అబద్ధమాడని నిజం
-చందలూరి నారాయణరావు
నిత్యం వారిద్దరి విందులో
రుచిగల మాటలు
అబద్ధమాడని నిజాలు
ప్రియమైన వంటకాలు.
ఎదుటపడని కలయికలో
ఎదమాటున సంగతులు
మధురంగా మైమరిపించే
మనసూరించే ఇష్టాలు.
నిద్రమంచానే చూపులు
ముఖాల్లో ఏరులా ప్రవహించి
సంతోషసారాన్ని ఇచ్చి
పదునుగా ప్రవర్తించి
రోజూ గుప్పెడు అనుభవాల్ని
ఒకరిలో మరొకరు చల్లుకుని
ముసురుపట్టి మెరుపులతో
జోరుగా కురుసుకుంటారు
తనివితీరా తడిసిన తలపులకు
మన్ను వెన్నులో
పదాల మొలకలు
పుట్టపగిలి ఉదయించుకుంటారు
వాక్యాల మెరుపులతో
కౌగిలించుకుంటారు.
కవితల విరుపులతో
రెపరెపలాడతారు…
మగ్గిన ఊహలను
మాగిన ఊసులతో కలిపి
మంచి కలకు స్వాగతం పలికి
ఒకరినొకొరికి పండుగౌతారు.
దూరాల్ని రహస్యంగా
దగ్గరగా లాక్కొని
దగ్గరను బహిరంగంగా
కలిసి మెలిసి నటిస్తున్నారు.
భూమిలా
తమ చుట్టూ తామే తిరుగుతూ
ప్రేమ చుట్టూ పరిభ్రమిస్తూ
ఒకరికొకరు వెలుగునీడలౌతారు.
*****