చాతకపక్షులు (భాగం-18)
(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల)
– నిడదవోలు మాలతి
హరి సీరియసుగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. తెలిసినవాళ్లందరికీ ఫోను చేస్తున్నాడు.
గీత తపతితో మాట్లాడడం తగ్గింది. మాట్లాడాలని వుంది కానీ ఏంవుంది మాట్లాడ్డానికి అనిపిస్తోంది. పైగా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లడానికి మనసొప్పడం లేదు, తాను చెయ్యగలిగింది ఏం లేకపోయినా.
ఓరోజు గీత చెక్కుబుక్కు చూస్తుంటే హరి సుమతికి రెండు వేలకి చెక్కు రాసినట్టు కనిపించింది. బాంకు కాయితాలు చూస్తే ఆ మొత్తం తిరిగి వచ్చిన జాడల్లేవు. దాదాపు ఏడాది పైనే అయింది. హరిని అడిగింది.
“అవును. ఎప్పుడో అవసరం అంటే ఇచ్చేను” అన్నాడు.
“తిరిగి ఇచ్చేశారా?”
“ఏమో ఇవ్వలేదు కాబోలు. నాకు జ్ఞాపకం లేదు. పిలిచి అడుగు,” అన్నాడు.
గీత మొదట మొహమాట పడింది. తరవాత తెగించి పిలిచింది, సుమతి సరదాగానే మాటాడింది డబ్బు విషయం వచ్చే వరకూ. గీత డబ్బుమాట ఎత్తేసరికి బిగిసి పోయింది.
“హరి మిమ్మల్ని అడగమన్నాడా?” అంది విసురుగా.
గీతకి అర్థం కాలేదు. హరికీ తనకీ మధ్య అరమరికలు లేవు. అతనిచ్చిన అప్పు అతనే అడగాలని తను అనుకోలేదు. అసలు అలాటి రూళ్లున్నాయని కూడా తనకి తెలీదు.
“అది కాదండీ. చెక్‌బుక్కు బాలెన్సు చేస్తున్నాను. మాకు వేరు వేరు ఎకౌంట్లు లేవు” అంది క్షమాపణగా.
సుమతి శాంతించ లేదు. “హరికివ్వండి ఫోను. ఈ గేములేమిటో అతన్నే అడుగుతాను,” అంది ఇంకా గట్టిగా.
”సారీ. నాదే పొరపాటు. ఆయన ఇంట్లో లేరు. వచ్చిం తరవాత చెప్తాను. మీరూ మీరూ చూసుకుందురు గానీ” అని ఫోను పెట్టేసింది.
హరి వచ్చిం తరవాత చెప్తే, హరి కూడా ఆశ్చర్యపోయేడు. సుమతి ఎందుకంత దురుసుగా మాట్లాడిందో అతనిక్కూడా అర్థం కాలేదు. ఆ తరవాత సుమతి ఒకటి రెండుసార్లు కనిపించినా ముభావంగానే వుంది గీతతో.
ఆ తరవాత నెలరోజుల నాడు రాధ బజారులో కనిపించి, “శేషు, సుమతిల పెళ్లికి రాలేదేం?” అని అడిగింది.
వాళ్లు షికాగోలో బాలాజీ గుడిలో పెళ్లి చేసుకున్నారుట రెండువారాల క్రితం. గీతకి పెళ్లి అయినట్టే తెలీదు. “మేం పిలవబడలేదు” అంది చిన్నగా నవ్వుతూ.
స్నేహాలు ఇంత తేలిగ్గా ఎగిరిపోతాయా అనుకుంటూ గీత బాధ పడింది. తనమాట వదిలేసినా హరికీ వాళ్లకీ చాలా కాలంగా స్నేహం కదా. అదేనా ఎందుకు గుర్తు పెట్టుకోలేదు సుమతి? మనసంతా వికలమయి పోయింది. తపతిని పిలిచి చెప్పింది.
“అంతే మరి ఇక్కడ స్నేహాలు,” అంది తపతి నిరామయంగా.
కొంచెంసేపూరుకుని, “సుమతీ, శేషూ మిమ్మల్ని ఎందుకు పిలవలేదో నాకు తెలీదు కానీ ఒక్కమాట మాత్రం చెప్పగలను. ఈ దేశం వచ్చేక మనుషులు మారిపోతారు. ఓపక్కన మనవాళ్లతో కలవాలని వుంటుంది. మనవాళ్ల మొహాలు కనిపిస్తే మనసు విచ్చు కుంటుంది. మరోపక్క ఇక్కడి సాంప్రదాయాలకి అలవాటు పడతారు. ఎవరి బతుకు వారికి గుట్టు. తమ సంగతులు ఎవరూ మాట్లాడరు. కానీ మరొకరి గురించి మాట్లాడడానికి మాత్రం ఏ ప్రైవేసీలు లేవు. మనదేశంలో అలాక్కాదు. స్వ, పర బేధం లేదు. ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే మనసులో వున్నదేదో ఎవరు ఎదురుగా వుంటే వారి ముందే వెళ్లబోసేసు కుంటాం. మనకి అదే గొప్ప థెరపి. ఇప్పుడు తెలిసిందా నేను వీళ్లందరికీ దూరంగా వుండడానికి కారణం?” అంది తపతి.
సుమతి మనస్తత్త్వం ఏమయి వుంటుందో, ఆమె ప్రవర్తన ఎలా అర్థం చేసుకోడమో తెలీక చాలా కాలం ఆలోచిస్తూనే వుంది గీత. మనసంతా కలత బారిపోయింది. తపతి మాటలేమీ ఊరట కలిగించలేదు. ఆఖరికి నాలుగు కాయితాలు ముందేసుకుని కూచుంది. తొమ్మిదికి మొదలు పెట్టింది. పన్నెండయినా లంచి తినడానికయినా లేవాలనిపించ లేదు. రెండు అయేసరికి ఆరుపేజీలు రాసింది. కథ సుమారుగా పూర్తయింది. నాలుగు సార్లు చదివింది. తనకి బాగానే వుంది. మరి ఒకలెవరైనా చదివేలా వుందా?
తపతిని పిలిచి, తను ఇంట్లోనే వుందని స్థిరం చేసుకుని, వెళ్లింది.
“కధ రాసేను చూడు” అంది కాయితాలు అందిస్తూ.
“నువ్వు కథలు రాస్తావని నాకు తెలీదే!”
“నాకూ తెలీదు. కథలు అని బహువచనం వాడకు. ఇదే మొదలు. ఏదో మనసులో బాధ రాయాలనిపించింది. రాసేను. ఎలా ఉందో చెప్పు. నేను కాఫీ పెడతాను,” అంది గీత వంటింట్లోకి నడుస్తూ.
తపతి ఐదునిముషాల్లో చదివేసింది. “బాగా రాసేవు. మొదటి కథ అంటే నమ్మడం కష్టం.”
“నిజంగా?”
“నిజంగానే. నిజం చెప్పాలంటే ఎప్పుడయినా అంతే అవుతుంది. మనసులో గట్టిగా గుచ్చుకున్న బాధ కలంలోకి జారుతుంది. పాఠకుల మనసున హత్తుకుంటుంది. చిత్తశుద్ధితో రాసిన రచనలకి స్పందించినట్టు ఊకదంపుగా రాసిన కథలకి స్పందించరు పాఠకులు.”
ఇద్దరూ కూర్చుని, కాఫీ చప్పరిస్తూ, “ఇక్కడ బాగుంది,” “ఇక్కడ మారిస్తే బాగుంటుంది” “మూడోపేరా ముందుకి తెస్తే బాగుంటుంది” అంటూ దానికి మెరుగులు దిద్దేరు.
ఎనిమిదవుతుంటే, హరి ఫోను చేశాడు, “ఇవాళ గీత ఇంటికి వచ్చే సూచనలే మయినా వున్నాయా?” అంటూ.
ఇద్దరూ మొహాలు చూసుకుని నవ్వుకున్నారు.
“మీరు కూడా ఇక్కడికే రండి. భోంచేసి పోదురు గానీ. గీత రచయిత్రిగా ఆవిర్భవించిన సందర్భంలో పార్టీ” అంది తపతి.
హరి వచ్చి, “నువ్వు కథలు రాస్తావని నాకు తెలీదే” అన్నాడు.
కథ చదివినప్పుడు అతనికి అర్థం అయింది సుమతి ప్రవర్తన గీతని ఎంతగా గాయపరిచిందో. పైగా అతనికి నచ్చిన విషయం – గీత చాదస్తంగా అందులో పేర్లూ వూర్లూ వున్నవి వున్నట్టుగానో, గుర్తు పట్టేలాగానో వెకిలిగా చిత్రించ లేదు. ఉన్న ఊరూ, కన్నతల్లీ, ఇల్లూ, వాకిలీ, సమస్తం, వదులుకుని, పరాయిదేశం వచ్చి, పుట్టుకతో వచ్చిన వాసనలు వదులుకోలేకా, స్థానిక మర్యాదలతో రాజీపడలేకా సతమతమయే ఒకానొక మనస్తత్త్వాన్ని సున్నితంగా ఆవిష్కరించింది. అందుకు అతను గీతని మెచ్చుకోకుండా వుండలేక పోయాడు.
ముగ్గురూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తుంటే, గీతకి మనసు తేలిక పడింది. హరి ఉద్యోగం పోయిన తరవాత ఇదే తొలిసారిగా అతని మొహంలో ఏ మాత్రమో కళ కనిపించడం. నా కథ సాధించిన ఘనవిజయం అదే. ఓ గంటసేపయినా అతని దృష్టి మరోవేపు మళ్లించగలగడం అన్నట్టు తపతివేపు చూసింది.
తపతి చిరునవ్వుతో తలూపింది.
***
హరి ఉద్యోగం పోయి నెలరోజులవుతోంది. కొన్ని యుగాలు అయినట్టు వుంది గీత ప్రాణానికి. ఇద్దరికీ కటకటగానే వుంది. అలాటి దుర్భర సమయంలో తపతి పిలిచి ఓ చల్లని మాట చెప్పింది,
“మా బాంకులో చిన్న వుద్యోగం వుంది. చేస్తావా?”.
గీతకి హోహో అని అరవాలనిపించింది. ఉద్యోగం! తనకే! ఒక్క ఉదుటన ఎగిరిపడింది. వెంటనే “నాకా? ఉద్యోగమా?” అంది తను సరిగ్గా విందో లేదో అని.
“అవును. నీకే. చిన్నదే. పార్ట్ టైమ్. నీకు కాలక్షేపంగా వుంటుందని చెప్తున్నాను. నీ కంప్యూటర్ విద్య ఉపయోగించుకోడానికి అవకాశం” అంది తపతి.
అంతలోనే హరి పరిస్థితి గుర్తొచ్చి గీత చప్పున చల్లారి పోయింది. “హరిగారు ఏం అంటారో” అంది సందేహిస్తూ. ఉద్యోగం కోసం వెతుకుతున్నది ఆయనా. ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది తననీ! గీతకి అంతా మాయగా వుంది.
“ఆయన్ని అడిగే చెప్పు,” అంది తపతి.
హరిని అడిగితే అతను “నీ యిష్టం” అన్నాడు.
గీత చిక్కులో పడింది. ఆయనకి ఉద్యోగం లేని సమయంలో తను వుద్యోగంలో చేరడం? అది ఆయనకి చిన్నతనంగా వుంటుందేమో? ఇంత వరకూ తను ఉద్యోగం చేసే ప్రసక్తి రాలేదు. ఇంట్లో వున్నప్పుడు విసుగేసిన రోజులు గుర్తొచ్చాయి. ఉద్యోగం అంటూ వుంటే ఆ వంకనయినా వీధిలోకి వెళ్లొచ్చు రోజూ. చూడగా చూడగా తను ఉద్యోగంలో చేరడంలోనే ఎక్కువ లాభాలు కనిపిస్తున్నాయి.
“మీరేం అనుకోనంటేనే చేర్తాను” అంది మళ్లీ.
“నేనేం అనుకుంటాను? అనుకోడానికేముంది? నీ యిష్టం. నీక్కావాలనుకుంటే చేరు” అన్నాడతను.
గీత ఉద్యోగంలో చేరడానికే నిశ్చయించుకుంది. హరి మనసులో ఏముందో కానీ పైకి మాత్రం పొక్కలేదు.
గీత వుద్యోగంలో చేరిన తరవాత మాత్రం ఇద్దరికీ బాగానే వుందనిపించింది. ముఖ్యంగా ఇద్దరూ ఒకరికోసం ఒకరు బాధపడుతూ ఇరవైనాలుగ్గంటలూ ఎదురెదురుగా ముఖముఖాలు చూసుకుంటూ కూర్చోడంకంటే ఇదే నయం అనిపిస్తోంది. ఎవరికి వారు ఊపిరి తీసుకోడానికి కాస్త వీలు చిక్కింది.
ఉద్యోగ ప్రయత్నాల్లో హరీ, కొత్త ఉద్యోగంలో గీతా పడిపోయారు. గీతకి వచ్చే ఆదాయం చిన్నదే అయినా, తృప్తిగా వుంది. తల్లి మాటలు గుర్తుకొచ్చేయి. “మనిషికి వున్నది బలం, పశువుకి తిన్నది బలం” అనేది ఆవిడ. గీతకి చేతిలో పడ్డ నాలుగు రాళ్లూ తనకి ఎంతో తృప్తినిస్తున్నాయి.
* * * * *
(ఇంకా ఉంది)
చిత్రకారుడు: ఆర్లె రాంబాబు
నిడదవోలు మాలతి ఏడు దశాబ్దాలుగా కథలు రాస్తున్నారు. 2001లో తూలిక.నెట్ ప్రారంభించి, మంచి కథలు ఇంగ్లీషులోకి అనువాదాలు చేసేరు.. ప్రధానంగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులకి కథలద్వారా తెలియజేయాలన్న ఆశయంతో మొదలుపెట్టిన సైట్ అది. 2009లో తెలుగు తూలిక బ్లాగు ప్రారంభించి తమ కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు ప్రచురిస్తున్నారు. ఆమెసాహిత్యం ఆమెబ్లాగు www.tethulika.wordpress.comలో చూడవచ్చు. కథాసంకలనాలు, వ్యాససంకలనాలు అన్నీ తెలుగు తూలిక బ్లాగులో e-Book formatలో ఉచితంగా లభ్యం. స్వాతంత్ర్యానంతరం, తెలుగు రచయిత్రులు అసామాన్యమైన ప్రాముఖ్యం సంపాదించుకున్నారు. ఆ ప్రాముఖ్యతకి వెనుక గల సాహిత్య, సామాజిక, ఆర్థిక, కౌటుంబిక పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన పుస్తకం Women writers, 1950-1975. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.