ఘనంగా జరిగిన అపరాజిత పుస్తకావిష్కరణ
ప్రఖ్యాత రచయిత్రి డాక్టర్ కె.గీత సంపాదకత్వం వహించిన “అపరాజిత”- గత ముప్ఫై ఏళ్ల స్త్రీవాద కవిత్వ సంకలనం (1993-2022) ఆవిష్కరణ కార్యక్రమం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంతర్జాల వనితా మాసపత్రిక ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022 ఆదివారం ఉ.10.30 గం.కు జరిగింది. నెచ్చెలి ప్రచురణల తొలి సంకలనమైన ఈ ‘అపరాజిత’ పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఓల్గాగారు ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి డా. కొండపల్లి నీహారిణి గారు అధ్యక్షత వహించిన ఈ సభలో, ఆత్మీయ అతిథులుగా ప్రముఖ కవయిత్రులు శిలాలోలిత గారు, జూపాక సుభద్ర గారు పాల్గొన్నారు. ఈ “అపరాజిత” ముప్ఫై సంవత్సరాల తర్వాత వస్తున్న స్త్రీవాద కవయిత్రుల సంకలనంగా చరిత్ర సృషించడమే కాకుండా, పూర్తిగా ఆధునిక స్త్రీ మనోభావజాలాన్ని, చైతన్యాన్ని సుస్పష్టం చేస్తూ ఇప్పటి స్త్రీవాదబలాన్ని తెలియజేస్తుంది” అని నెచ్చెలి పత్రికా వ్యవస్థాపకురాలు, ‘అపరాజిత’ ప్రచురణకర్త, సంపాదకురాలు డాక్టర్ కె.గీత తెలియజేసారు. ఈ సభలో వంశీ సంస్థల అధినేత, కళాబ్రహ్మ డాక్టర్ వంశీ రామరాజు, అధ్యక్షులు శ్రీమతి తెన్నేటి హేమలత, ప్రముఖ రచయిత్రులు శ్రీమతి కె.వరలక్ష్మి, శ్రీమతి ఆలూరి విజయలక్ష్మి, శ్రీమతి తమిరిశ జానకి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
*****