అంతం కాదిది ఆరంభం
(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన కథ)
– డా.గురజాడ శోభా పేరిందేవి
“అటు చూడరా ఎర్రగా బుర్రగా వున్న పిల్ల పోతోంది.’’
“అవుననుకో కానీ ‘’
“కానీ ఎన్డిబెయ్’’
“ఏంలేదు. కాలు చెయ్యి పనిచెయ్యనిదాన్లా ఉందికదా ‘’
“కాలు సరిగ్గా లేదు కానీ కండపుష్టి బానే ఉందిరా ‘’
“వుండకేమవుతుంది టీనేజ్ వయసు కదా ‘
తనవెనక మాటలు వినబడడం దేనాని భయానికి గురిచేసింది. ’ ఎవ్వరు తన గురించి మాట్లాడినా ముందు తన లోపాన్ని గురించి మాట్లాడతారు. పుట్టినప్పటి నుండి అది జరుగుతూనే ఉంది. తన లోపాన్ని గురించి అందరూ మాట్లాడడం దేనాకి చాలా చికాకుగా ఉంటుంది. అందుకే కాలేజీ ఇల్లు తప్ప తనకి అంటూ వేరే ప్రపంచం లేకుండా చూసుకుంటూ వచ్చింది. ఎవరి ముందుకు వచ్చినా జాలి సానుభూతి వ్యంగ్యం వెక్కిరింతా ఇలాంటివేవో తప్పవు కనక అందరికీ అన్నివేళలా దూరంగా ఉంటూ వస్తోంది.
“ఏయ్ పిల్లా’’
ఉలిక్కిపడింది దేనా. ఆలోచనల్లోంచి బయటకి వచ్చింది.
“నిన్నే’’
“……..’’
“పిలుస్తుంటే పలకవేంటి?’’
“……. ‘’
“కాళ్ళు పనిచెయ్యనట్టే చెవులు కూడా పనిచెయ్యవేమోరా”
దేనా మనసు భగ్గుమంది. ‘వున్న లోపంతోనే ఏడ్చి చస్తుంటే మరో లోపాన్ని కూడా అంటకట్టేస్తున్నారేంటి?’
రోషంగా తలవెనక్కి తిప్పి చూసింది.
“అబ్బో చెవులు వినిపిస్తున్నట్టే వుందే’’
“చెవులు సరే కానీ పిల్ల ముఖం చూడు ఎంత ముద్దుగుందో.’’
” అవునవును. ‘’
“ఒక పట్టు పడదామా?’’
బాగా చీకటి పడింది. ఒంటరిగా గా కాళ్ళీడ్చుకుంటూ చేతి కర్రలతో నడుస్తున్న తన వెంట ఈ ఇద్దరూ ఇలా పడ్డారేంటో?’అనుకుంది భయపడుతూ
“నీకు పెళ్లి ఎలాగూ మీ అమ్మా నాన్నా చెయ్యరు. కనక నీ కోరికలు తీరే ప్రసక్తి లేదు. మాతో అప్పుడప్పుడు గడిపితే నీకు మాకు కూడా లాభమే. కంగారు పడకు. నీకు కడుపు రాకుండా మేము జాగ్రత్త తీసుకుంటాంలే.’’
గుండె వేగంగా కొట్టుకోసాగింది.
“మా మీద నువ్వెలాగూ కేసు పెట్టవు మేము ఇద్దరమే కనక నీకు మరీ ఇబ్బంది కూడా కాదు’’.మత్తుగా దేనాకి మాత్రమే వినబడేంత నెమ్మదిగా మాట్లాడుతూ ఆమె వెంట రాసాగారు ఇద్దరు మధ్యవయస్కులు.
రోజూలా కాక ప్రైవేట్ క్లాస్ ఉండడంతో చీకటి పడిపోయింది. దానికి తోడు చంకల కింద కర్రలు పెట్టుకుని నెమ్మదిగా నడవడం ఒకటి. . కాలేజీకి ఇంటికీ మధ్య అర కిలోమీటరు దూరం ఉంది. ఆ దారిన నడిచి రావడం దేనాకి చాలా కష్టంగా వుంది. రోజూ వెకిలి మాటలు వింటూనే ఉంది కానీ ఇవాళ చీకటి పడిపోయి చలికాలం కావడంతో జనాలు కూడా ఎక్కువగా లేరు.
“ఏం చెయ్యాలి తనని తానూ ఎలా కాపాడుకోవాలి’’
తన కర్రతీసి కొడదామా అంటే వచ్చినది ఒక్కడు కాదు ఇద్దరు. వాళ్ళని తాను ఎదుర్కోలేదు.
మరేం చెయ్యాలి?’
సినిమాలలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే అమ్మాయిలూ పరుగందుకుంటారు. కానీ తాను త్వరత్వరగా సైతం నడవలేదు. చంక కింద వున్న కర్ర తీసేస్తే కనీసం సరిగ్గా నిలబడ లేదు సరికదా దభేలున కింద పడిపోయి వాళ్లకి దొరికి పోతుంది.
మరేం చెయ్యాలి ఎలా తనని తాను కాపాడుకోవాలి?
వొళ్ళంతా చెమటలు పట్టడం మొదలయ్యింది. హనుమాన్ చాలీసా మనసులో చదువుకుంటూ అటుగా తనకంటే ముందుగా వెళ్తున్న పెద్దామెని పిల్చింది ‘ ఓ
అమ్మా ‘అని.
వెనక నడుస్తున్నవారి కాళ్ళ వేగం తగ్గింది.
కానీ పెద్దామె పలకలేదు.కనీసం ఆగలేదు
“ఇదిగో మీ 500 నోటు కింద పడింది. అయినా చూసు కోకుండా పోతున్నారేంటి?ఇందాకటి నుండి ఇది మీకు ఇవ్వాలని మీ వెనకే వస్తున్నా’’ అంది గొంతు బాగా పెంచి దేనా.
డబ్బు మాట వినగానే ముందు నడుస్తున్న పెద్దామె కాళ్ళు ఆగాయి. కటిక పేదరికంలో వున్న ఆస్త్రీమూర్తి ఐదు వందల నోటుని చూసి ఉండదు. కానీ అది నీదే అంటూ ఒక ఆడపిల్ల పిలవడంతో ఆనందంగా, అద్భుతంగా అనిపించింది. .
నోటు పైకెత్తి ఊపింది దేనా. క్షణం కాకుండా పరుగున వెనక్కి వచ్చింది పెద్దామె.
“మీ నోటు మీకు ఇఛ్చి ఆటో ఎక్కిస్తా పదండి’’ అంది దేనా.
పెద్దది పేదది ఐనా ఉక్కుముక్కల్లా వున్నాయి చేతులూ కాళ్లూ ; ఒడ్డూ పొడుగుతో ఉంది. ఆమెని చూసి ఆగారు ఆకతాయిలు. ఎదురుగా వస్తున్నఆటోని పిల్చి తాను ఎక్కి ఆమెనీ ఎక్కించుకుంది. ఆటో సర్రున ముందుకు సాగింది. అప్పటికి మనుషుల్లో పడిన దేనా అయిదు వందల నోటుని ఆమె చేతికి ఇఛ్చి’’అమ్మా నువ్విక్కడ దిగు’’ అంది.
పెద్దామెకి ఏమీ అర్ధం కాలేదు. కానీ డబ్బు దొరికిన ఆనందంలో వున్న ఆమె ఇంకేమీ ఆలోచించకుండా దిగింది.
తాను కాలేజీలో కట్టవలసిన పరీక్ష ఫీజు తాలూకు అయిదు వందల నోటది. ఫీజు తీసుకునే అతను ఆబ్సెంట్ కావడంతో తిరిగి వచ్చ్చేసింది. ఆ డబ్బు ఇలా ఇవ్వడం ఇంట్లో వారికి నచ్చ్చదని గొడవ చేస్తారని తెలుసు. ఆటో లో రావడం విషయంలో కూడా గొడవ చేస్తారని తెలుసు. అయినా తప్పదని అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి డబ్బులు అడిగి ఆటో అతనికి ఇవ్వడానికి నడిచింది.
తల్లి పట్టుచీర కట్టుకుని చక్కగా తయారై ఉంది.
“ఇవాళ పెళ్ళికి వెళ్ళాలి త్వరగా ఇంటికి రమ్మని చెప్పాను కదా అయినా ఇంత’ ఆలస్యంగా వచ్చ్చావేంటి?’’అని ఆడి గింది తల్లి కొరకొరా చూస్తూ.
“ప్రైవేట్ క్లాస్ పూర్తయ్యే సరికి లేట్ అయ్యింది. అందుకే ఇంకా ఆలస్యం కాకూడదని ఆటలో వచ్చాను అంది దేనా.
“ఆటోలో వస్తే బోలెడు దబ్బవుతుంది కదా, సర్లే ఇవాళ ఇంకా లేట్ గావస్తే ముహూర్తం దాటిపోయేది.సరే. అన్నం పెట్టుకుని తిని తలుపు వేసుకుని టీవీ చూడు’’. అని తల్లి గబగబా బయటకి నడిచింది పదవ తరగతి చదువుతున్న దేనా తమ్ముడి తో బయటకి నడుస్తూ. తల్లి తమ్ముడూ వెళ్ళగానే తలుపు వేసి వచ్చి మంచం మీద కూర్చుంది.
అయిదు వందలు పోయినందుకు తల్లి తనని ఎంత వేధించి సాధిస్తుందో ఆ అమ్మాయికి తెలుసు. ఆ అయిదు వందల నోట్ ఆపద కాలంలో తనని ఆదుకుందని అది పోయినా తాను గట్టెక్కిందన్న ధైర్యంతో ఉంది దేనా.
కానీ ఈ విషయం తల్లితో చెప్పడం ఎలా? అని ఎంత ఆలోచించినా ఏం చెప్పాలో అర్ధం కాలేదు. మర్నాడు తల్లిని’’ నాన్నకి చెప్పి నాకొక చక్రాలబండీ కానీ వాకర్ కానీ కొనిపించమ్మా’’ అని దీనంగా అడిగింది.
“ఆమ్మో బోలెడు డబ్బవుతుంది’’ అంది తల్లి.
“పోనీ రోజూ ఆటోలో వెళ్తాను డబ్బు ఇప్పించు’’ అంది
“రోజుకు నూట ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలా? నెలకి ఎంతవుతుందో తెలుసా?’’కటువుగా అడిగింది తల్లి.
“నా చదువు పూర్తవ్వగానే ఉద్యోగంలో చేరి నీకు డబ్బు ఇస్తానమ్మా’’ అంది.
“నీకు ఉద్యోగం ఎవరిస్తారు? వందల మంది నిరుద్యోగులున్నారు. వాళ్ళకే దిక్కులేదు. నువ్వు కుంటి దానివి. దానికి తోడు ఆడదానివి. పైగా పై కులం దానివి. కనక నీకు ఉద్యోగం వచ్ఛే అవకాశమే లేదు. … ‘’
“అలా అనకమ్మా నేను రోడ్డు మీద ఒంటరిగా నడవడానికి చాలా అవస్థ పడు తున్నాను’’ అంటూ అంతా వివరంగా చెప్పి బావురుమంది.
తల్లి క్షణం మౌనంగా ఉండిపోయింది.
తర్వాత సూటిగా కూతుర్ని చూస్తూ పెదవి విప్పింది.
“నువ్వు ఇలా వొంకరగా పుట్టడం చూసిన వెంటనే మీ నాన్న చెత్తకుండీ దగ్గర వదిలేయమన్నారు తెలుసా. మీ నాన్నమ్మ కూడా ఆయనని సమర్ధించింది. అయ్యో శిశుహత్యా పాపం చుట్టుకుంటుందండీ అన్నాను. ఆ పని చేయవద్దని బ్రతిమాలు కున్నాను. అయితే అనాధాశ్రమంలో వదిలేసి వద్దాం అన్నారు నాన్న,నేనే ఇంత
ముద్ద తిని ఇంట్లో పడి ఉంటుంది లెండి అని నచ్చ్చచెప్పి ఒప్పించాను. కానీ ఆ పని చేసినందుకు ఇప్పుడు బాధ పడుతున్నాను’’ అంటూ తల కొట్టుకుంది తల్లి. తల్లి బాధ పడుతున్నది తనకి జరగబోయిన అఘాయిత్యం గురించి కాదు. అంతదాకా పెట్టిన ఖర్చుని తల్చుకుని బాధ పడుతోంది. ఇక ముందు కానున్న ఖర్చును ఊహించుకుని బాధపడుతోంది. ఆటో ఖర్చు గురించి మళ్ళీ ఖర్చు పెట్టవలసిన కాలేజీ ఫీజు ని గురించి ఆలోచిస్తోంది.
ఎంత బాధాకరం తన పరిస్థితి.
తనని గురించి ఆలోచించేవారు లేరు . తన కాళ్ళ మీద తానూ నిలబడతాను అంటే నమ్మేవారు లేరు. ఆడపిల్లలకి ఎన్నో సమస్యలున్నాయని సమాజంలో అందరూ వాపోతారు. కట్నకానుకలు ఖర్చును గూర్చి, అత్తింటి ఆరళ్ళ గురించి భర్త వేధింపుల గురించి సినిమాలు తీస్తారు కథలు రాస్తారు .అవి సమస్యలే. కానీ తమ సమస్యలంత భయంకరమైనవి కావుగా. అయినా ఎందుకు ఎవ్వరూ తమని గురించి ఆలోచించరు ?
తమని పుట్టగానే చంపడమే పరిష్కారంగా ఎందుకు ఆలోచిస్తారు? ఏం తాము మాత్రం చదువుకుని తమ కాళ్ళమీద నిలబడలేమా?
‘ఈ ఒక్కసారీ పరీక్ష ఫీజు కట్టెయ్యండమ్మా ఇంటర్ అయ్యాక ఏం చేద్దామో ఆలోచిద్దాం ‘అని తల్లినీ తండ్రినీ వొప్పించేసరికి తలప్రాణం తోకకి వచ్చింది. పరీక్షలప్పుడు కూడా ఆటోలోనే వెళ్లి రాసి వచ్చింది.
ఇంటర్ మొదటి శ్రేణిలో పాసయ్యింది. అప్పుడు మళ్ళీ సమస్య మొదలయ్యింది.
డిగ్రీలో చేర్చమని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలింది. అంత ఫీజు కట్టడమూ,ఆటో ఖర్చు పెట్టడమూ అయ్యే పనికాదని తేల్చి చెప్పారు కన్నవారు.
మళ్ళీ సమస్య…ఒకదాని తర్వాత ఇంకొక సమస్య.
చివరికి ప్రైవేట్ గా చదివేలా అన్నీ సిద్ధం చేసారు. ఎవరైనా ట్యూషన్ చెప్తే పరీక్ష రాయడం తేలిక అనిపించింది. ఆ మాటే చెప్పింది. ఒక కాలేజీ లెక్చరర్, దూరపు బంధువు ఉచితంగా పాఠాలు చెప్పడానికి ఒప్పుకున్నాడు. బ్రతుకు జీవుడా అనుకుంది.
మాస్టర్ ఇంటికి వఛ్చి తనకి ఖాళీ ఉన్నప్పుడు పాఠాలు చెప్పసాగాడు. అతను చాలా చక్కగా అరటిపండు వొలిచి పెట్టినట్లుగా పాఠాలు చెప్తున్నమాట నిజమే. కానీ, అతని చూపు దేనా ఎత్తు పల్లాల మీదే ఉంటోంది. వీలైనంతగా ఆమె ని తాకడం దగ్గర దగ్గరగా వొచ్చి యేదేదో చెయ్యడంతో మొదలయ్యింది అతని మృగాడి ప్రవర్తన.
తల్లి వేరే గదిలో కళ్లప్పగించి టీవీ చూస్తూ ఉంటుంది. బ్రహ్మ రుద్రాదులు వచ్చినా సీరియల్స్ ముందు నుండి కదలదు.
ఆడపిల్ల బాధ్యత తల్లిది అంటారు.కానీ ప్రతీసారీ సమయస్ఫూర్తితో తనని తానే కాపాడుకుంటూ వఛ్చిన దేనా ఈ సారి కూడా అదే పనిలో పడింది. అతనితో పెద్దగా గొడవ పెట్టుకోకుండా పాఠాలు నేర్చుకుంటూ వచ్చిన దేనా తో ఒకసారి ఆతను సూటిగా
అడిగాడు నాకు గురు దక్షిణ గా ఏమిస్తావు అని..
దేనా చిన్నగా నవ్వి ‘నేను చదువయ్యి ఉద్యోగంలో చేరాక మొదటి జీతం మొత్తం మీకే ఇస్తాను’ అంది.
అతను గట్టిగా నవ్వాడు.’ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది నీ మాట’ అన్నాడు.
దేనా జవాబివ్వలేదు
‘నువ్వు పరీక్షలో పాస్ అయితే నాకు నిన్ను నువ్వు ఒక్కసారి అర్పించుకో చాలు’’ అన్నాడు చాలా కాజువల్ గా.
ఉలిక్కిపడింది. లోలోన వొణికిపోయింది.
‘మౌనం అర్ధాంగీకారం కాదు సంపూర్ణాంగీకారం అనే అనుకుంటున్నాను’ అన్నాడు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్ఛే మిషతో చేతులు తడుముతూ.
కంప్యూటర్ నాలెడ్జి సంపాదించిన దీనా తల్లితండ్రులతో సైతం సంప్రదించ కుండా దివ్యాన్గ బాలికలు స్త్రీల సంక్షేమ కేంద్రాల వారితో సంప్రదింపులు జరిపి చివరికి ఒక హోమ్ ఎంచుకుంది. ఆ విషయం విని ఇంట్లో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అయినా ఎదిరించి బయటకి వచ్చ్చేసింది దేనా.
ఆమెకి తెలుసు అక్కడ కూడా సమస్యలు ఎదురవుతాయని,లెక్చెరర్ తనని ఒదులుకోవాలని అస్సలు అనుకోడని , కానీ ఆమె పోరాటం చెయ్యదలచింది. వుద్యోగం సంపాదించి తన లాంటి ఆడపిల్లలకి సమస్యలు ఎదురు కాకుండా వుండేలాటి ఆశ్రమం నెలకొల్పాలని నిర్ణయించుకుంది.
*****