నిషేధపుటాంక్షల గీతలను దాటిన ‘అపరాజిత’
-డా.సిహెచ్. సుశీల
“పురుషుడంటే సమానత్వ చిహ్నమైన చోట
పురుషుడంటే మోహానికి
ముందూ తర్వాతా
ఒకటే అయిన చోట
పురుషుడంటే
నిజమైన నాన్న అయిన చోట
ఇదే పురుషత్వం అని ఋజువై నప్పుడు కృత్రిమాలు సహజాలవుతాయి “
డా. కె.గీత వంటి స్పష్టమైన సిద్ధాంతం గల వారి అభిప్రాయం ప్రకారం స్త్రీవాద మంటే మగవాళ్ళ పట్ల ద్వేషం, వారిని అణచివేయాలన్న పగ కాదు. స్త్రీవాదమంటే అన్ని రంగాల్లో సమానావకాశాలు. అన్నింటా సాధికారత.
స్త్రీలు తమ వైయక్తిక వేదనలను, సామాజిక అసమానతలను, కౌటుంబిక వేధింపు లను అక్షరీకరించడంతో మొట్టమొదటి స్త్రీవాద సంకలనం ‘ గురి చూసి పాడే పాట ‘ (1990) లో, “నీలిమేఘాలు ‘ ( 1993) లో, ‘ముద్ర’ (2001)లో వెలువడి, పెద్ద సంచలనాన్ని తెచ్చాయి. ముఖ్యంగా “నీలిమేఘాలు” ఒక చరిత్రని సృష్టించింది. తర్వాత ముప్పయ్యేళ్ళకి ఇప్పుడు 2022 లో డా. కె.గీత సంపాదకత్వం లో వచ్చిన “అపరాజిత” మరింత బలంగా ఒక ఉద్యమశక్తి గా రూపుదిద్దుకొంది.
1993 నుండి 2022 వరకు 93 మంది కవయిత్రులు రాసిన 168 కవితల సంకలనం “అపరాజిత”. లబ్దప్రతిష్టులైన వారే కాక, కొత్తగా కలం పట్టిన వారూ తమ గొంతుకని సుస్పష్టంగా వినిపించారు. ఆలోచింపజేసారు. పితృస్వామ్యం, జెండర్, చాకిరి, సంతానోత్పత్తి, గర్భవిచ్ఛిత్తి, ఇంటా బయటా అసమానతలు, దళిత మహిళలపై దాడులు… అన్నీ బలమైన వ్యక్తీకరణలే. ధిక్కార స్వరాలే.
“….అవునండి మేము ఇప్పుడున్న పాత రోతనంతా విచ్ఛిన్నం చేయాలని నిర్ణయానికి వచ్చిన వాళ్ళం/ బహుముఖంగా పరుచుకున్న వివక్షతల్ని నిరసిస్తున్న వాళ్ళం/ మేము మీ కుటిలాధికార దురహంకార వ్యవస్థల్ని ధిక్కరిస్తున్నాం/
ఇన్నాళ్ళూ మీరు అల్లిన చీకటి వలల్లోంచి/ ఏమీ చూడలేకపోయాం/ దుమ్ము పట్టిన దుర్నీతుల్ని దురపరించలేక పోయాం/ ఇంకా పడి ఉండమనే అంటున్నారా?/ అలా ఉంటామని అనుకుంటున్నారా?/ అది ఇక ఏ మాత్రం జరగని పని….” అని శెట్టి రజిత ‘అక్షరాలా’ నూత్న చైతన్య స్రవంతి ని వెలువరించారు.
168 కవితలలో కవయిత్రులు వెల్లడించిన ఆక్రోశాలు, వాటి వెనుక ఉన్న దుఃఖపు తడిని తడిమి చూడటం ఒక సాహసమే. (మొత్తంగా ఈ అపరాజితను ఒక వ్యాసంలో కుదించి సమీక్షించడం అన్యాయమే).
30 ఏళ్ళ స్త్రీల కవితా ప్రస్థానం… భావ పరిణామ క్రమం… దుఃఖిస్తూ… ప్రశ్నిస్తూ… ధిక్కరిస్తూ… పోరాడుతూ… “అపరాజిత” లోని పదునైన భావాలు! భూదేవంత బాధల బరువుని ఆకాశం నిండా పరుస్తూ… ఎన్నెన్ని పోయెమ్స్! ఎన్నెన్ని చీకటి బాధా శకలాలు!
“నాకెందుకో గొప్ప గొప్ప ఆలోచనలన్నీ వంట చేసేటప్పుడే వస్తుంటాయి! వంటింటికి పది అడుగుల దూరంలో నా వ్రాత బల్ల! రారమ్మని పిలుస్తోంది నన్ను! వెళ్ళనా?
మరే!/ అవతల పిల్లకి జడలు వెయ్యొద్దూ/ చంటాడింకా నిద్దర లేవనే లేదు/ ఆయన గారి కాఫీ సరేసరి/ ఆఫీసులో అసలే ఆడిట్/ నే త్వరగా వెళ్లాలి/ వంటింటి గుమ్మం పై నేనూ నా అంతరాత్మల మీమాంసా చర్చ!… నా వ్రాతబల్ల అందనంత దూరంలో…/ కాలపు ఆవలి ఒడ్డున నిలబడి నన్ను వెక్కిరిస్తుంది/ అవును… అక్షర రూపం దాల్చేలోపే ఆవిరైపోయే భావాలెన్నో!” సింగంరాజు రమాదేవి రాసిన ఈ వంటింట్లో ఆవేదన ఎందరి కవయిత్రులు ఆవేదనకి ప్రతీకనో!
అమ్మ కడుపులో కూడా భద్రత లేదని ఆడపిల్ల పిండ దశలోనే ఆక్రోశించడం, తల్లి వేదన చాలా కవితల్లో జ్వలించింది.
డా. కె.మీరాబాయి… “దేవుడా అమ్మ కడుపులో ఉండగానే నాకొక మానం బిళ్ళ నీయలేదెందుకు/ ఆడపిల్లనని అప్పుడు స్కానింగ్లో తెలిసేది కాదు/ అమ్మకీ కడుపుకోత ఉండేది కాదు పాపం/ఉమ్మనీటిలోనే నన్ను ముక్కలుగా నరకాలని/ నిరపరాధికి మరణశిక్ష ఖరారు చేసే వాళ్ళు కాదు!”
నిరంతర పరివర్తనశీలమైన సమాజ గమనాన్ని గమనిస్తూ, ఈ సామాజిక పరిణామాల్లో స్త్రీల జీవన విధానాన్ని చిత్రిస్తున్న కవయిత్రుల సంఖ్య కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూనే ఉంది. వ్యక్తిగత అనుభవ సారానికి సామాజిక దుష్పరిణామాలను జోడిస్తూ రాస్తున్న కవయిత్రుల కలం మరింతగా పదునెక్కుతూనే ఉంది.
అమ్మమ్మలు, బామ్మలు, అమ్మలు గడిపిన జీవితాన్ని తేరిపార చూసుకొని నేడు తను జీవిస్తున్న తీరును గమనిస్తే పెద్ద మార్పు ఏమీ కనబడడం లేదు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆధునిక స్త్రీ ఇంటా బయట కూడా అనేక ఒత్తిడిలకు గురవుతోంది. చాకరీ తప్పటం లేదు.
మందరపు హైమావతి అన్నట్లు “పొద్దున్నే లేవగానే పొగలు కక్కే కాఫీ తాగుతూ పేపర్ చదవాలని నా చిరకాల వాంఛ. కలల శాలువా కప్పుకొని నిద్రాదేవత కౌగిలిలో ఇంటిల్లిపాది పరవశిస్తున్న వేళ నేను మాత్రం కళ్ళు నులుముకుంటూ కాలు పెడతాను వంటింట్లోకి…” చాలా మంది ఆవేదన ఇది.
గర్భస్థ పిండంగా ఉన్నప్పటి నుండి, బాల్యంలోనే వివక్షతకు గురవుతూ, వచ్చీ రాని వయసులోనే గంపెడు చాకిరిని తలకెత్తుకున్న ఆడపిల్ల ప్రేమ పేరిట జరిగే దుర్మార్గాలను అత్యాచారాలను వెల్లడించే కవితలు.
ఒక్కోసారి ప్రత్యక్షంగా, ఒక్కోసారి పరోక్షంగా, కనిపించకుండా ఎదురవుతున్న హింసని నేటి స్త్రీ సునిశిత దృష్టితో గమనించ గలుగుతుంది. ఎదుటివారి అతి తెలివిని గుర్తించగలుగుతోంది. కనిపించని గాయాన్ని మానసిక క్షోభల్ని తడుముకుంటున్నది, ప్రశ్నిస్తున్నది. స్పష్టమైన సమాధానాన్నీ ఇస్తోంది. డా.సి.భవానీదేవి కవిత –
“అందరి అమ్మలకి కూడా అందరి నాన్నలే గుర్తింపు/ కానీ నేను అమ్మ కాకముందు/ అతను నాన్న కాకముందు/ అతని గుర్తింపును/ నామీద ముద్రించక ముందే /నన్ను నేను గుర్తించాను/ నా గుర్తింపును మాత్రం/ అతనికి అస్సలు ఇవ్వను!”
93 మంది కవయిత్రులు రాసిన ఈ కవితల్లో మాయలు, జిమ్మిక్కులు, సుమగంధ వీచికలు, స్వప్నవీధుల విహారాలు లేవు. కఠిన కంటకాలు ఎదుర్రాళ్ళు, కడుపుని చిదిమేస్తుంటే శారీరక మానసిక అలజడులు, ఒంటరి వంటిల్లే కాదు చిందర వందర రైటింగ్ టేబుల్ లు, ఒక చేత్తో పిల్లల పనులు మరో చేత్తో కంప్యూటర్ ఆపరేటింగ్, ఒక కన్ను బిడ్డల సంరక్షణ పై, మరో కన్ను వర్క్ ఫ్రం హోం పై…. ఆధునిక స్త్రీ తనని తాను నిరూపించుకునే క్రమంలో ఎదుర్కొంటున్న వాటినన్నిటిని స్పష్టంగా సూటిగా వెల్లడించారు. కవిత్వం నిర్మాణ పద్ధతి, శిల్పం, శైలి వంటి లాక్షణికుల సూత్రాల చట్రంలో ఇమిడిపోక తమ వేదనల్నీ రోదనన్ని అక్షరాలా వెల్లడించారు.
త్యాగాలు చేసి చేసి, ఓర్పును చూపి చూపి, ఎదిరించి వినిపించిన ధిక్కార స్వరాలు అపరాజిత లో ఎన్నో!
‘మాతృత్వమనే మాట నన్నెందుకో భయపెడుతుంది…’ అని కొండేపూడి నిర్మల, ఆడపిండం అని తెలిసి కడుపులోనో, పుట్టాక చెత్తకుప్ప లోనో వదిలించుకోక తప్పని పరిస్థితి గురించి ‘ఆడపిండం అన్వేషణ ‘ నిత్య కవితల్తో గుండె ను తడిమారు.
మెహందీ స్త్రీలు పిల్లలని బళ్ళో చేర్చాలంటే అక్కడ తండ్రి పేరు అడుగు తున్నారని తెలిసి కొండేపూడి నిర్మల రాసిన ‘నాన్నల్ని కొనాలి కిలో ఎంత’ –
వంటింటి చాకిరి గురించి షహీదా ‘లేడీస్ స్పెషల్’, నల్లూరి రుక్మిణీ ‘బ్లో అవుట్’, అనురాధ నాదెళ్ల ‘ఉద్యోగిని ఉత్తరం’, డా. కె. గీత ‘కంప్యూటర్ కాపురం’, కె.వరలక్ష్మి ‘ ఒంటరి చాకిరి’, ములుగు లక్ష్మీమైథిలి ‘ బలిదానం ‘ , నస్రీన్ ఖాన్ ‘ సాంచా ‘ వంటి కవితల్లో స్త్రీ శక్తి వంటింట్లో ఎలా మగ్గిపోతోందో వివరించాయి.
వరూధిని, శకుంతల, ద్రౌపది మాధవి ల కాలం నుండి మగవాని మోసానికి బలైన స్త్రీలను గురించి చెప్తూ కల్పనా రెంటాల –
“ఇప్పుడు నేను మానవిని/ అవ్యక్తనూ పరిత్యక్తనూ కాను/ అయోనిజనో అహల్యనో కాబోను/ వంచిత శకుంతల వారసురాలిని అసలే కాను/ స్త్రీత్వపు కొలమానంగానే మిగలనింక/ నేను అపరాజితను/ కనిపించని సంకెళ్లను ఛేదించే కాళిని/ సస్య క్షేత్రాన్నే కాదు, యుద్ధక్షేత్రాన్ని/ సిగ్గుతో చీలిపోయిన భూమిని నేనే/ నెర్రలు విచ్చిన నేలను విశాలమైన బాహువులతో కప్పే ఆకాశాన్ని నేనే / …” అంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్త పరిచారు.
తాగుబోతు మొగుణ్ణి, ఖజానా నింపుకునే ప్రభుత్వాన్ని జమిలీగా తూర్పార పట్టారు కొండేపూడి నిర్మల ‘రిస్కు తీసుకుంటాను’ కవితలో. భూతల స్వర్గం అని భావించే అమెరికా కి వెళ్లినా స్త్రీ జీవితంలో డిపెండెంట్ గానే తప్ప పెద్ద మార్పు ఏమి లేదంటారు ‘డిపెండెంట్ స్వర్గం’లో డా. కె గీత.
ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషికి మనిషికి మధ్య మానవత్వం అనే సంబంధం తెగిపోయి ‘మాల్స్’ లో వస్తువుకి ప్రాధాన్యమిస్తున్న పేలవమైన జీవనాన్ని ‘కూరగాయలమ్మాయి’ లో మందరపు హైమావతి, ‘పొట్టు పొయ్యి’ లో డాక్టర్ కె. ఆశాజ్యోతి కనుమరుగయిన జ్ఞాపకాలని స్పృశించారు.
ఆడపిల్లలు చదువుకోవాలని చెప్తున్న ప్రభుత్వమే తాము ప్రవేశ పెడుతున్న ఉచితాల తాయలాల వల్ల ఆడపిల్లలు త్వరగా పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి పరిస్థితులు కల్పిస్తున్నాయి అని నిష్కర్షగా చెప్పారు ‘భేటీ బచావో ‘ లో శీలాసుభద్రాదేవి.
బాడీ షేవింగ్ గురించి, స్త్రీ దేహాన్ని కేవలం ఒక క్రీడాస్థలంగా భావించే మగవాని బలవంతపు ఆక్రమణని గురించి ‘నీలి కలలు’ లో పద్మావతి రాంభక్త నిరసిస్తే , పశుత్వ వ్యక్తిత్వాలకు చరమ గీతం పాడేందుకు ‘మీ టు’ లను ‘పోరాట శకపు ప్రసవం’ లో సమర్ధించారు డి నాగజ్యోతి శేఖర్.
సంఘంలో, కుటుంబంలో జరుగుతున్న అన్యాయాన్ని దురాగతాల్ని గ్రహించిన స్త్రీ ఆత్మవిశ్వాసంతో తనకు తాను చెప్పుకుంటుంది శిలాలోలిత ‘ఇకపై’ లో –
“నేనొక పని ముట్టును మాత్రమే నని తెల్సింది/ పని గంటల నియమం లేని గడియారాన్ననీ/ పని తోడ్పాటును కోల్పోయిన బక్రా ననీ తెల్సింది/ యజమాని బానిసల బతుకు మగ్గంపై/ ఇప్పటికైనా కనురెప్పలు విప్పకపోతే/ నన్ను నేను పూర్తిగా కోల్పోతానని తెల్సింది/ నేనెప్పటికీ సీతాకోకచిలుకనే/ నన్ను నేను నిర్మించుకునే చిత్రకారిణినే / ఇకపై ! “
ఈ ‘అపరాజిత’ను ఒక ఉద్యమంలా, విదేశంలో ఉండి కూడా, ఒక్క చేతి మీద డా. కె. గీత చేపట్టి, ప్రముఖులు ప్రసిద్ధమైన కవితలనే కాక, ఎక్కడెక్కడో మరుగున ఉన్న – లేదా అవకాశం రాని కవయిత్రులను కూడా వెలికి తీశారు. దానికి ఎంత సహనం ఉండాలి! ఎంత కష్టపడి ఉండాలి! కానీ ఈ “అపరాజిత” పుస్తక రూపంలో అద్భుతమైన ఫలితం పొంది, స్త్రీ వాద కవితా లోకంలోకి అడుగిడింది. అతి కొద్ది రోజుల్లోనే నిలదొక్కుకుంది. తనకంటూ ఒక ప్రత్యేకతను చేకూర్చుకుంది.
శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం యోగ్యతాపత్రం ఎంత గొప్ప యోగ్యతనిచ్చిందో, ఆచార్య కాత్యాయనీ విద్మహే గారి ” ‘అపరాజిత’ స్త్రీవాద కవిత్వ అడుగుజాడలు ( ఒక పరిచయం – ఒక పరిశీలన)” అంత గౌరవాన్ని చేకూర్చింది. ఈ అద్భుతమైన యోగ్యతా పత్రం గురించి డా. కె. గీత మరియు ఆచార్య కాత్యాయనీ విద్మహే లకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి.
సమానత్వం కోసం స్త్రీల ఆవేదన, ఆవేశం, అన్వేషణ సమాహారమే అపరాజిత. ఇదొక వాస్తవ విజయం. రాబోయే తరానికి, కాబోయే స్త్రీవాద కవయిత్రులకు దారి దీపం అపరాజిత. మొత్తంగా చూస్తే ఇది ఒక యుద్ధభేరి. రాజకీయ, ఆర్థిక దోపిడీతో, సామాజిక అసమానతలతో, కుటుంబ అణిచివేతతో, మగానుభావుల అహంకారంతో – నిజానికి స్త్రీ తనలోని ఆడతనంతో చేస్తున్న యుద్ధానికి ప్రతీక ఈ అపరాజిత. తనలోని “మానవి”కి ఇదొక మేల్కొల్పు. రాజీ పడటం, సమాధాన పరచుకోవటం పై విసుగు పడి, అడుగడుగునా పరాజితం అవుతున్న పోరాటాన్ని చైతన్య పరచి, ఊపిరి పోసి విజయం వైపు సూటిగా చేస్తున్న ప్రయాణం “అపరాజిత”. తమ స్థిరమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ మరో తరానికి పొద్దుపొడుపు “అపరాజిత”.
నేటి నిజాలకి, ఇజాలకీ దర్పణం “అపరాజిత”. స్త్రీ వాద అస్తిత్వ రాగాలకి అక్షరీకరణ “అపరాజిత”.
*****
నమస్కారం మేడం,
ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది తెలపగలరు. విద్యార్థులకు తక్కువ ధరకు లభించే అవకాశం ఉందా ఏమైనా.
Please see the details here కందుకూరి దాదా ఖలందర్ garu. *అపరాజిత పుస్తకాన్ని ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే నెచ్చెలి ఇండియా ఫోను నంబరు (+917995733652) కి ఒక కాపీకి రూ.300 ఫోను పే ద్వారా గానీ, గూగుల్ పే ద్వారా గానీ పంపించి, మీ అడ్రసు, ఫోను నంబరు తెలియపరిస్తే పుస్తకాన్ని పోస్టులో పంపిస్తాం.
GREAT ==GOOD EFFORT
CONGRATS
GEETHA. GARU
I WILL BUY ONE COPY