రుద్రమదేవి-10 (పెద్దకథ)
-ఆదూరి హైమావతి
“చూడూ లక్ష్మీనరసూ! మాటిమాటికీ అలా ఏడ్వకు, చూడనే అసహ్యంగా ఉంది. మగాడివి ఇలా ఉండబట్టే మీ అమ్మ అరాచకాలు అలా సాగాయి. మీ నాయనా ఆమెను మందలించక, ఆమె చర్యలను అడ్డగించక పోబట్టే అలా రెచ్చిపోయి అమాయకురాలిని నిలువునా చంపేసింది. మా వల్లభ బాబాయ్ ఇంట్లో ఉండి చదువుకుంటూ పనులు చేసుకుని మగమనిషిలా బ్రతుకు. ఈఇల్లూ, ఆస్థీ అంతా మునసబుగారి సమక్షంలో ఎవరికి ఇవ్వదలచావో చెప్పు.” అంది రుద్ర.
“అక్కా! అదంతా నాకు తెలీదు. నాకు వద్దని రాసిస్తాను. నన్నుమన్నిస్తే నగలూ, మా ఇనప్పెట్టెలో ఉన్న నగదూ ముత్యాలు తల్లిదండ్రులు తీసుకునేలా మీరే వప్పిం చండి. ఇది మేము చేసిన అన్యాయానికి సరిపోకున్నా కనీసం మా అమ్మకు దక్క కూడదని కోరుకుంటున్నాను. ఇహ పొలమూ, ఈ ఇల్లూ మీ ఇష్టం. మా నాన్న గారు ఇహరారు. వెళ్ళేప్పుడే కాశీ వెళ్ళి సన్యాసుల్లో కలసి పోతానని చెప్పారు. తిరిగి ఈ ఊరు రాకుండా ఆస్థికి సంబంధించిన వ్యవహారం ఏదైనా పెద్దలు మీరంతా ఉన్నారు. మీరే ఏదో ఒకటి చేయండి.” అన్నాడు లక్ష్మీనరసు.
“తాతగారూ, నాయనగారూ, వల్లభ బాబాయ్! మీరు లాయర్లతో మాట్లాడి మునసబుగారి సమక్షంలో రాతకోతలు చూడండి. లక్ష్మీనరసు అన్నట్లు తిరిగి ఇంత దూరం రావటం వృధా.” అంది రుద్ర.
అంతా కలసి చర్చించి బడిలేని ఆ ఊరికి ప్రభుత్వంతో మాట్లాడి ఒక మంచి హైస్కూల్, అనాధలకు ఆశ్రయం కల్పించనూ ఆ ఇల్లు, పొలం అమ్మేసి ఆ ధనాన్ని శరణాలయం నడపను విరాళంగా ఇవ్వను రాతకోతలు అయ్యాయి. లక్ష్మీనరసు సంతకాలు పెట్టాడు పెద్దలందరి ముందు. అందరి ముందూ భోషాణంలో ఉన్న నగలూ, నగదూ లెక్కించి ఒక పెట్టెలో భద్రంగా ఉంచి ముత్యాలు తలిదండ్రులకు బలవంతంగా ఇచ్చారు. అంతా అయ్యేసరికి మధ్యాహ్నమైంది. ముందుగానే ఇంత సమయమవుతుందని ఊహించిన మునసబు అందరికీ భోజన సౌకర్యం చేశాడు. లక్ష్మీ నరసు ఒక చిన్న సంచిలో తన బట్టలు తీసుకుని వారితో కలసి ప్రయాణ మయ్యాడు . అంతా మునసబుకు కృతఙ్ఞతలు మరో మారు చెప్పి, ఉదయం రైలు తప్పి పోడంతో మధ్యాహ్నం రైలుకు బయల్దేరారు.
ముత్యాలు తల్లిదండ్రులను వారింట దింపి అంతా చీరాల చేరారు. అలా ముత్యా లు అధ్యాయం ముగిసి, లక్ష్మీనరసు రుద్ర కుటుంబం అండతో చీరాలచేరి , వల్లభ బాబాయ్ చేనేత సంఘంలో ఒక కార్మికునిగా చేరి, పనిచేస్తూ చదువు సాగించాడు. డిగ్రీ అయ్యాక చేనేత సహకార సంఘంలో ఇన్స్ పెక్టర్ ఉద్యోగం వచ్చింది.
ఆ రోజున పండ్లు, చీరాల స్పెషల్ తీపులు ‘ బొంగు మిఠాయి ‘ తీసుకుని రుద్ర ఇంటికి వచ్చి , – రుద్ర తండ్రి భానుచంద్రకూ, రుద్ర తాత హనుమంతప్పకూ నమస్కరించడు.
“తాతగారూ! మీ దయవల్ల ఆ రాక్షసుల బారి నుండీ బయటపడి ఈరోజున ప్రయోజకుడి నయ్యాను. ఇదంతా మీ ఆశీర్వాదం, మీ సహాయం వల్లే. మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను ” అన్నాడు.
ఆ సరికి రుద్ర తన మాస్టర్స్ డిగ్రీ కోసం వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం ఎస్సీ కెమిస్ట్రీలో జాయినై , పూర్తి చేసి అక్కడే ఉద్యోగం సంపాదించుకుని , అదో అప్పుడే వేసవి శలవులకు వచ్చి ఉంది.
ఆమె లక్ష్మీ నరసును అభినందించి ” నరసూ! ఇప్పుడు నీవు మగాడిననిపించు కున్నావయ్యా! ఇహ ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకో ” అంటుండ గానే , ” రుద్రా! వచ్చావా నిన్నుచూసి ఎంతకాలమైందే!” అంటూ వచ్చింది సుబ్బులు.
ఆమెను చూడగానే రుద్ర కళ్ళు మెరిశాయి.
పక్కకు పిలిచి” ఏమే సుబ్బూ! ఇప్పుడు నరసు బాగా చదువుకుని, ఉద్యోగం కూడా చేస్తున్నాడు కదా! మీ వదిన ఎటూ నీకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేయనే చేయలేదు. నరసు చూడనూ బాగుంటాడు, చదువు, మంచి ఉద్యోగమూ ఉన్నాయి. నీకు అభ్యంతరం లేకపోతే నీవే ఎందుకు చేసుకోకూడదూ! ఇక్కడే ఉండవచ్చు కదా!ఎటూ అత్త ఆడ పడుచులపోరూ లేదు, అంతా నీ ఇష్టమే అవుతుంది, హాయిగా సంఘసేవా చేసుకోవచ్చు, ఏమంటావ్!” ” అని అడిగింది.
కాస్త సేపు ఆలోచించి సుబ్బులు ” రుద్రా ! నీవే తొలి నుంచీ నాకేది మంచో చేస్తూనే ఉన్నావు,. నీకు ఏది మంచిదనిపిస్తే అదేచెయ్ నాకేం అభ్యంతరం లేదు ” అంది కొంచెం సిగ్గుపడుతూనే.
“ఇహనే ! నాయీ సెలవులు సద్వినియోగమైనట్లే .” అని, హల్లో కొచ్చింది. ముందుగా, తాతగారితోనూ, నాయనగారితోనూ అమ్మతోనూ మాట్లాడి , అంతా సరే అనుకున్నాక , తాతగారినే చెప్పమని కోరింది. తాతగారు చావిట్లో కొచ్చి ” ఏమోయ్ నరసూ! ఇహనీకు పెళ్ళే మిగిలింది ..ఏమంటావ్ ! ” అన్నారు.
“నాకు పెళ్ళేంటి తాతగారూ! అన్నీ ఐపోయాయి కదా!. ముత్యాలుకు చేసిన ద్రోహా నికి ఇహ ఈ జన్మకు పెళ్ళీలేదు , ఏమీలేదు. ” అన్నాడు తల వంచుకుని. అతడు పెళ్ళైన బ్రహ్మచారి. ముత్యాలును ముట్టిందే లేదు, తల్లి అనుమతిలేక.
“అదేంటోయ్ ! అప్పుడు నీవు అమ్మకూచివి, ఏమీ చేయలేని మాట్లాడలేని అసహా యుడివి. ఇప్పుడు పరిపూర్ణ పురుషుడివి. చదువు సంపాదన, స్వతంత్రమూ ఉన్న వాడివి. నీకు వివాహం చేసుకోను అభ్యంతర మేముంది? ” అన్నారు రుద్ర తండ్రి భానుచంద్ర.
“బాబయ్యగారూ! నా కెవరు పిల్లనిస్తారు? మొదటి భార్యను అమానుషంగా చంపేసిన వాడిని, నా గతం దాచి ఎవ్వరినీ మోసం చేయలేను. ” అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు తలవంచుకుని.
“జరిగిందానికి నీ తప్పు కొంత ఉన్నాఅసలు దోషులు పాపానికి తగిన శిక్ష అనుభవిస్తూనే ఉన్నారుగా ! మీ బావగారింటికి వెళ్ళి అక్కడ మీ అక్క తన అత్తగారికీ, మామకూ చాకిరీ చేస్తూ పని మనిషిలా పడి ఉండగా, మీ అమ్మ భయం భయంగా బయటికి రాకుండా వంట పనీ, ఇంటి పనీ చేసుకుంటూ చీకటి బ్రతుకు బ్రతుకు తున్నది అక్కడే. నేను అప్పుడప్పుడూ మీ బావకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. వారినలాగే చీకటి బ్రతుకులోనే ఉంచమని. అదే వారికి తగిన శిక్ష. నీవు బాధపడాల్సింది లేదు. హాయిగా వివాహం చేసుకో. నీకిష్టమైతే మా సుబ్బుల్నిచ్చి పెళ్ళిచేస్తాం.” అంది రుద్ర.
“తలెత్తి చూడు పెళ్ళికూతుర్ని.” అంటూ సుబ్బుల్ని గదిలోంచి బయటికి తెచ్చింది రుద్రతల్లి .
ఇద్దరి చూపులూ కలిసి కాస్తంత సేపునిల్చి , ఏవేవో మాట్లాడుకుని మౌనంగా క్రిందికి వాలాయి.
“ఏం పెళ్ళికూతురా! పెళ్ళికొడుకు నచ్చాడా! ఏమయ్యా పెళ్ళికొడకా! మా అమ్మాయి సుబ్బు సుందరి నచ్చిందా ! చెప్పండర్రా!” అని నిలదీసింది రుద్రతల్లి.
ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
“ఆహా! ఇహ ముహూర్తమే కొరవ తాతగారూ! ఆపనులేవో చూడాలి, నా శలవుల్లోగా పెళ్ళి పూర్తై కాపురం పెట్టించాలి, సుబ్బుసుందరి, లక్ష్మీ నరసుల పెళ్ళిసంబరంతో నాశలవులు ముగుస్తాయి. హాయిగా వీళ్ళకు ఆ వాడ పనులు అప్పగించి నేను వెళ్ళి పోతాను. “
“ఎప్పుడూ ఇతరుల గురించేగానీ నీపెళ్ళి సంబరం మాకూ వద్దా రుద్రా! ” అరిందాలా అడిగింది సుబ్బుసుందరి.
“అలా అడుగమ్మా! ఎప్పుడు చూసినా సమాజసేవ, వాడపనులు ..అంటూనే ఉంటుంది మీ చెలి.” అంది రుద్రతల్లి పెరిందేవి.
“అయ్యా! భానుచంద్ర-హనుమంతప్ప గార్ల ఇల్లు ఇదేనా!” అంటూ బయటి నుండీ ఎవరిదో పిలుపు వినిపించి, బయటికి తొంగి చూశారు వాళ్ళు.
ముందుగా భానుచంద్ర లేచి వరండాలో కెళ్ళి, అక్కడ నిల్చుని ఉన్నవ్యక్తిని చూసి “అయ్యా! మీరెవరు ? ఎందుకోసం వచ్చారో లోనికి రండి, మీరు సరైన ఇంటికే వచ్చా రు .” అని ఆహ్వానించాడు.
ఆయన లోనికి వచ్చికూర్చున్నాక, రుద్ర వెళ్ళి గ్లాసు నిండా మంచి తీర్ధం, మరోగ్లాసు నిండా నిమ్మమజ్జిగా తెచ్చి ఇచ్చింది. అది త్రాగాక ఆయన ” అయ్యా! మీ పనికి భంగం కలిగిస్తే మన్నించండి. మాది రాజమండ్రి. నేను లాయరు సూర్యనారాయణ గారి క్లైంట్ ను. మా లాయరు సూర్యనారాయగారి కుమారుడు పెళ్ళికి ఉన్నాడు, మీది సాంప్రదాయమైన కుటుంబమనీ, సమాజ సేవకులనీ, మీది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమనీ, మీ అమ్మాయి వివాహానికి ఉందనీ, ఆంధ్రా యూనివర్శిటీలో ఉద్యోగం చేస్తున్నదన్నినీ విన్నారు. మీ అమ్మాయి ధైర్యం గురించీ మంచితనం గురించీ విని సంతోషించారు మా లాయరు సూర్యనారాయగారు . మంచి పేరు, పలుకుబడి సంపాదనా ఉన్నవారు. ఆయన కుమారుడు భరతుడు సైంటిస్ట్. మీకు సమ్మతమైతే మీ అమ్మాయిని వారింటి కోడల్ని చేసుకోవాలనే కోరికతో నన్ను పంపారు. వారిదీ సాంప్రదాయ కుటుంబం. మీకు సమ్మతమైతే మాటలు సాగించవచ్చు. మరోమాట వారికేమీ కట్న కానుకలు అవసరం లేదు. మీ కుటుంబంతో బంధుత్వం కలుపుకోటమే వారికి కట్నం అని కూడా తెలియపరచ మన్నారు.” అని చెప్పేసి వారి అభిప్రాయం కోసం ఎదురు చూడసాగాడు.
అంతా విన్న భానుచంద్ర, హనుమంతప్ప, పెరిందేవి ఎంతో ఆశ్చర్యపడ్డారు, ఇంతకు ముందే తాము రుద్ర వివాహం గురించీ తొలిసారిగా అనుకోగానే ఇలా ఈయన రావడం దైవానుగ్రహమే అనుకున్నారు. కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుడతాడనే మాట నిజమేననిపించింది వారికి.
అంతా ముఖముఖాలు చూసుకుని రుద్ర వైపు చూశారు. ఆమె చూపులతో వారేం అర్ధం చేసుకున్నారో గానీ, తాత హనుమంతప్ప,” అయ్యా! మంచి మాటే మోసు కొచ్చారు. ఇదో ఇప్పుడే మేము వివాహం విషయం తొలిసారిగా అనుకుంటుండగానే మీరు వచ్చారు. మేమే వచ్చి మీ లాయరు గారితో మాట్లాడటం భావ్యంగా ఉంటుంది. ఇదో ఈమే నా మనవరాలు రుద్రమదేవి, స్వాతంత్య్ర సమరయోధురాలి పేరు పెట్టుకున్నాం, ఇతడు మా కుమారుడు భానుచంద్ర , ఈమె మా కోడలు రుద్రతల్లి పెరిందేవి . ఈమె చిన్నతనం నుంచీ మాతో పాటుగా స్వతాంత్ర పోరాట సమావేశాలకు రావటం వల్ల ధైర్య సాహసాలు పుణికి పుచ్చుకుంది. ఊహ వచ్చినప్పట్లుంచీ ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది కాదు. సమాజ సేవలోనూ మమ్మల్ని మించి పోయిందనే చెప్పాలి. రుద్ర పేరు చెప్తే చాలు ఎలాంటి వారైనా భయపడవలసిందే! ..” అని చెప్పుకు పోతున్న తాతగారిని ఆపుతూ, ” తాతగారూ! మన విషయాలు అంతగా చెప్పుకోడ మెందుకూ” అంది రుద్ర.
“అయ్యా! మీ రుద్రమదేవి సేవ గురించీ, మీ విశాల హృదయం గురించీ కూడా మా లాయరు గారు విన్నారు. అన్నీ తెలిసే మీ వద్దకు నన్నుపంపారు. మీరు చెప్ప వలసినదేమీ లేదు. వారికీనీ తెలియ వలసినది మరేమీ లేదనేది వారి భావన.” అన్నాడాయన.
రుద్రలేచిలోనికెళుతూ తాతగారికీ, తండ్రికీనీ కళ్ళతోనే లోనికి రమ్మని సైగ చేసింది. వారు ” అయ్యా! మీరు అనుమతిస్తే ఒక్క నిముషం పాటు లోనికెళ్ళి వస్తాము. అంతదాకా ఇదిగో ఈ లక్ష్మీనరసు మాకు ఎరిగున్న వాడే ఇతగాడితో మాట్లాడుతుండండి. ” అని లోని కెళ్ళారు.
*****
(ఇంకా ఉంది)
నేను 40 సం. [యం.ఏ. బియెడ్] ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యా యినిగా పనిచేసి 2004 లో వృత్తి విరమణపొందినాను.
ఆరోజుల్లో ఆకాశవాణి విజయ వాడ కేంద్రం నుండి వ్యాసాలు, నాటకాలు, టాక్స్ ప్రసారమయ్యాయి. ఎక్కువగా బాలవిహార్లో వచ్చాయి.
4 మార్లు జిల్లా స్థాయిలోనూ , 1992లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా య అవార్డు , 1994 లో జాతీయస్థాయిలో ఉత్తమ జాతీయ స్థాయి ప్రధానోపాధ్యాయినిఅవార్డు, 2003లో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీచే జాతీయ స్థాయి అవార్డు [ ఇన్నో వేటివ్ టెక్నిక్స్ ఇన్ క్లాస్ రూం టీచింగ్ అనే రిసెర్ఛ్ అంశానికి] గోల్డ్ మెడల్ భగవంతుని కృపతో అందాయి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవతా విలువలను . భారతీయ సంస్కృతినీ లేతవయస్సులో పిల్లల మమనస్సుల్లో నింపాలనే ప్రయత్నంతో, 1969లో స్థాపించిన బాలవికాస్ అనే ఉచిత మానవతా విలువల బోధనా తరగతులు నిర్వహిస్తూ ,ఒక సేవకురాలిగా 1978 నుండీ వుంటూ, స్టేట్ రిసోర్స్ పర్సెన్గా 1985నుండి రాష్ట్రస్థాయి పర్యటనలు సంస్థ తరఫున సాగిస్తూ ఈ రోజువరకూ జీవిస్తున్నాను. ప్రస్తుతం పుట్టపర్తి ఆశ్రమ ఐఛ్ఛిక సేవలో జీవనం కొనసాగుతున్నది.