మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 2
-చెంగల్వల కామేశ్వరి
మేము దర్శించుకున్న శ్రీమాతారాణి వైష్ణోదేవి ఆలయ చరిత్ర భైరవ్ నాథ్ గుడికి సంబంధించిన వివరాలు చెప్పి మా రెండోరోజు యాత్ర గురించి చెప్తాను.
జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియ జేస్తున్నారు. త్రికూట పర్వతంగా ఋగ్వేదంలో చెప్పబడిన పర్వతసమూహం ఇదే అని అంటారు.
వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతంలో ఉంది. అర్జునుడు అమ్మవారిని పూజించినట్లుగా మహాభారతంలో ఉంది.
స్థలపురాణం ప్రకారం పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయం నిర్మించారని తెలుస్తుంది. త్రికూట పర్వతానికి పక్కన ఐదు రాతి కట్టడాలున్నాయి. వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు
ఇక్కడ సతీదేవి శిరస్సు పడిన కారణంగా కొన్ని సంప్రదాయాల శక్తి పీఠాలన్నింటిలోనూ ఈ పీఠానికి అత్యంత శక్తి వంతమైందిగా భావిస్తారు. కొన్ని సంప్రదాయంల వారు మాత్రం అమ్మవారి కుడిచేయి ఇక్కడ పడిందని భావిస్తారు. హైందవ పవిత్ర పుస్తకాల మూలముగా తెలియవచ్చేది ఏమనగా, కాశ్మీరంలో అమ్మవారి కుడిచేయి పడిందని. ఇప్పటికీ మాతా వైష్ణోదేవి ఆలయంలో మనిషి కుడి చేయి రూపములోని కొన్ని శిల్పాలు లభ్యం కావడం ఈ వాదన సరైనదేననడానికి ఊతమిస్తుంది. ఈ చేతి శిల్పంను అమ్మవారి వరద హస్తంగా భక్తులు గౌరవిస్తారు.
శ్రీధర పండితుడు అనే వ్యక్తి 700 సంవత్సరాలకు పూర్వం ఈ కొండ గుహలను కనుగొన్నాడని చెపుతారు. తన ఇంటిలోనున్న పూజా సంపుటంలో అమ్మవారి విగ్రహం మాయమవడం చూసిన శ్రీధర పండితుడు కటిక ఉపవాసం చేస్తూ అమ్మవారికి మొరపెట్టుకోగా కలలో దర్శనమిచ్చిన అమ్మవారు తను పర్వత సానువులలో ఉన్నానని దారి చూపించిందని, ఉపవాస దీక్ష మానవలసినదిగా ఆదేశించిందని. ఆమె ఆజ్ఞానుసారం శ్రీధర పండితుడు వెతుక్కుంటూ వెళ్ళగా మూడు రాతుల రూపంలో అమ్మవారు దర్శనమిచ్చిందని చెపుతారు.
ఆ మూడు మూర్తులే మహాసరస్వతి మహాలక్ష్మి, మహాకాళీ అవతారాలుగా శ్రీధర పండితుడు పూజించాడని చెపుతారు. తరువాత అమ్మవారి ప్రసాదంగా శ్రీధర పండితునికి నలువురు కుమారులు జన్మించారని, తరువాత శ్రీధర పండితుడు తన శేష జీవితాన్ని అమ్మవారి సేవలో గడిపాడు
ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాల మీద, పల్లకిల్లో ఎలాగైనా వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైంది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లే ఇక్కడ కూడ కొండ ఎక్కేవారు జై మాతాజూ అంటూ అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానే అమ్మవారి ఆలయం కనిపిస్తూనే వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయం లోపలికి సెల్ ఫోన్లు, కెమెరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు. వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.
ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన జమ్మూ జిల్లాలోని, కట్రా పట్టణంలో ఉంది.
దేవిలోని బహ్రియవ్‌నాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాన ఉన్న రాష్ట్రమైన జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఉన్న మాతా వైష్ణో దేవి ఆలయానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం కత్రా భైరవుడిని తాంత్రికుడిగా పరిగణిస్తారు. భైరవుడు వైష్ణో దేవిని అనుసరించాడని మరియు ఆమె కాళీ రూపాన్ని ధరించి అతని తల నరికి వేసినప్పుడు ఆమెపై దాడి చేయబోతున్నాడని నమ్ముతారు. దేవత ఏ సాధారణ అమ్మాయి కాదని తెలుసుకున్న అతను, క్షమించమని వేడుకున్నాడు మరియు మోక్షాన్ని పొందడం కోసం మాత్రమే ఆమె పై దాడి చేయాలని భావించినట్లు అంగీకరించాడు.
అతని నిజాయితీని తాకిన, దేవత అతనికి పునర్జన్మ చక్రం నుండి విముక్తి కలిగించింది. దానితో పాటు ఆ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భైరవనాథుని కోసం ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి అతనిని ఆశీర్వదించింది. తీర్థయాత్రను విజయవంతంగా పూర్తి చేయాలనుకునే ఏ భక్తుడైనా ముందుగా భైరవనాథ్ ఆలయంలో నివాళులర్పించాలి.
దేశంలోని అన్ని వైష్ణో దేవి ఆలయాలకు ఇది వర్తిస్తుంది. మోక్షాన్ని పొందాలని కోరుకున్నారు మరియు సాధించగలిగారు కాబట్టి ఈ ఆలయం మా వైష్ణోదేవిచే భైరవనాథ్ అనే సాధువుకు అంకితం చేయబడింది. భైరవనాథుడు ఈ ప్రదేశంలోనే తుది శ్వాస విడిచి ఉంటాడని స్థానికులు నమ్ముతారు, అందుకే ఈ ప్రదేశం తరువాత దేవాలయంగా నిర్మించబడింది. ఈ ఆలయం వైష్ణోదేవి ఆలయానికి సమీపంలో ఉంది. భైరవనాథుని ఆలయాన్ని ఆరాధించడానికి చాలా మంది సందర్శకులు ఈ ఆలయానికి తరచుగా వస్తుంటారు.
21 వతారీఖున శ్రీ వైష్ణోదేవి ని దర్శించుకుని డిన్నర్ చేసి అందరం బాగా అలిసిపోవడం వల్ల రాత్రి త్వరగా పడకేసేసాము.
ఉదయం అందరూ తయారయి హొటల్ లోనే బ్రేక్ ఫాస్ట్ చేసి మా సామాన్లు అన్నీ వెహికిల్స్ పైన ఎక్కించుకుని అమృత్ సర్ కి బయల్దేరాము.
మాతో వచ్చిన వారిలో ప్రముఖ గాయకులు శ్రీ కెవి రావు గారు, శ్రీ మోహన్ రావు గారు బాపూజీ రావు గారు, గాయనీ మణులు శ్రీమతి రాజ్యశ్రీ శ్రీమతి సీతాకామేశ్వరి శ్రీమతి సత్య కామేశ్వరి రచయిత్రులు రాజ్యశ్రీ అయితే ఆల్ రౌండర్ కవయిత్రి రచయిత్రి ఉమాకల్వకోట. ఇలా వీరందరూ రెండు వెహికిల్స్ లో సర్దుకోవటం వల్ల రెండు వెహికిల్స్ లోనూ ఫుల్ జోష్ గా ఉండేది. ఇంక బ్లూ టూత్ ద్వారా మా అమ్మ రాధాదేవి గారి భక్తి గీతమాలతో మొదలు పెట్టి డ్రైవర్ కోసం మధ్య మధ్యలో హిందీపాటలు పెడితే చాలా హేపీ అయ్యేవాడు మా డ్రైవర్ రాకేష్! పుష్ప హిందీ పాటలు పెడితే చాలా హేపీ అయ్యాడు.
దారిలో బాగున్న హొటల్ లో లంచ్ చేసాము ఏడు వారాల నగల లాగా భధ్రంగా పట్టుకెళ్లి రకరకాల పచ్చళ్లను లంచ్ లో ఒకటి డిన్నర్ లో ఒకటి గా వడ్డించే వాళ్లము. ఒక రోజు ఈ పచ్చడి కట్ చేసి బౌల్ లో వేసి బఫే లో మిగతా ఐటమ్స్ తో పెట్టమంటే వాడు అందులో నీళ్లు పొయ్యమంటారా అని అతి వినయంగా అడిగాడు. హమ్మబాబోయ్ ! ఇంకా నయం అడిగాడు అనుకుని ఆ పని కూడా మేమే చేసేవాళ్లం! స్నాక్స్ లను రోజుకొకటి అందరికీ డ్రైవర్స్ తో సహా సాయంత్రం వేళ ఇచ్చేవాళ్లం!
నాది డ్రైవర్ పక్క సీటు కాబట్టి వాడు డ్రైవింగ్ లో తినలేక పోయేవాడు అందుకని నేను ఏది తిన్నా వాడికి పెడతూ నేను తినేదాన్ని ! వాడు నా కొడుకు వయసువాడే అయినా వాడు మేడమ్ అనో దీదీ అనో పిలిచేవాడు
అలా పాటలతో, మాటలతో ప్రయాణాలు మహా పసందు గా ఉండేవి. అయిదు గంటలకు వాఘా బోర్డర్ కి చేరగానే అందరూ హుషారు గా అయిపోయారు.
ప్రతి భారతీయుడు దేశభక్తితో ఊగిపోయే అద్బుతం ! పెద్ద సరిహద్దు గేట్ కి ఆవల పాకిస్తాన్ సైనిక దళాలు ఈవల మన భారతీయ సైనిక దళాలు చేసిన పెరేడ్ రకరకాల విన్యాసాలు గుండెలనిండా నిండిన దేశభక్తి ఉత్సాహం మనల్ని ఉరకలెత్తిస్తుంది.
ఒక గంట సేపు సాగే ఆ ఆనందపు హేల చూసి తీరాల్సిందే! మరల యధాప్రకారం ఆ గేట్ మూసేస్తారు. అక్కడ వీడియోలు ఫొటోలు అన్నీ తీసుకుని మళ్లీ వెహికిల్స్ ఎక్కి అమృతసర్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్లాము. అక్కడ తప్పనిసరిగా ఆడవారు చున్నీలు కొంగు తల పైన కప్పుకుని వెళ్లాల్సిందే ! మగ వారు కూడా రుమాళ్లతో తలపైన కట్టుకోవాల్సిందే!
ఆ ఆలయ సముదాయం అంతా పాలరాతి తో నిర్మితం ముందు కాళ్లు కడుక్కోవడానికి అనువుగా మెట్ల దగ్గరే నీళ్ల అమరిక కాళ్లు జారకుండా చక్కని కార్పెట్స్ ఏర్పాటు బాగుంది. రాత్రి వేళ వెళ్లామేమో ! దేదీపమాన్యంగా వెలిగే విద్యత్కాంతుల నడుమ అహ్లాదకరమైన నిర్మల జలాల కొలను లో ప్రతిఫలించే దీపకాంతుల సువర్ణ మందిరం !ఆ ధగధగ మెరిసిపోయే బంగారు ఆలయ సొబగు అంతా ఇంతా కాదు.
ఆ పక్కనే మరో ప్రాంగణంలో జలియన్ వాలా బాగ్! అమర వీరుల స్మృతి చిహ్నంగా కట్టిన కట్టడం దాని చుట్టూ రంగు రంగుల జల విన్యాసాలతో పౌంటెన్స్ కనుల పండువుగా అనిపించింది.
మొత్తం అంతా చూసాకా అందరం కలిసి మాకై బుక్ చేసిన హొటల్ కి వచ్చి ఫ్రెషప్ అయి డిన్నర్ చేసాము. ఉదయం యధావిధిగా బ్రేక్ ఫాస్ట్ చేసుకుని ప్యాకప్ ధర్మశాలకు బయలుదేరాము. వాఘాబోర్డర్ జలియన్ వాలా బాగ్, గోల్డెన్ టెంపుల్ కి సంబంధించిన కొన్ని వివరాలు రేపు చెప్తాను.
*****
(సశేషం)