చరిత్రలో వారణాసి పట్టణం – 3
-బొల్లోజు బాబా
- కాశీ ఆలయాల విధ్వంసాలు– పునర్నిర్మాణాలు
1194CEలో మహమ్మద్ఘోరి సేనాని కుతుబుద్దిన్ ఐబెక్కాశిని ఆక్రమించుకొని గాహాదవాల వంశానికి చెందిన జయచంద్రుని శిరచ్ఛేధనం గావించి, అక్కడిబౌద్ధ, హిందూ, ఆలయాలను ధ్వంసం చేసాడు. అలా గాహాదవాల వంశం ఘోరమైన పరాజయంతో సమసిపోయింది.
కాశి హిందూ పుణ్యక్షేత్రంగా క్రమక్రమంగా విస్తరిస్తున్నప్పటికీ సారనాథ్ కూడా ప్రముఖ బౌద్ధక్షేత్రంగా సమాంతరంగా చాలా కాలం మనుగడ సాగించింది. కుతుబుద్దిన్ ఐబెక్కాశినిలు కాశిని, సారనాథ్ ని నేలమట్టం చేసాక, కాశి క్రమేపీ కోలుకొంది కానీ, సారనాథ్ కు రాజాదరణ లేకపోవటంతో కోలుకోలేక కాలగర్భంలో కలిసిపోయింది.
***
ఐబెక్కాశి ధ్వంసానంతరం కాశీనగరం మధ్యలో విశ్వరూప అనే బెంగాలు రాజు విశ్వేశ్వరుని పేరిట ఒక విజయస్తంభాన్ని నిలబెట్టినట్లు 1212 లో వేయించిన ఒక శాసనం ద్వారా తెలుస్తున్నది.
కాశీ విశ్వనాథుని ఆలయ సమీపంలో పద్మసాధు అనే భక్తుడు పద్మేశ్వర ఆలయాన్ని (విష్ణువు) నిర్మించినట్లు 1353 నాటి ఒక శాసనంలో కలదు. ఇదే సమయంలో మణికర్ణికాఘాట్ వద్ద మణికర్ణికేశ్వరుని ఆలయ నిర్మాణం జరిగింది.
సికిందర్లోడి (1489-1517) హయాంలో మరొకసారి కాశి ఆలయాల పై దాడి జరిగింది. ఆ తరువాత ఎనభై ఏండ్లపాటు ఏ రకమైన ఆలయాల నిర్మాణాలు జరగలేదు కాశిలో.
ఇదే కాలానికి చెందిన నారాయణభట్టు అనే పండితుడు విశ్వనాథ ఆలయ శిథిలాలను చూసి, దుఃఖపడి, తన త్రిస్థల సేతు (కాశి, గయ, ప్రయాగ స్థలాలు) అనే గ్రంధంలో (1585) శివభక్తులను ఇలా ఓదార్చాడు…
……..కాశీ విశ్వేశ్వరుని పురాతన స్వయంభు విగ్రహం పోయినప్పటికీ, మరో మూర్తిని మానవులే ప్రతిష్టించినప్పటికీ, ఈ కష్టకాలంలో దానినే మనం కొలుద్దాం. పాలకులు బలవంతులు కనుక, మూలవిరాట్టు లేకపోయినా ఆ పవిత్ర స్థలాన్నే సందర్శించు కొందాం, ప్రదక్షిణలు చేద్దాం, పూజించు కొందాం….
***
తొడర్మల్ అనే రాజు 1585 లో పూర్వీక విశ్వనాథుని ఆలయానికి వంద మీటర్ల దూరంలో కొత్తగా మరో ఆలయాన్ని నిర్మించాడు.
(పైవివరాలనుబట్టిఔరంగజేబు (1669) కంటే ముందే స్వయంభు కాశీవిశ్వనాథుని విగ్రహం తొలగించబడిందని, దాని స్థానంలో మరొకటి ప్రతిష్టించబడిందని అర్ధమౌతుంది)
***
ఔరంగజేబు హయాంలో కాశీలోని కృత్తివాశేశ్వర, ఓంకార, మహాదేవ, మధ్యమేశ్వర, విశ్వేశ్వర, బిందుమాధవ, కాలభైరవ ఆలయాలు నేలమట్టం చేయబడ్డాయి. చాలాచోట్ల మసీదులు నిర్మించబడ్డాయి.
1659 లో కృత్తివాశేశ్వర ఆలయం విరూపం చేయబడింది. దాని స్థానంలో ఆలంగిరి మసీదు నిర్మించారు. దానికి సమీపంలో బెనారస్ రాజైన రాజాపత్నిమాల్పం తొమ్మిదో శతాబ్దంలో ఒకచిన్న ఆలయాన్ని నిర్మించి కృత్తివాశేశ్వర ప్రతిమను పునః ప్రతిష్టించాడు.
1585 లో తొడర్మల్ పునఃర్నిర్మించిన విశ్వనాథ ఆలయాన్ని ఔరంగజేబు ఆజ్ఞలతో 1669 లో విరూపం చేసి జ్ఞానవాపి మసీదును నిర్మించారు. ఆలయానికి చెందిన ఉత్తరంవైపు గోడను యధాతధంగా ఉంచేసారు.
పూర్వీక ఆలయంలోని జ్ఞానవపి (నుయ్యి) మాత్రం అలాగే ఉందని భక్తుల విశ్వాసం. కొందరు స్థానిక రాజులు విశ్వనాథ ఆలయం యొక్క మూలవిగ్రహాన్ని భద్రపరిచారు. (ఇది బహుశా తొడర్మల్ 1585 లో ప్రతిష్టించిన విగ్రహం కావొచ్చు)
ముస్లిమ్ పాలకులు ఎన్నిసార్లు కాశీ ఆలయాలను విధ్వంసం చేసినా అన్ని సార్లూ హిందువులు వాటిని పునర్నిర్మించుకొంటూనే ఉన్నారు.
***
1698లో అంబర్ కు చెందిన బిషన్సింగ్ విశ్వనాథ ఆలయాన్ని పునఃర్నిర్మించటానికి ప్రయత్నించగా, జ్ఞానవాపి మసీదు సరిహద్దులు ఎంత వరకూ ఉన్నాయి అనే సమస్య తలెత్తి పని ముందుకు సాగలేదు. బిషన్సింగ్ తెలివిగా జ్ఞానవాపి మసీదు చుట్టూఉన్న ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కొనుగోలు చేసాడు. అలా సేకరించిన స్థలాలలో ముస్లిములవి కూడా ఉన్నాయి.
1772 లో మరాఠా రాజు మల్హర్ రావు హోల్ రాజా ఙ్ఞానవాపి మసీదును తొలగించి ఆలయాన్ని నిర్మించాలని ప్రయత్నించి విఫలమైనాడు.
మల్హర్ రావు హోల్ రాజా కొడుకు ఖండేరావుహోల్కర్. ఇతని భార్య అహల్యాబాయ్ హోల్కర్. మామగారు, భర్త, కొడుకు మరణించాక అహల్యాబాయ్ హోల్కర్ రాజ్యపగ్గాలను చేపట్టింది. దేశంలో ఆసేతుహిమాచల పర్యంతం అనేక ఆలయాలను, ధర్మ సత్రాలను, నూతులను, ఘాట్లను ఈమె నిర్మించింది. కాశి, గయ, సోమనాథ, అయోధ్య, మథుర, హరిధ్వార్, కంచి, అవంతి, ద్వారక, బద్రినాథ్, రామేశ్వరం, పూరీజగన్నాథ ఆలయాల పునర్నిర్మాణం/దీనోద్ధరణలో ఈమెపాత్ర ఉన్నదంటే ఆశ్చర్యం కలిగించక మానదు.
పద్దెనిమిదో శతాబ్దంలో హిందూమత ఔన్నత్యం నిలబెట్టటంలో రాణి అహల్యాబాయ్ హోల్కర్ పోషించిన పాత్ర చారిత్రాత్మక మైనది.
1781 లో అహల్యాబాయ్ హోల్కర్ ఙ్ఞానవాపి మసీదుకు దక్షిణం వైపున ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకొని కొత్తగా విశ్వనాథ ఆలయాన్ని నిర్మించింది. పద్దెనిమిదో శతాబ్దాంతానికల్లా ఈ ఆలయమే కాశీ ప్రధాన ఆలయంగా పూజలందుకో సాగింది. నేడు మనం చూస్తున్న కాశీవిశ్వనాథ ఆలయం ఇదే.
అహల్యాబాయ్ హోల్కర్ వ్యక్తిత్వానికి అబ్బురపడిన వారన్ హేస్టింగ్సు 1781 లో విశ్వనాథ ఆలయానికి సరైన మార్గాన్ని, నౌబత్ఖానా (ఢంఖా) ఏర్పాటు చేయమని స్థానిక అధికారి ఇబ్రహింఖాన్ని ఆజ్ఞాపించాడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న నూతికి జ్ఞానవాపి అనిపేరు. ఈ నూతి నీరు జ్ఞానానికి ప్రతిరూపమని దీనిని ఈశ్వరుడే స్వయంగా తవ్వాడని భక్తుల విశ్వాసం.
***
మొఘల్ పాలకుల మతవిధానం చాలా సంక్లిష్టమైనది. భారతదేశాన్ని ఏకీకృతం చేసి ఢిల్లీ కేంద్రంగా ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించాకా, భిన్న సామంతరాజులు తిరుగుబాటు చేయకుండా అదుపాజ్ఞలలో పెట్టుకోవటం చక్రవర్తి నిర్వహించాల్సిన రాజధర్మం. ఈ సామంతులలో ఎక్కువమంది హిందూరాజులు. వీరిని నియంత్రించటానికి మతం ఒక బలమైన అంశంగా ఉండేది. ఈ క్రమంలో హిందూమతానికి ప్రధాన కేంద్రంగా ఉండిన కాశీ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవ్వక తప్పలేదు.
కాశికి సంబంధించి ఔరంగజేబు కొన్నిసార్లు హిందు అనుకూల మరికొన్నిసార్లు ప్రతికూలంగాను ద్వంధ్వవైఖరి ప్రదర్శించాడు. 1669 లో విశ్వనాథ ఆలయ ధర్మకర్తలు గా వ్యవహరిస్తున్న భూస్వాములు కొందరు తిరుగుబాటు చేసారు. వీరే 1666 లో ఖైదు నుండి శివాజి తప్పించుకోవటంలో సహాయపడ్డారనే అనుమానంతో ఔరంగజేబు కాశీ విశ్వనాథుని ఆలయాన్నినేలమట్టం చేయమని ఆజ్ఞాపించాడని Aurangzeb, The Life and Legacy of India’s Most Controversial King అనే పుస్తకంలో audreytruschke అభిప్రాయపడ్డారు. ఔరంగజేబు చేసిన ఆలయ విధ్వంసాలను ఆనాటి రాజకీయ అవసరాలుగా గుర్తించాలి తప్ప అతని మతోన్మాదచర్యలుగా తీసుకోరాదని ప్రముఖ చరిత్రకారిణి మాధురిదేశాయ్ అభిప్రాయం. (రి.Benaras Reconstructed, Madhuri Desai, Pn.6)
ఏది ఏమైనా వారణాసిలో హిందూ ఆలయాలను ముస్లిమ్ పాలకులు విధ్వంసం చేసారు అనేది కాదనలేని చారిత్రక సత్యం.
- పునర్వైభవం
జ్ఞానవాపి మసీదు సమీపంలో అహిల్యాబాయి చేపట్టిన విశ్వేశ్వరుని ఆలయ నిర్మాణం పూర్తయ్యాక దేశం నలుమూలల నుండి భక్తుల తాకిడి పెరిగింది. 1720 లో నిర్మించిన అన్నపూర్ణాదేవి ఆలయానికి చెందిన పూజారి పతాంకర్, పీష్వారాజులను వేడుకొని అక్కడ నిత్యాన్నదానం జరిగే ఏర్పాట్లు చేసాడు. దీనితో విశ్వనాథ, ఇతర ఆలయాలకు విరాళాల వెల్లువ మొదలైంది. 1841 లో నాగపూర్ రాజు (Bhonslas of Nagpur) వెండి సామాగ్రి బహూకరించాడు. లాహోర్కు చెందిన రంజీత్సింగ్ విశ్వనాథ ఆలయ గోపురానికి బంగారు పూతపూయించాడు. 1828 లో గ్వాలియర్కు చెందిన బైజాబాయిసింధియా విశ్వనాథ ఆలయానికి ప్రాకారాలతో కూడిన మండపాలను కట్టించింది.
నేడు కాశిలో కనిపించే కట్టడాలన్నీ అక్బర్ పాలన తరువాత నిర్మించినవే కావటం ఆశ్చర్యం కలిగించక మానదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కాశిలో కనీసం వెయ్యేళ్ళ పాతదైన నిర్మాణం లేకపోవటం కొన్ని శతాబ్దాలుగా జరిగిన విధ్వంసానికి అద్దంపడుతుంది. 1765 నాటి ఒక వారణాసి స్కెచ్ లో నగరం విశాలంగా ఎత్తైన భవనాలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నిసార్లు నేలమట్టం చేసిన ఫీనింక్స్ పక్షిలా మరలా మరలా పైకిలేస్తూ వచ్చిందీ నగరం.
*****
(సశేషం)
కాకినాడ వాస్తవ్యులు బొల్లోజు బాబా గారు పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకులు. వీరి రచనలు : 1. యానాం విమోచనోద్యమం − 2007, చరిత్ర పుస్తకం
2. ఆకుపచ్చని తడిగీతం − ఇది 2008 లో ప్రచురించబడిన మొదటి కవితా సంకలనం 3.ఫ్రెంచి పాలనలో యానాం[5] − 2012 లో ప్రచురింపబడింది. యానాం చరిత్ర 4.వెలుతురు తెర − రెండవ కవిత్వసంపుటి. 2016 లో ప్రచురించబడింది 5.స్వేచ్ఛా విహంగాలు − విశ్వకవి రవీంద్రుడు రచించిన స్ట్రే బర్డ్స్ పుస్తకానికి తెలుగు అనువాదం 6. కవిత్వ భాష − పాశ్చాత్య అలంకారలను వివరించే సాహిత్య వ్యాసాలు 2018 7. మూడో కన్నీటిచుక్క − 2019 లో ప్రచురించబడిన కవిత్వ సంపుటి 8. మెకంజీ కైఫీయ్యతులు-తూర్పుగోదావరి ( 2020) 9. ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా (2021)
అవార్డులు:
1. శిలపరశెట్టి సాహితీ ప్రత్యేక ప్రశంసా పురస్కారం 2010, 2.ఇస్మాయిల్ సాహితీ పురస్కారం 2017, 3. రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు 2018, 4. పాతూరి అన్నపూర్ణ స్మారక సాహిత్య పురస్కారం 2020, 5. పెన్నా సాహిత్య పురస్కారం 2020.