మూసుకున్న తలుపు

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ)

– డా. నల్లపనేని విజయలక్ష్మి

          కాషాయ వస్త్రాలను ధరించి సన్యసించడానికి వెళుతున్న ప్రౌఢ వయస్కునిలా సూర్యుడు. వెళుతూ వెళుతూ అతడు పంచిన నారింజ రంగు కాంతులతో మిడిసిపడుతూ రాబోతున్న చీకటిని గుర్తెరగని ఆకాశం. ఏమిటిలా అనిపిస్తుంది? రాబోయేది చీకటేనా? వెన్నెలకాంతను తోడు చేసుకొని చల్లని ఇంద్రజాలమై మురిపించడానికి జాబిలి వేంచేయడా? అబ్బ! ఎంత ఆశ? ఈ రోజు అమావాస్యేమో! ఎందుకైనా మంచిది. ఒకసారి క్యాలండర్‌ తీసి చూడు.

          ఆశ నిరాశల్ని ఒకేసారి గుప్పించి అయోమయంలో పడేసే ఈ మనసుంది చూశావూ! అది ఆడే ఆటలకీ, పెట్టే టార్చర్‌కీ ఎదుటపడితే కాల్చి పారేయాలనిపిస్తుంది.

          అప్పటి వరకూ బాల్కనీలో నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తూ, తనలో కమ్ముకున్న అలోచనలకు బలవంతంగా ఫుల్‌స్టాప్‌ పెట్టి లోపలికి నడిచింది నవ్య.

          చిక్కని పాలతో స్ట్రాంగ్‌గా కాఫీ కలుపుకొని సోఫాలో కూర్చొని టి.వి ఆన్‌ చేసింది. తెర మీద కదిలే బొమ్మలేవీ మనసులోకి ప్రవేశించడం లేదు. కళ్ళు మాత్రమే అటువైపు చూస్తున్నాయి. మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. పడమటి దిక్కున పరచుకొనే సంజ కాంతులను చూడడం తనకెంతో ఇష్టం. ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు రాలేదు. నిరాశతో కూడిన ఆలోచనలు తనలో దోబూచులాడడానికి శ్రీకాంత్‌ ప్రవర్తన కూడా ఒక కారణమేమో!

          ఆ రోజులు ఎంత బాగుండేవి? చదువు, ఉద్యోగం తప్ప మరో లోకం తెలియని తన లోకంలోకి శ్రీకాంత్‌ మలయమారుతంలా ప్రవేశించాడు. ఎక్సైజ్‌  డిపార్ట్మెంట్‌లో డిప్యూటీ కమీషనర్‌గా పనిచేస్తున్న అతడు తమ పక్క ఇంటిలో అద్దెకి ఉండేవాడు. అతడు మృదువైన మాటలతో, చక్కని పాటలతో తన మనసుని కొల్లగొట్టిన ఆ క్షణాలు మరిచి పోలేనివి. ‘కోరా కాగజ్‌ థా యే  దిల్‌ మేరా! లిఖ్‌ లియా నామ్‌ ఇస్‌ పే తేరా’ అంటూ అతడు ప్రపోజ్‌ చేసిన విధం మనసును మైమరపించింది. రోజుకొక పాటతో పలకరించేవాడు. ‘చౌధ్‌వీ కా చాంద్‌ హో!’ అని ఒక రోజు, ‘ఓ మేరీ దిల్‌ కీ చైన్‌’ అని మరో రోజు` ఇలా. నీ ప్రక్కన నాలుగు అడుగులు వేయగలిగే రోజు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ పెళ్ళి చేసుకొందామని అతడు ప్రతిపాదించిన రోజు అభ్యంతరపడాల్సిన విషయాలేమీ కనపడలేదు.

          అతడికి తల్లిదండ్రులు లేరు. అమ్మానాన్నలను ఒప్పించడం పెద్ద కష్టం కాలేదు. శ్రీకాంత్‌ మంచి ఉద్యోగంలో ఉండడం, కులమతాల పట్టింపులు కూడా లేకపోవడంతో అమ్మా నాన్నలు వెంటనే పెళ్ళికి అంగీకరించారు.

          పెళ్ళైన తరువాత పది సంవత్సరాలు పది రోజుల్లా గడిచిపోయాయి. శ్రీకాంత్‌ ప్రతిరోజూ పాటల పందిరి అల్లి దానికింద కూర్చోబెట్టి మాటలతో మురిపించేవాడు. ఇంట్లో ఉన్నంతసేపూ ‘నా హృదయంలో నిదురించే చెలీ’ అని హమ్‌ చేస్తూ ఏ పని చేస్తున్నా వెంట వెంట తిరిగేవాడు. ఎప్పుడైనా పుట్టింటికి వెళితే ‘మేరీ సప్నోంకీ రాణీ కబ్‌ ఆయేగీ తూ!’ అంటూ ఒకటే మెసేజ్‌లు. అతడు ఆఫీస్‌ పనిమీద వేరే ఊరు వెళితే ‘నీవు లేని వేళ బుద్ధి పనిచేయకున్నది’ అంటూ ‘నీవు లేక వీణ’ పాటకు పేరడీ కట్టి మెసేజ్‌లు పెట్టేవాడు.

          ఎప్పుడైనా పనిమనిషి రాకపోతే గిన్నెలు కడగడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేయవలసి వచ్చేది. ఆ పనులు చేస్తూ కనిపిస్తే చాలు శ్రీకాంత్‌కి కోపం వచ్చేది. ‘నీ చేతులు అరిగిపోతాయి. గోళ్ళు పాడైపోతాయి. ఇలాంటి పనులు చేయవద్దు’ అనేవాడు. చివరికి తనే పూనుకొని పనిమనిషితో మాట్లాడి ఆమె రాని రోజు ఆమెకు బదులుగా వేరొకరిని పంపేలా ఏర్పాటు చేశాడు.

          నీ గురించి నువ్వు అసలు పట్టించుకోవు అని అలిగేవాడు. పదిహేను రోజుల కొకసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఫేషియల్‌, పెడిక్యూర్‌, మేనిక్యూర్‌, హెయిర్‌ స్పా చేయించు కొమ్మని పోరేవాడు. ఎండకు, వానకు తడుస్తూ ఆటోల్లో, బస్సుల్లో తిరిగితే చర్మం పాడవుతుందని, ప్రతిరోజూ అతడే కారులో స్కూలు దగ్గర దింపి, తిరిగి ఇల్లు చేర్చేవాడు. కొన్నాళ్ళు ఉద్యోగం మానేయమని గొడవ చేశాడు, కానీ తనే పడనివ్వ లేదు. పిల్లలు లేరనే దిగులు నుండి బయటపడడానికి  ఈ వ్యాపకం అవసరం అని నచ్చచెప్పి అతడిని ఒప్పించింది. ఆ దిగులు అప్పుడప్పుడూ కలత పెడుతున్నా టీచర్‌గా పని చేస్తున్న స్కూల్లోని పిల్లల్నే సొంత పిల్లలుగా భావించి తృప్తిపడింది. ఆ విషయంలో శ్రీకాంత్‌ ఎప్పుడూ ఎటు వంటి అసంతృప్తినీ ప్రదర్శించలేదు. ఎవరైనా పిల్లలు లేరా? అని అడిగి తనను బాధ పెడతారేమోనని ముందే అటువంటి ప్రశ్నలు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకొనేవాడు. అతడు చూపించే ప్రేమ ముందు ఏ బాధైనా తోక ముడిచి పారి పోవలసిందేనని గర్వం కలిగేది. అతడు తన పట్ల చూపే శ్రద్ధను, ప్రేమను చూసి తన కొలీగ్స్‌ అసూయపడడం గమనించినపుడు తన అదృష్టానికి ఎంతో సంతోషం కలిగేది.

          రెండేళ్ళ క్రితం రొమ్ములో చిన్న గడ్డ తగిలినపుడు మొదట భయం వేసింది. శ్రీకాంత్‌తో చెప్పగానే వెంటనే టెస్టులన్నీ చేయించాడు. బ్రెస్ట్‌ కాన్సర్‌ రెండో స్టేజ్‌లో ఉందని తెలిసి బెంబేలు పడిన తనను ఓదార్చి ట్రీట్‌మెంట్‌ ఇప్పించాడు. ఎడమ రొమ్ము పూర్తిగా తీసేశారు. కీమో థెరపీ తీసుకొనే సమయంలో తనకు సాయంగా అమ్మ ఉండి పోయింది. అలా అలా ఏడాది గడిచి పోయింది. జీవన్మరణాల మధ్య ఊగిసలాడి చివరికి ఇవతలి ఒడ్డు చేరింది.

          అయితే శరీరంలో మార్పు కన్న శ్రీకాంత్‌లో సన్నగా కలుగుతున్న మార్పు ఎక్కువ బాధించసాగింది. ఒకప్పటి పాటల పందిరి లేదు. మాటల మురిపాలు లేవు. బహుశా తన అనారోగ్యం వల్ల కలిగిన బాధ అతడిని మూగబోయేలా చేసి ఉంటుంది. అమ్మ ఇంట్లో ఉండడం కూడా ఒక కారణం కావచ్చు అని సరిపెట్టుకుంది.

          ఒకవైపు జుట్టు పూర్తిగా ఊడిపోవడం, మరొకవైపు ఒక రొమ్మును పూర్తిగా తీసివేయడం వల్ల స్త్రీ సహజమైన సౌందర్యాన్ని కోల్పోయాననే బాధలో ఉండి తను శ్రీకాంత్‌ సామీప్యాన్ని కోరుకుంది. సరిగ్గా అప్పుడే అతడికి ప్రమోషన్‌ రావడం, చెన్నైకి బదిలీ కావడంతో ప్రమోషన్‌ వదులు కోవడం ఇష్టంలేక చెన్నై వెళ్లాడు. అతడికి తనను వదిలి వెళ్ళడం ఎంత కష్టమో తెలుసు కాబట్టి, తను ధైర్యంగా కనబడకపోతే ఆతడు బాధ పడతాడనే ఆలోచనతో ఒంటరిగానే శారీరక, మానసిక బాధలను భరించింది.

          శారీరకంగా బలహీనంగా మారిపోయిన తనను అమ్మ కంటికి రెప్పలా కాపాడు కున్నది. శ్రీకాంత్‌కి పని ఎక్కువవడంతో మూడు నాలుగు నెలలకు ఒకసారి వచ్చి వారం రోజులు ఉండి వెళ్ళేవాడు. అప్పుడు కూడా చెన్నైలో తనతో పాటు పనిచేసే ఉద్యోగులతో ఫోన్‌లో మాట్లాడుతూనో, మెసేజ్‌ల రూపంలో పనికి సంబంధించిన సూచనలు అందిస్తూనో బిజీగా ఉండేవాడు. తనకు ప్రాణం కొట్టుకులాడేది. అతడి సామీప్యం తనకెంతటి ధైర్యాన్నిస్తుందో చెప్పి తన కోసం సమయం కేటాయించమని అడగాలని పించేది. కానీ పని ఒత్తిడిలో ఉన్న అతడిని ఇబ్బంది పెట్టకూడదని తనకు తనే సర్ది చెప్పుకుంది.

          రెండు నెలల క్రితం శ్రీకాంత్‌ బదిలీ మీద వైజాగ్‌ వచ్చేస్తున్నాడని తెలియగానే ఎంతో సంతోషం కలిగింది. మళ్ళీ పూర్వంలా ఆనందంగా ఉండవచ్చునని కలలు కన్నది. కానీ శ్రీకాంత్‌ వైఖరిలో ఏదో తెలీని మార్పు. కారణం ఏమిటో ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదు.

          కరెంట్‌ పోవడంతో టి.వి ఆగిపోయింది. నవ్య ఆలోచనల్లోంచి బయటపడింది.

          ఐదు నిమిషాల్లో కరెంట్‌ రావడంతో సాయంత్రం వంట పని ప్రారంభించింది. శ్రీకాంత్‌కి కోడిగుడ్డు పొరటు కూర ఇష్టం. అతను వచ్చే సమయానికి వేడివేడిగా చపాతీలు చేయాలి అనుకుంటూ అన్నీ సిద్ధం చేసింది. ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చిన శ్రీకాంత్‌ తన భోజనం అయిపోయిందని చెప్పాడు. బాగా అలసిపోయానంటూ వెళ్ళి పడుకున్నాడు. దానితో నవ్యకూ ఆకలి చచ్చి పోయింది. ఒక కప్పు పాలు తాగి నిద్ర పోవాలని ప్రయత్నించింది. ఎంతకూ నిద్ర రాలేదు.

          శ్రీకాంత్‌ మనసులో ఏముందో తెలుసుకోవాలనే ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వ లేదు. అంతలో శ్రీకాంత్‌ ఫోన్‌లో ఏదో మెసేజ్‌ వచ్చినట్టుగా బీప్‌ శబ్దం వినిపించింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ‘ఒకసారి చూస్తే’ అనిపించింది. శ్రీకాంత్‌ గాఢ నిద్రలో ఉన్నాడు. ఫోన్‌ ఆన్‌ చేసి చూసింది. శ్రీకాంత్‌ స్నేహితుడు సుధాకర్‌ పెట్టిన మెసేజ్‌ అది. ‘ఎన్ని చెప్పినా నువ్వు చేస్తున్న పని నాకు నచ్చడం లేదు. మరోసారి ఆలోచించు. గుడ్‌ నైట్‌.’ అని ఉంది.

          సుధాకర్‌ దేని గురించి చెపుతున్నాడు? వెంటనే మెసేజెస్‌లోకి వెళ్ళి అంతకు ముందు వారిద్దరి మధ్యా జరిగిన సంభాషణ అంతా చదివింది.

          సుధాకర్‌` నువ్వు చెన్నైలో పనిచేసేటపుడు మీ ఆఫీసులో పనిచేసే సౌమ్యతో చాలా సన్నిహితంగా ఉన్నావని, ఆమెకు వైజాగ్‌ బదిలీ చేయించడానికి ప్రయత్నిస్తున్నావని మన స్నేహితులు అంటున్నారు. ఏమిటిదంతా?

          శ్రీకాంత్‌` ఒరేయ్‌! నా గురించి చిన్నప్పటి నుండి నీకు తెలుసు. నేను సౌందర్యారాధకుణ్ణి. నవ్యను ఆమె అందం చూసే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. ఆరాధించాను. పిల్లలు పుడితే ఆమె అందం ఎక్కడ చెదిరిపోతుందోనని తనకు తెలీకుండా వేసెక్టమీ చేయించుకున్నాను. ఆమె కోసం ఎంతో చేశాను. బ్రెస్ట్‌ కాన్సర్‌ రావడం` ఆమె ఒక రకంగా భరించలేక పోయింది. నేను ఇంకో రకంగా తట్టుకోలేక పోయాను. రాలిపోయిన జుట్టుతో, కోల్పోయిన స్తనంతో మునుపటి అందం ఎక్కడ? నాకు కావలసిన సౌందర్యం సౌమ్య రూపంలో నా తలుపు తట్టింది. ఆమెను వదులుకోలేను. ప్రాణ స్నేహితుడివి కాబట్టి ఇదంతా నీతో చెపుతున్నాను.

          సుధాకర్‌`నవ్యను ఏం చేయాలనుకుంటున్నావు?

          శ్రీకాంత్‌`ఆమెకు కావలసినవన్నీ అందుబాటులో ఉంచుతున్నాను. చక్కని ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి?

          సుధాకర్‌` సౌమ్య విషయం ఆమెకు తెలిస్తే?

          శ్రీకాంత్‌`తెలియదు. తెలియకుండా మేనేజ్‌ చేస్తాను. ఒకవేళ తెలిసినా నవ్య ఏమీ అనదు. ఆమెకు నేను ఏమీ లోపం చేయడం లేదు కదా!

          అంతా చదవగానే తల మీద పిడుగు పడ్డట్టుగా కంపించి పోయింది నవ్య. తను ఇన్నాళ్ళు జీవించింది ఒక అబద్ధపు ప్రపంచంలోనా? అతడు ఇంతకాలం చూపిన ప్రేమ కేవలం తన శరీరం మీదేనా? అర్థం కాగానే అప్పటి వరకూ అతడి మీద ఉన్న ప్రేమ స్థానంలో తెలీని అసహ్యం పేరుకున్నది.

          ఇదంతా కల కాదు కదా! కేవలం ఒక ఫోన్‌ సంభాషణ ఆధారంగా ఇన్నాళ్ళుగా ఆతడు చూపిన ప్రేమను తను అనుమానించడం లేదు కదా! మళ్ళీ ఒకసారి శ్రీకాంత్‌ ఫోన్‌ను చేతిలోకి తీసుకుంది. తనకు, శ్రీకాంత్‌కు ఒకరి ఫోన్‌ ఒకరు చూసే ఆలవాటు ఎప్పుడూ లేదు. ఒకరి మీద ఒకరికి అంత నమ్మకం. కానీ ఈ రోజు ఆ నియమాన్ని ప్రక్కన పెట్టడం వల్ల తను గ్రహించిన విషయం వాస్తవమా? కాదా? అన్న విషయం నిర్ధారించు కోవాలి. ఫోన్‌లో వాట్స్‌ యాప్‌ ఓపెన్‌ చేసి చూసింది. గంట గంటకు ఒకరినొకరు పలకరించుకుంటూ సౌమ్య, శ్రీకాంత్‌ల మధ్య జరుగుతున్న సంభాషణలు, ఒకరికొకరు పంపించుకున్న ఫోటోలు, వీడియోలు చూడగానే విషయం అర్థమైంది.

          ‘లిక్విడ్‌ మోడర్నిటీ’ గురించి చదివి, ఆ సిద్ధాంతం తప్పని, లోకంలో మనుషుల మధ్య సంబంధాలన్నీ అవసరాల సంబంధాలే కావని తన స్నేహితురాళ్ళతో వాదించడం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు తన వాదన తప్పని తన జీవితమే పాఠం నేర్పింది కదా! అని బాధపడిరది.

          ‘ఇప్పుడు ఏం చేయాలి? ఉదయం శ్రీకాంత్‌ నిద్ర లేచేవరకు ఆగి అతడిని నిలదీయాలి. లేదా ఏమీ తెలియనట్టుగా ఉండి సర్దుకు పోవాలి. అప్పుడెప్పుడో సుమతి అనే పతివ్రత కుష్టు వ్యాధిగ్రస్తుడైన భర్తను అతడి సంతోషం కోసం వేశ్య దగ్గరకు తీసుకువెళ్ళిందట. అది పురాణ కాలం. ఇప్పుడు ఇంత చదువుకున్న నేను నా భర్త బలహీనతను క్షమించగలనేమోగానీ నా స్వాభిమానాన్ని తాకట్టు పెట్టలేను.   

          గోవును పాలు ఇచ్చినంత కాలం గోమాతగా పూజిస్తారు. ఒట్టిపోయిందని తెలియగానే కబేళాకు తరలిస్తారు. ఇప్పుడు నా వంతు. కానీ నేను గోవును కాను. మనిషిని. నా వల్ల ఉపయోగం లేదనిపించగానే నాకు దూరంగా జరిగిన మనిషి నాకు వద్దు. బహుశా లోకంలో నా ప్రేమ, నా సేవలు అవసరమైన చోటుకు నన్ను పంపడం కోసమే భగవంతుడు ఈ విధంగా నా కళ్ళు తెరిపించాడు. అనాథ పిల్లలకు తల్లినై వారికి నా ప్రేమను పంచుతాను’ అని నిర్ణయించుకున్నది.

          ‘శ్రీ!

          నిజానికి మిస్టర్‌ శ్రీకాంత్‌! అని సంబోధించాలనిపించింది. అంతగా నా మనసు గాయపడింది. అనుకోకుండా నీ ఫోన్‌ చూడడం వల్ల (అది మనం ఎంతో కాలంగా అనుసరిస్తూ వచ్చిన నియమానికి విరుద్ధమే అయినా) నా జీవిత వాస్తవాన్ని గ్రహించ గలిగాను.

          నువ్వు సౌందర్యారాధకుడివా? నీకు తెలుసా? నేను కూడా సౌందర్యారాధకురాలినే. తేడా ఎక్కడో చెప్పనా? నువ్వు బాహ్య సౌందర్యాన్ని ఆరాధించావు. నేను అంతః సౌందర్యాన్ని ఆరాధించాను. నా బాహ్య సౌందర్యం నశించిందని నాకు దూరం జరిగావు. నీలో అసలు అంతః సౌందర్యమే లేదని గ్రహించి దూరంగా వెళ్ళిపోతున్నాను.

          నేను కోల్పోయిన జుట్టు మళ్ళీ మొలకెత్తుతుంది. కోల్పోయిన స్తన సౌందర్యాన్ని ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా పొందడం పెద్ద కష్టం కాదు. స్త్రీ అంటే శరీరం మాత్రమే కాదని, ఆమె మనసిచ్చిన వారి కోసం ప్రాణాలు విడవడానికి కూడా సిద్ధపడే ప్రేమమూర్తి అని నువ్వు  గ్రహించనందుకు బాధగా ఉంది. నిజానికి బిడ్డల్ని కన్నా కనక పోయినా ప్రతి స్త్రీలో ఒక మాతృమూర్తి ఉంటుంది. బిడ్డల తప్పుల్ని ఎంత సహజంగా క్షమిస్తుందో అంతే సహజంగా భర్త బలహీనతల్ని క్షమించ గలుగుతుంది. నేను సౌమ్య విషయంలో నీ బలహీనతను క్షమిస్తున్నాను. అయితే నీ మోహ సంతృప్తి కోసం పసి నవ్వులు చూసి ఆనందపడే భాగ్యాన్ని నాకు దూరం చేయడాన్ని మాత్రం  క్షమించలేక పోతున్నాను.

          రేపు సౌమ్య అందం కరిగిపోతే మరో రమ్య వెంట పరిగెడతావా? వారూ నాలా అంతఃసౌందర్యారాధకులై నీ మనో వికారాన్ని చూసి అసహ్యించుకుంటే ఏమవుతావో చూడాలని ఉంది. శెలవు.

          నవ్య’

          అని లేఖ వ్రాసి అతడు నిద్ర లేవగానే కనబడేలా టేబుల్‌ మీద ఉంచింది.

          ప్రశాంతంగా సూట్‌కేసులో బట్టలు సర్దుకుని ఉషోదయం కోసం ఎదురు చూడసాగింది. ఆమె కోసం బంగారు కాంతులతో ఉదయించిన బాల భానుడు చీకటిని తరిమికొట్టి చిరునవ్వు నవ్వాడు.

*****

Please follow and like us:

One thought on “మూసుకున్న తలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ)”

  1. స్వార్థం-మోహాలకూ- ప్రేమకూ జరిగిన ఈ జీవిత పోరాటపు కథలో- లోకంలో మనుషుల మధ్య సంబంధాలన్నీ అవసరాల సంబంధాలేననే ‘లిక్విడ్‌ మోడర్నిటీ’ని హెచ్చరికగా పరిచయం చేయడం హృద్యం.
    ఇతివృత్తాన్ని పరిశీలిస్తే- శ్రీకాంత్ సౌందర్యారాధకుడు. నవ్యను ఆమె అందం చూసే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందం పోతుందని, ఆమెకు చెప్పకుండా పిల్లలు కలక్కుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. పదేళ్లు దేవతలా ఆరాధించాడు. అప్పుడామెకు బ్రెస్ట్ కాన్సర్ వచ్చింది. అందం పోయింది. శ్రీకాంత్కి ఆమెపై ప్రేమ పోయింది. అందంగా ఉన్న ఓ సౌమ్యను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతడు ప్రేమించింది కేవలం తన శరీర సౌందర్యాన్ని అని గ్రహించిన నవ్య- అంతఃసౌందర్యం బొత్తిగా లేని భర్తను భరించలేనని తనే అతణ్ణి విడిచి పెట్టి వెళ్లింది.
    ఇలాంటి ఇతివృత్తాలు అరుదేం కాదు. కానీ ఇందులో కొన్ని ప్రత్యేకతలున్నాయి.
    మొదటిది శ్రీకాంత్ పాత్రచిత్రణ. జన్మనిచ్చినవారికి కులమతాల పట్టింపులు లేవు. ‘పెళ్లి చేసుకొందామని ప్రతిపాదిస్తే, నవ్యకు అభ్యంతరపడాల్సిన విషయాలేమీ కనపడకపోవడంవరకూ’ మాత్రమే ఆ సంస్కారం పనికొచ్చింది. ‘ఎప్పుడైనా పనిమనిషి రాకపోతే గిన్నెలు కడగడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేయవలసి వస్తే- ‘నీ చేతులు అరిగిపోతాయి. గోళ్లు పాడైపోతాయి’ అని తాత్కాలికంగా వేరొక మనిషిని ఏర్పాటు చేస్తే- అది పనిమనిషిని భార్యకు సాయపడ్డానికి కాక, భార్య సౌందర్యాన్ని కాపాడే సాధనంగా భావించాడు. పనిమనిషికీ భర్త ఉన్నాడనీ- తనకిలాగే అతడూ భావించే అవకాశమున్నదనీ అతడికి స్ఫురించలేదు. ఎందుకంటే పనిమనిషినతడు మనిషిగా చూడలేదు. అలాగే తననూ మనిషిగా కాక ఓ అందమైన బొమ్మలా చూస్తున్నాడని స్ఫురించనంతగా- తన ఆరాధనతో భార్యను భ్రమలో పడేశాడు.
    రెండవది- ఈ కథను ఉత్తమ పురుషలో చెప్పిన నవ్య. రచయిత్రి ఆ పాత్రను ‘నవ్య’గా కాక ఒక స్త్రీగా చిత్రించారు. ఆమె అతణ్ణి సులభంగా నమ్మింది. అతడి ఆరాధనకు మురిసిపోయింది. ఏ స్త్ర్రీ విషయంలోనైనా జరిగేది ఇదే! భర్త గురించిన నిజం తెలిసేక ఆమె కృంగిపోకపోవడం సాధారణం కాదు. అది ఆమెలాంటి మగువలకు ప్రబోధం. ఆమె అనాథ పిల్లలకు తల్లిగా మిగతా జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలనుకోవడం- మహిళల్లోని మాతృహృదయానికి ఆవిష్కరణ. ఐతే అది ఈ కథకు శాశ్వత పరిష్కారం కాదు. అనుభవం నేర్పిన వివేకంతో- ఆమె తదుపరి జీవితం ఎలాగుంటుందో అప్పటికామెకు తెలియదు. అందుకే ఈ కథ- కాషాయ వస్త్రాలను ధరించి సన్యసించడానికి వెళుతున్న ప్రౌఢ వయస్కునిలా సూర్యుడితో మొదలై- అతడు పంచిన నారింజ రంగు కాంతులతో మిడిసిపడుతూ రాబోతున్న చీకటిని గుర్తెరగని ఆకాశాన్ని ప్రస్తావిస్తుంది. చివరకు- ఆమె కోసం బంగారు కాంతులతో ఉదయించిన బాలభానుడు చీకటిని తరిమికొట్టి చిరునవ్వు నవ్వడంతో కథ ముగుస్తుంది. ఆలోచించేవారిని ఈ వ్యాఖ్యలు ఎంత లోతుకైనా తీసుకెడతాయి.

Leave a Reply

Your email address will not be published.