ్వతన్ని పరిచయం చెయ్యకపోతే మాకీ దౌర్భాగ్యం పట్టేది కాదు” అంటూ.

          తపతికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఆవిడ అన్నమాట నిజమే మరి. అంత వరకూ జరిగిన మంచి అంతా తృటి కాలంలో తుడిచి పెట్టుకుపోయింది. తరవాత నెమ్మదిగా చెప్పింది. “జేమ్స్ ఆఫీసులో శలవు పెట్టేడంటున్నారు. చిత్రని తీసుకుని పొరుగూరు వెళ్లేడేమో …” అంది వీలయినంత సున్నితంగా ధ్వనిస్తూ.

          గాయత్రి గారింటి పొరుగున వున్న హెన్రీ వచ్చి, సానుభూతితో పోలీసు రిపోర్టు ఇవ్వమని సలహా ఇచ్చేడు,

          సోమలింగం “ఏమోనండీ. అదెక్కడుందో కూడా నాకు తెలీదు. ఏం అడుగుతారో, ఏంచెప్పాలో” అన్నాడు,

          “రండి నేను తీసుకెళ్తాను” అని ఇద్దర్నీ తన కార్లో తీసుకెళ్లేడాయన పోలీసు స్టేషనుకి.

          అక్కడ వాళ్లు “తప్పిపోయి ఇరవైనాలుగ్గంటలు అయితే కానీ రిపోర్టు తీసుకోం” అన్నారు. ఇంకా “మాకిలాటివి వారానికి ముప్పై వస్తాయి. నూటికి తొంభైపాళ్లు తెలిసిన వాళ్లే తీసుకెళ్లి వుంటారు. లేదా పిల్లలే అలిగి, పారిపోయి, నాలుగు రోజులు పోయేక తిరిగి వచ్చేస్తారు” అన్నారు.

          “మాపిల్ల అలాటిది కాదు. దానికి ఈ అలకలూ చిలకలూ తెలీవు” అని మొత్తుకున్నాడు సోమలింగం.

          హెన్రీ పరిస్థితులు వివరించీ, కాస్త బెదిరించీ రిపోర్టు రాయించేడు. ఆఖరికి ఓ సార్జెంటు రిపోర్టు తీసుకుని, “చూస్తాం లెండి” అన్నాడు.

          మాట వుచితం కనక ఇచ్చేసేరు కానీ పోలీసులు చేసిందేమీ లేదు. వాళ్లకి ఇది high profile కేసు కాదు. కొన్నివందల “కోన్‌కిస్‌కా”లలో చిత్ర మరో కోన్‌కిస్‌కా. వేలకి వేలు రివార్డులిచ్చే వాళ్లయితే పత్రికలూ, పోలీసులూ కూడా హుషారుగా పని చేస్తారు.

          తపతికి పుష్కలంగా అక్షింతలు పడ్డాయి. గాయత్రీ, సోమలింగం మాత్రమే కాక, ఊళ్లో భారతీయులు కూడా అనరాని మాటలు అన్నారు. ఆవిడే పని గట్టుకుని వూళ్లో వాళ్లందరినీ మూకవుమ్మడిగా అవమానించినట్టు బాధ పడిపోయేరు. తపతి జవాబులు చెప్పుకోలేక వాళ్లని తప్పించుకు తిరుగుతోంది.

***

          నాలుగు నెలల తరవాత, జేమ్స్ తపతికి ఓ కార్డు రాసి పడేశాడు. అతని వివరణ ఏమిటంటే, ఇంట్లో చిత్రకి అన్నలపోరు ఎక్కువయింది. వారికి ఈ “స్లో” చెల్లెలు ఒక ప్రత్యేకత సాధించడం కంటకప్రాయం అయింది. తల్లీ తండ్రీ ఆ అమ్మాయి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. తనని ఏడిపించడానికి బొత్తిగా వీలు చిక్కడంలేదు. ఆ సంగతి తల్లిదండ్రులకి తెలుసో తెలీదో జేమ్స్‌కి అర్థం కాలేదు. అతను వాళ్లతో మాటాడితే బాగుండేదేమో. కానీ అప్పట్లో అతనికి తోచిన పరిష్కారం వాళ్లకి చెప్పకుండా ఆ పిల్లని తీసుకు న్యూయార్క్ వెళ్ళిపోవడం.

          తనకి తనే చిత్రకి ఏజంటు అయిపోయి. ఆ అమ్మాయిచేత బొమ్మలేయించి చిన్న చిన్న దుకాణాల్లోనూ, రోడ్డు వారలా అమ్మి రోజులు గడుపుకుంటున్నారుట. “బాగానే వున్నాం” అని రాసేడు కానీ ఎడ్రెసూ, ఫోన్ నెంబరూ ఇవ్వలేదు.

***

          తపతి చెప్పిన కథంతా విని గీత, “పోన్లే. చిత్ర జీవితం బాగుపడ్డట్టే కదా” అంది. 

          “లేదు. అలా ఎవరూ అనుకోలేదు. నా గతం అంతా తవ్వి తీసి, ‘పెళ్లి మీద పెళ్లి చేసుకున్నది చాలక వూళ్లో ఆడపిల్లలనందరినీ చెడగొడుతోంది’ అన్నారు. ‘నీ కూతురయితే ఇలా చేస్తావా?’ అని నన్ను రొకాయించేరు. ఆపైన  ‘ఆజాతి తీరే  అంత’ అని జేమ్సునీ‌ అతని జాతినీ కూడా దుమ్మెత్తి పోశారు. గీత కంటె పదిహేనేళ్లు పెద్దవాడు. దాన్ని వాడుకున్నన్నాళ్లు వాడుకుని, నట్టేట్లో ముంచేస్తాడు అంటూ జరుగుతాయో జరగవో తెలీనివన్నీ ఊహించేసుకుంటూ రాద్ధాంతం చేసేరు.”

          గీత నిర్ఘాంతపోయింది. “నిజంగా అంత ఘోరంగా మాటాడేరా?” అంది నమ్మలేనట్టు.

          తపతి పేలవంగా నవ్వింది, “అవే మాటలు కావులే. వీరంతా నాగరీకులు కదా. నాజూగ్గానే అయినా గట్టిగానే కొట్టేరు. అప్పట్నించీ నేను అందరికీ దూరంగా వుంటున్నాను. నా అదృష్టం ఈ ఇల్లు కూడా వూరికి కాస్త దూరమే కనక నాజోలికి ఎవరూ రారు,” అంది.

          “తల్లిదండ్రులయినా సంతోషించొచ్చు కదా పిల్ల జీవితం మెరుగయింది అనీ, ఎక్కడో అక్కడ సుఖపడుతోందని.”

          “అదే నా బాధ కూడాను. ‘సంతోషించుదాం’ అన్న తాపత్రయంకంటే ఉన్నవీ లేనివీ ఊహించుకుని బాధ పడడంలోనే వాళ్లు ఎక్కువ ఆనందం అనుభవిస్తున్నారేమో అనిపించింది నాకు.”

          “పోనీ నువ్వేం అనుకుంటున్నావో చెప్పు? చిత్ర జీవితం బాగుపడింది అనుకుంటున్నావా?  లేదా?”

          “ఏం. ఇప్పుడు నువ్వు కూడా నన్ను దులుపుతావేమిటి?”

          గీత నవ్వేసింది తేలిగ్గా.

          తపతి ఆలోచిస్తూ, అడ్డంగా తలూపింది, “నాకూ తెలీదు. చిత్రే చెప్పాలి ఆ ప్రశ్నకి సమాధానం.”

***

          హరికి ఆఫీసులో ఒత్తిళ్లూ, ప్రయాణాలూ అధికం అయి ఇంట్లో వుండే సమయం తరుగుతోంది క్రమంగా. అదే స్థాయిలో గీతా తపతిల మధ్య ఆత్మీయత పెరుగుతోంది. సంగీతంతో పాటు కంప్యూటరు మీద పని చెయ్యడం కూడా నేర్చుకుంటోంది గీత తపతి దగ్గర. 

          హరి వుద్యోగంలో ఆటుపోటులు గీతకి చెప్పడం లేదు. పని గొడవలో పడి హరీ, తపతి సాన్నిధ్యంలో గీతా గమనించ లేదు ఇద్దరి మధ్య కనిపించని నీడలు పొరలు పొరలుగా పేరుకుంటున్నాయని.

          ఒక రోజు హరి ఇంటికి త్వరగా వచ్చేశాడు దివాలా పడ్డ మొహంతో. 

          “ఏమయింది?” అంది గీత కంగారు పడుతూ.

          “ఉద్యోగం పోయింది,” అన్నాడు హరి నీరసంగా సోఫాలో కూలబడి. వాళ్లాఫీసులో కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. మొదట్లో “కంపెనీ అభివృద్ధి కోసం అవసరమైన మార్పులు చేస్తున్నాం” అన్నారు. తరవాత “అభివృద్ది ప్రణాళిక వేస్తున్నాం” అన్నారు. తరవాత మరో పెద్ద కంపెనీతో “చేతులు కలుపుతున్నాం” అన్నారు. ఆ “చేతులు కలపడం”లో భాగంగా కొంత మంది ఉద్యోగస్థులకి మంగళం పాడి ఇళ్లకి తోలేశారు. అలా ఇళ్లకి తోలివేయబడిన వారిలో హరి ఒకడు.

          గీత అతని పక్కనే కూలబడింది.  “ఇప్పుడేం చెయ్యడం? ఇది పోతే దీని తాతలాంటిది మరొకటి వస్తుంది. ఇంత కంటె మంచిదే వస్తుంది” – ఏవేవో మాటలు మనసులో మెదులుతున్నాయి కానీ ఒక్కమాటా నోట్లోంచి వూడిపడడం లేదు. అతనెప్పుడూ తనఉద్యోగం సంగతి గీతతో చర్చించలేదు. ఎంతసేపూ, “నీకేం కావాలి” అని అడగడమే తప్ప తనజీవితంలో “ఇది జరుగుతోంది” అని ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలంటే ఎలా మొదలు పెట్టాలో గీతకి తెలీడం లేదు.

          ఓ అరగంట అయిన తరవాత, “నేను ఇప్పుడే వస్తాను. ఫరవాలేదులే. ఇది కాకపోతే మరో వుద్యోగం, నువ్వేం బెంగ పెట్టుకోకు” అనేసి గబగబా వెళ్లిపోయేడు. 

          గీతకి మనసంతా గజిబిజిగా వుంది. అతను ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేయబోతున్నాడో అర్థం కాలేదు. ఓ గంటసేపు అలా కూర్చుని, తపతికి ఫోను చేసింది.

          తపతి ఫోను తీసుకుని, సంగతి విని, “నువ్వేం బెంగ పెట్టుకోకు. హరికి మంచి అర్హతలు వున్నాయి. అనుభవం వుంది. ఇది కాకపోతే మరో ఉద్యోగం తొందరలోనే దొరుకుతుందిలే” అంది. ఆమాటలు పలికిన తపతికీ వింటున్న గీతకీ కూడా పేలవంగానే తోచేయి. నిజంగా విషమపరిస్థితుల్లో ఇరుక్కునప్పుడు మాటలు ఎంత పొడిగా వుంటాయో తెలిసింది.

          గీత ఫోను పెట్టేసి ఆలోచిస్తూ కూర్చుంది చాలాసేపు. హరి తిరిగి వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటింది. “ఎక్కడికి వెళ్లేర”ని తను అడగలేదు. అతను చెప్పలేదు. కానీ మొహంలో మాత్రం ఇందాకా వున్నంత దిగులు లేదు. బహుశా తనలాగే అతను కూడా ఏ స్నేహితుడితోనో కాస్సేపు తనబాధ వెళ్లబోసుకుని వచ్చేడేమో అనుకుంది.

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.