జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-1 

   -కల్లూరి భాస్కరం

చూపితివట నీ నోటను

బాపురే పదునాల్గు భువనభాండమ్ముల నా

రూపము గనిన యశోదకు

తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్

***

లోకంబులు లోకేశులు

లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం

జీకటి కవ్వల నెవ్వండే

కాకృతి వెలుగు నతని నే సేవింతున్

***

          డేవిడ్ రైక్(David Reich)రాసిన WHO WE ARE AND HOW WE GOT HERE అనే పుస్తకం రెండోసారి చదువుతూ, ముఖ్యమనుకున్న భాగాలను తెలుగులోకి అనువదించు కుంటూ (ప్రచురణకు కాదు), నోట్స్ రాసుకోవడం మొదలు పెట్టాను. రాసుకుంటున్నకొద్దీ పై పద్యాలు మాటి మాటికీ గుర్తుకు రాసాగాయి. అలాగని ఆ పుస్తకం ద్వారా నేను పొందిన అనుభూతికీ, ఈ పద్యాలు చెప్పే భావానికీ పూర్తి సామ్యం కుదిరందని చెప్పలేను; కానీ అవి మాత్రం గుర్తుకొస్తూనే ఉన్నాయి.

          డేవిడ్ రైక్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో జెనెటిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా ఉన్నాడు. గతాన్ని తెలుసుకోవడానికి సాయపడే ప్రాచీన మానవ DNA విశ్లేషణకు తోడ్పడిన మార్గదర్శులలో ఒకడిగా ఈ పుస్తకం అతన్ని పరిచయం చేసింది. ఈ రంగంలోని పది మంది ముఖ్యులలో ఒకడిగా 2015లో ‘నేచర్’ మ్యాగజైన్ అతన్ని గుర్తించింది.

          బాలకృష్ణుని నోట యశోదకు పద్నాలుగు భువనభాండాలు కనిపించినట్టు మొదటి పద్యం చెబుతోంది. ఆ రూపం చూడగానే ఆమెలోని తాపమంతా నశించి, జన్మధన్యమై పోయిందట! ఇది ‘పాండురంగ మాహాత్మ్యం’ అనే సినిమాలో సముద్రాల జూనియర్ రాసిన పద్యం. ఇదే ఘట్టంలో పోతన రాసిన పద్యం కూడా ఉంది కానీ దీనంతగా ఆ పద్యం పాపులర్ కాలేదు.

          రెండో పద్యం మాత్రం పోతనదే. లోకాలు, లోక పాలకులు, లోకాలలో ఉన్నవారు నశించి పోయాక ఏర్పడే- అలోకమైన పెను చీకటి కవతల ఎవడు ఏకాకృతితో వెలుగుతూ ఉంటాడో అతణ్ణి నేను సేవిస్తానని ఈ పద్యం చెబుతోంది.

          యశోదకు బాలకృష్ణుని నోట విశ్వరూపం కనిపించడం తాత్వికం, ఆధ్యాత్మికం, మరీ ముఖ్యంగా వైయక్తికానుభవం. ఆ అనుభవంతోనూ, దానిని నిజమని నమ్మే విశ్వాసంతోనూ నాకు ఎలాంటి పేచీ లేదు. డేవిడ్ రైక్ తన పుస్తకంలో చూపించినది కూడా ఒక విధమైన విశ్వరూపమే. అది, జన్యువిశ్వం. అయితే, అది తాత్వికం, ఆధ్యాత్మికం, వైయక్తికం కాదు; తార్కికం, హేతుబద్ధం, శాస్త్రీయం, సార్వజనీనం. కాకపోతే, నా వరకు చెప్పాలంటే, యశోద చెందిన విశ్వరూపానుభూతికి ఆ పుస్తక పఠనానుభూతి ఏ విధంగానూ తీసిపోదు. తర తరాలుగా కృష్ణుని విశ్వరూపాన్ని భావించుకుంటూ, ఊహలో దర్శించుకుంటూ, ఆశ్చర్యం చెందుతున్నట్టుగానే; సైన్సు ప్రదర్శించే విశ్వరూపాన్ని కూడా భావించుకుని, దర్శించుకుని, ఆశ్చర్యం చెందినప్పుడే మనం వాస్తవంగా జ్ఞానసమాజంగా పరిణతి చెందుతున్నట్టు!

          రెండో పద్యం ఒక సంపూర్ణ అంతిమ స్థితిని చెబుతుంది.  ఆ అంతిమ స్థితిలో అన్నీ పోతాయి, రద్దైపోతాయి, అంతటా పెనుచీకటి తప్ప ఇంకేమీ ఉండదు. ఆ పెను చీకటికి అవతల మాత్రం ఒకే ఒకడు ఏకాకృతితో వెలుగుతూ ఉంటాడు! భక్తకవి అతన్నే భగవంతుడన్నాడు. ఆ వెలుగునే నేను జ్ఞానమంటాను. అలా అనుకుంటున్న సమయంలోనే  హఠాత్తుగా గుర్తొచ్చింది, “జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును” అన్న గురజాడ ప్రసిద్ధవాక్యం. ఎంత యాదృచ్చికత!

***

          బాలకృష్ణుని నోట విశ్వరూపాన్ని చూడగానే యశోదలో తాపం నశించిందన్నది కవి ఊహ కావచ్చు కానీ డేవిడ్ రైక్ పుస్తకంలో జన్యువిశ్వాన్ని దర్శించగానే నాలో అనేక సందేహాలు పటాపంచలు కావడం మాత్రం నిజం. మన దేశం, మతం, ధర్మం, సంస్కృతి, సాహిత్యం, విశ్వాసాలు, మన ప్రవర్తనాసరళి, మన నిచ్చెనమెట్ల సామాజికవ్యవస్థలతో సహా అన్నింటి ‘కీ’ తెలిసి పోయింది. నా ఉద్దేశంలో మనకు ఇంత వరకు తెలిసిన వాటికన్నింటికీ -పై వాక్యం -ఈ పుస్తకం. అరటిపండు వలచినట్టు మన జన్యుమూలాలను అన్నిటినీ ఇది చెప్పేసింది. నేను సాధారణ సైన్సు విద్యార్థిని కూడా కాదు, జన్యుశాస్త్రం గురించి ఓనమాలు కూడా నాకు తెలిసే అవకాశం లేదు. కాకపోతే, డేవిడ్ ఆంథోనీ, మైకేల్ విజెల్, బెడ్రిక్ హ్రోజ్నీ, రాంభట్ల కృష్ణమూర్తి లాంటి పురావస్తు, భాషాశాస్త్ర, మానవ శాస్త్రవేత్తలను ఏ కొందరినో చదివిన కొద్దిపాటి జ్ఞానంతో, నాకు అవసరమైన మేరకు ఈ పుస్తకంలోని జన్యువిషయాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను.

          డేవిడ్ రైక్ శాస్త్రవేత్తే కానీ, మంచి రచయితేమీ కాదు, కావాలని ఆశించడమూ తప్పే; మధ్య మధ్య డొంక తిరుగుడు, గొలుసుకట్టు వాక్యాలతో మన సహనాన్ని పరీక్షిస్తాడు. ఈ పుస్తకంలో మనల్ని ఆకర్షించేది భాష, శైలి కావు; అడుగడుగునా మనల్ని ఆశ్చర్యంలో ముంచి తేల్చే విషయం. అలాగని అక్కడక్కడ తటిల్లున మెరిసే వ్యాఖ్యలు లేవని కాదు. మానవుడికి చెందిన జన్యువిజ్ఞాన రంగంలో ఈ పుస్తకం చరమవాక్యమూ కాదు. ఇది కొనసాగుతున్న పరిశోధన. అయినాసరే, అనేక అంశాలలో ఈ పుస్తకంలోని జ్ఞానం చరమ వాక్యాలనే నిర్దేశించింది. మన ఊహలను, విశ్వాసాలను, అహాలను తలకిందులు చేయడానికి అవే చాలు. 

***

మానవ సంబంధమైన జన్యుశాస్త్ర అంశాల్లో కన్నా మానవ వలసల చరిత్రను వెలుగులోకి తేవడంలో జన్యువిప్లవం గొప్ప విజయం సాధించిందని డేవిడ్ రైక్ అంటాడు. ఇప్పుడు వెల్లడవుతున్నవి మనం చిన్నప్పుడు విన్నవాటికి, ప్రచారంలో ఉన్నవాటికి పూర్తిగా భిన్నమైనవనీ, వాటి నిండా అన్నీ ఆశ్చర్యాలేననీ అంటాడు. మనుషుల మధ్య మనం ఇంత వరకు ఊహించి కూడా ఎరగని సంబంధాలను ప్రాచీన DNA ఆధారిత జన్యు విప్లవం బట్టబయలు చేసిందంటాడు. ఆయన ముందుకు తెచ్చిన ఎన్నో కొత్త నిర్ధారణలు, ప్రతిపాదనల్లోంచి కొన్నింటిని క్లుప్తంగా… 

  • పదేళ్ళలో వరద కట్టిన జన్యుపరిజ్ఞానం: కాలగర్భంలోకి మరింత లోతుగా వెళ్ళి మానవగతాన్ని దర్శించే అవకాశం ప్రాచీన DNA ద్వారానే కలిగింది. గతం గురించి ఇప్పటివరకూ ఉన్న మన అవగాహనను అది ప్రశ్నించుకునేలా చేసింది. నియాండర్తల్ మానవుడి గురించి (జర్మనీలోని నియాండర్ లోయలో దొరికినందు వల్ల అలా పిలిచారు) మనకు చాలా కాలంగా తెలుసు. కానీ 2010లోనే నియాన్డర్తల్ మానవుడి జన్యు సంపుటి(genome)ని శాస్త్రవేత్తలు వెల్లడి చేయగలిగారు. మానవుడి సుదూర గతం గురించిన మన జ్ఞానాన్ని అడ్డుకుంటున్న ఆనకట్టకు ఇది చిన్న   తూము(sluice) తెరిచింది. అంతకు రెండేళ్ల ముందే దక్షిణ సైబీరియాలోని డెనిసోవా గుహలో బయటపడిన మానవ రకం తాలూకు జన్యుసంపుటీ, ఇతర ప్రాచీన DNA ఆవిష్కారాలూ  ఏకంగా వరదగేట్లే తెరిచాయి.  అయితే, ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే నంటాడు డేవిడ్ రైక్.
  • మనలానే నియాండర్తల్స్ : నియాండర్తల్స్ మనం ఇప్పటి వరకూ ఊహించిన దానికన్నా ఎక్కువగా మనల్ని పోలి ఉండేవారు. బహుశా చాలా వరకూ మనలానే నడచుకునేవారు. వైవిధ్యవంతమైన యూరేసియన్(యూరప్, ఆసియాలు మొత్తం విస్తరించిన ప్రాంతం)పర్యావరణాలకు అలవాటు పడడానికి అవసరమైన జన్యు వారసత్వం, ఆఫ్రికా బయట నివసించే జనానికి నియాన్డర్తల్ నుంచే అందింది.
  • సాంకర్యమే నిజం, స్వచ్ఛత అబద్ధం: వర్ణసాంకర్యం, లేదా నిందార్థంలో ‘సంకరజాతి’ అనే మాటలు ఇప్పటికీ మన దగ్గర తరచు వినపడుతూ ఉంటాయి. మహాభారతంలో యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడి విషాదానికి ఒక కారణం, వర్ణసాంకర్య భయమే. యుద్ధం వల్ల పురుషులు చనిపోతారనీ, దాంతో స్త్రీలు ఎవరెవరి వల్లనో సంతానం కనాల్సి వస్తుందనీ, ఆవిధంగా వర్ణసాంకర్యం జరిగి ఆచారాలు, సంప్రదాయాలతో సహా ఉత్తమమైన వ్యవస్థ అంతా అంతరించి పోతుందన్నది అర్జునుడి భయాల సారాంశం. అప్పుడు, “అనార్యుడిలా ఆలోచిస్తున్నా”వని కృష్ణుడు అతన్ని మందలిస్తాడు. ఆ సందర్భంలోనే మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. వర్ణసాంకర్య ప్రస్తావన ఇక్కడే కాదు, అంతకు ముందు కూడా మహాభారతంలో చాలా చోట్ల వస్తుంది. ధర్మరాజుకీ, నహుషుడికీ మధ్య జరిగిన సంభాషణ వాటిల్లో ఒకటి. “అందరూ అన్ని రకాల వారి వల్లా సంతానం కంటున్నా”రని ధర్మరాజు ఆ సందర్భంలో అంటాడు. కృష్ణుని విశ్వరూప ప్రదర్శనకు అర్జునుని వర్ణసాంకర్య భయాలతో ప్రత్యక్ష సంబంధం కాకపోయినా పరోక్షసంబంధం ఉంది. విచిత్రంగా, డేవిడ్ రైక్ తన పుస్తకంలో ప్రదర్శించినది ‘వర్ణసాంకర్య’పు ‘విశ్వమానవ’రూపమే!

          సాంకర్యాలు కొనసాగుతాయని  ప్రాచీన DNA పరిశోధనలు చెబుతుండడమే కాదు, మన మెవరమో తెలుసుకోడానికి ప్రాథమికమైన వనరు సాంకర్యమేననీ, అలాంటిదేమీ జరగలేదని తోసిపుచ్చడం కన్నా, దానిని అక్కున చేర్చుకోవడం అవసరమనీ డేవిడ్ రైక్ అంటాడు(The findings of the ancient DNA revolution suggest that the mixtures will continue. Mixture is fundamental to who we are, and we need to embrace it, not deny that it occurred). భిన్న భిన్న జనాల మధ్య పెద్ద ఎత్తున సాంకర్యాలు జరిగిన స్థాయిలోనే ఆయా జనాభాలు స్థానభ్రంశం చెందుతూ  వేర్వేరు చోట్లకు విస్తరించాయనీ, చరిత్ర పూర్వ కాలంలో ఆయా జనాభాల మధ్య ఉన్న విభజనలు, నేడు కనిపించే విభజనలు ఒకే విధమైనవి కావనీ, అంతస్సంబంధం కలిగిన మన మానవ కుటుంబం మన ఊహకు అందని ఎన్నెన్ని మార్గాల్లో ఏర్పడిందో అవి చెబుతాయని ఆయన అంటాడు. “గతం అనేది కచ్చితంగా వర్తమానానికి దారి తీస్తుందని చెప్పడానికి వీల్లేదు. మానవ చరిత్ర అంతా ఎక్కడికక్కడ మూసుకుపోయిన మార్గాలతో(dead ends)నిండినదే. ఇప్పుడు ఒక ప్రదేశంలో నివసిస్తున్న వారికి గతంలో ఆ ప్రదేశంలో నివసించినవారు కచ్చితంగా పూర్వీకులే నని చెప్పడానికి ఎంత మాత్రం అవకాశం లే” దన్నది డేవిడ్ రైక్ చేసిన అతి ముఖ్యవ్యాఖ్యలలో ఒకటి.

  • సైబీరియాలో కనిపించిన న్యూగినీ జన్యు మూలాలు: మరోసారి నియాండర్తల్స్ ను ప్రస్తావించుకుంటే, వీరికీ, ఆధునిక మానవుడికీ మధ్య సాంకర్యం జరిగింది. నియాండర్తల్స్ యూరోపియన్లకు, తూర్పు ఆసియా వారికీ, న్యూగినీ (ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి ఉత్తరంగా ఉన్న ఒక ద్వీపం; ప్రపంచంలోని అతి పెద్ద ద్వీపాలలో రెండవది) వారికీ సమానంగా దగ్గరగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే వారు సబ్ సహారన్ ఆఫ్రికన్లు, పశ్చిమ ఆఫ్రికన్లు, దక్షిణ ఆఫ్రికాకు చెందిన శాన్ వేట-ఆహార సేకరణ జనం కన్నా ఆఫ్రికా బయటిజనానికి ఎక్కువ దగ్గరగా ఉంటారు. ఆపైన డెనిసోవన్లు నియాండర్తల్స్ కు కజిన్స్ అన్న సంగతి జన్యు సమాచారం  వెల్లడించింది. యూరేసియా ప్రధాన భూభాగంలోని ఏ జనాభాకు కన్నా కూడా  డెనిసోవన్లు జన్యురీత్యా న్యూగినీ జనానికి దగ్గరగా ఉంటారు. న్యూగినీ పూర్వీకులు డెనిసోవన్లతో సంపర్కం పొందారని ఇది సూచిస్తుంది. విశేషమేమిటంటే, డెనిసోవన్ గుహకూ, న్యూగినీకి మధ్య తొమ్మిది వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఆపైన, ఆసియా ప్రధాన భూభాగానికి, న్యూగినీకి మధ్య సముద్రం ఉంది. డెనిసోవన్ జన్యు వారసత్వం కలిగిన జనాలు ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ లలోనూ  ఉన్నారు. ఈ వివరాలన్నీ దూరదూరాలకు జరిగిన వలసల గురించే చెబుతాయి. 75 వేల ఏళ్లనాటి మనిషి అవశేషాలు మనదేశంలోని నర్మదా నదీ ప్రాంతంలోనూ కనిపించాయి కనుక డెనిసోవన్లతో సంపర్కం జరిగి ఉండడానికి అవకాశమున్న ప్రాంతాలలో ఇది కూడా ఒకటి కావచ్చని డేవిడ్ రైక్ అంటాడు. నిజానికి 75 వేల ఏళ్ల క్రితం ఇప్పటి కంటే మానవ వైవిధ్యం చాలా ఎక్కువగా ఉండేదన్నది ఆయన చేసిన ముఖ్య ప్రతిపాదనలలో ఒకటి, వారికి చెందిన జన్యుసంపుటులు ఇప్పుడు పెద్ద సంఖ్యలో లభిస్తూ ఆ వైవిధ్యాన్ని మన కళ్ళకు కట్టిస్తున్నాయి. 

          20లక్షల ఏళ్లలో నాలుగు జనాభా చీలికలు: తూర్పు ఆఫ్రికా మాత్రమే మానవ వైవిధ్యానికి పుట్టిల్లనీ, అక్కడే మానవ సంబంధ ఆవిష్కారాలన్నీ సంభవించాయనీ, మిగతా ప్రపంచమంతా అక్కడి నుంచే జనాభాను స్వీకరించిందనే అభిప్రాయాన్ని డేవిడ్ రైక్ ప్రశ్నిస్తాడు. మానవ పరిణామ క్రమానికి యూరేసియా కూడా ముఖ్య రంగస్థలమే నంటాడు. గత 20 లక్షల సంవత్సరాలలో కనీసం నాలుగు ప్రధాన జనాభాల మధ్య వేర్పాటు(separation) జరిగినట్టు ఆయన వివరించాడు. 1. పద్దెనిమిది లక్షల సంవత్సరాల క్రితం యూరేసియాలోకి మానవుల తొలి ముఖ్య విస్తరణ సంభవించింది. ఆఫ్రికా నుంచి ఇక్కడికి హోమో ఎరక్టస్ అడుగుపెట్టారు.

          2. జన్యు ఆధారాల ప్రకారం, 14 లక్షల నుంచి 90వేల సంవత్సరాల మధ్య కాలంలో ఆధునిక మానవుల అవతరణకు దారి తీస్తూ జన్యు సంబంధమైన రెండవ చీలిక వచ్చింది. దానినుంచి ‘సూపర్ ఆర్కాయిక్’ గ్రూపు పుట్టింది. డెనిసోవన్ల పూర్వీకులతో సాంకర్యం చెందిన ఫలితంగా ఈ గ్రూపు ఏర్పడినట్టు ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ సాంకర్యం అత్యంత వైవిధ్యం కలిగిన డెనిసోవన్ మైటో కాండ్రియల్ DNA సీక్వెన్స్ కు దోహదం చేసింది. ఆ సీక్వెన్స్ ఈ నిర్దిష్ట కాలంలో  నియాండర్తల్స్ కు, ఆధునిక మానవులకు గల ఒక ఉమ్మడి జన్యు వారసత్వాన్ని (పూర్వీకులను) పంచుకుంటోంది.

          3. ప్రధానమైన మూడవ చీలిక 7లక్షల 70వేలు-5లక్షల 50వేల సంవత్సరాల మధ్య సంభవించింది. డెనిసోవన్లనుంచి, నియాండర్తల్స్ నుంచి ఆధునిక మానవులు ఈ దశలోనే వేరుపడ్డారు. 4. 4లక్షల 70వేలు-3లక్షల 80వేల సంవత్సరాల మధ్య డెనిసోవన్లు, నియాండర్తల్స్ ఒకరినుంచి ఒకరు వేరు పడ్డారు. 

  • యూరేసియాలో అమెరికా ఆదివాసుల జన్యుమూలాలు: ఈరోజున మిశ్రమ రూపంలోనే తప్ప సొంతంగా ఉనికిలో లేని అనేక అదృశ్య(ఘోస్ట్) జనాభాలను గుర్తించ గల వెసులుబాటును జన్యువిప్లవం కల్పించింది. పైన పేర్కొన్న ‘సూపర్ ఆర్కాయిక్’ జనంతో పాటు మరికొన్ని ‘ఘోస్ట్’ జనాభాలను శాస్త్రవేత్తలు ఎలా గుర్తించ గలిగారో, పరిశోధన క్రమంలో ఎదురైన రకరకాల చిక్కు ప్రశ్నలతో వారు ఎలా పెనుగులాడవలసి వచ్చిందో, ఎలా సర్దుబాట్లు, దిద్దుబాట్లు చేసుకోవలసి వచ్చిందో డేవిడ్ రైక్ ఆసక్తికరంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఘోస్ట్ జనాభాలలో ‘యాన్షియెంట్ నార్త్ యూరేసియన్(Ancient North Eurasia-ANE)’ ఒకటి. 15వేల సంవత్సరాలకు మించిన వెనకటి కాలంలో ఈ ఘోస్ట్ జనాభా ఉత్తర యూరేసియాలో జీవించింది. విచిత్రమేమిటంటే, ఇప్పుడీ ప్రాంతంలో నివసిస్తున్న జనానికి వీరు ముఖ్య పూర్వీక జనాభా కారు. వీరిలోంచే కొంత మంది సైబీరియా మీదుగా తూర్పునకు పయనించి బేరింగ్ భూ వారధి(land bridge)మీదుగా వెళ్ళి అమెరికా ఆదివాసుల అవతరణకు మూలమయ్యారు. మరికొందరు పశ్చిమంగా పయనించి యూరోపియన్ జనాభాకు దోహదం చేశారు. ఆ విధంగా, ఫ్రెంచి జనాల వంటి ఉత్తర యూరప్ జనాలు వివిధ జనాభాల మిశ్రమం నుంచి వచ్చినట్టు; ఆ జనాభాలలో ఒకటి, ఈ రోజున ఉన్న ఏ ఇతర జనాభాకన్నా కూడా  ఎక్కువగా నేటి అమెరికా ఆదివాసులతో జన్యు వారసత్వాన్ని పంచుకున్నట్టు తేలింది. సైబీరియా మీదుగానే ఈ ANE జనంలో కొందరు అమెరికాకు వెళ్ళినా, నేటి సైబీరియా ఆది వాసులలో మాత్రం ఈ జనం తాలూకు వారసత్వం ఎక్కువ కనిపించదు. సైబీరియా ఆదివాసులు ఇటీవలి కాలంలో, అంటే మంచు యుగం తర్వాత తూర్పు ఆసియాలోని దక్షిణ ప్రాంతాల నుంచి సైబీరియాలోకి వలస వచ్చిన జనాలు కావడమే ఇందుకు కారణం. కనుక, ‘ఆదివాసులు’ అని మనం ఎవరినైనా అనే ముందు కాస్త జాగ్రత్త వహించాలన్న అతిముఖ్యమైన హెచ్చరికను జన్యు పరిశోధనలు చేస్తున్నాయి. ఎక్కడైనా సరే, ఇప్పుడు ఆదివాసులుగాఅనుకుంటున్న వారు మొదటినుంచీ అక్కడే ఉన్నారని చెప్పడానికి వీల్లేదు.

          “స్థానికులు అంటే…: “స్థానికులు”(indigenous) అంటే వ్యవసాయ విస్తరణతో పాటే జనాభా వ్యాపించడానికి ముందు నుంచీ ఒక ప్రదేశంలో ఉన్నవారిగా మరోచోట డేవిడ్ రైక్ నిర్వచించాడు. మనదేశంలో వ్యవసాయ విస్తరణకు ముందు నుంచీ ఉన్న ఆది వాసులకు కూడా ఇది వర్తిస్తుంది. 

          ఇప్పుడే కనుక ఈ ANE జనాభా ఉండి ఉంటే వారిని ఒక ‘జాతి’గా పేర్కొనవలసి వచ్చేదనీ, నేటి పశ్చిమ యూరేసియన్లు, అమెరికన్ ఆదివాసీలు, తూర్పు ఆసియన్ల లానే అప్పటి అన్ని ఇతర యూరేసియన్ జనాభాల కన్నా వీరు జన్యుపరంగా భిన్నంగా ఉండి ఉండే వారనీ డేవిడ్ రైక్ అంటాడు. ఇప్పటి జనాభాకు వారు దోహదం చేసిన జన్యు సామగ్రి అక్షరాలా వందలు వేల లక్షల జనాల విలువ చేస్తుందనీ, ప్రపంచంలోని సగానికి పైగా జనాభా ANE నుంచి 5 శాతం మొదలుకొని 40శాతం వరకు జన్యు వారసత్వాన్ని పొందారనీ అంటాడు.

          మాల్టా సాక్ష్యం: దక్షిణ-మధ్య సైబీరియాలోని మాల్టా(Mal’ta) అనే ప్రదేశంలో 24వేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక బాలుడి ఎముకలు దొరికేవరకు ANE జనాభా ఊహకే పరిమితమైంది. 2013 చివరిలో ప్రచురితమైన ఆ బాలుడి జన్యువారీ సమాచారం ANE ఉనికిని ససాక్ష్యంగా ధ్రువీకరించింది. మాల్టా జన్యు సంపుటితో యూరోపియన్లకు, అమెరికా ఆదివాసులకు అత్యంత బలమైన జన్యుసామీప్యం ఉన్నట్టు వెల్లడైంది. అమెరికా ఆదివాసులు తమ జన్యువారసత్వంలో మూడో వంతును ANE నుంచి, మిగిలిన దానిని తూర్పు ఆసియన్ల నుంచి పొందినట్టు మాల్టా జన్యువిశ్లేషణ స్పష్టం చేసింది. యూరోపియన్లు జన్యుపరంగా తూర్పు ఆసియన్లకు కాకుండా అమెరికా ఆదివాసులకు ఎందుకు దగ్గరగా ఉంటారో ఈ కీలకమైన సాంకర్యం(mixture) చెబుతుంది. మాల్టా సాక్ష్యం లభించడానికి ముందు తాము ఊహించినట్టే, ఇప్పుడు సైబీరియాలో నివసిస్తున్న వారికి మాల్టా జన్యువుతో అతి స్వల్పమైన సామీప్యతే ఉన్నట్టు తేలిందనీ, ANEకి మాల్టా జన్యువు ప్రోటో టైప్ శ్యాంపుల్ అయిందనీ, ప్రాచీన DNA శక్తి ఎలాంటిదో తెలుసుకోడానికి మాల్టా జన్యువు చక్కని ఉదాహరణ అనీ డేవిడ్ రైక్ అంటాడు.

(బాసాల్ యూరేసియన్ అనే మరో ఘోస్ట్ జనాభా, తొలి యూరప్ ఘోస్ట్ జనాభాలు, ఆధునిక యూరప్, భారతదేశాల జన్యుచరిత్రకు సంబంధించిన విశేషాలు తర్వాత)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.