సింహ పరిపాలన

-కందేపి రాణి ప్రసాద్

 
          అడవికి రాజైన సింహం రోజు ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు అడవి అంత సంచారం చేస్తుంది. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటుంది. ఒకసారి అన్ని జంతువులను పిలిచి సమావేశం నిర్వహిస్తుంది. ఆ సమయంలో ఎవరికి ఎదురైనా సమస్యలు వారిని చెప్పమంటుంది. వాటికీ పరిష్కరాలు చెబుతుంది. ఇలా సింహరాజు తన రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నది.
 
          ఇలాగే ఒకరోజు అడవి సంచారం చేస్తున్న సమయంలో దారి పక్కన కదల్లేక పడున్న ఒక ముసలి ఎద్దు కనిపించింది. పైన ఎండ మాడుతూ ఉన్నది. సింహం ఎద్దును పలకరించింది. ఎద్దు నీరసంగా కళ్ళు తెరిచి చూసింది. కానీ మాట్లాడలేక పోయింది. కొద్దిగా నీళ్ళు తెచ్చి ముఖం మీద చల్లింది అప్పుడు సింహం అడిగింది. “కళ్ళు తిరిగి పడిపోయావా? ఆరోగ్యం బాగాలేదా” అంటూ వివరాలు అడిగింది. మీ భార్య పిల్లలకు కబురు పంపిస్తాను. నీ ఇల్లెక్కడో చెప్పు? అన్నది.
 
          సింహం ఆప్యాయంగా పలకరించే సరికి ఎద్దు కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి. “ రాజా! నా భార్య గతేడాది చనిపోయింది. నా పిల్లలు నన్ను ఇంటి నుంచి గెంటేశారు. నేను పొలం దాకా వెళ్ళి గడ్డి తినలేక పోతున్నాను. నా భార్య ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకునేది. ఇద్దరం మెల్లగా నడుచుకుంటూ పోయి గడ్డి తిని చెర్లో మంచి నీళ్ళు తాగి వచ్చే వాళ్ళం. నా భార్య చనిపోయిన దగ్గర నుంచి నాకు శక్తి ఇంకా సన్నగిల్లింది. లేవలేక పోతున్నాను. అంటూ చెప్తూనే తన భార్యను గుర్తు చేసుకుని ఏడ్చింది ఎద్దు.
 
          “ఊరుకో ఏడవకు ముసలి తనంలో ఎవరికైనా శక్తి తగ్గుతుంది. మరి మీ కొడుకులు ఏం చేస్తున్నారు. నిన్ను ఎందుకు గెంటేశారు? అని అడిగింది సింహం.” ఈ మధ్యనే కొడుకులిద్దరి పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళకే ఇల్లు సరిపోవటం లేదట ‘ నువ్వేక్కడికైన వెళ్ళు’ అన్నారు. నాకు గడ్డి తెచ్చేందుకు వాళ్ళకు సమయం లేదు. మంచి నీళ్ళు కూడా ఇవ్వడం లేదు” అని చెప్పింది ఎద్దు. ఈ విషయాలన్నీ సావధానంగా విన్నది సింహం. ఎద్దు కొడుకులిద్దర్నీ పిలిపించమని మంత్రిని ఆజ్ఞాపించింది.
 
          కాసేపటికి ఎద్దు కొడుకులిద్దరూ సింహం వద్దకు వచ్చారు. మృగ రాజుకు వినయంగా నమస్కరించారు. సింహం ‘ఏమిటి సంగతి’ అని అడిగింది.” మా నాన్నే ప్రతి దానికి విసిగిస్తాడు మహారాజా! గడ్డి తెచ్చి పెట్టాక మంచి నీళ్ళు కావాలంటాడు. అవి తెచ్చేలోపు ఆకలి వెయ్యటం లేదు. తర్వాత తింటానులే అంటాడు. ఎవరూ నాతో మాట్లాడటం లేదు అంటాడు. ఎవరు ఖాళీగా ఉన్నారు. మా రైతు మమ్మల్ని క్షణం కూడా కూర్చోనివ్వడు పొలం దున్నిస్తూనే ఉంటాడు. ఒక్కోరోజు తవుడు కావాలంటాడు. అది ఎంతో ఖరీదు కదా! ఎండు గడ్డి దొరకటమే కష్టంగా ఉన్నది. ఈ మధ్య రైతులు పంట వేసిన తరువాత మిగిలిన గడ్డిని, చొప్పను కోసి పక్కన పెట్టటం లేదు. దీనికంతా కూలి దండగ అని నిప్పు పెట్టు ఆ గడ్డినంతా కాల్చేస్తున్నారు. అందుకే విసుగొచ్చి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో పో అన్నాం” అంటూ ఎద్దు కొడుకులు సుదీర్గంగా తండ్రి మీద చెప్పారు.
 
          సింహం మొత్తం ప్రశాంతంగా విన్నది. ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి ఎద్దు కొడుకుల్ని దగ్గరకు రమ్మని పిలిచింది. చూడండి మీరు చెప్పినవన్ని నిజమయి ఉండవచ్చు. నేను మిమ్మల్ని అబద్దం చెప్పారని అనటం లేదు. వయసు మళ్ళిన వారిని చిన్న పిల్లలు లాగా చూసుకోవాలి. మీ ఇద్దరూ చిన్నగా ఉన్నప్పుడు ఏమీ అల్లరి చేయ కుండానే తల్లిదండ్రుల్ని విసిగించ కుండానే పెరిగారా? నాకు చాక్లెట్ కావాలి అని అడిగి చాక్లెట్ తెచ్చేలోపు బిస్కెట్ కావాలని అడగ లేదూ. మీ నాన్న కూడా అలాగే అనుకోవాలి. శరీరం సహకరించనప్పుడు ఇంట్లో వాళ్ల ఓదార్పు కోసం ఎదురు చూస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆప్యాయతానురాగాలు కోరుకుంటారు. అదే మిరివ్వవలసినది. చిన్నప్పుడు మీరు చెప్పిన మాట వినటం లేదని మిమ్మల్ని ఎక్కడా వదిలెయ్య లేదు కదా! పిల్లలు తాహతుకు మించి కోరికలు కోరిన తన కడుపు మాడ్చుకుని మరి మీ కడుపు నింపటానికి తాపత్రయ పడ్డారు మీ తల్లిదండ్రులు. ముసలి వారు, పసి పిల్లలు ఒక్కలాగానే ఉంటారు. రేపు మీరు కూడా ముసలోళ్ళు అయిపోతే ఇలాగే చేస్తే ఎలా ఉంటుంది. ఆలోచించండి! నిదానంగా చిన్న గొంతుతో చెప్పటానికి ప్రయత్నించింది సింహం. గట్టిగా అరిచి చెప్పకుండా వాళ్ళలో పరివర్తన తేవాలని అనుకున్నది.
 
          సింహం ఆలోచన ఫలించింది ఎద్దు కొడుకుల్లో ఆలోచన మొదలైంది. వాళ్ళేమీ క్రూరులు కారు. ఎదో విసుగులో భార్యల ప్రోత్సాహంతో అలా అనేశారు. ఇప్పుడు వాళ్ళలో పశ్చాత్తాపం మొదలైంది. తాము చేసినా తప్పు తెలిసి వచ్చింది. ఇద్దరూ వెంటనే మృగరాజుకు చేతులు జోడించి నమస్కరిస్తూ “ మా తప్పు తెలుసుకున్నాం. మా నాన్నను మా ఇంటికి తీసుకెళ్ళి ప్రేమగా చూసుకుంటాం. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదు” అన్నారు.
 
          సింహం చిన్నగా నవ్వి ‘అలాగే తీసుకెల్లండి’ అన్నది. ఎద్దు కొడుకులిద్దరూ తమ తండ్రిని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంకెప్పుడూ ఇలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. తన పాలనలో ఏ తప్పూ జరగకుండా కాపాడినందుకు సంతోషించింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.