జ్ఞాపకాల సందడి-37
-డి.కామేశ్వరి
కావమ్మ కబుర్లు -8
మా అమ్మమ్మ (రెండవ భాగం)
అపుడు బంధువుల మధ్య సహాయ సహకారాలు, అభిమానాలు, ఆప్యాయతలు కాదనలేని అవసరాలుండేవి. కనుక పిల్లలను పంపడానికి వాళ్ళు ఆలోచించేవారు కాదు. ఇంట్లో పెట్టుకోడానికి వీళ్ళు అభ్యంతరం చెప్పే వాళ్ళు కాదు. ఆ రోజుల్లో మా నాన్న గారికి తరచుగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండడంతో బదిలీ అయి వెళ్లే ఊర్లలో చదువులు, స్కూల్స్ సరిగాలేక అమ్మమ్మగారింట్లో అక్కను, అన్నయ్యను, నన్ను హైస్కూల్ చదువుకి అక్కడ పెట్టారు. ముగ్గురు పిల్లలు అంటే ఎంత కష్టమో ఆలోచించండి. మా నాన్న అపుడు హైవేస్ అసిస్టెంట్ ఇంజనీరుగా ఉండేవారు. కొన్నాళ్ళ తరువాత ఆ గుంపులో చదువులు సాగడం లేదని మా అత్తయ్యను, మమ్మల్ని వేరే ఇల్లు అద్దెకి తీసుకుని పెట్టారు. అక్కడున్న ఆరునెలలూ అమ్మమ్మ చాకిరీ చూసా. ఏడో క్లాస్ చదివేదాన్ని కనక అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. ఆ రోజుల్లో పొలం నుంచి ధాన్యం వచ్చేది. చవక రోజులు కనుక సరిపోయింది. అయినా పై ఖర్చులు ఎన్ని ఉంటాయి? పొద్దుటే పిల్లలందరూ వరసగా కంచాలు తెచ్చుకు కూర్చుంటే చల్ది అన్నాలు పెట్టే వారు. పిల్లలందరికీ అన్నాలు పెట్టి, అపుడు మడి కట్టుకుని, మా తాతగారు కోర్టు కెళ్ళే సమయానికి వండి పెట్టాలి. ఆయన పాపం స్నానం చేసి, బొట్టు పెట్టుకుని, రెడీగా కూర్చునేవారు.
ఈవిడ కాళ్ళూ, చేతులూ కుమ్ముకుంటూ, ఆదరాబాదరా ఉడికీ ఉడకని పప్పులో ఇంత ఉప్పేసి, ఎనిపేసి, నీరు ఇగరని కూర, నలిగీ నలగని పచ్చడి, మరిగీ మరగని పులుసు, ఆవిర్లు కక్కే అన్నం పట్టుకుని విస్తరిలో వడ్డించేది.
‘కాళ్ళ కింద నిప్పులు పోస్తారు. పప్పు కాస్త మగ్గాలి. పులుసు కాగాలి. ఇలా తొందర పెట్టేస్తే ఎలా చావాలి?’ అంటూ అయన ఏమనకుండా దీర్ఘాలు తీసేది విసుక్కుంటూ. ‘మరో అరగంట ముందు మడి కట్టుకు చావరాదూ? నా విస్తట్లో ఇలా ఉడికి ఉడక్కుండా పిండాకూడు తగలేస్తే ఎలా తిని చావాలి?’ అని ఆయన ఎగిరేవారు.
‘ఆ! కూర్చుని, చెమ్మచెక్క ఆడుకొంటున్నాను ఇంతసేపూ. తెల్లారి ఐదుగంటలకి లేచాను. పోనీ ఆ కూరలేవో ముందు రోజు నా మొహాన తగలేస్తే తరుకుంటాను గదా? లేవగానే చంటి పిల్లకి స్నానం చేయించాలి. (పురిటి కి వచ్చిన కూతురు పిల్ల.) పిల్లలకి చద్దన్నాలు పెట్టాలి, వీసెడు కూరలు తరుక్కోవాలి, గిన్నెలు తొల్చుకోవాలి. కాళ్ళు చేతులు కుమ్ముకుని ఎనిమిదిన్నరకి మడి కట్టుకుంటే ఉడికి చావద్దూ అడ్డెడు గిన్నె?’ ఆవిడా దండకం ఆరంభించేది.
‘చాల్లే ఆపు నీ సోది. రోజూ ఉండేదే కదా. మొగుడికింత వేళకి విస్తట్లో అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అనే మాటలు మాట్లాడకు. నేను కోర్టుకు వేళకి వెళ్లాలంటే వేళకింత పెట్టు. నన్నింక విసిగించకు!’ అని కసిరి ఔపోసన పట్టేవారు. ఈవిడ సణుక్కుంటూ లోపలికెళ్ళేది.
ఇదంతా ఇప్పుడు ఈజీగా చెప్పేస్తున్నా గానీ వాళ్ళిద్దరి గోల చూసి బిక్కచచ్చి పోయేవారం.
*****