కొత్త అడుగులు – 35

చిట్టి పొట్టి అడుగుల ‘కవిత కుందుర్తి’

– శిలాలోలిత

          కవిత లాంటి కవిత. కవిత్వమే  తానైన కవిత. కుందుర్తి గారి మనుమరాలు. కవిత్వమంటే ప్రాణం. ఎక్కువగా చదువుతుంది. రాయాలన్న ఉత్సాహమెక్కువ. చిన్నప్పటి నుంచీ పెరిగిన వాతావరణం లో సాహిత్యమే ఎక్కువ కాబట్టి రచన చేయాలనే సంకల్పము వచ్చింది. ఇప్పటి తరం కవయిత్రి. సుడులు తిరిగే గోదావరిలా ఆమె అంతరంగం నిండా ఆలోచనల సంద్రాలే. సరిగ్గా ఇలాంటి సందర్భాలే కవి పుట్టుకకు కేంద్రమౌతాయి. “తాత గారంతలా నేను రాయలేను. కానీ, రాయాలన్న తపన నాలో చాలా రోజు రోజుకు పెరిగిపోతుంది” అన్నదొక  సారి. వచన కవితా పితామహుడిలా కవిత్వదిశనే మార్చగలగిన కుందుర్తి గారి శక్తిలో కొంత మేరకైనా కవిత స్వీకరించ గలదనిపించింది.

          స్వచ్చమైన ఆమె చిరునవ్వే ఆమెలోని అంతరంగాన్నిపట్టిస్తుంది. నిర్మలమైన మనస్సు, నిర్బీతి నిర్మొహమాటం, అమాయకత్వం, ఉత్సాహం, ప్రేమ, జాలి, కరుణ కలగలిస్తే అది ‘కవిత’ అవుతుంది.

          పేరే  కవిత కావడం వల్ల తన గురించా, కవిత్వం గురించా అనే సంశయం కలుగు తుందప్పుడప్పుడు .

          వెబ్ మ్యాగ్ జైన్స్ లో  తరచుగా కవిత కవితలు కనిపిస్తూనే వున్నాయి. ఆమె కవిత్వ సంతకం చూస్తూనేవున్నాం.

          జ్ఞాపకాల పేటిక, ఓటమిని దాటే గెలుపు కోసం, ఇక్కడ – అక్కడ, కరోనా, ఇంధనం, సునామీ, స్వదేశం, ఓ కాంక్ష కి మరుజన్మ వంటి కొన్ని కవితల్ని చూద్దాం. ఆమె కవిత్వనాడి, పరిణితి, క్రమక్రమ పరిణామం కనిపిస్తాయి. కవిత్వం ఎందుకిష్టం అని ప్రశ్నిస్తే, ‘తనపేరులోనే కాక, తనచుట్టూ వున్న వ్యక్తుల ప్రభావం వల్ల బాగా ఇష్టం ఏర్పడింది అంది. అటు వచన కవితా పితామహుడిగా పేరెన్నికగన్న కుందుర్తి ఆంజనేయులు గారి మనవరాలిని కావడం వలనా, వారు మొదలు పెట్టిన ఫ్రీవెర్స్  ఫ్రంట్ బాధ్యతని తదనంతరం కొన సాగించిన కుందుర్తి సత్యమూర్తి గారి కూతుర్ని కావటం వలనా  బాల్యం నుంచి ఫ్రీవెర్స్  ఫ్రంట్ పురస్కార సమావేశాలకు వెళ్ళటం, ప్రముఖులైన  కవులతో, వారి పుస్తకాలలో సంబంధ బాంధ్యవ్యాల వలనా, కవిత్వం రాయాలనే తపనతో గత కొంత కాలంగానే కవిత్వం రాస్తున్నాను” అంది.

          ఇక, చదువు సంధ్యల ప్రస్తావన వస్తే, యం.కామ్, ఎం.బి.యే, పి.జి.డి.సి.ఎ చేసింది. ప్రస్తుత నివాసం సింగపూర్. పిల్లల ప్రపంచంలో ములిగి  తేలడం ఇష్టం.  ఏ పనైనా సృజనాత్మకతతో చేయడం సరదా. రంగవల్లికలు వేయడం, బొమ్మలు చేయడం, పెయింటింగ్ హాబీలు.

          ఓ  ‘కాంక్ష కి మరుజన్మ’ కవితలో ఎత్తుగడలోనే విభిన్నతను చూపించింది. ప్రతి ఉదయం/ముగింపు మాటెత్తని / ఒక కొత్త ప్రారంభం అంటుంది.

          విదేశాలకు వెళ్ళినంత మాత్రాన, స్వదేశంలో లేనంత మాత్రాన  వాళ్ళు దేశభక్తులు కాదని అనలేం. దేశ ప్రేమికులే వాళ్ళు కూడా అని ‘స్వదేశం’– కవిత లో తన దేశాభిమానాన్ని వ్యక్తీకరించింది. ఇంకొక మంచి కవిత ‘జ్ఞాపకాల పేటిక’ లో మనిషికి ఎన్నెన్ని స్మృతులు ఇంటి పట్ల, ప్రదేశం పట్ల, దేశం పట్ల వుంటాయో చాలా బాగ కవిత్వీకరించింది.

          ఇల్లంటే / ఇటుక గోడలూ/గదులూ తలపులూ / ఇదేనా  కాదంటుంది. మరి ఇల్లంటే జ్ఞాపకాల పేటిక అట, అంటూ పేటిక తెరిచి ఒకో అనుభుతిని, జ్ఞాపకాన్నీ, పారిజాతం లా విప్పుకుంటూ  పోయింది. అది సున్నితమై భావోద్వేగ ప్రకటనలు ఎన్నో వచ్చాయి. చివర్లో అంటుంది కదా!

‘ఇంటిని వదిలి వెళ్ళడమంటే

దాని భౌతిక కాయాన్ని వదిలి వెళ్ళడం కాదు.

నువ్వు జీవం పోసి ప్రేమతో పెంచుకున్న

పంచుకున్న జ్ఞ్యప్తుల పంజరాన్ని వదిలెళ్ళడం

నువ్వక్కడ నేర్చుకున్న పాఠాలని’ –  చెప్పేస్తుంది.

          ఇప్పుడిప్పుడే కవిత్వం అల్లుతున్న కవిత.  ఒక కవిత్వ పొదరిల్లు  లాంటి పుస్తకాన్ని త్వరలో తేవాలని ఎదురుచూస్తున్నాను. మనిషిగా బతకడమంటే, కవిత్వమై కనిపించాలని ఎవరో  అన్నట్లుగా, కవిత్వ జీరలన్నింటిని తనలో పొదువుకుని, రోజు రోజుకు చిగుర్లు తోడుగుతున్న లేత మొక్క కవిత. అభినందనలు నీకు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.