లోలోపలి రాజ్యం నడుపుతున్నదెవరు?

పుస్తకాలమ్’ – 11

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

లోలోపలి రాజ్యం నడుపుతున్నదెవరు?

 

(దేశంలో కార్పొరేట్ల అక్రమాల గురించి జర్నలిస్టు మిత్రుడు జోసీ జోసెఫ్ Josy Joseph  రాసిన ది ఫీస్ట్ ఆఫ్ వల్చర్స్ – The Feast of Vultures – చదవగానే నాలుగు సంవత్సరాల కింద (డిసెంబర్ 6, 2016) ఫేస్ బుక్ లో ఒక చిన్న పరిచయం రాశాను. ఆయన రెండో పుస్తకం ది సైలెంట్ కూ – ఎ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్టేట్ – The Silent Coup – A History of India’s Deep State – వెలువడుతున్నదని తెలియగానే దానికోసం ఎదురుచూస్తూ ఇక్కడే ఒక పోస్ట్ పెట్టి నాలుగు నెలల కిందనే పుస్తకం కొనుక్కున్నాను. అనేకానేక పనుల, ఒత్తిళ్ల మధ్య ఇప్పటిదాకా చదవలేకపోయాను. ఇప్పుడు చదివితే, ఈ నాలుగు నెలల ఆలస్యానికి క్షమాపణ కోరాలనిపించింది. మీలో ఇంగ్లిష్ చదవ గలిగిన వాళ్లందరూ వెంటనే ఈ పుస్తకం చదవాలని కోరుతున్నాను. ఈ పుస్తకం భారత రాజ్యం లోపలి రాజ్యం (డీప్ స్టేట్) చరిత్రను, అది మొత్తంగా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడానికి జరిపిన, జరుపుతున్న నిశ్శబ్ద కుట్రను విప్పి చెప్పడానికి ప్రయత్నించింది.)

          డీప్ స్టేట్ (రాజ్యాంతర్గత రాజ్యం) అనే భావన 1990ల్లో టర్కీలో కుర్దిష్ తిరుగుబాటుదారులను అణచి వేయడానికి మాదకద్రవ్యాల ముఠాలతో, మాఫియా ముఠాలతో చేతులు కలిపి దేశ సైన్యం ఏర్పాటు చేసుకున్న రహస్య పాలక బృందంతో మొదలయిందంటారు. ఇటీవలి కాలంలో సామాజిక శాస్త్రాలలో, ప్రత్యేకంగా రాజనీతి శాస్త్రంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఒక రాజ్యపు రాజకీయ నాయకత్వానికి బైట, స్వతంత్రంగా, తన సొంత ప్రయోజనాల కోసం, లక్ష్యాల కోసం పనిచేస్తుండే రహస్య, అనధికార ఆధిపత్య శక్తుల కూటమిని డీప్ స్టేట్ అంటున్నారు. అయితే రాజకీయ నాయకత్వానికి మొత్తంగా ఇది దూరంగా, స్వతంత్రంగా ఉన్నట్టు కనిపించినా, చాల సందర్భాల్లో ప్రధాన రాజకీయ నాయకత్వపు కనుసన్నల్లోనే ఇది నడుస్తుంటుంది. రాజకీయ నాయకత్వంతో భావజాల అనుబంధాన్ని పంచుకుంటుంది.

          ప్రధానంగా వ్యతిరేకార్థంలోనే వినియోగంలో ఉన్న ఈ మాట రాజ్యపు సహజ, చట్టబద్ధ పౌర అధికారపు పరిధి దాటి ప్రవర్తించే రాజ్యాంతర్గత శక్తుల ప్రాబల్యాన్ని సూచిస్తుంది. బైటికి చూడడానికి అధ్యక్షులు, రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, మంత్రులు, చట్టసభల సభ్యులు, ఉన్నతాధికారులు ఎవరున్నా, వారందరూ ఈ డీప్ స్టేట్ తయారు చేసిన వ్యూహాల ప్రకారం, ఆ వ్యూహాలను సమర్థించడానికి, ముందుకు తీసుకు పోవడానికి పని చేస్తుంటారు. డీప్ స్టేట్ అనేది ఒక చిన్న రాజకీయార్థిక ప్రయోజనాల ముఠా. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో సిఐఎ, ఇజ్రాయెల్ లో మొసాద్, సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో కెజిబి వంటి నిఘా సంస్థలనూ, వాటి అనుబంధ సంస్థలనూ, వాటి మిలాఖత్తుతో నడిచే చిన్న రాజకీయ బృందాన్నీ డీప్ స్టేట్ అనవచ్చు.

          ఈ ‘రాజ్యం లోపలి రాజ్యం’ కన్న ముందు అసలు రాజ్యం, రాజ్యాధికారం అనే మాటల గురించి ఆలోచించాలి. అవి ఆలోచనాపరులకు కొత్తవి కాదు గాని వాటి పూర్తి అర్థాన్ని గుర్తించినవారు తక్కువే. ఒక వర్గానికో, కులానికో, మతానికో, కులనిర్మూలన భావానికో, తమ భావజాలానికో రాజ్యాధికారం సంపాదించడం కోసం పోరాడుతున్నామని అనేవాళ్లలో చాలా మంది కూడ ఆ మాటను ప్రభుత్వాధికారానికి మాత్రమే కుదించి చూస్తున్నారు. 

          రాజ్యం అంటే ప్రభుత్వం, రాజ్యాంగయంత్రం, పాలనాధికారం, అధికార వర్గం, పాలనా రీతి, ఒకానొక ప్రభుత్వ విభాగం వంటి పరిమిత అర్థాలు మాత్రమే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చి, పూర్తి అర్థం కనబడకుండా పోతున్నది. పోలీసులు, సైన్యం, జైళ్లు, అణచివేత సాధనాలు రాజ్యానికి ప్రధానమైన, బైటికి కనబడే సాధనాలు. ప్రభుత్వం, అందులోని ఉన్నతాధికారులు రాజ్యానికి బైటికి కనబడే మరొక రూపం. కాని ఈ కనబడే రూపాల వెనుక సారం క్లిష్టమైనది. సమాజంలోని సంపద మీద, వనరుల మీద, మానవ శ్రమ మీద, మొత్తంగా సమాజం మీద ఆధిపత్యం వహించే వర్గపు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాల గుచ్ఛమే రాజ్యం. ఆ అర్థంలో రాజ్యం అంటే పాలకవర్గ ప్రయోజనాల సమాహారం. పాలకవర్గంలోని భిన్న ముఠాల ప్రయోజనాలను కాపాడుతూ, వాటి మధ్య సమన్వయం సాధించే మధ్యవర్తి అది. సమాజంలో ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం ఉన్నవారి యథాస్థితిని కాపాడడానికీ, కొనసాగించడానికీ, విస్తరించడానికీ ప్రయత్నించే యంత్రాంగం అది. సమాజంలో వర్గపోరాటం జరగకుండా చూసే, అణచివేసే సాధనం అది. కాని ఈ కీలకమైన రాజ్య ప్రయోజనాలన్నీ రహస్యమైనవి, బహిరంగంగా ప్రకటించడానికి వీలులేనివి. అందువల్ల రాజ్యం ప్రభుత్వం అనే సంక్షేమ ముఖం బైట పెట్టి, లోలోపల మాత్రం అణచివేత సాధనాలనే ప్రధానంగా చూస్తుంది. 

          అంటే ఎటువంటి రాజ్యానికైనా రాజ్యాంతర్గత రాజ్యం, బహిరంగంగా కనబడని రాజ్యం, గద్దె మీద కూచున్నవారి కంటె ఎక్కువ దూరదృష్టీ, విహంగ దృష్టీ, భావజాల నిబద్ధతా, కరుడుగట్టిన హింసాత్మకతా ఉన్న ‘రాజ్యం లోపలి రాజ్యం’ అవసరం అవుతుంది. ఈ పని సాధారణంగా భద్రతా, నిఘా సంస్థలు చేస్తాయి గనుక ‘రాజ్యం లోపలి రాజ్యం’గా ఎదిగే అవకాశం వాటికే వస్తుంది. అవి పాలకవర్గాల ఆర్థిక ప్రయోజనాలనూ, ప్రభుత్వంలో ఉన్నవారి రాజకీయ ప్రయోజనాలనూ కలగలుపుతాయి. అలా నిఘా సంస్థల అధిపతుల – కార్పొరేట్ సంపన్నుల – రాజకీయ నేతల దుష్టత్రయం కలిస్తే అదీ ‘రాజ్యం లోపలి రాజ్యం’.

          భారతదేశంలో అటువంటి ‘రాజ్యం లోపలి రాజ్యం’ ఎప్పుడు, ఎలా, ఎవరితో ఏర్పడింది, ఎలా పని చేస్తున్నది తెలుసుకోవడం ఆయా సంస్థల రహస్య పని విధానాల వల్ల చాల క్లిష్టమైన వ్యవహారం. ఆ ‘రాజ్యం లోపలి రాజ్యం’లో ఒక భాగమైన కార్పొరేట్ పన్నాగాలు ఎలా సాగుతున్నాయో సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పరిశీలించి, అధ్యయనం చేసిన అనుభవంతో జోసీ జోసెఫ్ తన మొదటి పుస్తకం రాశారు. ముంబాయి ఆదర్శ్ హౌజింగ్ కుంభకోణం, 2010 కామన్ వెల్త్ క్రీడల కుంభకోణం వంటి కీలకమైన వార్తా కథనాలను బైట పెట్టినది ఆయనే. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ, కార్పొరేట్ రంగాల వార్తా కథనాలతో పాటు భారత భద్రతా వ్యవహారాల వార్తా కథనాలు సేకరించే పనిలో ఎన్నో భారత భద్రతా, నిఘా, సైనిక, అర్ధసైనిక, పోలీసు బలగాలతో సంబంధంలోకి వచ్చారు. సంవత్సరాల తరబడి, వేలాది మంది అధికారులను, గూఢచారులను, నిజాలు బైటపెట్టిన వాళ్లను, అవినీతికరమైన ఉన్నతాధికారులను, పన్నుల అధికారులను, బ్లాక్ మెయిల్ పరిశోధకులను కలిసి చేసిన పరిశోధన ఈ పుస్తకం. 

          ఈ పుస్తకం ఎ టేల్ ఆఫ్ ముంబాయి, మెనీ టేల్స్ ఆఫ్ ఇండియా అనే రెండు భాగాలలో, మొదటి భాగంలో ఐదు అధ్యాయాలతో, రెండో భాగంలో ఏడు అధ్యాయాలతో తయారైంది. రెండు వందల అరవై పేజీలకు మించని ప్రధాన రచనకు 348 పాదసూచికల వివరణలు, ఆధారాలు, ఈ పుస్తకం ఎటువంటి సందేహానికి తావులేని, కచ్చితమైన, సాధికారికమైన, ధృవీకరించుకో గలిగిన సాక్ష్యాధారాలతో తయారైందని చూపుతాయి. అచ్చంగా వాస్తవాలతో నిండి కాల్పనికేతర రచనగా వెలువడిన ఈ పుస్తకం దేశం మీద ప్రేమ, దేశ భవిష్యత్తు పట్ల ఆందోళన ఉన్న ఎవరినైనా కాల్పనిక రచన కంటె ఎక్కువ రోమాంచకారిగా చదివిస్తుంది. మనం ఎన్నుకున్న, పన్నులు కట్టి పోషిస్తున్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తుల చేతుల్లో నడుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థలు ఎంతెంత దుర్మార్గమైన పనులు, ఎంత రాజ్యాంగ వ్యతిరేకమైన, చట్ట వ్యతిరేకమైన, అమానుషమైన పనులు సాగిస్తున్నాయో అడుగడుగునా కనబడి ఆగ్రహం కలుగుతుంది, దేశ భవిష్యత్తు పట్ల దుఃఖం కలుగుతుంది.

          మొదట, మొత్తం పుస్తకానికి జోసీ జోసెఫ్ రాసిన ముందుమాట లోంచి కొన్ని వాక్యాలు చూడండి: “నైపుణ్యం గల భద్రతా యంత్రాంగం ఆధునిక రాజ్యపు కేంద్రం. రాజ్యానికి అత్యుత్తమ రక్షణ అది. కాని, దాన్ని సరిగా నిర్వహించక పోయినట్టయితే, అది ఆ దేశపు అత్యంత ఘోరమైన పీడకలగా మారిపోగలదు. భద్రతా యంత్రాంగంలో అత్యంత శక్తిమంతమైన అంగం సైన్యం. అది పాలనను తన చేతుల్లోకి తీసుకునే సంభావ్యత నిజమవుతుందేమోనన్నదే ప్రపంచమంతటా ఉన్న భయం. కొన్ని అంచనాల ప్రకారం, 1950 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 460 సైనిక కుట్ర ప్రయత్నాలు జరిగాయి. వాటిలో 233 విజయం సాధించాయి…. భారత సైన్యం దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూలదోయబోదనే విశ్వాసం నుంచి చాలా మంది భారతీయులు సాంత్వన పొందుతారు. వారిలో నేనూ ఒకడిని…. అయితే, ఒక ప్రజాస్వామ్యాన్ని కూలదోయడానికి సైనిక కుట్ర ఏకైక మార్గమేమీ కాదు. విదేశీ శక్తి దురాక్రమణ, పాలనను కూలదోసే తిరుగుబాటు, లేదా పాలకుల హత్యలు వంటి ఇప్పటికే గుర్తించిన ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. కాని ఒక కొత్త ప్రమాదం కూడ ఉందని అంతకంతకూ ఎక్కువ సాక్ష్యాలు దొరుకుతున్నాయి. ఆ ప్రమాదాన్నే నేనీ పుస్తకంలో పరీక్షించబోతున్నాను. అది లోలోపలి నుంచి వచ్చే ప్రమాదం. దేశపు పాలక వర్గంలో అత్యున్నత ముఠా ప్రజాస్వామ్యాన్ని కూలదోయడం అనేదే ఆ ప్రమాదం. ….దాన్ని వాళ్లు ఎలా సాధించ గలరు? ప్రత్యేకంగా క్రియాశీలంగా పాల్గొనడానికి సిద్ధంగా లేని సైన్యం ఉన్న భారతదేశంలో అది ఎలా జరుగుతుంది? ప్రతి ప్రభుత్వోద్యోగీ తాను ఏ ఒక్క వ్యక్తి ఆదేశాలకూ తల వంచబోనని, రాజ్యాంగాన్ని ఎత్తిపట్టడమే తన విధ్యుక్తధర్మమని ప్రమాణం చేసే చోట అది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడే, భద్రతా యంత్రాంగంలోని సైనికేతర అంగం తన పాత్ర పోషిస్తుంది. రాజ్యపు పోలీసు బలగాలు, నిఘా యంత్రాంగాలు, కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థలు, పన్నుల శాఖలు, అటు వంటి అనేక సంస్థలు అత్యున్నత పాలక వర్గ ముఠా సాధనాలుగా మారిపోతాయి…”

          ఇది కేవలం సైద్ధాంతిక పరికల్పన మాత్రమేనా, ఈ పని నిజంగా జరుగుతున్నదా లేదా చూడడానికి గత రెండు మూడు దశాబ్దాల భారత చరిత్రను జోసెఫ్ అవలోకనం చేస్తారు. దేశవ్యాప్తంగా అటు మూల కశ్మీర్ నుంచి ఇటు మూల కేరళ దాకా, ఒకదిక్కు గుజరాత్ నుంచి మరోదిక్కు ఈశాన్య రాష్ట్రాల దాకా సైనికేతర భద్రతా బలగాలను పాలకవర్గ ముఠాలు ఎలా ఉపయోగించుకున్నాయో, ఉపయోగించుకుంటున్నాయో డజన్ల కొద్దీ ఉదాహరణలతో సాధికారంగా వివరిస్తారు. కంట తడి పెట్టకుండా, ఆగ్రహం, అసహ్యం కలగకుండా, ఈ కాన్సర్ ను అరికట్టడానికి ఏమైనా చేయలేమా అని ఉద్రేక పడకుండా ఈ పుస్తకం చదవడం కష్టం. 

          వాటిలో కొన్ని విషాద గాథలు. మనుషులను వారి కుటుంబాల నుంచీ, ఉద్యోగాల నుంచీ, వృత్తుల నుంచీ బైటికి లాగి నిస్సహాయులుగా మార్చి, రోజుల తరబడీ వారాల తరబడీ నిర్బంధ శిబిరాలలో చిత్రహింసలు పెట్టి, చేయని నేరాలు ఒప్పించి, కేసుల్లో ఇరికించి, ఏళ్ల తరబడి జైళ్లలో నిర్బంధించిన కథనాలు. పోలీసులు, అర్ధ సైనిక బలగాలు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని చివరికి తేలిన దారుణ ఘటనలు. కొన్ని హాస్యాస్పద గాథలు. మహా ఘనత వహించిన భారత భద్రతా బలగాలలో ఒకదానికీ మరొకదానికీ సమన్వయం లేకపోవడం, అంతర్గత కుట్రలు, రాజకీయ నాయకుల, కార్పొరేట్ సంపన్నుల, చివరికి ఎవరు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిస్తే వారికి సేవకులుగా పనిచేసిన రాజ్యాంగబద్ధ అధికారుల గాథలు. రెండు ప్రధాన ఘటనల్లో ఒకటి కేవలం ఒక బోగస్ పారిశ్రామిక సంస్థ యజమానులను ఎదిరించి, ఉద్యోగం వదిలేసిన వ్యక్తి మీద శక్తిమంతులైన యజమానులు పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాథ. ఆ వ్యక్తినీ అతని కుటుంబాన్నీ చిత్రహింసలతో వేధించిన గాథ. పది సంవత్సరాల తర్వాత ఆ ఉద్యోగి చెప్పిన యాజమానుల అక్రమాలే నిజమై వాళ్లు ప్రభుత్వరంగ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కథ. ఈ మొత్తం లో ఆ యజమానులకు సహకరించిన పోలీసు యంత్రాంగం.

          సోదాలు, జప్తులు, తప్పుడు పంచనామాలు, అబద్ధపు కేసుల బనాయింపు, తప్పుడు సమాచారాల సేకరణ, అక్రమ నిర్బంధాలు, చిత్రహింసలు, నార్కో టెస్ట్ పేరిట జరిగిన ఘోరాలు, తప్పుడు ఒప్పుకోలు ప్రకటనలు, ఖైదీల మీద జైలు అధికారులు జరిపిన దారుణాలు, ఉద్దేశ పూర్వకంగా పత్రికలను, న్యాయస్థానాలను తప్పుదారి పట్టించడం, పారదర్శకత లేని దర్యాప్తులు, నిజంగా దర్యాప్తు జరపవలసిన దిశలో కాకుండా సరిగ్గా వ్యతిరేక దిశలో దర్యాప్తు జరపడం, నిజమైన నేరస్తులకు పోలీసుల, నిఘా సంస్థల, దర్యాప్తు సంస్థల సహకారం, అలా సహకరించిన అధికారులకు పదోన్నతులు, పోలీసు చట్టాలలో ఉన్న అప్రజాస్వామికత, టాడా, పోటా, యుఎపిఎ, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం వంటి అప్రజాస్వామిక చట్టాలు, హక్కుల కార్యకర్తల, న్యాయవాదుల హత్యలు,   వంటి వందలాది ఉదంతాలను జోసెఫ్ క్రమబద్ధంగా, సోదాహరణంగా, సాధికారికంగా వివరించారు. ఆయా ఉదంతాలను బట్టి ప్రస్తావనవశాత్తూ ఆ వ్యవహారాలలో దేశంలోని 22 అత్యున్నత నిఘా, దర్యాప్తు, భద్రతా సంస్థల భాగస్వామ్యం ఎలా ఉందో, ఎంత ఉందో వివరించారు.

          ఈ క్రమంలో జోసెఫ్ చూపిన నిదర్శనాల జాబితా చూస్తే సమకాలీన భారత చరిత్ర చదివినట్టు ఉంటుంది. ముంబాయి వాహిద్ ఉదంతం, గోధ్రా ఉదంతం, గుజరాత్ మారణకాండ, హరేన్ పాండ్యా హత్య, సోహ్రాబుద్దీన్ షేక్, కౌసర్ బీ, తులసీరాం ప్రజాపతిల బూటకపు ఎన్ కౌంటర్లు, ముంబాయి అల్లర్లు, ముంబాయి పోలీసు వ్యవస్థకూ మాఫియాకూ ఉన్న అన్యోన్యమైత్రి, ఎన్ కౌంటర్ స్పెషలిస్టులు, దశాశ్వమేధ్ ఘాట్, శ్రమజీవి ఎక్స్ ప్రెస్, ఢిల్లీ, సంకట్ మోచన్ దేవాలయం, గోరఖ్ పూర్ మార్కెట్, హైదారాబాద్ లుంబినీ పార్క్, గోకుల్ చాట్ భండార్, ఉత్తరప్రదేశ్ కోర్టులు, జైపూర్ వంటి చోట్ల బాంబు పేలుళ్ల కేసులు, బాట్లాహౌజ్ ఎన్ కౌంటర్, తాజ్ మహల్ హోటల్ మీద దాడి, హేమంత్ కర్కారే హత్య, సంఝౌతా ఎక్స్ ప్రెస్ పేలుళ్లు, అభినవ్ భారత్ వంటి హిందూ తీవ్రవాద సంస్థలు, లష్కర్ ఎ తోయెబా, ఇండియన్ ముజాహిదీన్ వంటి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు, అంతులేని కశ్మీర్ విషాదగాథ, ఖలిస్తానీ ఆందోళన, ఆపరేషన్ బ్లూస్టార్, శ్రీలంక తమిళ ఈలం ఉద్యమం, భారత శాంతి రక్షక దళాల హింసామయ, విషాదమయ ప్రహసనం, ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానపు 1999 హైజాక్, పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచడం పేరుతో పోలీసులు 25,000 మంది యువకులను మాయం చేయడం, మితిమీరిన అధికారాలు సంపాదించుకుని, ఆ అధికారాన్ని అమాయక సాధారణ పౌరుల మీద హింసాత్మకంగా ఉపయోగించడం, మణిపూర్ లో సైనిక, అర్ధసైనిక బలగాల అకృత్యాలు, ఛత్తీస్ గడ్ లో సాల్వా జుడుం అకృత్యాలు, గుజరాత్ నమూనా పేరుతో నరేంద్ర మోడీ – అమిత్ షా తయారుచేసిన అక్రమ, హింసాపూరిత, ముస్లిం వ్యతిరేక భద్రతా యంత్రాంగ మానసిక స్థితి, మొదట మితిమీరిన అధికారాలు పొంది విచ్చలవిడిగా ప్రవర్తించి, చివరికి జైలు పాలైన పోలీసు అధికారి వంజారా, తాను చేసిన నేరాల్లో మోడీకీ, షాకూ ఉన్న పాత్రను విప్పిచెపుతూ రాసిన రాజీనామా ఉత్తరం, జడ్జి లోయా అనుమానాస్పద మరణం, అమిత్ షా మీద కేసు ఉపసంహరణ, స్వచ్ఛంద సంస్థల మీద మోడీ పగ, మోడీ మీద హత్యా ప్రయత్నాలు అనే ఎడతెగని అబద్ధాల కథ, భీమా కోరేగాం అబద్ధపు కేసు, ఆర్సెనాల్ కన్సల్టింగ్ వాస్తవాల వెల్లడి… ఇదీ ఈ మూడు దశాబ్దాల చరిత్ర.    

          ఈ మొత్తం కథనం భారత భద్రతా బలగాలలో విస్పష్టంగా ఉన్న ముస్లిం వ్యతిరేకతను, ప్రతి దానికీ ముస్లింలను అనుమానించే మానసిక స్థితిని, హిందూ తీవ్రవాద సంస్థల విధ్వంసాల గురించి స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా వాటిని దాటవేయడాన్ని, తక్కువ చేసి చూపడాన్ని, మోడీ-షాల గుజరాత్ నమూనా తర్వాత భద్రతా బలగాలను వినియోగించి భిన్న స్వరాలను వేధించడాన్ని అద్భుతంగా వివరిస్తుంది. అక్కడక్కడ జోసెఫ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తప్పనిసరిగా వినవలసినవి.

          “ఈ పుస్తకపు మౌలిక వాదన – పోలీసు, నిఘా యంత్రాంగాలను జవాబుదారీగా మార్చవలసిన తక్షణ అవసరాన్ని గుర్తింప జేయడం.”

          ఎన్నికల కమీషన్ గురించి చెపుతూ “కీలక సమయాల్లో ఒక ఎత్తుగడగా మరొక పక్కకు చూడడంలో నైపుణ్యం సాధించిన భారత రాజ్యాంగ వ్యవస్థల పనితీరే ఇవాళ దేశపు ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లలో ప్రధానమైనది.”

          “దురభిప్రాయాలు, చీకటికోణాలు లేని భద్రతా యంత్రాంగం మాత్రమే, క్షేత్రస్థాయి పరిస్థితి గురించి లోతైన అవగాహన ఉన్న యంత్రాంగం మాత్రమే ప్రజాస్వామ్యానికి అత్యంత కీలక అవసరం.”

          “భారతదేశం సైనిక కుట్రల నుంచీ, ప్రభుత్వాల కూల్చివేత నుంచీ సురక్షితంగా ఉన్నదని అనిపించవచ్చు. కాని మన భద్రతా సంస్థలలోని చీకటి శక్తులకు కళ్లాలు బిగించ వలసిన అవసరం ఉన్నదనడానికి ఈ పేజీల్లోనూ, వేరే చోట్లా తగినన్ని ఆధారాలున్నాయి”

          “2008 ముంబాయి దాడుల తర్వాత ఏర్పాటైన ఎన్ఐఎ తన వృత్తి నైపుణ్యాన్ని రాజకీయ యజమానుల వేదిక మీద బలి ఇచ్చినట్టే కనబడుతున్నది.”

          “దేశానికి నిజమైన శత్రువులను కనిపెట్టే బదులు, భారత భద్రతా సంస్థలు తమ చేతికి అందిన వారిని వేటాడాయి. తీవ్రవాదుల కోసం వెతికే బదులు, అమాయకులను అదుపులోకి తీసుకున్నాయి. సమాచార సేకరణలో, విశ్లేషణలో నైపుణ్యం మెరుగు పరుచుకునే బదులు, తామే అబద్ధపు సమాచారాన్ని ఉత్పత్తిచేయడం మొదలు పెట్టాయి.”

          ఇవీ, ఇటువంటివీ ఎన్నో నిజాలు బైట పెట్టకుండా ఉండడానికి, సత్యాన్వేషణను ఆపివేయడానికి తనకు ఎన్నెన్నో లంచాలు ఇవ్వజూపిన, బెదిరించిన అత్యున్నత ప్రభుత్వాధికారుల ఉదాహరణలు కూడ జోసెఫ్ రాశారు. ఎక్కడో ఒక చిన్న, స్థానిక, సుపరిచిత ఘటనను వివరిస్తూ, అక్కడి నుంచి సుదూరమైన అంతర్జాతీయ వ్యవహారాల లోకీ, చరిత్ర లోకీ, మానవ స్పందనల లోకీ సునాయాసంగా వెళ్లడం జోసీ జోసెఫ్ రచనా శైలి. అది చదువరుల ఆలోచనా, విశ్లేషణా పరిధిని అంతకంతకూ విశాలం చేస్తుంది. 

          నాకు తోచిన, నేను గుర్తించిన లోపాలు లేవని కాదు గాని, మొత్తంగా పుస్తకం ఇచ్చే అవగాహనతో పోలిస్తే ఆ పొరపాట్లను వదిలేయవచ్చు.

          పుస్తకం లోంచి డజన్ల కొద్దీ పేజీలు, ఇరవైకి పైగా ఘటనలు, పరిణామాలు వివరంగా ఉటంకించి, ఎంత పెద్ద కుట్ర ఎంత నిశ్శబ్దంగా జరిగిపోయిందో, జరిగిపోతున్నదో చూపాలని ఉన్నది. దేశంలో ఏం జరుగుతున్నదో ఈ పుస్తకం చదివి తెలుసుకొమ్మని, ఇక్కడ కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమేనని ఇంకా నమ్మేవాళ్లకు సవినయంగా విజ్ఞప్తి చేయాలని ఉన్నది. పాలకవర్గ దుర్మార్గాల గురించి తెలుసుకొని, ప్రజలకు తెలియ జెప్పదలచిన వారందరూ ఈ పుస్తకం చదవాలి. ఒక ప్రత్యామ్నాయ ప్రజా నవభారతాన్ని కలగని, ఆ మార్గంలో సాగుతున్న శక్తులకు, వాళ్లు కనిపెట్టిన దుర్మార్గానికి వందల రెట్లు ఎక్కువ జరుగుతున్నదని తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవమనీ, తమలో తమ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి విశాల ప్రజారాశుల ఐక్యత సాధించ వలసిన అవసరం ఎంతగా తోసుకొస్తున్నదో ఈ పుస్తకం చదివి తెలుసుకొమ్మనీ చెప్పాలనిపిస్తున్నది. ఇప్పటికైనా మేలుకోవలసిన కర్తవ్యం ముక్కు మీద గుద్దినట్టుగా ఎట్లా ముంచుకొస్తున్నదో భారత ప్రజలందరికీ ఈ పుస్తకం ద్వారా చూపాలని ఉన్నది.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.