షేక్స్పియర్ ను తెలుసుకుందాం
(కాళ్లకూరి శేషమ్మగారి పుస్తకం పై సమీక్ష )
-అనురాధ నాదెళ్ల
ఆరవ అధ్యాయంలో,
మానవ జీవన విధానానికి స్ఫూర్తిదాతగా షేక్స్పియర్ ను చెపుతారు రచయిత్రి. ఆయన రచనల్లో దేశప్రేమ, జాతీయతా భావాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకి దేశ బహిష్కరణకు గురైన రాజు తిరిగి దేశానికి చేరినపుడు అక్కడి మట్టిని ముద్దాడుతాడు. చదివే వారిలో కూడా అప్రయత్నంగా దేశం పట్ల అనిర్వచనీయమైన భక్తిభావం కలుగుతుంది.
షేక్స్పియర్ దృష్టిలో కాలానికున్న విలువ మరి దేనికీ లేదు. రాజులు, రాజ్యాలు, కోటలు, మనుషులు అందరూ మాయమైపోయినా కాలం నిరంతరంగా సాగిపోతూ ఉంటుందంటాడు. అలాటి కాలానికి ఎదురొడ్డి నిలబడేది సాహిత్యం ఒక్కటే అంటాడు. వ్యాపారమంటే కుట్రలూ, దురాశలూ అంటూ 16 వ శతాబ్దంలో తాను చూసిన వ్యాపారపు లావాదేవీలు తన నాటకాల్లో చూపిస్తాడు. స్త్రీ పాత్రలను ప్రత్యేకంగా తీర్చి దిద్దాడు. స్త్రీలు చదువుకుని, సంపాదనాపరులైనా పురుషుల అండ తప్పనిసరి అన్నది “ఏజ్ యూ లైక్ ఇట్”, “మర్చంట్ ఆఫ్ వెనిస్” రచనల్లోని స్త్రీ పాత్రలలో చూడవచ్చు. సుఖాంతమైన నాటకాలలో ధనవంతుల స్వార్థబుద్ధిని చూపిస్తాడు. మనిషి జీవితం చిన్నదని, పోట్లాటలతో అనర్ధాలు తెచ్చిపెట్టుకోవటం సరికాదని చెపుతూ, మంచి నడవడి ఉన్న మనిషి తృప్తిగా, శాంతిగా జీవించగలడంటాడు. విద్యావంతులు, ఉన్నత వర్గాల్లోని వారు మంచి ప్రవర్తనతో సమాజంలో ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపాలంటాడు. రాచ కుటుంబాలలోనూ, ధనిక వర్గం వారిలోనూ పిల్లలందరికీ మర్యాద, మంచి ప్రవర్తనల్లో శిక్షణను ఇప్పించేవారు. సమాజంలో విలువలతో కూడిన జీవితాలను కలలు కన్న ఈ నాటక కర్త భవిష్యత్తులో మనిషి మరిన్ని విలువలను నెలకొల్పుతాడని నమ్మాడు. ఇ.ఎం. ఫోస్టర్ రాసిన ఒక వ్యాసంలో ఐరోపా నాగరికతను ప్రతిబింబించే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు షేక్స్పియర్. రెండో వారు వోల్టేర్.
ఏడవ అధ్యాయంలో,
ప్రసిద్ధ తెలుగు కథకుడు బుచ్చిబాబు షేక్స్పియర్ గురించి రాసిన ఒక సాహిత్య వ్యాసాన్ని చూస్తాం. షేక్స్పియర్ పుట్టి నాలుగు వందల సంవత్సరాలు గడిచిన సందర్భంగా 1964వ సంవత్సరంలో ఆ వ్యాసం భారతి మాసపత్రికలో వచ్చింది.
“విశ్వంలో తిరుగాడే భూగోళం గురించి, మానవ జాతి గురించి చర్చించడం ఎలాంటిదో ఈ నాడు షేక్స్పియర్ గురించి చర్చించడం అలాంటిది.” అని బి.బి.సి. లో ఒక ప్రసంగకర్త బ్రిబెట్ చెప్పారు. “నాగరిక ప్రపంచానికి ఇలా షేక్స్పియర్ గురించి తెలిసికొనుట, వ్రాయుట ఒక తీరిక సమయపు వ్యాపకం” అని ఒక ప్రముఖుని అభిప్రాయం. ఇలాటి ప్రశంసలకు కొన్ని కారణాలు లేకపోలేదు. షేక్స్పియర్ నాటకాలలో మానవుడి అంతరంగ వికాసానికి పనికి వచ్చే దృక్పథం కనిపిస్తుంది. మనలోని మనలను ఆయన తన పాత్రల ద్వారా పట్టి ఇస్తాడు. ఎవరికీ చెప్పక రహస్యంగా మనిషి తనలోనే దాచుకునే ఆలోచనలను బయటపెడతాడు. మనలోని మనిషిని చూసుకుని మనమే విస్తుపోతాము. చేసేపనిని కర్మకు వదిలేసే తత్త్వం భారతీయ జీవనంలో చూస్తాం. అలాటి ధోరణీ షేక్స్పియర్ వ్రాతల్లో కనిపిస్తుంది.
“మానవజాతి చరిత్ర రేపటితో సమాప్తమైతే మానవుడు రాయదగిన వీలునామా షేక్స్పియర్ నాటకాలే” అంటారు బుచ్చిబాబు. కాలం పెట్టే పరీక్షలకు నిలబడి, తరం తర్వాత తరాన్ని తన సాహిత్యంతో దగ్గర చేసుకున్నవాడు షేక్స్పియర్.
షేక్స్పియర్ ఎలాటి వాడన్న ప్రశ్నకు “ప్రతి మనిషి సంతోషంగా బ్రతకాలి. సంతోషం ఎలా సాధించుకున్నా, ఉద్రేకానికి బానిస మాత్రం కాకూడదని నమ్మిన వ్యక్తి ఆయన.” అని బుచ్చిబాబు చెపుతారు. ఆయన వ్యాసం ముగిస్తూ ఆంగ్లభాషతో ఎక్కువ పరిచయం లేక షేక్స్పియర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం తెలుగులో ఒకటి, రెండు పుస్తకాలు రావాలంటారు. శేషమ్మ గారు బుచ్చిబాబు గారి ఆశను ఫలవంతం చేసారు. దాదాపు ఆరు దశాబ్దాలనాటి విలువైన వ్యాసాన్ని పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన శేషమ్మగారు అభినందనీయులు.
ఎనిమిదవ అధ్యాయంలో…
షేక్స్పియర్ విషాదాంత నాటకాల గురించి ఎ.సి. బ్రాడ్లే విశ్లేషణను రచయిత్రి మనకు అందించారు. షేక్స్పియర్ విషాదాంత నాటకాలు పాఠకుల మనసుల్లో గట్టి ముద్రను వేసాయి. ఎందరెందరో విశ్లేషించినా, సాధికారత గల్గిన వ్యక్తి ఎ.సి.బ్రాడ్లే. వారి “షేక్స్పియరన్ ట్రాజడీ” విద్యార్థులకు అధ్యయన గ్రంథం. దీనికి 1916లో ప్రొఫెసర్ నికోల్ స్మిత్ ఉపోద్ఘాతం రాసారు. విషాదాంత నాటకాల్లో నాయకుడు మంచివాడై ఉండక్కర్లేదు. కానీ షేక్స్పియర్ నాటకాలలో నాయకుడు మంచివాడు కావటంతో అతనిలోని చెడుని సానుభూతితో అర్థం చేసుకుంటారు పాఠకులు. ఈ ప్రత్యేక లక్షణం వల్ల ఆ నాటకాలను ప్రజలు అమితంగా ఇష్టపడ్డారంటాడు స్మిత్.
తన పరిశీలనకు వచ్చిన అంశాలే సరైనవని కాక పాఠకులు తమంత తాముగా నాటకాలలోని విశేషాలను మరిన్నింటిని కనుగొనాలని బ్రాడ్లే కోరాడు. ఈ నాటకాలలో నాయకుడి నిర్ణయానికి కారణాలు కేవలం అతనివే కావని, వెనుక కనపడని ఒక అదృశ్య శక్తి ఉండి, అతని పతనానికి దారితీయిస్తుందంటారు.“Poetic justice” గురించి బ్రాడ్లే చెప్పారు. కింగ్ లియర్ నాటకం విశ్లేషణ చేస్తూ స్వచ్ఛమైన ఆలోచనలు, ఆరోగ్యంగా జీవించటం మంచి అని, విషపూరితమైన ఆలోచనలు, రోగపీడిత జీవితం చెడు అని అంటారు. నాటకం చూసేవారి హృదయాలను తాకాలంటే కొంత అనిశ్చితి, భయాందోళనలు కలిగించే అంశాలు అందులో ఉండాలని బ్రాడ్లే అంటారు. ప్రతి చిన్న విషయాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పిన ఘనత ఈ నాటకకర్తది. పాత్రలతో ప్రేక్షకులు మమేకమైపోయి నాటకాన్ని అనుభూతిస్తారు. బ్రాడ్లే విశ్లేషణ చదివిన వారు షేక్స్పియర్ను తెలుసుకుందుకు ఆత్రపడతారు.
విషాదాంత నాటకాలను విశ్లేషించిన బ్రాడ్లే రచయిత వ్యక్తిగత జీవితం కానీ, ఇతర రచయితలతో పోలిక కానీ చెప్పక,కేవలం సామాన్య పాఠకుడిని ఏవైతే ఆకర్షిస్తాయో వాటినే చెప్పారు. ఒకప్పుడు ఉన్నత శిఖరాలను అందుకున్న నాయకుడు/నాయకి పరిస్థితుల వలన అధోస్థాయికి పడిపోయినపుడు పాఠకుడికి వారి పట్ల సానుభూతి కలుగుతుంది. తొందరపాటు తనం, జాప్యం, ఇతరుల పై అతి నమ్మకం, అధిక ఆత్మవిశ్వాసం, ఆవేశం వంటివి విషాదాంతానికి దారితీయిస్తాయి. నాటకాలలో ప్లాట్ విషయంలో కొన్ని చోట్ల మానవాతీత శక్తులు ప్రముఖ పాత్రను పోషిస్తే, కొన్ని చోట్ల మనిషిలోని ఈర్ష్య, అసూయలు నాయకీ, నాయకుల వినాశనానికి దారి తీస్తాయి. వీటి ద్వారా ప్రేక్షకులు జీవిత పాఠాలను నేర్చుకుంటారు.
తొమ్మిదవ అధ్యాయంలో…
విశ్వవ్యాప్తంగా సాహిత్య ప్రక్రియలపై షేక్స్పియర్ రచనల ప్రభావం ఎలా పడిందన్నది వివరించారు. వాస్తవికత, సమాజ తీరు తెన్నులు, చరిత్రలోని అంశాలు వంటివి ఆయన సృజనాత్మకతతో కొత్త రూపురేఖల్ని అద్దుకుని చక్కని సాహిత్యంగా తయారయ్యాయి. ఇలాటి వైవిధ్యాన్ని అందించిన వారిని మిగిలినవారు సహజంగానే అనుసరిస్తారు.
షేక్స్పియర్ 1590లలో పద్య రచనను, 1623లో నాటక రచనను ప్రారంభించాడు. షేక్స్పియర్ రచనలు అనంతకాలం నిలిచి ఉంటాయని బెన్జాన్సన్ ముందుగానే చెప్పాడు. పద్యాన్ని నాటకంతోను, సంభాషణతోనూ కలిపి, అన్ని రసాలను తన నాటకాలలో ప్రదర్శించాడు. భాషకు అనేక కొత్త పదాల్ని, పద సముదాయాల్ని చేర్చాడు. It is greek to me, What a piece of work is a man, All the world is a play house వంటి ఎన్నో ప్రయోగాలు ఇంగ్లీషు భాషకు చేర్పులయ్యాయి. ఆయనకు ఆంగ్లంలో ముఫ్ఫై వేల పదాలు తెలుసన్నది గొప్ప విషయం. ఆయన కాలంలోనే వ్యాకరణం, స్పెల్లింగ్ లకు ప్రాముఖ్యం పెరిగింది. అనేక భాషల్లోకి ఆయన రచనలు అనువదించబడ్డాయి. కేవలం 52 సంవత్సరాల కాలంలో ఇన్ని కొత్తదనాలతో కూడిన సాహిత్యాన్ని ప్రపంచానికి అందించిన ఘనత షేక్స్పియర్ ది.
దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సారధి నెల్సన్ మండేలా “The collected works of William Shakespeare” గురించి ప్రస్తావిస్తూ “షేక్స్పియర్ మనకు ఎల్లవేళలా సందేశమిస్తూనే ఉంటాడు.” అన్నాడు. ఆయన జైలు జీవితంలో స్ఫూర్తిని నింపినది షేక్స్పియర్ సాహిత్యం. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ షేక్స్పియర్ తో అమెరికా ప్రజలకు ఏనాటి నుంచో ఆత్మీయానుబంధం ఉందంటూ, “తరాలు మారినా ప్రతి తరానికీ అతడొక స్ఫూర్తి” అంటారు. న్యూయార్క్ లో షేక్స్పియర్ విగ్రహం ఉంది. “మానవుని మేధస్సును ఇంతగా ఒక రచయిత అధ్యయనం చెయ్యగలడా” అని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆశ్చర్యపడ్డాడు. షేక్స్పియర్ నాటకాలలోని పద్యాల స్థాయిని గమనించిన సంగీతకారులు వాటిని “ఒపెరా”లుగా మలిచారు.
పదవ అధ్యాయంలో…
షేక్స్పియర్ సాహిత్యంలోని కొన్నిప్రత్యేక అంశాలకు రచయిత్రి స్వేచ్ఛానువాదం చేసారు. అవి జూలియస్ సీజర్ లో మార్క్ ఏంటోనీ స్వగతం, మర్చట్ ఆఫ్ వెనిస్ లో పోర్షియా “దయ” గురించి చెప్పిన మాటలు, ఏజ్ యు లైక్ ఇట్ లో ప్రపంచం ఒక నాటక రంగం అంటూ మనిషి జీవితంలోని వివిధ దశలను వివరించిన సందర్భం మొదలైనవి అనువాదాలన్న స్పృహను కలిగించవు. సాహిత్యాభిమానులందరి గుండెల్లో నిలిచిపోతాయి. అనువాదం సహజంగా, సరళంగా చదివిస్తుంది. కాలానికున్న శక్తి గురించి షేక్స్పియర్ ఎన్నో విషయాలను చెప్పాడు. మార్పన్నది తప్పనిసరి అంటాడు. కాలాన్ని జయించేందుకు ఆయన రెండు పరిష్కారాలను చెప్పాడు. ఒకటి యువకులు వివాహం చేసుకుని పిల్లలను కనటం ద్వారా వంశానుగతమైన అంశాలు తరతరాలకు విస్తరిస్తాయంటాడు. రెండవది, సాహిత్యం విలువలతో ఉన్నదైతే శాశ్వతత్త్వాన్ని పొందుతుందంటాడు. కాలం యొక్క శక్తి గురించి చెప్పిన కొన్ని సానెట్లను రచయిత్రి అనువదించి, తన విశ్లేషణను జత చేసారు.
*****
(సశేషం)
నా పేరు నాదెళ్ల అనూరాధ, నా గురించి చెప్పాలంటే పుస్తకాలు, పిల్లలు, సంగీతం ఇష్టమైన విషయాలు. పిల్లల మీద ఉన్న ఇష్టం నన్ను ఎమ్మే,బియెడ్ చేయించి టీచర్ని చేసింది. గత ఏడు సంవత్సరాలుగా విజయవాడలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకపడిన పిల్లలకోసం సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఈ ప్రయాణం ఎన్నో పాఠాల్ని నేర్పుతోంది. నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది.