బతుకు చిత్రం-21
– రావుల కిరణ్మయి
జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
***
ఆ రోజు ఊరు ఊరంతా పీరీల పండుగ వేడుకలకు సన్నద్ధం అవుతున్నారు. ఈర్లచ్చిమి ఇంటి పక్కన ఉండే సోమిదమ్మ బెల్లం కావాలని వచ్చింది.
లచ్చిమి వదినే !లచ్చిమి వదినే !గింత బెల్లంముంటే ఇయ్యి. మాలినద ముద్దలు చెయ్యాలే అని వచ్చింది.
ఎందుకు లేదోదినే !ఆగు !ఇప్పుడే తెత్త , అని లోపలకు పోగానే , ఆమె , అక్కడే పట్టె మంచం నవారు చుడుతున్న జాజులు తో ,
జాజులూ ..!ఏం జేత్తున్నవెంది? కనీసం మొగమన్న జూత్తలేవు కదా !అని అడిగింది.
ఏం లేదు పెద్దమ్మా !సూత్తనే ఉంటివి గదా !పట్టెమంచం నవారు పిండింది మల్ల అల్లటానికి ఉండ సుట్టుకుంటానా.
అబ్బ పిల్లా !ఎంత ఉషారు గల దానివి కాకుంటే కనపడేదే మల్ల జెప్పి తప్పించు కుంటానవ్? అన్నది నవ్వుతూ .
తప్పించుకునుడేంది ?దాచిపెట్టిన్దేమున్నది.?
లేకుంటే లగ్గమైతే అయింది గాని ,సైదులు నువ్వు కూడి ఉంటాన్ద్రా ?అని, నేను అడుగుతుంటే ఎరుగనట్టే మాట్లాడవడితివి? నేను అంత ఎడ్డిదాన్ని గాదె !నాకు ఆడివిల్లలున్నరు. మీ అత్తకు చెప్పుకో లేనిది ఏదన్నుంటే నా తోని చెప్పు. అన్నది గుస గుసగా.
ఏందే? మీ గుసగుస? అన్నది, ఈర్లచ్చిమి , బెల్లం తెచ్చి ఇచ్చుకుంట.
ఏమిలేదు ? వదినే? తల్లీ బిడ్డలమైతిమి, ఏదో ఉప్పోస , అన్నది.
సరేగని, మట్టిగల పండుగకు పొద్దుగూకి రా వదిన !జాజులమ్మ ను నాతోని తొలక పోత అన్నది.
జాజులూ !నువ్వు తయారుగుండు, పోదాము , ఆడికి బొట్టుగిన ఏమి పెట్టుకోకు, బిడ్డా!కొంగు నిండుగ కప్పుకొని వచ్చుడు మరువకు. అని చెప్పి వెళ్ళిపోతూ, మట్టిగిల పండుగ కు రమ్మని చెప్పింది.
జాజులు,ఆమె చెప్పిన విషయాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా ,ఆమెకు ఈ పండుగ గురించి పూర్తిగా అర్థం కాలేదని తెలుసుకొని,
బిడ్డా !నీకు తీరని కోరికలేమన్న ఉంటె పీరిలకు మొక్కి మాలినద ముద్దలు గట్టి పిరీని హత్తుకుంటే అన్ని సక్కగైతయి. ఆలోచించుకో !ఏమన్న,చెడు దుమ్ము ధూళి, మంత్రం తంత్రం తగిలినా, పులివేషదారుని ఇంట్లకు తీసుకచ్చి ఎగిరించుకుంటే శని పోయి తేటగైతవ్, సరేనా, అన్నది.
రాగి పిండి తోని మలింద ముద్దలు చెయ్యాలె ,శానా పనున్నది,అని వెళ్ళి పోయింది.
ఈర్లచ్చిమి, జాజులు కు సహాయం గా కూర్చొని చెప్పటం మొదలు పెట్టింది.
సోమిదమ్మ, పీరిలను నమ్మడం ఎనుక ఉన్న కథను చెప్పసాగింది.
సోమిదమ్మ బాగా కలిగిన కుటుంబం నుండి వచ్చిన పిల్ల.అత్తగారు,చాలా బాగా చూసుకునే వారు.అంతా బాగా జరిగిపోతున్న సమయం లో సోమిదమ్మ పెనిమిటికి ఆరోగ్యం పాడైంది. ఏడ చూపిచ్చినా కోలుకోలేదు. రోజు రోజు ఆరోగ్యం దగ్గరపడి ఆస్తంతా హారతి కర్పూరం కాసాగింది. ఆ సమయం లోనే పీరీల పండుగచ్చి పెద్ద వేడుక జరిగింది,పెద్ద మనుషులు ఎవరో ఉండి ఈ పీరీల కు మొక్కుకుంటే కాని పని లేదని చెప్పగా, సోమిదమ్మ అత్త కోరిక మీద మొక్కి నమ్మింది. దేవుడి మహిమో, మందుల మాయో కాని ఆరోగ్యం కుదుట పడసాగింది. దీనితో ఇంటిల్లిపాది సంతోషం తో అప్పటి నుండి నమ్మి పీరిలు ఎత్తుతున్నారు.
ఇప్పుడు తానూ నిన్ను ప్రత్యేకంగా రమ్మని చెప్పటం లో ఉన్న ముచ్చట ఏందంటే నువ్వూ సైదులు కలిసి పోవడానికి నిన్నూ మొక్కమని ఒక రకంగా ఈ తీరుగ చెప్పింది బిడ్డా !
తప్పని, పోవద్దని నేను అనను, కానీ, నువ్వు కొంచెం సోచాయించు. గాలికి దీపం బెట్టి దేవుడా !నువ్వే దిక్కు, అంటే లాభం లేదు కదా! నువ్వు చేసే ప్రయత్నానికి దైవం సాయతుంటడు. కానీ చేష్టలు మాత్రం మనయే ఉండాలే. సమజైంది గదా!పో సాయత్రం అట్ల వోయి ఆ వేడుక గూడ చూసిరా పొండ్రి.సైదులును కూడా ఎంట వేట్టుక పో !అని తల మీద నిమురుతూ చెప్పింది ప్రేమగా.
అత్తా! నాకు ఎందుకో పోను మనసైతలేదు. బొట్టు తీసేసి. ముసుగేసుకొని పోవుడంటే ఏదో తప్పు చేస్తున్న అనిపిత్తాంది. అన్నది.
తప్పేముంది బిడ్డా !ఆళ్ళ దేవుణ్ణి నమ్మినప్పుడు ఆళ్ళ ఆచారం పకారం పోతెనే ఇలువిచ్చి బత్తున్నట్టు వాళ్ళు అనుకుంటరు. కాబట్టి అందరి ఆచారాలను,నమ్మకాలను గౌరవించాలే, నీ ఇష్టం బలవంతం ఏమి లేదు. అన్నది తనే మళ్ళీ.
జాజులుకు ఈర్లచ్చిమి తీరు బాగా నచ్చింది.నిజమే కదా! ఎఅరి నమ్మకాలు వారివి, ఆచరించడం ఆచరించక పోవడం మన ఇష్టమే కానీ ప్రతీ దాన్ని గౌరవంగా చూడాలనేది ఆమె ఆంతర్యం.
అందుకే, సైదులు తో చూడడానికి వెళ్ళడానికే నిర్ణయించుకుంది. అతని కోసం ఎదురు చూస్తూ స్నానం చేసి మల్లెలు మరువం మాల కట్టి, కొత్త చీరలో అందంగా ముస్తాబైయింది.
అందరూ బైల్దేరుతున్నారు .
బిడ్డా !గలుమట్ల ఎంతసేపు కూచుంటవ్ ? అన్నది ఈర్లచ్చిమి ,దర్వాజలో కూర్చున్న జాజులమ్మను చూస్తూ.
జాజులమ్మ మాట్లాడలేదు. నెమ్మదిగా లోపలికి కదులుతుండగా ,వాడ మూల మలుపు నుండి సైదులు రావడం కనిపించింది. రెట్టించిన ఉత్సాహం తో లోపలికి వచ్చి స్నానానికని నీళ్ళు తోడింది .కండువా వేసి కొత్త బట్టలు తీసి పక్కన పెట్టి రెడీ గా ఉంచింది.
ఇదంతా చూడగానే ఈర్లచ్చిమి కి అర్థం అయింది.సైదులు వస్తున్నట్టుగా ,ఆమె కొడుకును సరపిండి తిని పొమ్మందామని గిన్నెకు పిండిని పొయ్యి ముందు కూచొని ఒత్త సాగింది.
సైదులు ఇల్లు చేరి భార్యను,తల్లిని చూసి ,ఏమీ పలకరించకుండానే మళ్ళీ బయటకు దారి తీస్తుండగా పరుగు పరుగున వచ్చి జాజులమ్మ దారికి అడ్డంగా నిలబడింది.
సరిగ్గా అప్పుడే వచ్చిన రాజయ్య అది చూసి ,
ఏమిరో !నీకు అడ్డం పడ్తాంది ?ఏందట కథ?ఇప్పుడు నిన్ను తాదానికి పోనియ్యద్ధనా? ఏంది? అప్పుడే కొంగుకు ముడేసుకోవాల్నని కుట్రలు సురు జేసిందా ?పైలం కొడుకో ! ఇయ్యాల మందు వద్దంట ది. రేపటికి చెప్పినట్టు ఇనకుంటే నువ్వే వద్దంటది. అన్నాడు ఎకసక్కెంగా.
అంతా విన్న ఈర్లచ్చిమి ,చేస్తున్న పని ఆపి దిగ్గున లేచి రాజయ్య దగ్గరకు వచ్చి,
సెప్పిన కాడికి సాలుగని తియ్. ఎప్పుడు వానెంబడుండే ,మొగుడు పెళ్ళాలన్నాక సవాలక్ష సంబరాలుంటయ్ .నికేమురుక?నడుమిట్ల సొరవడకు.దా !గిన్నెకు పెట్టిన తిందువుగానీ! అన్నది.
అరేయ్ !సైదులు ,జాజులు సేప్పినట్టు ఇను. అయ్య మాటింటే అన్నాలమైతావ్! అన్నది.
వాళ్ళు లోపలికి వెళ్ళగానే ,జాజులు మెల్లగా , పీరిలు ఊరేగిత్తరట,పీరికి మొక్కితే కోరికలు తీర్తయట ,పోదాం !పెయ్యికి పోస్కోపో !అన్నది.
దానికి నేనెందుకు !అవ్వ నువ్వు పొయి రావచ్చుగా !అన్నాడు,అసహనం గా .
ఎవరికి కోరికలుంటే వాల్లే వాళ్ళ తోడూ తోని పోవాల్నట. నా కోసం ,మన కోసం మనమే పోవాలా !అందుకే పా !పోదాం అని చేయ్యివట్టి స్నానానికి తిసుకొస్తుండగా ,సైదులు చెయ్యి విడిపించుకుని ,
నేను ఇట్టాంటివి నమ్మను.నాకిష్టం లేదు.అన్నాడు.
అల్లాగంటే ఎలారా? బిడ్డా? దాని మాట కూడా వినిపించుకోవాలె గదా ! ఇంటి కోడలుగా అది ఏది సేసిన మనకోసమే గదా! అన్నది జాజులుకు వత్తాసు పలుకుతూ, సైదులును బుజ్జగిస్తూ.
తల్లి మాటకు విలువిస్తున్నట్టుగా, మారు మాట్లాడకుండా స్నానానికని బయలుదేరాడు.
జాజులు సంబరం తో సైదులుకు తలంటి స్నానం చేయించి తాను అంతకు ముందే తీసి పెట్టిన కొత్త బట్టలు తొడిగించింది. జాజులమ్మ సంబరం చూసి ఈర్లచ్చిమి మురిసిపోయింది.
అలా సైదులు ,జాజులమ్మ పీరీల ఊరేగింపు కాడికి బయలుదేరారు.
***
అయ్యా!నేను పీరీలకు ఏమని మొక్కాలనుకుంటున్నానో తెలుసా ? అడిగింది, తల వంచుకొని నడుస్తూనే. ఆమె మొఖమైన చూడకుండానే ,ఊ …అన్నాడు.ఏమిటో చెప్పమన్నట్టుగా.
జవాబు అడుగుతున్నాడని అర్థం చేసుకున్నదానిలా మరే !మనకు తోలిసూరు కొడుకు పుట్టాలని అన్నది.సిగ్గుతో పూర్తి చేయ్యాకుండానే. ‘’పిల్ల పుట్టాక ముందే కుల్ల కుట్టినట్టు’’..అని ఆగాడు .
అరేయ్ !ఇన్నావురా!ఈ పొల్ల ఇంకా ‘’నలగని పువ్వేరా’’అదేరా !జాజి పువ్వు. మొరతోనికి మొగిలి పువ్వు ఇత్తే ఇట్టాగే ఉంటుంది మరి, అదే నాలాంటోడికైతే …..అని బిగ్గరగా నవ్వుతూ మాట్లాడిన వెకిలి మాటలు వినిపించాయి.ఇద్దరికీ. ఆగి వెనుతిరిగి చూశారు.
ఏం తమ్మీ ! నడుసుడు ఆపినవేంది? శాతనయితలేదా? ఏంది? అన్నాడు వాళ్ళను వెంబడిస్తూ వచ్చిన ముగ్గురు మనుషులలో ఒగడు.
అన్నా! తమ్మికి ఏది శాతనైంది గనుక ఇది శాతనయితది? అన్నాడు మరొకడు.
అంతే ..!అంతే ..!నువ్వన్నది అచ్చర సత్తెం.అన్నాడు మూడవ వాడు.
సైదులు కోపంతో ముందుకు కదలగా, జాజులమ్మ చెయ్యి అందుకొని వారించింది.
అరేయ్ ఈడు మొగోడు కాదురా !అట్టి ఆడంగి ఎదవ.పెళ్ళాం ఆపగానే అట్నే ఆగిండు. అన్నాడు ఒగడు.
ఆ మాటకు సైదులు, జాజులమ్మ చెయ్యి విడిపించుకొని ఒకడిని వంగబెట్టి ఈపు మీద దబా దబా పిడి గుద్దులు గుద్దాడు.
మిగతా ఇద్దరూ చెరోదిక్కు పారిపోయారు.
ఈ గొడవకు చుట్టూ జనం పోగయ్యారు. ఏం జరిగిందని అడుగక ముందే దెబ్బలు తిన్నవాడు వాళ్ళ పక్షం చేరి లబోదిబో మంటూ ,
అయ్యా ! నేను ఈళ్ళను ఏమీ అన్లేదయ్యా ! నా మానాన నేను
అదిగో! అక్కడున్న జాజి పూలు ఇంకా వాడలేదన్నానయ్య. ఈడికి ఏం అర్థమయిందో తెలియదు కానీ, నన్నిలా వాయగోట్టాడయ్యా! అన్నాడు దూరంగా ఓ ఇంటి ముందు కనిపిస్తున్న జాజి తీగను చూపిస్తూ.
అరె ! సైదులు ! ఏం పనిది? అన్నాడో పెద్దమనిషి.
సైదులు నోరు తెరిచి చెప్పబోతుంటే, జాజులమ్మ, కల్పించుకొని ..
అయ్యా ! ఏదో పొరపాటున తాగిన మైకంల నన్నే అన్నాడనుకొని కొట్టాడండి. ఆయన తరుపున నేను చమాపన చెప్తున్నాను. వదిలెయ్యండయ్యా. అన్నది చేతులు జోడిస్తూ.
దెబ్బలు తిన్నవాడు గర్వంగా మీసం మెలేస్తూ, జాజులమ్మను వెకిలిగా చూస్తూ నవ్వాడు.
పదండిరా! ఆడబిడ్డ చమాపన చెప్పింది కదా ! వదిలేయ్రా ! అంటూ చెప్పి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు.
సైదులుకూడా జాజులమ్మను విడిచి పెట్టి సరాసరి మందు కొట్టు లోకి జొరబడ్డాడు.
జాజులమ్మ ఈ పరిస్థితికి దిక్కుతోచక చక్కగ ఇల్లు చేరింది.
ఎసట్లోకి బియ్యం కడుగుతున్న ఈర్లచ్చిమి జాజులు ఒక్కతే , హడావుడిగా తిరిగి రావడం చూసి పని ఆపి ఎదురు రానే వచ్చింది .
జాజీ ! ఎంది ? బిడ్డా! మాల్యమే అచ్చినవ్? వాడేడి? పీరీల కాడికి పోలేదా? అడిగింది ఆత్రంగా.
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.