పృథ – ఒక అన్వేషణ – ఒక పరిశీలన (రేణుకా అయోల దీర్ఘకవిత)

– రత్నాల బాలకృష్ణ

                పృథ – ఒక అన్వేషణ “క్వెష్ట్‌ ఫర్‌ వుమెన్‌ ఐడెంటిటీ”.  మహిళగా నాటి కుంతి పాత్ర ద్వారా ఈనాటి మహిళ యొక్క వ్యక్తిత్వ అంతర్గత సంఘర్షణే పృథ.  భైరప్ప నవల ‘పర్వ’ ద్వారా ఉత్తేజితురాలైన రేణుక గారు ఆనేక సంకెళ్ళ మధ్య బందీగా మారిన, నాటి నుండి నేటి వరకు అనేక సంఘర్షణల అంతరంగ మథనాన్ని ఎదుర్కొంటున్న మహిళ పాత్రగా పృథని మలిచారు.

                భైరప్ప గారు 1979లో ఆనాటి మహాభారతాన్ని పౌరాణిక గాథగా కాకుండా ఆయా పాత్రలకు దైవత్వాన్ని ఆపాదించకుండా సామాజికీకరణ చేస్తూ ఆయా భారత పాత్రల చిత్రణ అనుసారంగా ఆయా ప్రాంతాలు తిరిగి అక్కడ 10 ఏళ్ళపాటు శ్రమించి రాసిన అద్భుతమైన నవల ‘పర్వ’.  వరాల ద్వారా పిల్లలు పుడతారా అని కాకుండా ఆయా పాత్రలు నిజజీవితంలో ఈ సమాజంలో ఆకాలంలో ఎలా జీవించివుంటారో ఊహించి నేటి సమాజానికి ఆయా పాత్రలను పరిచయం చేసే గొప్ప ప్రయోగాన్ని చేసారు భైరప్ప పర్వలో.  అందరూ చదవదగ్గ పుస్తకం. అది చదువుతున్నంతసేపు మనం చదివి, విన్న వ్యాసభారతానికి, పర్వ భారతానికి పాత్రల విశ్లేషణ, ఆలోచన సరళి ఒక గొప్ప సంఘర్షణకి లోను చేస్తుంది.  అటువంటి సంఘర్షణ అనంతంగా రగిలినప్పుడే ఇలాంటి పృథ కావ్యరచనలు వెలుగులోకి వస్తాయి.

                రేణుక గారి కవితలు వారి ఫేస్‌బుక్‌లోను, కవిసంగమంలోను ఇంతకుముందు పరిచయం ఉన్నవే.  ఆమె ప్రయోగాలకు వెనుకాడరు.  ఇంతకు ముందే చెప్పింది మళ్ళీ చెప్పాలనుకోరు. అందుకే ఆవిడ మస్తిష్కం నుండి జాలువారిన దీర్ఘకావ్యం ‘మూడవ మనిషి’.  ఒక ట్రాన్స్‌జెండర్‌ మానసిక అంతర్గత సంఘర్షణను 15 అధ్యాయాలలో అద్భుతంగా వర్ణించారు.  ఎంతో పరిశీలన ఉంటేగాని తనకి అందుబాటులో లేని వ్యక్తిత్వం గురించి అంతలోతుగా వర్ణించలేరు.  అలాగే ఆమె అంతఃతీరాల అన్వేషణ కవితా సంపుటి.  ఆమె రాయాలనుకున్న వాక్యాలను నిర్భీతిగా, సమాజం కట్టుబాట్లను ధిక్కరిస్తూ ధైర్యంగా వెలిబుచ్చ గలరు.  ఇండియన్‌ ఇంగ్లీష్‌ రైటర్‌ కమలాదాస్‌తో పోల్చదగ్గ కవయిత్రి.

                ‘ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది’  అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ నేటి ఈ ఆధుక మహిళగా వందేళ్ళ తరువాత పృధ వ్యథను పునర్మూల్యాంకనం చేసారు.

                ఈ సందర్భంగా ప్రస్తావించవలసిన ఒక విషయం ఉంది. సాధారణంగా మన అనుభవ దృష్ట్యా కొన్ని వాక్యాలను సాధారణీకరిస్తుంటాం.  ఉదా: ది సన్‌ రైజస్‌ ఇన్‌ ద ఈస్ట్‌. ఇది సింపుల్‌ ప్రెజెంటెన్స్‌ వాక్యం. ఇది అన్ని విధాలా కరెక్ట్‌ వాక్యంగా పిల్లలకు నేర్పుతూ ఉంటాము.  కానీ సర్వకాల సర్వావస్తలలోనూ ఈ వాక్యం కరెక్టేనా?  అసలు సూర్యుడు భ్రమిస్తున్నాడా ? భూమి పరిభ్రమిస్తున్నదా? సూర్యుడు చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నది. అంటే సూర్యుడు ఉదయం కనిపించే దిక్కుపేరు తూర్పు. ఇక్కడ ఫ్రేమ్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ మారుతున్న కొద్దీ ఆయా అనుషంగిక విషయాలను అర్థం చేసుకునే పద్ధతి మారుతుంది.  అర్థం మారుతుంది. 

                ఈ కావ్యంలో అయోల గారు చేసిన పని అదే.  పురుష భావజాలంతో ఇప్పటి వరకూ రాయబడ్డ పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర తిరిగి మహిళాబద్ధంగా నిర్వచించ బడాలన్నది ఆమె ఉద్దేశ్యం.  శ్రీశ్రీ చెప్పిన ఇతిహాసపు చీకటికోణం వెలికితీసి మళ్ళీ రాయబడాలి.  అప్పుడే తను కోరుకున్న స్వేచ్ఛ, మానసిక పరిపక్వత మహిళకు లభిస్తుంది.  అంతేకాని ఇప్పుడు పురుష భావజాలంతో స్త్రీకి లభించిన స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ కాదు.  పురుషుడు తన మార్కెట్‌ వినియోగానికి మహిళను తను తయారు చేసిన పంజరంలో బంధించి ఎగరమన్న పక్షి స్వేచ్ఛ. ఆమె పరిధి ఆ పంజరం ప్రాంగణం మాత్రమే. ఇదికాదు రేణుక గారు కోరుకున్నది.  నిజమైన స్వేచ్ఛ కావాలి.  బంధనాలు లేని, స్వతంత్రంగా తనంత తానుగా నిర్మించుకున్న ఊహాప్రపంచంలో ఎటు వంటి మగ ఆంక్షలు లేని ప్రపంచంలో తన భవిష్యత్తుని నిర్మించుకొనే స్వేచ్ఛ కావాలి.  అందుకోసమే ఈ పృథని ఒక వాహికగా చేసుకొని మాద్రి సహాయంతో ఆనాటి పురుష భావజాల ప్రపంచాన్ని ఎదిరించే ప్రయత్నం చేసింది.  ఈ నాటికీ పౌరాణిక భావజాలంతో సీత, సావిత్రి కథలే స్త్రీల జీవితాలకు ప్రమాణాలుగా నిర్దేశిస్తూ మహిళల ఆలోచనా శక్తిని ఎదగనీయకుండా చేస్తున్న సమాజాన్ని కుంతి ద్వారా ప్రశ్నిస్తున్నది.  సమాజం తనకు అనుకూలంగా ప్రవర్తించినపుడు ఆమెనే పతివ్రత అంటుంది, తన నియమాలకు విరుద్ధం అనుకున్నప్పుడు ఆమెనే పతిత అంటుంది.  ఇదే విషయాన్ని లేడీ కరుణాకరంలో కుంతి, ద్రౌపదిలు పతివ్రతలైతే లేడీ కరుణాకరం కూడా పతివ్రతే అని అనిపిస్తాడు చాసో.

                పృథలో కూడా భర్త అనుమతితో ముగ్గురు బిడ్డలను పొందిన కుంతి, వివాహానికి పూర్వం పొందిన బిడ్డను సమాజానికి చూపించలేక తనలో తాను అనుభవించిన మానసిక పరివేదనను అద్భుతంగా వర్ణిస్తారు కవయిత్రి. దీనికి సమాధానం దొరికితే ఈనాడు ఈ కుప్పతొట్టిలోను, మురికి కాలువల్లోను పారేస్తున్న అనాధ బిడ్డల ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

                మన ఆలోచనా పరిధి విస్తృతం కావాలంటే 6వేల ఏళ్ళనాటి మాతృస్వామ్య వ్యవస్థ నుండి నేటి పురుషాధిక్య వ్యవస్థగా రూపాంతరం చెందే ప్రయాణాన్ని కథల రూపంలో వర్ణించిన రాహుల్‌ సాంకృత్యాయన్‌  రాసిన, చాగంటి తులసిగారిచే తెలుగు సేత చేసిన ‘‘ఓల్గా నుండి గంగ వరకు” పుస్తకం ద్వారా  మనకు అనేక ప్రశ్నలకు ఆ పుస్తకంలో సమాధానాలు లభిస్తాయి.  శీలం, పాతివ్రత్యం మెదలగు పదాలకు కొత్తర్థాలను స్ఫురింపజేస్తుంది. భావవాదం నుండి భౌతిక వాదం వైపు నడిపిస్తుంది. పరిణామ క్రమంలో స్త్రీ జీవితంపై సమాజ నియంత్రణ, పురుషాధ్యిసమాజం ఆమె స్వేచ్ఛను ఏ విధంగా హరించిందీ తేటతెల్లం చేస్తుంది.

                పృథ ఆనాటి కన్నీటి వ్యథల సంఘర్షణల కథే కాదు, ఈ నాటి మహిళ తరపున నిలబడి, మహిళ తనదికాని తప్పుకు జీవితాంతం బాధ్యత వహిస్తున్న తీరును, రీతిని ఎండగట్టడానికి కాగడా పట్టుకొని నిలబడ్డ పాత్ర.  పిల్లలు కలగక పోవడానికి కారణం స్త్రీమాత్రమేనన్న భావనే ఇంకా సమాజపు పాదుల్లో నుంచి పోలేదు. ఆధునిక పురుషులు, స్త్రీలు ఈ పరంగా సరైన అవగాహన పెంచుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

                ఒకప్పటి పౌరాణిక పాత్రని ఇప్పటి తరం ఆలోచనల ప్రతిబింబంగా ఒక అన్వేషణతో పునఃకథనం చేసి అయోలా ఒక సరికొత్త ఆలోచనా స్రవంతికి ప్రాణ ప్రతిష్ట చేసారు.  ఈ కావ్యంలో ప్రతి వాక్యాన్ని రసాత్మకం చేసారు.  ప్రతి వాక్యం కవిత్వాన్ని చిప్పిల్లిస్తూ పాఠకునికి అనంతమైన భావ సంఘర్షణకు గురిచేసారు.  ఆవిడ రాసిన వాక్యాలను మళ్ళీ ఉటంకించడం లేదు గానీ ‘‘ఎవరిదో వొక మాట వీపు అద్దానికి తగిలి ముక్కలవుతూనే వుంటుంది” అనే వాక్యంతో మొదలుకొని కవిత్వం చివరి వాక్యాలు ‘‘జీవితం తెలుసుకునే అర్హత కోల్పోయి / ఐదుగురు పిల్లల కన్నీటి దడికట్టి/ హస్తినాపుర జీవిత ప్రయాణంలో/ జీవితం ముగిసిందీలేదు బతికిందీలేదు/ కేవలం సమాధి కట్టబడింది” వరకూ ప్రతీ వాక్యం భావాత్మకమే.  చదువుతున్న కొలదీ సరికొత్త ఆలోచనలకు నాంది పలుకుతుంది.  ఇక్కడ వాక్యాలన్నీ చెబితే రుచించదు.  చదివి రుచి చూడవలసిందే. సరికొత్తగా సమాజాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నానికి బీజం పడుతుంది. సరికొత్త చర్చకు లేవదీసిన పృథ  ఒక అన్వేషణ కావ్యకర్త అయోలా గారు ఎంతైనా అభినందనీయులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.