నా జీవన యానంలో- రెండవభాగం- 21

-కె.వరలక్ష్మి

          1991 లో నేను రాసి ఆంధ్రజ్యోతికి పంపిన ‘అడవి పిలిచింది’ నవల అందినట్టు ఉత్తరం వచ్చింది. కాని, ఎడిటర్ మారడంతో ఆ నవలను ప్రచురించనూ లేదు. తిప్పిపంపనూ లేదు. దాని రఫ్ కాపీ కూడా నా దగ్గర లేకపోవడంతో ఆ నవల కోసం వెచ్చించిన ఎంతో టైమ్ వేస్ట్ అయిపోయినట్లైంది..

          1993 మార్చి 8న హైదరాబాద్ నుంచి చిలకలూరి పేట వస్తున్న బస్సుని 24మంది జనంతో బాటు పెట్రోలు పోసి తగలబెట్టేసారు. ఇప్పుడంటే అలాంటి సంఘటనలు సర్వసాధారణమయ్యాయి కాని, అప్పటికిదే గొప్ప షాకింగ్ న్యూస్, నేను కొన్ని రోజుల పాటు నిద్రపోలేక పోయాను.

          గళం విప్పలేని మూగతనంలో

          కలం మాత్రమే నెచ్చెలి నాకు –

          ఇంకో 4 రోజులకి బొంబాయిలో జనసమ్మర్దం ఉండే 13 ప్రదేశాల్లో శక్తివంతమైన బాంబులు పేల్చారెవరో, 200 మంది మరణించగా 900 మందికి పైగా గాయపడ్డారని వార్త వచ్చింది. ఎంత ఘోరమై పోయింది ఇండియా కూడా అని రాసుకున్నాను, అదే నెల 16న నేనెంతో అభిమానించే గాయని శ్రీరంగం గోపాలరత్నం గారు తన 54 ఏళ్ల వయసులో మద్రాస్ లో  సెరిబ్రల్ హెమరేజ్ తో కాలం చేసారు. అదో  గొప్పషాక్.  1993 అక్టోబర్ లో ‘అస్మిత’ సంస్థ ‘నీలిమేఘాలు’ కవితా సంపుటి వేసింది. దాన్లోనావి  నాలుగు, గీతవి మూడు కవితలు వచ్చాయి.

          జీవితం నుంచి దూరమైపోవడం వల్ల కాక జీవితాన్ని అవగతం చేసుకోవడం వల్లనే మనం సత్యాన్ని దర్శించిన వాళ్ల మౌతాం – అంటాడు టాల్ స్టాయ్ ‘యుద్ధము-శాంతి’ లో, ప్రేమ దొరకక, ప్రేమ కోసం తపించిపోయే నిర్భాగ్యులకి హఠాత్తుగా ఆశ్చర్యంలో ముంచేసేటంత ప్రేమ లభించి ఆనంద సాగరంలో ముంచి తేలుస్తుంది.

          1993 నవంబర్ 6న మా గీతకు అబ్బాయి పుట్టేడు. మాకు మొదటి మనవడు, మా జీవితాల్లోకి అనుకోని ఆనందాన్ని ప్రవేశ పెట్టినవాడు, తనని చూడకుండా ఉండలేక వీకెండ్ కి వైజాగ్ వెళ్లిపోయేవాళ్లం. ఆ చిన్ని అందాలు, ఆ బోసి నవ్వులు, ఆ కేరింతలు, ప్రేమతో  హత్తుకు పోవడాలు విశాఖ సముద్రపుటందాలలాగ సంతోషంలో ముంచి తేల్చేవి.

          అలా ఒకసారి కేకు గీత వాళ్ళింటికెళ్లినప్పుడు నేను అక్కడున్నానని తెలిసి అత్తలూరి నరసింహారావుగారు వచ్చారు. అది డిసెంబర్ నెల, బుల్లయ్య కాలేజ్ గ్రౌండ్లో బుక్ ఫెస్టివల్ జరుగుతోంది. 11వ తేదీ సాటర్ డే సాయంత్రం రచయితతో ముఖా ముఖి కార్యక్రమానికి నాపేరు రాసుకున్నామని, తప్పక రావాలని పిలిచారు, మాకు దగ్గరగా ఉండడం వల్ల బొమ్మూరు యూనివర్శిటీ సభల్లో రచయితల్ని, కవుల్ని చూడడం తప్ప నాకు పెద్దగా పరిచయాలు లేవు. నాది చొరవగా చొచ్చుకు పోయే నైజం కాక ఎప్పుడూ దూరంగాను, మౌనంగాను ఉండేదాన్ని, మన రచనలే మనకొక గుర్తింపు తెచ్చి పెడతాయని అప్పుడర్థమైంది. నేను  వెంటనే ‘సరే’ అనకుండా తటపటాయిస్తూ ఉంటే “మీరు వస్తున్నారు అంతే” అన్నారాయన. “దేని మీద మాట్లాడతారో చెప్పండి. ఆ బుక్కు తెచ్చి ఇస్తాను” అన్నారు, నేను టక్కున “ద రూట్స్” అన్నాను, “అలాకాదు, మన తెలుగు పుస్తకం మీద మాట్లాడండి” అన్నారు.”సరే, నామిని  సినబ్బ కతలు” అన్నాను.

          ఆ మర్నాడే అత్తలూరి ‘సినబ్బ కతలు’ తెచ్చి ఇచ్చారు. ఆ పుస్తకాన్ని అప్పటికే చదివి ఉన్నా, రిఫరెన్స్ కోసం ఆ రోజంతా మళ్లీ చదివేను, మర్నాడే నేను పాల్గోవాల్సి ఉంది. అసలు ఆ కార్యక్రమం ఎలా ఉంటుందో చూడాలన్పించింది.

          ఆ రోజు సాయంకాలం అబ్బూరి గోపాల కృష్ణ గారితో ముఖాముఖి. మా అబ్బాయి రవిని సాయం తీసుకుని వెళ్లేను. అబ్బూరి వారు  కన్యాశుల్కంలోని గిరీశం కేరెక్టర్ గురించి కొంత డిఫరెంట్ గా (గిరీశంలోని అమాయకత్వం గురించి) మాట్లాడేరు, తర్వాత శ్రోతలు ప్రశ్నలు వేస్తే ఆయన సమాధానాలు చెప్పేరు..

          అలా అబ్బూరి వారి ముఖాముఖి ముందుగా చూడడం మంచిదైంది. నా కార్యక్రమం చాలా సక్సెస్ అయ్యింది. శ్రోతలు సైలెంట్ గా విన్నారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా ఎంతో మర్యాదగా జరిగింది. చాలా మంది నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అక్కడ అందరూ ఎంతో మర్యాద చూపించారు. రచనా శాయి గారు, అత్తలూరి నన్ను టీస్టాల్ కి తీసుకెళ్లి టీ తాగించి వారి సేవాతత్వాన్ని రుజువు చేసుకున్నారు.

          మర్నాడు 12వ తేదీ బుక్ ఫెస్టివల్ లో  కవి సమ్మేళనంలో గీత  కవిత చదివింది. శాయిగారు ఆ సందర్భంగా గీతకి వేరుగా, నాకు వేరుగా తానాకథలు – కవితలు; త్రిపుర కవిత్వం, భైరవయ్య కవిత్వం పేకెట్స్ ఇచ్చారు. డిశంబర్ నెల చలిలో బాబును తిప్పలేక ముందురోజు గీత, మర్నాడు నేను బాబును చూసుకుంటూ ఇంట్లో ఉండి పోయాం.

          13 వ తేదీ భరాగో గారితో ముఖాముఖీ. ఆయన సైగల్ ని, భాగమతిగారిని తన గొంతులో అచ్చంగా అలాగే పలికిస్తూ పాడిన పాటలు హైలైట్. అదేరోజు రావిశాస్త్రిగారి నాటికల లోని రెండు కేరెక్టర్స్ నటించారెవరో, ప్రఖ్యాత నటులు కె. వెంకటేశ్వర్రావు గారబ్బాయి, ఆంధ్రాయానివర్శిటీ స్టేజ్ ఆర్ట్ శాఖ లో ప్రొఫెసర్ గా ఉన్న కె. ప్రసాద్ గారిని పరిచయం చేసాడు మా అబ్బాయి.  MBA లో మా అబ్బాయి ఆప్షనల్ సబ్జెక్ట్ స్టేజ్ ఆర్ట్, మర్నాడు రాంనగర్ క్వార్టర్స్ లో  ఉన్నప్రసాద్ గారింటికెళ్లి వాళ్ల తల్లిగార్ని చూసోచ్చాం. ఆవిడ ఎంతో ఆత్మీయంగా మాట్లాడేరు, వెంకటేశ్వర్రావుగారి ఆల్బమ్స్ అన్నీ దగ్గరుండి చూపించారు.

          అదేరోజు అత్తలూరి గారు, పద్మినిగారు కలిసి గీత ఇంటికి వచ్చారు. బాబుకోసం బొమ్మలు, పుస్తకాలు తెచ్చారు. డిశంబర్ 15న నేను మాఊరికి వచ్చిన మర్నాడే రాజమండ్రి నుంచి సన్నిధానం శర్మగారు, కోస్తావాణి ఎడిటర్ చింతల గోపాలరావు గారు వచ్చారు  మా ఇంటికి. RS.సుందరం గారి భావన నవల తెచ్చి ఇచ్చారు. 26న రాజమండ్రి ఆనం కళాకేంద్రం మినీ హాలులో ఆ నవల ఆవిష్కరణ ఉందట. అప్పటికి సుందరం గారు బొమ్మూరు యూనివర్సిటీ డీన్ ఉన్నారు. ఆవిష్కరణ సభలో ఆ నవల  గురించి మాట్లాడమని చెప్పేరు. నేను సరే అన్నాను.

          ఆ రోజు నేను, రచయిత్రి డి.సుజాతాదేవిగారు, విమెన్స్  కాలేజ్ లెక్చరర్ మణి భూషణి గారు వక్తలం. సభ బాగా  జరిగింది. చింతల గోపాల్రావు గారింట్లో మంచి లంచ్ చేసి, వారింట్లోనే చూపించిన ‘మృగతృష్ణ’ సినిమా చూసి, అక్కడికి దగ్గర్లనే ఉన్న ఎండ్లూరి సుధాకర్ గారిల్లు, వాళ్ల పాపాయిల్ని చూసి తిరిగొచ్చాను.

          నాకొక అలవాటు ఉండేది. ప్రతీ సంవత్సరం జనవరి 1stకి టీచర్స్ అందరికి చీరలు, ఇంటికి ఉపయోగపడే స్టీలు సామాన్లు కొని ఇచ్చేదాన్ని. వాళ్లు కూడా నాకు అంతగా సహకరించేవాళ్లు. 1994 వ సంవత్సరం వచ్చే సరికి అప్పుడప్పుడు సాహిత్య సభలకి అటెండ్ కావడం ;మా అమ్మాయిల పెళ్లిళ్ల తర్వాత ఏదో ఒక సందర్భానికి వాళ్ల ఇళ్లకు వెళ్లాల్సి రావడం వల్ల స్కూల్ బాధ్యత తరచుగా టీచర్స్ కి  అప్పగించాల్సి వచ్చేది. నాకు స్కూలు మీద కాన్ సన్ ట్రేషన్ తగ్గిందని అందరూ అనుకోసాగేరు. రాజమండ్రికి దగ్గర్లో  ఉన్న మా ఊరి నుంచి అటు గీత ఉన్న వైజాగ్ కో, లలిత ఉన్న కర్నూలు కో  వెళ్లాల్సి వచ్చేది. ఎప్పుడైనా అలా వెళ్లలేకపోతే వాళ్లకు కోపాలు వచ్చేసేవి.  దానికి తోడు ఊళ్లో మరో మూడు ప్రైవేటు స్కూల్స్ వెలిసాయి. టీచర్స్ దొరకక చక్కగా ట్రెయినప్  అయి ఉన్న మా స్కూల్ టీచర్స్ కి మరో వందో, యాభయ్యో  ఎక్కువిచ్చి వాళ్ల స్కూల్కి పిలిచేసుకునేవాళ్లు. ఫలితం గా 1994కి మాస్కూల్కి  ఎడ్మిషన్స్ తగ్గాయి. నాకు గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ప్రారంభమైంది. తీర్చాల్సిన ఇంటి అప్పు; ఆడపిల్లల పురుళ్లు – పుణ్యాలు, పెట్టుపోతలు; ఇంకా అప్పు తీర్చలేదా అనే చుట్టాల ఎగతాళి మాటలు – వెరసి సూదిమొన స్థంభం మీద ఒంటికాలితో నిల్చునట్టు అన్పించేది. ఫలితంగా ఆ సంవత్సరం ఎక్కువగా రాయలేకపోయాను. ఆ సంవత్సరం రాసిన ‘పిండి బొమ్మలు’ కథకు రంజని అవార్డు వచ్చింది. ఆకథ 10.6.94 ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘ఈవారం కథ’గా వచ్చింది.

-27.7.94న ‘నిరసన’ కథ విశాఖ రేడియో నుంచి బ్రాడ్ కాస్ట్ అయ్యింది.

-13.11.94 ఆదివారం ఆంధ్రజ్యోతి స్పెషల్ లో ‘గేప్’ కథ వచ్చింది. 

-6.12.94 న రిలీజైన ‘మంచికత’ సంకలనం లో రంజని అవార్డ్ పొందిన నా ‘గాజుపళ్ళెం’,‘పిండి బొమ్మలు’ కథలు వచ్చాయి.

ఫిబ్రవరి 94 రచన మంత్లీలో నాది, గీతది వైజాగ్ బుక్ ఎగ్జిబిషన్లో మాట్లాడిన వార్తలు, ఫోటోలు వచ్చాయి..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.