మెరుపులు-కొరతలు
యం.రమేష్ కుమార్ కథ “కిటికీ బయట”
– డా.కే.వి.రమణరావు
మనకు ఏదైనా తీవ్రమైన సమస్య వస్తే మన అంతరంగమంతా కల్లోలమైనప్పుడు ఒక్కోసారి బాధంతా మనకే ఉన్నట్టుగా, బయటి ప్రపంచం నింపాదిగా ఏ సమస్యా లేకుండానే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది, నిసృహ కూడా కలుగుతుంది. కానీ బయట కూడా ప్రతివాళ్లూ ఏదోవొక సమస్యను మోస్తూనే ఉంటారు అని చెప్పే కథ ఇది.
కథనం పెద్దగానే వున్నా కథ చిన్నది, ఇలా ఉంటుంది.
కథ ఉత్తమ పురుషలో చెప్పబడింది, కథ చెప్పే మనిషి పేరు లేదు. ‘అతను’ కథ జరిగిన రోజు ఆఫీసుకు సెలవు పెట్టానని చెప్పాడు కాబట్టి అతన్ని ‘ఉద్యోగి’ అనుకుందాం. ఈ వుద్యోగి కథా రచయిత కూడా, కాని కథ కోసం ప్రస్తుతం ఉద్యోగిగానే తీసుకుందాం.
ఉన్నత మధ్య తరగతి స్థాయిలో ఉన్న ఒక ఉద్యోగికి తన పక్కటెముకల దగ్గర చిన్న కాయలా వచ్చి దాన్ని తన డాక్టరు ఫ్రెండుకి చూపిస్తే ఆ డాక్టరు దాన్ని ఇతర (బయాప్సి) టెస్టులకు పంపుతాడు. దాని ఫలితం వచ్చే లోపల ఉద్యోగి అది క్యాన్సరేమోనని రోజంతా చాలా టెన్షన్ పడతాడు. దేని మీదా మనసు నిలవదు. ఆలోచనలతో నిద్ర పట్టదు. బయట చూస్తే అందరూ బావున్నట్టు, తనకే బాగలేనట్టు అనిపిస్తుంది.
ఉదయం తొమ్మిది గంటలకు బజారు సెంటర్లో అతను ఎప్పుడూ వెళ్లే అన్వర్ టిఫిన్ హోటల్ కి వెళ్తాడు. అక్కడ అన్వర్ హుషారుగా, సంతోషంగా పనిలో ఉంటాడు. ‘ఇతనికేమి కష్టాలున్నాయోగాని ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనపడతాడు’ అనుకుంటాడు ఉద్యోగి. ఎనిమిదో తరగతి చదువుతున్న వాళ్లబ్బాయి అసిఫ్ కూడా హోటల్లో పనిచేస్తూండడం చూసి బాగా చదువుకునే పిల్లాణ్ణి పనిలో ఎందుకు పెట్టడం అనుకుంటాడు ఉద్యోగి.
టెన్షన్ పడుతూనే వుద్యోగి సాయంకాలం వరకు గడిపి ఆ తరువాత ఆస్పత్రికి వెళ్లి డాక్టరును కలిస్తే అతను ‘అది క్యాన్సరు కాదు కేవలం మైలోమా గడ్డ మాత్రమే’ అంటాడు. ఉద్యోగికి చాలా రిలీఫ్ కలుగుతుంది.
మరుసటి రోజు పొద్దున్నే ఒక పనిమీద డాక్టరు ‘బజారు సెంటరుకొస్తున్నానని చెప్పి ఉద్యోగిని కలవమంటాడు. ఇద్దరూ కలిసాక అక్కడి నుంచి అన్వర్ హోటల్ కి బయల్దేరుతారు. దారిలో డాక్టరు అన్వర్ కి ప్రాస్టేట్ క్యాన్సరని, సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నానని ఉద్యోగికి చెపుతాడు. అది విని ఉద్యోగి ఆశ్చర్యపోతాడు. అందుకే చదువుకుంటున్న కొడుకుకి పనిలో తర్ఫీదు ఇస్తున్నాడని అర్థమౌతుంది. ‘అంత ప్రాణాంతకమైన జబ్బుతో ఉండి కూడా అన్వర్ అంత సంతోషంగా ఎలావున్నాడు’ అని ఉద్యోగి అనుకుంటాడు.
‘ప్రపంచంలో పతివొక్కరూ ఏదోవొక సమస్యతో బాధపడుతున్నా పైకి మామూలుగానే ఉంటున్నారు. అలా ఉండడం వల్లే ప్రపంచం మామూలుగా కనిపిస్తూంది’ అనుకుని తనొక పాఠం నేర్చుకున్నాననుకుంటాడు. ఇదీ కథ.
ఈ కథలో కొత్తదనం ఏమీ లేదు. ఇలాంటి థీమ్ తో చాలా కథలు వచ్చాయి. ఐతే ఈ కథలో ట్రీట్ మెంట్ కాస్త వేరుగా ఉండి చదివిస్తుంది.
దాదాపుగా సంప్రదాయ శిల్పంలో రాసిన ఈ కథలో కథనం బావుంది. పాత్రలు, సంభాషణలు చాలా వరకు వాస్తవికంగా ఉన్నాయి. కథ కంటెంట్ లో అధిక భాగం కథ నడిపించడానికి గ్యాప్ ఫిల్లర్ లా తప్ప కథాంశానికి అవసరం లేని విధంగా ఉంది. అంతరంగ చిత్రణ లైటర్ వెయిన్ లో నడపడం వల్ల సీరియస్ నెస్ నచ్చని పాఠకులకు బావుంటుంది. టెన్షన్ పడుతూ ఉద్యోగి రోజంతా ఇంట్లోనే ఉన్నా అతని శ్రీమతి ప్రసక్తి ఒక్క వాక్యంలోనే వస్తుంది. ఆమెకు కథలో బొత్తిగా పాత్రలేదు.
పోలిక కోసం తనకంటే కష్టంలో ఉన్న ఒక వ్యక్తిని (అన్వర్) ఉదాహరణగా తీసు కోవడం చాలా పాత టెక్నిక్. రచయిత తన సందేశాన్ని వ్యక్త పరచడానికి హేతువు కంటే ఆదర్శ సెంటిమెంటు పద్ధతిని ఎన్నుకున్నట్టుగా కనిపిస్తుంది.
కథలో ఉద్యోగికి మనస్సులో ఆందోళనగా ఉన్నప్పుడు డైవర్షన్ కోసం టీవీలో సినిమాలు, ఫోనులో వాట్సాప్ చూస్తాడు. ఆ సందర్భాన్ని ప్రస్తుత సినిమాల మీద, వాట్సాప్ సందేశాల మీద చక్కటి చెణుకులు వేయడానికి రచయిత ఉపయోగించు కున్నారు.
కథ ప్రారంభంలో రచయిత చెప్పిన ఈ వాక్యం కథా గమనాన్ని నడిపిస్తుంది. ‘ఎందుకో నా చుట్టూ వున్న వారంతా సంతోషంగా వున్నారనీ, నేనే ఇలా సతమతమవుతూ వున్నానని అనిపిస్తోంది. నాకంటే అందరూ ఆనందంగానే వున్నారనే ఫీలింగ్’.
ఈ చివరిది రివీలేషన్ వాక్యం. ‘నిత్యం ఎదురుపడే మనుషుల్లోనే ఎవరికెలాంటి సమస్యలున్నాయో మనకి తెలీదు. కిటికీ నుంచి చూస్తే దూరంగా కనిపించే వాళ్లందరూ హాయిగా తమ పనుల మీద తాము తిరుగుతున్నట్టుగా వాళ్లకి తక్షణ సమస్యలేవీ లేనట్టుగానే అనిపిస్తుంది. కానీ ఎవడే సమస్యని మోసుకుంటూ తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు.’
మధ్యలో ఒకసారి ‘నీకేమీ కష్టాలులేవా, ఎప్పుడూ సంతోషంగా ఉంటావు?’ అని ఉద్యోగి అన్వర్ ని అడిగితే అతను (క్యాన్సర్తో బాధపడుతూ కూడా) ‘కష్టాలు లేని మనిషెవరుంటారు సార్? వాటిని గుర్తు చేసుకోకుండా ఏదో ఇలా బతికేయడమే’ అని జవాబిస్తాడు. ఇదే కథ పాఠకులకిచ్చే సందేశం.
పై వాక్యాలు రాసి కథాంశం, సందేశం స్పష్టంగా ఉండేలా రచయిత జాగ్రత్త పడ్డారు.
కథలో రెండు అంశాలు ఆకట్టుకుంటాయి. మొదటిది కథ చెప్తున్న వ్యక్తి అంతరంగ చిత్రణ, రెండవది బయటి ప్రపంచం బాగానే ఉందని అనుకోవడం. చివర్లో బయటి ప్రపంచమంతా కూడా ఏదో ఒక కష్టం పడుతున్న వారితో నిండి వుందన్న రివిలేషన్ ని చూపించడం కొంత కొత్తదనమని చెప్పవచ్చు.
ఈమధ్య వచ్చే అధికశాతం కథల్లో హేతువు ద్వారా కాక సెంటిమెంటు లేదా ఆదర్శం ద్వారా రచయితలు తమ సందేశం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటిలో నేర్పుగా రాయబడిన కథలు చదవడానికి బావుంటాయి, పాఠకుల్ని ఉత్తేజితుల్నికూడా చేస్తాయి. వీటిల్లో కొన్ని మంచి కథలు అనికూడా అనిపించుకోవచ్చు. కాని వీటి ప్రభావం పాఠకుల మీద కొంత కాలమే ఉంటుంది. వారిని ఆలోచనకు పురికొల్పి వారిలో ఆ అంశంలో మార్పు తెచ్చేందుకు అంతగా ఉపయోగ పడవు. అంటే కథా ప్రయోజనాన్ని పెద్దగా సాధించలేవు.
బరువైన కథాంశం ఉన్న ఈ కథను రచయిత బహుశా లైటర్ వెయిన్ లో రాసేందుకు సెంటిమెంటు/ఆదర్శ పద్దతిని ఎంచుకున్నారని అనుకోవచ్చు. రచయిత ఈ కథని ఇంకా లోతుగా కూడా రాయగలరు అనిపిస్తుంది. పై కథలో హేతువుకి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కథ ఆసక్తినే కాక ఆలోచనను కూడా కలిగించ గలదు. రచయితకు అభినందనలు.
*****