ఎన్నో ప్రశ్నలు రేపే ఎర్ర లచ్చుప్ప
(27 ఆగష్టు ‘ఒక దీపం..’ ఆవిష్కరణ సందర్భంగా)
-చూపు కాత్యాయని
నంబూరి పరిపూర్ణ గారు రాసిన ఎన్నో కథల్లో ఒక చిన్న కథ _ఎర్ర లచ్చుప్ప .
వ్యక్తిగత జీవితంలో దగా పడిన ఒక స్త్రీ తనను తాను నిలబెట్టుకుంటూ సామాజిక ఆచరణలో భాగమై , పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సాధించడం _ఈ ఇతివృత్తం
కొత్తదేమీ కాదు, ఎన్నో సాహిత్య రచనల్లో చదివిందే .
ఐనా, ఎర్ర లచ్చుప్ప కథ ప్రత్యేకమైనదిగా నిలవటానికి కారణం _ఆ కథ ఆధారంగా పరిపూర్ణ గారు చర్చించిన అనేక సామాజిక సమస్యలు. వాటిని ఎదుర్కోవడానికి వ్యక్తిగత, సామాజిక స్థాయిల్లో జరగాల్సిన ప్రయత్నాల గురించిన ఆమె ఆలోచనలునూ.
లక్షుమ్మ అనే ఒక స్త్రీ కథను చెప్పటంలో భాగంగా పరిపూర్ణ గారు చర్చించిన విషయాలు చాలా విలువైనవి.
కులానికీ , జెండర్ కూ సంబంధించి ఆయా అస్తిత్వ సాహిత్యాలు ముందుకు తెచ్చిన సాధారణ సమస్యలతో పాటు, వాటిలో అంతగా చర్చకు రాని అంతర్గత సమస్యలను కూడా ఈ కథ ప్రస్తావించటమే కాదు, వాటి మూలాలను కూడా వెదికింది. అందుకోసం చరిత్రనూ, మానసిక విశ్లేషణనూ పరికరాలుగా ఉపయోగించింది. అందువల్ల ఈ కథలోని పాత్రలు, సంఘటనలూ సహజంగా, సజీవంగా రూపొందాయి .
మత సంస్కరణలు _ బ్రాహ్మణీయ పితృస్వామ్యం :
నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన లక్షుమ్మ బాల వితంతువు. ఆరేళ్లకు మేనత్త కొడుకుతో ఆమెకు పెళ్లి చేశారు. రెండేళ్లు గడవక మునుపే వరుడు మరణించాడు.
“ఎనిమిదేళ్ళ ప్రాయం నుంచే విధవగా నలుగురిలోకి , శుభ వేడుకల్లోకి రాగూడని శాపగ్రస్తురాలిగా బతుకు సాగించక తప్పేది కాదు “ అంటూ ఆమె పరిస్థితిని వర్ణిస్తారు రచయిత్రి .
ఈ మాటలు చదవగానే, దళిత స్త్రీలకు పితృస్వామ్య పీడన లేనే లేదంటూ దళిత స్త్రీవాదులు చేసిన సూత్రీకరణలు , కన్యాశుల్కం నాటకం పై దళితవాద విమర్శకుల నిరసనలూ గుర్తొచ్చి ఆశ్చర్యం కలిగింది. దళిత కమ్యూనిటీలోని అంతర్గత విభజనలను, ఆయా సమూహాల ప్రజల ప్రత్యేక సమస్యలనూ ఈ విమర్శకులు అధ్యయనం చేశారా అనే సందేహం కూడా కలిగింది.
ఈ ప్రశ్నలకు జవాబులు పరిపూర్ణ గారు ఇలా చెప్పారు _
“16 వ శతాబ్దంలో రామానుజాచార్యుల వారి వైష్ణవ మత మహోద్యమం అనేక చిన్న కులాల వారికి చక్రాంకితాలు వేసి వైష్ణవం ఇచ్చింది. ఆ కోవలోకి సాతాన్లు, తరువాత “మాల దాసులు”వస్తారు. వీరు ఆ మత నియమ నిష్ఠలను శ్రద్ధగా పాటిస్తారు. నిద్ర లేచి ముఖార్చన చెయ్యగానే పట్టి వర్ధనాలు దిద్దుకోనిదే బయటి ముఖం చూడరు. ఇల్లూ ఒళ్లూ అతి శుభ్రంగా ఉంచుకుంటారు .
పెరుమాళ్ కు నైవేద్యం పెట్టిగానీ భోజనం చెయ్యరు “
ఈ విషయాలపై అవగాహన ఉండుంటే “మాలపల్లి కాదది ముని పల్లె “అంటూ జయప్రభ ఉన్నవ రచనను వెటకారం చేసే వారు కాదు కదా !
కుల సమస్య కు పరిష్కారాన్ని ఆర్థిక, సామాజిక మూలాల్లో కాకుండా మత సంస్కరణల పరిథిలో వెతికిన ఉద్యమాలు అంతిమంగా బ్రాహ్మణీయ భావజాలాన్ని విస్తృతం చెయ్యడమన్నది వ్యాధి చికిత్సకు సైడ్ ఎఫెక్ట్ వంటిది. ఇక్కడ జరిగింది అదే !
వైష్ణవాన్ని స్వీకరించిన మాల దాసులు విద్య నేర్చారు .
వీరిలో కొందరు గొప్ప పండితులుగా, కళాకారులుగా, వైద్యులుగా రూపొందారు. కానీ వారిలోని అత్యధిక ప్రజలు మిగతా దళితుల వలె పేదరికంలో మగ్గుతున్న వారే.
“దాసుళ్లు బతికేది పామర జనంతోబాటు మాలపల్లెల్లోనే.
అయితే వారికి భిన్నమైన జీవన రీతిని అలవర్చుకుని ఉండటం వల్ల వీరిలో తాము వారికన్నా అధికులమనే భావన స్థిరపడింది “ అని వివరించారు పరిపూర్ణ గారు .
తమ ప్రత్యేకమైన సంస్కృతికి అవిచ్ఛిన్నంగా కొనసాగింపు ఉండాలనుకునే ఏ సామాజిక వర్గమైనా కుటుంబ వ్యవస్థ పైనే ఆధార పడుతుంది. తమ స్త్రీల శీలాలపై కఠినమైన నియంత్రణను విధిస్తుంది .
“దాంతో నిమ్న కులాల్లో జరిగే మారు మనువుల్ని వీళ్ళు ఎన్నో తరాలుగా బహిష్కరించారు. అగ్రవర్ణులకి మల్లేనే తమ బాల విధవలకు తిరిగి పెళ్ళిళ్ళు చెయ్యటం అప్రతిష్టగా భావించి మానుకున్నారు… లక్షుమ్మ ఈ దాసులింటి ఆడబడుచే “ .
ఇలా, దళితులలోకి పాకిన బ్రాహ్మణీయ పితృస్వామ్యం వల్ల గురజాడ వారి బుచ్చమ్మకూ, పరిపూర్ణ గారి లచ్చుమ్మ కూ ఒకే సమస్య ఎదురైంది .
కులాంతర వివాహాలు _స్త్రీలకు అదనపు సవాళ్లు :
సమాజంలో మార్పు కోసం జరిగే ప్రతి ప్రయత్నమూ అనేక ఎదురు దాడులను ఎదుర్కోవాల్సి రావటం సహజం. ఆ ప్రయత్నంలో ఉన్న స్త్రీలను ఈ దాడులు మరింతగా గాయపరుస్తాయి .
యవ్వనంలోకి అడుగు పెట్టిన లక్షుమ్మ అపురూపమైన సౌందర్యవతిగా తయారయింది. ఆమె పచ్చని శరీర ఛాయ వల్ల అందరూ ఆమెను “ఎర్ర లచ్చుప్ప” అని పిలుస్తున్నారు .
పొరుగు గ్రామానికి కూలి పనులకు వెళ్లిన ఆమెకు నాగభూషణ చౌదరి అనే అగ్రవర్ణ యువకుడితో పరిచయం అయింది. అది బలపడిన తర్వాత ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. లక్షుమ్మను కులం నుండి బహిష్కరించారు. రెండు వైపుల కుటుంబాలను ధిక్కరించి చిన్న దుకాణం పెట్టుకుని వాళ్ళు సొంత జీవితాన్ని ప్రారంభించారు .
ఇద్దరి నడుమ ఎంతో ప్రేమ ఉంది. కులంలో అమ్మాయిని పెళ్ళాడితే ఆస్తి పంచుతామని ఒత్తిడి చేస్తున్న తండ్రిని ఎదిరించి ఆమెతో నిలబడగలిగిన ప్రేమ నాగభూషణానిది .
ఐనా, ఇద్దరి నడుమ _అది కూడా ఇరవయ్యేళ్ల సహజీవనం తరువాత ఘర్షణ మొదలైంది .
ఈ క్రమాన్ని ఎంతో లోతుగా, సహజంగా చిత్రించారు పరిపూర్ణ గారు _పుట్టి పెరిగిన కుటుంబ నేపథ్యం వల్ల అతడికి శారీరక శ్రమ చేసే ఓపిక, సంసిద్ధత లేవు. కనీసం దుకాణాన్ని సరిగ్గా నడిపే శ్రద్ధ కూడా లేదు. ఇంటా బయటా చాకిరి చేసి కుటుంబాన్ని నడిపే బాధ్యత లచ్చుమ్మదే అయింది. అతడు తన ఆత్మ న్యూనతను మరిచి పోయేందుకు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. విసిగి పోయిన లచ్చుప్ప నిలదీసేది . పురుషాహంకారం దెబ్బతిన్న భూషణం ఆమెపై చెయ్యి చేసుకోసాగాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎటువైపు కుటుంబం నుండి సహకారం లేక స్త్రీలు ఎంత ఒంటరులవుతారో ఈ కథ చెబుతుంది .
స్త్రీ పురుష సంబంధాలు _ ప్రేమ, శృంగారం :
ఎంతో అన్యోన్యంగా ఉన్నారనుకునే జంటల నడుమ వివాహేతర సంబంధాలు ఎలా ప్రవేశిస్తాయనేది లోకంలో తరచుగా చర్చకు వచ్చే ఒక సంక్లిష్టమైన ప్రశ్న. దీన్ని పరిపూర్ణ గారు ఎంతో లోతుగా, బాలన్సుడ్ గా నిర్వహించారు .
దుకాణానికి సరుకులు బేరం చేసే పనుల్లో వేరే గ్రామానికి వెళ్లిన భూషణానికి ఒక స్త్రీ పరిచయమైంది. ఆమె మధ్య వయస్కురాలు, అనాకారి. లచ్చుప్పతో ఏ విధంగానూ సరితూగే మనిషి కాదు. అయినప్పటికీ ఆమె “అతి విచిత్రంగా అతడిని ఆకట్టుకుంది … అందంతో నిమిత్తమే లేని మరేదో ఆకర్షణ !”
ఈ సంబంధానికి ఆ స్త్రీని నిందించటం కాకుండా కారణాలను వెదికారు రచయిత్రి. కుటుంబ నిర్వహణలో అసమర్థుడైన భూషణం అప్పటికే భార్య ఎదుట ఆత్మన్యూనతకు గురవుతూ ఉన్నాడు. మరొక స్త్రీ తనను ఇష్టపడటం అతడి అహాన్ని తృప్తి పరిచింది. ఈ ప్రాసెస్ అంతటినీ జాగ్రత్తగా కథలో నిర్మించుకుంటూ వచ్చిన పరిపూర్ణ గారు, కుటుంబ జీవితంలోని కట్టడుల వల్లా, రోజువారీ సమస్యల వత్తిడుల వల్లా నిర్లిప్తతకు గురయ్యే ఇల్లాళ్లు మగవారు కోరుకున్నట్టుగా,” స్వేచ్ఛగా, నిర్భయంగా సరసాలేం చెయ్యగలరు ?” అనే అంశాన్ని కూడా ప్రస్తావనకు తెచ్చారు .పైగా “స్వేచ్ఛా శృంగారానికి మగవారిని సమాజం అనుమతిస్తుంది కదా ?”. అని కూడా ఎత్తి చూపుతారు .
కుటుంబంలో స్త్రీ పురుషుల నడుమ అసమానతలు వారి శృంగార జీవితంపై చూపే ప్రభావాన్ని, దానికి పరిష్కారంగా వివాహేతర సంబంధాలను కోరుకునే పురుషులకు సమాజం ఇచ్చే ప్రోత్సాహాన్ని ఇంత బోల్డ్ గా మాట్లాడిన రచయిత్రులు పరిపూర్ణ గారి తరంలో ఎందరున్నారో తెలియదు .
సహజీవనం _చట్టబద్ధత :
భూషణం ఆచూకీ వెదుకుతూ వెళ్లిన లక్షుమ్మ అతడు మరొక స్త్రీతో కలిసి ఉండటం చూసి నివ్వెరపోయింది. ఆమె లక్షుమ్మపై గొడవకు దిగింది .” ఏ దుష్ట ఘడియ లోనో ఈమెతో శరీర సంబంధం ఏర్పడింది …నేను ఊరికి బయల్దేరుతుండగా ఊరి పెద్దలను పోగుజేసి తగువు పెట్టించింది. ఆమెను పెళ్ళాడాల్సిందేనని తీర్పు. గుళ్ళో తాళి కట్టించారు. ఆ హక్కుతో ఆమె నన్ను సొంతం చేసుకుంది”. అని వివరించాడు భూషణం. లక్ష్మమ్మ మీద తనకు ప్రేమ పోలేదనీ, ఇద్దరితోనూ కలిసి ఉంటాననీ బతిమాలాడు.
పాతికేళ్ల తమ సహజీవనానికి చట్టం ఎదుట విలువ లేదని తెలిసి ఆమె అవాక్కయింది. ఈ అనుభవం ఆమెకు మరొక పాఠాన్ని నేర్పింది. స్త్రీ పురుషుల సంబంధాన్ని, ప్రేమ పునాదిగా సాగే సహజమైన మానవ సంబంధంగా నిలుపుకోవాలని అనుకునే తన వంటి వారు ఇటువంటి పరిణామాలకు సంసిద్ధతతో ఉండాలని అర్థమై ఒంటరిగా తిరిగి వెళ్ళింది .
ఇటు వంటి వైఫల్యాలు ఎందరో స్త్రీలకు ఎదురైన అనుభవాలే. వాటిని గుణపాఠాలుగా స్వీకరించి తన జీవితాన్ని విస్తృతం చేసుకోగలగటమే లక్షుమ్మ ప్రత్యేకత.
పదిమందికి సహాయ పడటంలో తన ఒంటరి తనానికి పరిష్కారాన్ని వెదుక్కున్నది. తనదైన సామాజిక జీవితాన్ని నిర్మించుకుంటూ అచ్చమైన ప్రజల మనిషిగా రూపొందింది. ఈ క్రమాన్ని ఎంతో సహజంగా, ఒక్కొక్క మెట్టుగా అల్లుకుంటూ వచ్చారు రచయిత్రి.
స్త్రీల స్వయం నిర్ణయాధికారం, ఆత్మాభిమానం అనే విలువలను ఎత్తిపట్టటం పరిపూర్ణ గారి రచనలు అన్నిటిలోనూ ఒక ప్రధానాంశమే. వాటితోబాటుగా ఈ కథ చర్చించిన చారిత్రిక అంశాలూ, స్త్రీపురుష సంబంధాలకు సంబంధించిన సున్నితమైన పరిశీలన, “ఎర్ర లచ్చుప్ప” కథకు మరింత ప్రత్యేకతను సంతరించి పెట్టాయి.
*****