ఎందాకని జ్ఞాపకాలకు రుచౌతావు?
– శ్రీ సాహితి
ఎన్నాళ్ళని
ఆ ఒక్క ప్రశ్నను ఈడ్చుకుంటూ
దగ్గరతనాన్ని కలగంటూ
దూరాన్ని మోస్తావు?
చాటేసిన ముఖంతో
మౌనాన్ని తప్పతాగి
వేళకు మనసుకు రాని జవాబుకు
ఎన్ని రాత్రులను తీవాచిగా పరుస్తావు?
చూపలరిగి చుక్కలై
అలిసిన ఆశకు దప్పిక తీర్చాలని
కన్నీళ్లను గొంతులో రహస్యంగా
ఎందాకని దాస్తావు?
కాలం తొక్కిడికి
ఒరిగిన కోరికను
సున్నితంగా చేరదీసి
కడుపున దాచి
ఎందాకని గుట్టుఔతావు?
కళ్ళకు తెలియకుండా కన్న కలను
కరిగి ఆరకుండా
చెదరి చెరగకుండా
మూటకట్టి ఎందాకని
పట్టపగలు సహితం కాపలాకాస్తావు?
నిజం నిప్పుల సెగకు
ఎండిన నవ్వులనదిలా
ముఖం నెర్రెలుబారి
ఎందాకని ఒంటరికి పుట్టిన
కవితకు కన్నీరవుతావు?
కఠిన ఛాయాలతో
కరకు హృదయంలో పొంగిన
చప్పని మాటలకు
ఎందాకని తీపినద్ది
జ్ఞాపకాలకు రుచౌతావు?
మనసు సువాసనలతో
మధురాక్షరాలతో
మౌనానికి ప్రాణంపోస్తూ
ఎందాకని రాత్రులను ఖర్చుపెట్టి
నిద్రకు బాకీపడతావు?
అల్లుకున్న ఊహ చులకనగా
దాచుకున్న కల బరువుగా
కాలమే ఎగతాళని అద్దుతుంటే
ఎందాకని నీకు నీవు బరువౌతావు?
నీవు పగిలి నమ్మకం ముక్కలైనా
నిజం నలిగి సహనం సొమ్మసిల్లినా
మౌనం ధాటికి మాట ఇంకిపోయినా
నిన్ను నీకు శత్రువుగా మార్చినా
ఎందాకని
ఆ గొంతువైపు చెవులను
ఆ చూపువైపు కళ్ళను
మెలుకువగా ఉంచుతావు?
ఎందాకని
నీలో నీవు దూరంగా విసురుకుని
నీకు అన్నీ దగ్గరని భ్రమిస్తావు ?
*****