తల్లి చీర
-రాజేశ్వరి దివాకర్ల
మమతల వాలుకు చిక్కి
వలస వెళ్ళిన వాళ్ళిద్దరు
తిరిగి రాని సమయాలకు
ఎదురు చూపుల ఇల్లు మసక బారిన కళ్ళతో
ఇసుక రాలిన చిన్న శబ్దానికైనా
ఇటుక గోడల చెవిని ఆనించు కుంది.
విశ్రాంతి పొందిన ఉత్తరాలు కొన్ని
బ్యాంకు జమా బాపతు తాఖీదులు కొన్ని
పిల్లల పుట్టిన రోజులకు గుడి పూజల
తారీఖుల పిలుపు రివాజులు కొన్ని
గాలి వాటుకు ఎగిరి ధూళి
కమ్ముకున్న నేలకు ఒరుసుకున్నాయి.
సంవత్సర చందాలకు వాలి వచ్చిన సంచికలు
మరక గట్టి పరపర చిల్లుల జల్లెడలయ్యాయి
వచ్చిన దిన పత్రికలు కొన్ని
ఉండలు కట్టిన వార్తలలో చుట్టుకుని
మింగుడు పడని అచ్చులలో
అలుక్కు పోయాయి.
గడ్డి మొలిచింది,
మొండి చెట్టు పెరిగింది
చుట్టు సున్నం పెచ్చు ఊడింది.
నిలువు కొబ్బరి మట్ట మబ్బు దుమికినట్టు
దుబ్బున రాలి పడింది
నిలువ నీడలేని నిరుపేద ఒక్కడు
వీధి అరుగు మీద వీలు చోటు చేసుకున్నాడు.
ఠికానా దొరికిందని బైఠాయించిన వాడిని,
వరుస మేడల వాళ్ళు ,గలీజు బాపతిదని
తరిమి వేసారు,
పాత వాసనలను అసలు వీడలేని
జరీ అంచుల తల్లిచీర మాత్రం
చెదలు పట్టిన చెక్క అలమారు మూలకు
గార మడతల గీరలకు
చివికి చివికి అంటు గట్టి పోయింది.
*****