ఒక్కొక్క పువ్వేసి-14
స్వాతంత్ర ఉత్సవాల్ని సంబురించగలమా!
-జూపాక సుభద్ర
దేశానికి స్వాతంత్ర మొచ్చి నేటికి 75సం|| అయినయని దేశమంతటా వజ్రోత్సవ అమృతోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నయి. వేరే విషయాలు సమస్యలు లేనట్లు ప్రజలంతా అన్ని సమస్యల నుంచి విముక్తి పొందినట్లు ఉత్సవాలు చేస్తున్నది భారత ప్రభుత్వము. దేశ సంపద శ్రామికకులాల రక్తం, చెమట నుంచి పెంపొందించబడింది. యివి వారి అభివృద్ధి కోసం జరగాలి. వారి అభివృద్ధి యింకా మిగిలే వుందనే ఎరుక దేశానికి తెలియజేస్తూ జరగాలి. యీ భారత అభివృద్ధితో శ్రామిక కులాల మహిళల భాగస్వామ్యాలు కూడా వున్నాయనే శ్రామిక కుల జెండర్ చైతన్యాల్ని, స్పృహతో జరగాలి. యిప్పటికే భారతదేశము స్వాతంత్రం సాధించిన రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు చేసుకుంది. యిప్పుడు వజ్రోత్సవాలు చేసుకుంటోంది కేంద్ర ప్రభుత్వము. దీనిలో ప్రజలు స్వచ్చందంగా కాకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్ గా జరుగుతున్నయి.
భారత దేశం స్వతంత్రం పొందినాక మహిళల పరిస్థితి, అందులో సామాజిక ఉత్పత్తి శక్తులైన శ్రామిక కులాల మహిళలు స్వేచ్చా స్వాతంత్రాలతో వజ్రాలు, అమృతాలు పొంది ఉత్సవాలు చేసుకునేంతగా దళిత ఆదివాసీ ఓబీసీ మహిళల అభివృద్ధి జరిగిందా అనేది ఆలోచనీయమ్.
స్వాతంత్ర పోరాటంలో బ్రిటీష్ వలస పాలన పోతే.. మనదేశాన్ని మనం ఉన్నతంగా తీర్చి దిద్దుకుంటామని కుల, జాతి, మత, జెండర్ తారతమ్యం లేకుండా అభివృద్ధి చేస్కుందామని అశేష పీడిత కులాలకు, జెండర్ లకు ఆశలు కల్పించిన వాగ్దానాలు చేసింది జాతీయోద్యమం.
విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో శ్రామిక కులాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు జరిగిన అభివృద్ధి చెప్పుకో తగింది కాదు. స్వాతంత్రమొస్తే చదువుకుంటాము, ఎట్టి నుంచి విముక్తి పొందుతాము, కులవివక్షలు పోతాయి, మానవ హక్కులు మనిషి హక్కులతో ఆత్మగౌరవంగా బతుకుతామని జాతీయోద్యమంలో ప్రాణాలు పనంగా పెట్టి పోరాడిండ్రు. మొదటి స్వాతంత్య్ర సంగ్రామమైన 1857 తిరుగు బాటులో ఝల్కారీ, ఉదా దేవి లాంటి యుద్ధ వీరనారీమణులు తమ ప్రాణాల్ని త్యాగం చేసిండ్రు. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ లు అంట రానితనాలకు వ్యతిరేకంగా అందరు చదువుకోవాలని బాలికలకు విద్యాసంస్థ లు ఏర్పాటు చేసి మహిళా విద్య కోసం కృషిచేశారు. సతి, వితంతు వివాహ నిషేధాలకు, పునర్వివాహ నిషేధాలకు , బాల్య వివాహాల నిషేధాలకు, జోగినీ వ్యవస్థల నిర్మూలనకు పోరాడి జరిగిన సంస్కరణోద్యమాల్లో లాఠీలు, జైల్లు, హత్యలకు గురయినారు. అయితే సంస్కరణలు పైస్థాయి కులాల మహిళలు కాడనే ఆగిపోయినయి, సంస్కరణలు అంటే మహిళా అవిద్య, బాల్యవివాహాలు జోగిని దురాచారాలు యింకా కొనసాగుతానే వున్నాయి. బేటి పడావోలు – బచావోలు ప్రకటనలకే పరిమితం.
దళిత ఆదివాసీ, ఓబీసీ మహిళలు చేసిన పోరాట ఫలితాలు వారికి న్యాయ పరంగా దక్క లేదు. అభివృద్ధి అని చెప్పుకుంటున్న చట్రంలో ఈ మహిళలు లేరు. స్వాతంత్ర మొచ్చిన 75 సంవత్సరాలని ఉత్సవాలు చేస్కుంటున్న కూడా కులపీడన పోలేదు. అది మతంతో కొత్త పుంతల తో ముందుకు పోయే రాజకీయమే నడుస్తుంది. అంటరాని వివక్షల కారణం గా చదువు, ఆర్యోగం, రాజకీయ, ఆర్థిక రంగాలకు ఆమడనే వుండడమే కాదు, యింకా పేదరికం, ఆకలితో అల్లాడుతున్నరు. వీటికి తోడు సామాజక హింసలు, లైంగిక దాడులు, హత్యలు యీ మహిళల మీదనే ముఖ్యంగా దళిత మహిళల మీదనే నిత్యం జరుగుతున్నాయని క్రైమ్ రిపోర్టులు చెపుతున్నయి. స్వాతంత్ర రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు అమృతోత్సవాలని దళిత మహిళలకు మిగిల్చిన అభివృద్ది, పంచిన సంపద శూన్యం . భైర్లాంజీమనీషా మరియమ్మ, మైసమ్మల మీద అత్యాచారాలలో, హత్యలు నిత్యమై పోయినయి. యివి మర్చిపోయి స్వాతంత్ర సంబరాలు ఎట్లా చేస్కుంటము?
1950 నుంచి 1994దాకా అసలు నేర నమోదు రికార్డులేవు, 1994 నుంచే క్రైమ్ రికార్డులలో నమోదైనయి. 1994 నుంచి క్రైమ్ రికార్డులు కొన్నయినా అందు బాటులోకి వచ్చినయి. ఆ కొన్నింటిలో కూడా నమోదైన నేరాలు ఎక్కువగా దళిత మహిళల మీద జరిగిన హత్యలు, అత్యాచారలు, దాడులను గమనిస్తే దేశంలో అంటరాని మహిళల పట్ల ఎంత దుర్మార్గమైన కులాధిపత్య సామాజిక హత్యలు జరుగుతున్నయో అర్ధమైనది.
1994 నుంచి 2020 వరకు –44,506 దాడులు,అత్యాచారలు, హత్యలు దళిత మహిళ మీద జరిగాయని సెంటర్ ఫర్ దళీత్ స్టడీస్ రిపోర్టులు చెప్తున్నయి. యింకా 2004 లో – 1157 దళిత మహిళలు అత్యాచారాలకు గురయితే 2020 లో ఆ సంఖ్య 3,396కి పెరిగిందంటే. నిజంగా భారతదేశం దళిత మహిళల్ని యిండియన్ డాటర్స్ గా చూస్తుందా! దళిత మహిళలపై నిత్యం జరిగే దాడుల్ని అత్యాచారాల్ని, హత్యల్ని ఎందుకు ఆపలేకపోతున్నాయి ప్రభుత్వాలు, వ్యవస్థలు? దళిత మహిళలు ఈ దేశ పుత్రికలైతే ఈ హత్యలు, అత్యాచారాలు రోజు, రోజుకు ఎందుకు పెరుగుతున్నట్లు? భారతదేశంలో వ్యవస్థలు, ప్రజాస్వామ్యాలు, ప్రజాస్వామిక హక్కులు, విలువలు దళిత మహిళలకు అందుతున్నాయా! అనేది ప్రశ్న. బ్రిటీష్ వాడు సమానంగా చూడలే, మరి సొంత గడ్డమీది మనుషుల్ని, మహిళల్ని కులదురహంకారంతో కుల అసమానతలతో ఎందుకు చూస్తున్నారు? ప్రజాస్వామిక ప్రగతిశీల వాదులు, ఆధిపత్యమగ, ఆడ వాళ్లు కూడా దళిత మహిళల మీద జరిగే దాడుల పట్ల, అత్యాచారాల పట్ల వివక్షల పట్ల పెద్దగా స్పందించనితనాల్నే చూస్తున్నాము. యిన్ని హింసలతో చావులతో దళిత మహిళలు స్వాతంత్య్రాన్ని ఎట్లాసంబురిస్తారు?
రాబోయే తరాలకైనా యీ హింసల నుండి విముక్తి అయి నిజమైన స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటారని ఒక చిన్న ఆకాంక్ష.
*****
జూపాక సుభద్ర కవయిత్రి, కథకురాలు, కాలమిస్టు, వ్యాసకర్త, అనువాదకురాలు, పరిశోధకరాలు, వక్తగా, సంఘసేవకురాలు, ప్రభుత్వ ఉన్నతాధికారిణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల సంఘంలో కీలకంగా పనిచేస్తున్నారు.
సుభద్ర గారు తెలుగు సాహిత్యంలో, మహిళా సాహిత్యంలో ఉన్న అగ్రకుల బావజాలాన్ని ప్రశ్నిస్తూ, ఆధునిక సాహిత్యంపై విమర్శ చేస్తూ దళిత, బహుజన సాహిత్యం యొక్క ఉన్నతిని పెంపొందిస్తూ రచనలు చేసున్నారు.