మా అమ్మ ఆదిశక్తి

-ఆదూరి హైమావతి

నేను పుట్టినరోజున…

‘రెండోసారీ ఆడపిల్లే పుట్టిందీ?’

అంటూ బామ్మ దీర్ఘం తీసిందిట.

అక్షరాభ్యాసం రోజున                                                                                                                      ‘ఆడపిల్లకు కాన్వెంటెందుకూ?..

సర్కారీ బళ్ళో పడేయి అన్నీ ఫ్రీనే’..

తాతగారి ఆశీర్వచనం అది.

టెన్త్ లో  స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు..

‘ఆ మహా సదిసతి కిందిలే–

వృక్షాలులేని చోట ఆముదం వృక్షమైనట్లు

పనేలేదుగా -వాళ్ళమ్మ గారాబంతోడూ ’ ..

మాపెద్దమ్మ,-అత్తల ఆరాటం.

ఇంటర్లో చేరే రోజున..

‘ కాలేజీలు ఎందుకూ ? వేషం కాకపోతే

ఉద్యోగాలు చేయాలా? ఊళ్ళేలాలా

డబ్బు తగలేయకు‘ –పెదన్నాన్నల సలహా – నాన్నకు .

ఎంటెక్లో గోల్డ్మెడల్  వచ్చిన రోజున—

నెలకు పదిలక్షల ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిన క్షణాన-

“మా బంగారం. మా ఇంటి సరస్వతి, మా వంశపు వజ్రం

మా మేలిమి తల్లి. మా వంశానికి కీర్తి తెచ్చిన మణి

మా యింటి మహాలక్షి – మానట్టింటి దేవత.’

ఇవన్నీ నాకు అంతా ఇచ్చిన సర్టిఫికేట్స్.

అన్నీ వింటూ సజల నయనాలతో అమ్మ అక్కున చేర్చుకుంది.

ఆమె నాకేమీ బిరుదులివ్వ లేదు- మౌనమే ఆమె నాకిచ్చిన ఆయుధం .

‘పుట్టినపుడే నా తల్లి మేలిమి బంగారం

నా ముద్దులబిడ్డ నా ప్రాణం. ‘అని మనసులో అనుకుని

నాకు అండగా ఉండి, చదివించింది మౌనంగా వెన్ను నిమిరింది.

అడ్డంకులు అధిగమించి పోరాడి నడిపించింది.

మా అమ్మ నా బంగారు అమ్మ.

అసలైన ఆడబొమ్మ రూపంలో ఆదిశక్తి మా అమ్మ.   

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.