పెద్దరికం

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథ)

-ఆదోని బాషా

          “ఇదిగో సావిత్రీ, ఈ రోజు సాయంత్రం నా బెస్ట్ ఫ్రెండ్ పరిమళ బర్త్ డే పార్టీ ఉంది. పార్టీకి మనిద్దరిని పిలిచింది. నేను సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంటికొచ్చేస్తాను. ఆలోగా నువ్వు కొత్త బట్టలు వేసుకొని మేకప్ చేసుకొని సిద్ధంగా వుండు. ఇద్దరం కలిసి పార్టీకి వెళదాం” డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న లత పెదాలకు లిప్స్ స్టిక్ రాసుకుంటూ కూతురు సావిత్రితో అంది.

          “నాకు పార్టీలంటే ఇష్టం లేదని నీకు తెలుసు కదమ్మా. నేను రాను. కావాలంటే మాధురిని పిల్చుకెళ్లు” సోఫాలో కూర్చుని నవల చదువుతున్న సావిత్రి చిరాగ్గా అంది.
“అదేమిటే, ఎప్పుడు పార్టీకి పిలిచినా ఇదే మాట చెబుతావ్? పరిమళ పిలిచింది నిన్ను గాని మాధురిని కాదు కదా. ఆవిడ అంత ప్రేమగా పిలిచినా నువ్వు వెళ్లకపోతే ఆవిడ ఏమనుకుంటుంది?”

          “ఏమనుకుంటే నాకేం? ఆవిడ నీ ఫ్రెండ్ గానీ నా ఫ్రెండ్ కాదుగా. నువ్వు వెళ్లక పోతేనే బాధపడుతుంది గాని నేను వెళ్లకపోతే ఏమీ అనుకోదు. మాధురి కూడా రాకపోతే నువ్వు ఒక్కదానివే వెళ్ళు. అంతేగాని నన్ను బలవంతం చెయ్యకు” నిష్టూరంగా అంది సావిత్రి.

          “అది కాదే! పరిమళ కూతురు డిగ్రీలో నీ క్లాస్ మేట్ కదా. ఆమెకెప్పుడో పెళ్ళై పోయింది. ఇప్పుడు పరిమళ నీ పెళ్ళి గురించి ఆలోచిస్తోంది. నువ్వు ఇలా పార్టీలు, ఫంక్షన్లకు వెళుతుంటే నలుగురి దృష్టిలో పడతావ్. అప్పుడు నీకు మంచి సంబంధాలొస్తాయని చెప్పింది పరిమళ.”

          “నా పెళ్లి గురించి ఎవరూ చింత చేయాల్సిన పని లేదమ్మా. నాకసలు పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదని నీకు చాలాసార్లు చెప్పాను కదా.”

          “అవేం మాటలే? నీ వయసు ఆడపిల్లలంతా హాయిగా పెళ్ళిళ్ళు చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం పెళ్లే వద్దంటున్నావ్. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తుంటే చెప్పు. వాడి కులం మతం వేరైనా మీ నాన్నని ఒప్పించి అతనితో నీ పెళ్ళి జరిపిస్తాను” జుట్టుకి రంగు అద్దుతూ చెప్పింది లత.

          “అమ్మా, నాకు పెళ్ళి చేసుకొనే ఉద్దేశ్యమే లేనప్పుడు ఇక ప్రేమించే అవసరమేముంటుంది? నాకసలు ఈ ప్రేమ, పెళ్ళిళ్ళు అంటే ఇష్టమే లేదు.”

          “నీకు పిచ్చి పట్టిందా? నీ వయసు ఆడపిల్లల్ని చూడు, ఎవరైనా ఇలా విరక్తిగా మాట్లాడుతున్నారా? పైగా వారు తమ పెళ్ళి మాటెత్తితే చాలు, ఆనందంతో పొంగిపోతారు. తొందరగా పెళ్ళి కావాలని బాగా సింగారించుకొని పార్టీలు, ఫంక్షన్లలో తిరుగుతూ నలుగురి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు మాత్రం ఎక్కడికీ వెళ్ళకుండా ఎప్పుడు చూసినా ఇంట్లోనే పడి వుంటావ్” కనుబొమ్మలకు షేడ్ ఇస్తూ అంది లత.

          “నేను ఇంట్లో ఖాళీగా కూర్చోవటం లేదమ్మా. ఇంటి పనులు చేస్తున్నాను కదా. కథలూ, కవితలు కూడా రాస్తున్నాను. ఒక మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనేది నా జీవితాశయం.”

          “ఈ కాలంలో నీ కథల్నీ, కవితల్ని ఎవరు చదువుతారు? ఇప్పుడు సాహిత్యానికి విలువ లేదు. కాలం మారింది. కాలానికి తగ్గట్టు నువ్వు కూడా మారాలి. అందరూ ముందుకెళుతుంటే నువ్వు వెనక్కి వెళుతున్నావ్. అయినా తప్పు నీది కాదులే. మీ నాన్నని తప్పుబట్టాలి. నిన్ను తన అభిరుచికి తగ్గట్టు పెంచాడు. తన కిష్టమైన నటి సావిత్రి పేరు పెట్టాడు. నేను వద్దన్నా వినకుండా నిన్ను తెలుగు మీడియంలో చదివించాడు. ఇప్పుడా సావిత్రీ లేదు, తెలుగు సాహిత్యమూ లేదు. అందుకే నువ్విలా తయారయ్యావ్” అని రుసరుసలాడుతూ మేకప్ ముగించి హడావుడిగా హాండ్ బ్యాగ్ తీసుకొని బయటికెళ్లిపోయింది లత.

***

          లత, మనోహర్ లకు ఏభై ఐదేళ్ళుంటాయి. వారిద్దరిది ప్రేమ వివాహం. ఇద్దరు కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నారు. డిగ్రీ తర్వాత లత ఫ్యాషన్ డిజైనర్ గా స్థిరపడింది. మనోహర్ కి ఓ ప్రయివేటు బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం వచ్చింది. లత తలిదండ్రులు కోటీశ్వరులు. పైగా ఆధునిక జీవితానికి అలవాటు పడ్డవారు. సాంప్రదాయ కుటుంబానికి చెందిన మనోహర్ ని లత పెళ్ళి చేసుకోవటం వారికి ఇష్టం లేదు. కాని లత తల్లి దండ్రుల్ని ఎదిరించి మనోహర్ ని పెళ్ళి చేసుకుంది.

          చిన్నప్పటి నుంచి ఆధునిక జీవితానికి అలవాటు పడ్డ లత మనోహర్ కోసం తల్లి దండ్రుల్ని వదిలేసింది కానీ ఆధునికతను వదల్లేదు. పైగా ఫ్యాషన్ డిజైనర్ కావటంతో ఫ్యాషన్లు ఆమె జీవితంలో విడదీయ లేని భాగాలయ్యాయి. ప్రతి రోజు మేకప్, ఆధునిక దుస్తులు ధరించకుండా బయటికి వెళ్ళేది కాదు. భార్యపై ప్రేమ వల్ల మనోహర్ ఆమె ఫ్యాషన్లను భరించాడు. కాని పిల్లల్ని కనే విషయంలో మాత్రం ఆమెతో విభేదించాడు. తన శారీరక సౌందర్యం కోసం ఐదారేళ్ళ వరకు పిల్లల్ని కనకుండా కుటుంబ నియంత్రణ పాటిస్తానని లత నిర్ణయిస్తే దానికి మనోహర్ తీవ్రంగా స్పందించాడు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల్సిందేనని పట్టుబడ్డాడు. చివరికి ఓ షరతు మీద బిడ్డను కనటానికి లత ఒప్పుకుంది. బిడ్డను కనటం వరకే తన బాధ్యత, ఆ తర్వాత బిడ్డ బాగోగులన్నీ మనోహరే చూసుకోవాలనేది లత పెట్టిన షరతు. దానికి మనోహర్ ఒప్పుకున్నాడు.

          అలా సావిత్రి పుట్టింది. మనోహార్ ఆ బిడ్డకు తన అభిమాన నటి సావిత్రి పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడు. సావిత్రి బాగోగులు చూసుకోవటానికి ఓ ఆయాను నియమించాడు. లత వద్దన్నా వినకుండా సావిత్రిని తెలుగు మీడియంలో చదివించాడు. సావిత్రి తనని మమ్మీ అనకుండా అమ్మా అని పిలుస్తుంటే లతకి నామోషీగా అనిపించేది. సావిత్రి పాత సాంప్రదాయాల్ని పాటించటం కూడా ఆమెకి నచ్చేది కాదు. చిన్నప్పుడు సావిత్రి ఎంతో చలాకీగా ఉండేది. ఆకాశమే హద్దు అన్నంత ఉత్సాహంగా ఉండేది. అందరితో కలుపుగోలుగా మాట్లాడేది. కాని యుక్తవయసులోకి అడుగుపెట్టాక ఆమె స్వభావం హఠాత్తుగా మారిపోయింది. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా వుండ సాగింది. పెళ్ళిళ్ళు, వేడుకలకు కూడా వెళ్ళేది కాదు. ఆమె స్వభావంలో వచ్చిన మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెను మార్చటానికి ఎంతో ప్రయత్నించారు. కాని సావిత్రిలో మార్పు రాకపోగా రానురాను మరింత మొండిగా తయారైంది.

          సావిత్రి పుట్టిన ఆరేళ్ళ తర్వాత లత మరో ఆడబిడ్డ మాధురికి జన్మనిచ్చింది. లత మాధురిని తన కిష్టమైన రీతిలో పెంచింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించింది. ప్రస్తుతం మాధురి డిగ్రీ చదువుతోంది. సావిత్రిలా కాకుండా ఆమెకు ఎంతో మంది ఆడ, మగ స్నేహితులున్నారు.

***

          “ఏమండీ, సావిత్రి రానురాను మరీ మొండిగా తయారౌతోంది. తను పెళ్లే చేసుకోనంటోంది. ఒక్క పార్టీకీ, ఫంక్షన్ కి కూడా వెళ్ళటం లేదు. ఆమెకి ఫ్రెండ్స్ కూడా లేరు. ఎప్పుడు చూసినా ముభావంగా ఉంటుంది. ఆమె ఇలా కావటానికి కారణం మీ పెంపకమే! మీరామెను తెలుగు మీడియంలో చదివించటం వల్లనే ఆమె ఇలా తయారైంది” ఆ రోజు రాత్రి ఏకాంతంలో భర్తతో అంది లత.

          “కాని సావిత్రి చిన్నప్పుడు చాలా చలాకీగా ఉండేది. యవ్వనంలోకి అడుగు పెట్టాక ఆమె స్వభావం పూర్తిగా మారిపోయింది. దానికి కారణమేమిటో అంతు పట్టడంలేదు” మనోహర్ బాధగా అన్నాడు.

          “ఆ కారణం తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గముంది. సావిత్రిని ఓ మంచి సైకియాట్రిస్ట్ కి చూపించాలి.”

          “కాని దానికి సావిత్రి ఒప్పుకుంటుందా?”

          “ఒప్పుకోదు. కాని ఆమెకి తెలియకుండానే ఆ పని చేస్తాను. నా కజిన్ అశోక్ అమెరికాలో ఓ సైకియాట్రిస్ట్ గా పని చేస్తున్నాడని మీకు తెలుసు కదా. ఈ రోజు సాయంత్రం నాకతను ఫోన్ చేశాడు. వచ్చే ఆదివారం మా నగరంలో జరగబోయే ఓ మెడికల్ కాన్ఫరెన్సులో పాల్గొనటానికి అతను ఇండియా కొస్తున్నాడట. కాన్ఫెరెన్స్ వారం రోజులు జరుగుతుందట. ఆ వారం రోజులు అతన్ని మా ఇంట్లోనే ఉండమని ఆహ్వానించాను. సావిత్రి సమస్య గురించి అతనికి వివరంగా చెప్పి దానికి పరిష్కారాన్ని సూచించమన్నాను. దానికతను ఒప్పుకున్నాడు. తనని ఓ సైకియాట్రిస్ట్ గా కాకుండా ఓ రచయితగా సావిత్రికి పరిచయం చెయ్యమన్నాడు. ఇక్కడ వుండే వారం రోజులు సావిత్రి మనస్తత్వాన్ని అధ్యయనం చేసి ఆమె ప్రవర్తనకు కారణమేమిటో తెలుసుకొనే ప్రయత్నం చేస్తానన్నాడు” అంది లత.

          “చాలా మంచి పని చేశావ్ లతా. అశోక్ మంచి సైకియాట్రిస్ట్ అని విన్నాను. అతను సావిత్రి సమస్యకు సరైన పరిష్కారం సూచిస్తాడనిపిస్తోంది” ఆనందంగా అన్నాడు మనోహర్.

***

ఆదివారం ఉదయం అశోక్ అమెరికా నుంచి హైదరాబాద్ కి చేరుకున్నాడు. అతనికి అరవై ఏళ్ళుంటాయి. మనోహర్ దంపతులు అతన్ని ఎయిర్ పోర్ట్ నుంచి కారులో ఇంటికి పిలుచుకొచ్చారు. ఇంటికొచ్చాక సావిత్రి, మాధురిలను అశోక్ కి పరిచయం చేశారు. మొదట్లో సావిత్రి అశోక్ పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. కాని అశోక్ ఓ రచయిత అని లత చెప్పగానే సావిత్రికి అతని పట్ల ఆసక్తి కలిగింది. సావిత్రి తెలుగులో కథలు రాస్తుందని తెలిశాక అశోక్ ఆమె రాసిన కథలు ఇస్తే చదువుతానన్నాడు. అప్పుడు సావిత్రి ఉత్సాహంగా తను రాసిన కథల సంపుటి తెచ్చి అశోక్ కిచ్చింది. అశోక్ అప్పటికప్పుడే కొన్ని కథల్ని చదివి సావిత్రిని మెచ్చుకున్నాడు. అలా ఇద్దరి మధ్య చనువు పెరిగింది.
అశోక్ ప్రతిరోజు సాయంత్రం కాన్ఫరెన్స్ నుంచి తిరిగి రాగానే సావిత్రి గదికి వెళ్ళి ఆమెతో తెలుగు సాహిత్యం గురించి చర్చించేవాడు. మధ్యమధ్యలో ఆమె వ్యక్తిగత విషయాలు కూడా అడిగేవాడు. సావిత్రి మొదట్లో సంకోచించినా తర్వాత అశోక్ ఆప్యాయంగా అడిగేసరికి మనసు విప్పి మాట్లాడింది. అంత వరకు ఎవరికీ చెప్పని వ్యక్తిగత విషయాల్ని చూచాయగా అశోక్ కి చెప్పింది. మనుషుల మానసిక విశ్లేషణ చేయటంలో ఆరితేరిన అశోక్ సావిత్రి అస్పష్టంగా చెప్పిన విషయాల్ని ఒకదానితో మరొకటి జోడించి చూశాడు. అప్పుడొక స్పష్టమైన మానసిక చిత్రపటం అతని కళ్ళ ముందు సాక్షాత్కరించింది. దాని ఆధారంగా సావిత్రి బాల్యంలోంచి యవ్వనంలోకి అడుగుపెట్టాక ఆమె స్వభావంలో నకారాత్మక మార్పు ఎందుకు వచ్చిందో అతను గ్రహించగలిగాడు.

          అమెరికాకి వెళ్ళే ముందు అశోక్ ఏకాంతంలో లతని కలసి మాట్లాడాడు. “లతా, నువ్వు భావిస్తున్నట్టు సావిత్రి ఉదాసీనంగా ఉండటానికి కారణం ఆమె తండ్రి పెంపకం కాదు. ఆమె తెలుగు మీడియంలో చదువుకోవడం కూడా ఆమె సమస్యకు కారణం కాదు. అదే నిజమైతే ఆమె చిన్నప్పటి నుంచే ఇలా తయారయ్యేది. ఆమె చిన్నప్పుడు మిగతా పిల్లల్లాగే చురుగ్గా, చలాకీగా ఉంది. కాని యవ్వనంలోకి అడుగు పెట్టాక ఆమె ప్రవర్తనలో హఠాత్తుగా మార్పు వచ్చింది. దానికి కారణం ఎవరో కాదు, నువ్వే!” అన్నాడు.

          ఆ మాట విని లత నివ్వెరబోయింది. “నాన్సెన్స్! నేనెలా కారణమౌతాను? నేనసలు ఆమె పెంపకంలోగాని, చదువు విషయంలోగాని జోక్యం చేసుకోలేదు. ఏ విషయంలోనూ ఆమెను నియంత్రించలేదు” ఉక్రోషంగా అంది.

          “ఇది నువ్వు తెలిసి చేసిన పని కాదు. నీకు తెలియకుండానే ఇదంతా జరిగి పోయింది. నువ్వు చిన్నప్పటి నుంచే ఆధునిక జీవితానికి అలవాటు పడ్డావ్. నీకు వయసు మీదబడుతున్నా ఆ అలవాటును మానుకోలేదు. నీ మేకప్, ఆధునిక వస్త్రధారణ వల్ల నువ్వు సావిత్రికి తల్లిలా కాకుండా అక్కలా కన్పిస్తున్నావ్. చిన్న వయసులో సావిత్రి ఈ విషయాన్ని పట్టించుకో లేదు కాని యుక్త వయసులోకి వచ్చాక ఆమెకు నీ ధోరణి నచ్చలేదు. పైగా అందరూ నీ అందాన్ని మెచ్చుకుంటుంటే ఆమె ఇబ్బందిగా ఫీలయ్యేది. మిగతా ఆడపిల్లలకు భిన్నమైన మనస్తత్వం ఆమెది. అందువల్ల ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పుకో లేక మనసులోనే మధన పడసాగింది. రానురాను ఇదే విషయం ఆమెకొక మానసిక సమస్యగా మారింది. తాను చెయ్యవలసిన మేకప్ తల్లి చేస్తుండటంతో ఆమె మేకప్ చేసుకోవటం మానేసింది. బయట పార్టీలు, ఫంక్షన్లకు వెళ్ళటం కూడా మానేసింది. నిజానికి ఇదంతా ఆమె పరోక్షంగా నీకు తన నిరసన తెలపటానికే చేసింది. కాని నువ్వు ఆ సంగతి గ్రహించలేదు. దాంతో సావిత్రి మొండిగా తయారైంది. చివరికి పెళ్ళి కూడా చేసుకోకూడదని నిర్ణయించుకుంది” అన్నాడు అశోక్.

          కజిన్ మాటలు విని లత ముఖం కోపంతో ఎర్రబడింది. “నీ మాటల్ని నేను నమ్మను. ఆధునిక భావాలకు మారుపేరుగా చెప్పుకొనే అమెరికాలో నివసిస్తున్న నువ్వే నా మేకప్పునూ, దుస్తుల్ని విమర్శిస్తున్నావా?” అంది చిరాగ్గా.

          “నా మాటల్ని అపార్థం చేసుకోవద్దు లతా. నేను నిన్ను తప్పుబట్టడం లేదు. సావిత్రి ప్రవర్తనకు కారణాన్ని వివరిస్తున్నానంతే. అమెరికాలో ఎనభై ఏళ్ళ ముసలమ్మలు కూడా మేకప్ చేసుకుంటారు. వారి పిల్లలు వారినేమీ అనరు. ఎందుకంటే అది అక్కడి సంస్కృతి. కాని భారతీయ సంస్కృతిలో శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యానికే ఎక్కువ విలువ నిస్తారు. చిన్నప్పటి నుంచి సంప్రదాయబద్ధంగా పెరిగిన సావిత్రి పెద్ద వయసులో నీ మేకప్పును, ఆధునిక దుస్తుల్ని చూసి జీర్ణించుకోలేక పోతోంది. బయటికి చెప్పుకోలేక మనసులోనే కుంగిపోతోంది. ఆమె డిప్రెషన్ కి అదే కారణం!”

          “అంటే సావిత్రిలో మార్పు రావాలంటే నేను మేకప్ చేసుకోవటం మానెయ్యాలి. ఇదేనా నువ్వు చెప్పదలచుకున్న పరిష్కారం?” లత అసహనంగా అడిగింది.

          “నేను సమస్యకు కారణం మాత్రమే చెప్పాను. పరిష్కారం గురించి నువ్వే నిర్ణయించుకోవాలి. అయితే నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. వయసుకు తగ్గట్టు మేకప్ చేసుకోవటంలో తప్పు లేదు. కాని మేకప్ చాటున వయసును దాచాలనుకోవటమే తప్పు. నువ్వొక స్త్రీలా కాకుండా ఓ తల్లిలా ఆలోచించు. నీ ముఖం మీది ముడతలు వృద్ధాప్య చిహ్నాలు కావు. అవి నీ జీవితానుభవాల అందమైన గుర్తులు. వాటిని మేకప్ చాటున దాచేస్తే దాగేది వృద్ధాప్యం కాదు, నీ అమ్మతనం! అలాగే నీ జుట్టులో అక్కడక్కడా వెండి దారాల్లా మెరిసే తెల్ల వెంట్రుకలు కూడా నీ వృద్ధాప్యాన్ని సూచించవు. అవి నీ పెద్దరికాన్ని సూచిస్తాయి. వాటికి రంగేస్తే దాగేది నీ పెద్దరికమే! ఈ ముడతలు, తెల్ల వెంట్రుకల్లోనూ ఓ రకమైన అందం దాగి ఉంది. వాటిని చూస్తే మన పిల్లలకు మన పట్ల గౌరవభావం కలుగుతుంది. నా స్వానుభవంతో చెబుతున్న మాట ఇది” తన తెల్ల జుట్టును సవరించుకుంటూ నర్మగర్భంగా పలికాడు అశోక్.

***

          మూడు నెలల తర్వాత లత అమెరికాలో ఉన్న అశోక్ కి ఫోన్ చేసింది. కుశల ప్రశ్నలయ్యాక అశోక్ “సావిత్రి ఎలా ఉంది?” అనడిగాడు.

          అప్పుడు లత “నా వల్లనే సావిత్రి డిప్రెషన్ లోకి వెళ్ళిందని నీకెందుకు అన్పించింది?” అంటూ అశోక్ ను సూటిగా అడిగింది.

          దానికి అశోక్ “పేషెంట్ మనసును పుస్తకంలా తెరిచి చదవటమే నా వృత్తి. నా సర్వీసులో ఇలాంటివి కొన్ని వందల కేసులు చూశాను. ఆ అనుభవంతోనే సావిత్రి సమస్యకు కారణాన్ని తెలుసుకున్నాను. నా అంచనా నిజం కాలేదా లతా?” అనడిగాడు.

          “నీ అంచనా నూటికి నూరు పాళ్ళు నిజమైంది అశోక్. నీ మాటలపై నమ్మకం లేకున్నా ఎందుకైనా మంచిదని నువ్వు చెప్పిన రోజు నుంచే నేను మేకప్ చేసుకోవటం మానేశాను. ఆధునిక దుస్తులకు బదులు చీరలు ధరించసాగాను. కొద్ది రోజులు సావిత్రి నన్ను అనుమానంగా చూసింది. తర్వాత మెల్లగా ఆమెలో మార్పు రావటం మొదలైంది. అంతవరకు అద్దం వైపు చూడని సావిత్రి అప్పుడప్పుడు సింగారించుకోవటం మొదలెట్టింది. కొద్ది రోజుల తర్వాత బయటికి కూడా వెళ్ళసాగింది. కొందరు పాత స్నేహితురాళ్లతో కలసి పార్టీలు, ఫంక్షన్లకు కూడా వెళ్ళ సాగింది. అది చూసి నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. ఇప్పుడు సావిత్రి పెళ్ళికి కూడా సుముఖంగా ఉంది. ఇదంతా నీ వల్లనే సాధ్యమైందిరా. నువ్వు సావిత్రితో పాటు నాలో కూడా మార్పు తీసుకొచ్చావ్. ఇన్నాళ్ళు మేకప్ చాటున నా వయసును దాచి దాన్నొక గెలుపు అనుకున్నాను. కాని అది గెలుపు కాదు ఓటమి అని ఇప్పుడర్థమైంది. ముఖం మీది ముడతలు నా అనుభవాల తీపి గుర్తులనీ, జుట్టులోని తెల్ల వెంట్రుకలు నా పెద్దరికానికి చిహ్నాలని ఇప్పుడే గ్రహించ గలిగాను. నా కృత్రిమ అందాన్ని చూసి ఇన్నాళ్ళు నన్ను పొగిడిన వారే ఇప్పుడు నా పెద్దరికాన్ని చూసి గౌరవిస్తున్నారు. ఆ పొగడ్తల కన్నా ఈ గౌరవమే నాకు సంతృప్తి నిస్తోంది. శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యమే గొప్పదని నాకు అర్థమయ్యేలా చేసిన నీకు సదా రుణపడి ఉంటానురా” ఉద్వేగంగా పలికింది లత.

*****

Please follow and like us:

2 thoughts on “పెద్దరికం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథ)”

  1. It is indeed a very good story. How young ladies turn up as dullers. There must be some reason behind their behaviour. A psychiastrst is the best person to solve the issue. So, the writer showed a way! Congrats!

  2. కథ చాలా బాగుంది.
    మన సంస్మృతి సంప్రదాయాలు ఎప్పటికీ విడనాడి కూడదు. ఏ దేశం వెళ్ళినా మనిషి లో మార్పు రాకూడదు.
    ఇంగ్లీష్ చదివినా మన పద్ధతులు మర్చిపోకూడదు.
    ముఖం మీది ముడతలు అమ్మతనాన్ని, తెళ్ళవెంట్రుకలు పెద్దరికాన్ని సూచిస్తాయి అని చాలా బాగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.