కనక నారాయణీయం -37

పుట్టపర్తి నాగపద్మిని

          ‘ఆడపిల్లలిద్దరూ పెద్దవాళ్ళౌతున్నారు. పెళ్ళీడు వచ్చేస్తూంది. కరుణ అక్కడ హైద్రాబాద్ లో బీ.ఎస్సీ. రెండో సంవత్సరంలో ఉంది. ఇదిగో, తరులత కూడ చూడండి, చెట్టంత ఎదిగింది. ఇద్దరికీ పెళ్ళిల్లు చేసి, మన బాధ్యత తీర్చుకోవలె కదా!! ఇక్కడున్న వైష్ణవ కుటుంబాలకు మనమంటే ఏదో చిన్న చూపు. వాళ్ళ ఆర్థిక స్థితి గతులు మనకంటే ఎక్కువని కాబోలు!! అప్పటికీ నేనప్పుడప్పుడు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వస్తూ, ఆ మాటా యీ మాటా మాట్లాడుతూ,పెళ్ళీ సంబంధాలేవైనా వుంటే చెప్పమని అడుగుతూనే వుంటాను. ఇంత వరకూ ఎవ్వరూ ఏమీ చెప్పనే లేదు. మీరు కూడా కాస్త దృష్టి పెట్టవలె!! ‘
పుట్టపర్తి యీ మాటలతో, కాస్త ఇహలోకంలోకి వచ్చి పడినట్టే అనిపించి, కనకవల్లి మళ్ళీ, గొంతు సవరించుకుంది.

          ‘మన బంధువులు, మీ తమ్ముడు కమలాకాంతుడు, మీ అనంతపురం బంధువులకు ఉత్తరాలు వ్రాయండి. ఆడపిల్లలిద్దరికీ ఒకే సారి చేస్తే ఖర్చు కూడ కలిసి వస్తుంది. ఇద్దరికీ రెండేళ్ళే వారా ఉంది కాబట్టి!!’

          కనకవల్లి మాటలకు నవ్వొచ్చింది పుట్టపర్తి కి!! ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు, వరుళ్ళే దొరకలేదింకా, అప్పుడే పెళ్ళి దాకా ఆలోచన!! ఆడవాళ్ళు దూరదృష్టి గలవాళ్ళు అంటే నిజమే అనుకున్నాను గానీ, ఇంత దూరదృష్టి ఉంటుందనుకోలేదు. తల్లి మనసు మరి!!’ అనుకుంటూ, ‘సరే, ఆ ఉత్తరాలేదో నువ్వే రాసేయ్!! అర్ధాంగి మాత్రమే కాదు కదా నువ్వు, కుటుంబ బాధ్యతల విషయంలో నీ మాటే నా మాట!! చివర సంతకం నీవే పెట్టినా నేనేమీ అనుకోనులే!! మంచి రోజు చూసి ఆ పని చేసేయ్!!’ అని లేచి తనకు కావలసిన పుస్తకమేదో వెదుక్కోవటంలో మునిగి పోయారాయన!! అది దొరికితే మళ్ళీ పుస్తక పఠనంలో మునిగిపోతారంతే!! ‘సరే.. తనకిక తప్పదు.’ అనుకుంటూ, వంటింట్లోకి నడిచింది కనకవల్లి.

          అటు పుట్టపర్తి మనసులోనూ కలకలం మొదలైంది. ఏదో అప్పటికి ఆ విధంగా మాట్లాడేసి, సర్వ బాధ్యతలూ ఆమె పైకి నెట్టేసినా, ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిల్లంటే తన బోటి బడుగు బడి పంతులకు సాధ్యమయ్యే విషయమా?? కరుణ, తరులత – ఇద్దరూ చక్కటి సంగీత గాయనీమణులు. భర్త ఎటువంటి వాడు వస్తాడో, వాళ్ళకు పాడుకునే వీలుంటుందో లేదో?? ఇక్కడైతే, తను అచ్చపు వైష్ణవుల ఇళ్ళలో వలె, ఒంటినిండా నామాలు, నిత్యం అనుష్టానం, మడీ, దడీ వంటివి అంతగా పాటించడు. అత్తగారిళ్ళల్లో ఆడ పిల్లలకు కొత్త చోట సర్దుకు పోవటమంటే మాటలా?? కానీ తప్పదు. ఇక్కడి వైష్ణవులకు తనంటే పడదు. పైగా వైష్ణవుడై వుండి శివతాండవం వ్రాయడమేమిటి?? అని వాళ్ళకు యీసడింపు. ఇప్పుడు ఆడపిల్లల పెళ్ళి వేళకు, యీ కుల నియమాలు వంటి వాటికే ప్రాధాన్యత. శ్రీనివాసా!! నీదే భారం..’ అని నిట్టూర్చి, మళీ తన పనిలో మునిగి పోయారు.

          అటు కనకవల్లి మదిలోనూ కలకలం. ‘అసలు వరుడెటువంటివాడు దొరుకుతాడో?? వరకట్నం కింద వెంటి తట్టా (భోజనం చేసే పళ్ళెం) చెంబూ, లోటా ( ఇవీ వెండివే) ఇచ్చుకోవలె!! పెళ్ళికుమారుడికీ, పెళ్ళి కూతురికీ పట్టు బట్టలు, వియ్యాల వారికీ, వాళ్ళ ఆజ్ఞ అనుసరించి వాళ్ళ బంధువులకు బట్టలు, పెళ్ళి కుమార్తెకు అంగమణి పాత్రలు (రాయలసీమలో వాడుకలో ఉన్న పదం – అత్తింటికి పట్టుకుపోయే స్టీల్ సామానులు, ఇతర అవసర సామగ్రి ) ఇంకా కల్యాణ వేదిక, విడిదీ, వాధ్యార్లు (పెళ్ళి చేయించే పండితులు) , వాళ్ళకు చదివింపులూ – ఇవన్నీ ఒనగూడాలంటే, ఒక్కో పెళ్ళికీ కనీస పక్షం ఇరవై వేలైనా ఉండవలె!! (అప్పట్లో ఇరవై వేలంటే ఒక లక్షతో సమానం కదా) రెండు నూర్ల రూపాయల జీతంతో గడుస్తున్న సంసారానికి వేల గురించి ఆలోచించే అర్హత ఎక్కడిది? శ్రీనివాసా!! నీవే రక్షించవలె!!’ అనుకోవటం తప్ప చేయగలిగిందే ముంది యీ పరిస్థితిలో??’

          మొత్తానికి వారం పది రోజుల్లో, కనకవల్లి, ప్రొద్దుటూరులో జీ.సీ.కృష్ణమాచార్యులు, కస్తూరి రంగాచార్యులు, పెనుగొండలో పుట్టపర్తి వారి తమ్ముడు కమలాకాంత్ కు ఉన్న విషయం తెలుపుతూ, ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో సహాయం చేయవలెనని ప్రార్థిస్తూ, పుట్టపర్తి సంతకం కూడా తానే పెట్టి ఉత్తరాలు రాయటం పూర్తి చేసింది. అదే చేత్తో, ప్రొద్దుటూరులో పుట్టపర్తి శిష్యులు మాలేపాటి సుబ్రహ్మణ్యం, సుబ్బన్న, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న గోవింద రెడ్డి, ఉపాద్యాయ వృత్తిలో ఉన్న బాబయ్య – వీళ్ళకూ ఉత్తరాలు వ్రాసేసి, వాళ్ళ సమాధానాల కోసం ఎదురు చూడటం మొదలెట్టింది.
ఉత్తరాలు వ్రాసి పోస్ట్ డబ్బాలో పడేసిన మరు క్షణం నుంచే నిరీక్షణ!! ఐనా తన పిచ్చిగానీ, ఉన్న పాటున వరుళ్ళు దొరకడమంటే మాటలా?? లేడికి లేచిందే పరుగు అన్నట్టు, తమ నిర్ణయానికి తగ్గట్టు, దైవ నిర్ణయం కూడా సహకరించవలె కదా?? ఆయన భారమంతా తనపైకి తోసేసి నిశ్చింతగా తనపనిలో నిమగ్నమైపోవటం చూస్తే ఆశ్చర్యం!! తాను కొలిచే అష్టాక్షరీనాథుడే అన్నీ చూసుకుంటాడని ధీమానా?? ఏమీ అర్థం కావటం లేదు.

          వారం రోజుల తరువాత సుబ్రహ్మణ్యం నుండి వచ్చిన జాబు చూచి కాస్త ధైర్యం చిక్కింది కనకవల్లికి!! ‘అయ్యగారి శిష్యులు మేమంతా ఉన్నాం కదమ్మా, మీరేమీ దిగులు పెట్టుకోవద్దు. అన్నీ లక్షణంగా జరుగుతాయి..’ అన్న మాటలతో కాస్త ఊరట లభించింది ఆమెకు!!

          మరో వారానికి, ప్రొద్దుటూరు జీ.సీ. కృష్ణమాచార్యుల నుంచీ పుట్టపర్తి వారికి వచ్చిన లేఖా సారాంశం, కర్నూలు లో శ్రీమాన్ బాణగిరి దేశికాచార్యుల వారి మొదటి కుమారుడికి సంబంధాలు చూస్తున్నారట!! వారిది శ్రీవత్స గోత్రం. పుట్టపర్తిది షఠమర్షణ గోత్రం కాబట్టి సరిపోతుంది. దేశికాచార్యులవారు సెంట్రల్ బాంక్ లో ఉద్యోగి!! బాగా ఆస్తిపరులు. వరుడు రాఘవాచార్యులు, పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. వరుడు బుద్ధిమంతుడు. ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది. ముందు కరుణాదేవి జాతకం నాకు పంపితే, నేను వధూవరుల జాతకాలు సరిపోల్చి చూస్తాను. ఆ తరువాత, పెరుమాళ్ళు ఆశీస్సులు..’ ఈ కృష్ణమాచార్యులు దూరపు బంధుత్వం తో పాటు, పుట్టపర్తి సాహిత్యాభిమాని కూడా!! జాతకాలు చూడటంలోనూ చక్కటి ప్రవేశం ఉన్నది. ప్రొద్దుటూరిలో ఉండేటప్పుడు, చాలా సహాయంగా ఉండేవాడు. మంచి కార్య దక్షుడు కూడా!! ప్రొద్దుటూరిలో ఒక బుక్ షాప్ ఓనర్. కస్తూరి రంగాచార్యులు దీనిలో భాగస్తుడు. ఇద్దరికీ పుట్టపర్తి అంటే విపరీతమైన అభిమానం. కృష్ణమాచార్య ఉత్తరం పుట్టపర్తిలోనూ ఉత్సాహం నింపింది.

          ఈ సంగతి చదవగానే కనకవల్లి మనసులో సందేహం తలెత్తింది. వాళ్ళేమో కలిగిన వాళ్ళు. ఇక్కడ సరస్వతీ కటాక్షం మెండుగా ఉంది కానీ, లక్ష్మీదేవి అనుగ్రహం అంతగా లేదు. ఈ పరిస్థితిలో, వరునికి పెట్టుపోతలు, వియ్యాల వారికి గౌరవ మర్యాదలు విషయంలో నిర్వహించటం సాధ్యమా?? అని!! కరుణాదేవి జాతకం పంపుతూ, తన సందేహాలు కూడా వెలువరించింది తల్లిగా!!

          మరో పది రోజులు – మళ్ళీ అసహనంతో కూడిన నిరీక్షణ!! అప్పట్లో పొస్ట్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రమే అన్ని సందర్భాలలోనూ ఆదుకునే మార్గాలు!! ఆపత్సమయాలలో మాత్రమే టెలిగ్రాంలు నడిచేవి. పుట్టపర్తి విషయం వేరు, సభలూ, సమావేశాలకు సంబంధించిన కొన్ని ముఖ్య సూచనలు, టెలిగ్రాం ల ద్వారా అందుకోవటం ఆనవాయితీ గా ఉండేది వారి ఇంట్లో!!

          అప్పట్లో వధూవరుల ఫోటోలు ముందుగా పంపే పద్ధతి కూడా వుండేది కాదు. జాతకాలు కుదరటాన్ని బట్టి, పెళ్ళిచూపుల తారీఖు నిర్ణయించుకోవటం జరిగేది. శ్రీవైష్ణవులలో, వరదక్షిణ కింద వెండి చెంబు వంటివి సమర్పించుకోవటం, ఆపై, వియ్యపువారి అభీష్టాన్ని బట్టి (అదికూడా పెద్దగా వుండేదికాదనే నాకు గుర్తు) కట్న కానుకలు ఉండేవి. ఎంత లేదన్నా, పదిహేను నుండీ ఇరవై వేలదాకానైనా ఖర్చు తేలేది.
ఇంతకూ ప్రస్తుత విషయానికి వస్తే వధూవరుల జాతకాలలో 23 గుణాలు కలిసాయన్న శుభవార్త మోసుకొచ్చిన ప్రొద్దుటూరు కృష్ణమాచార్యుల ఉత్తరం, పుట్టపర్తి దంపతులకు గొప్ప సంతోషాన్ని అందించింది.

          అప్పుడే వధూవరులు మొట్టమొదట చూసుకోవటాలు, తక్కిన విషయాలు పెద్దలు మాట్లాడుకోవటాలూ!! సంబంధాలు కుదర్చటం కూడా ఒక కళేనని ఒప్పుకునేటట్టు మధ్యవర్తుల పాత్ర చాలా ప్రధానంగా ఉండేది. కృష్ణమాచార్యులు ఇటువంటి పనులలో మాంచి ప్రవేశము, మాట నేర్పరి తనము, హాస్య స్ఫూర్తితో ఆకట్టుకునే గుణాలున్న మంచి వ్యక్తి.

          ఈ లోగా అనుకోకుండా ఇల్లు కూడా మారటం జరిగింది. ఇప్పుడున్న నరస రామయ్య వీధిలోని మట్టి మిద్దె నుంచీ, మోచంపేట శివాలయం వీధిలో ఉన్న ఇంటికి మకాం మారింది. ఈ ఇల్లు ఇదివరకటి ఇంటికన్నా పెద్దది. పెద్ద పడసాల, వంటిల్లు, ఆడపిల్లలు బైటికి వెళ్ళకుండా ఇంట్లో ఆవరణలోనే స్నానాల గది తదితరాలు ఉన్నాయి. ముఖ్యంగా పుట్టపర్తి సొంత గ్రంధాలయానికి తగ్గట్టుగాను, వ్రాత కోతలలో ధ్యాన భంగం కాకుండా మేడ మీద ప్రత్యేకంగా ఒక గది – ఉన్నాయి.

          అసలు హడావిడి ఇప్పుడు మొదలైంది. కృష్ణమాచారే పెళ్ళి చూపుల తేదీ నిర్ణయించేసి, ఇరు పక్షాలవారికీ తెలియబరచాడు కూడా!! పెళ్ళి చూపులనేవి ఆనాళ్ళలో చాలా ప్రధాన ఘట్టాలు. అప్పుడే వధూవరులు మొట్టమొదట చూసుకోవటాలు, తక్కిన విషయాలు పెద్దలు మాట్లాడుకోవటాలూ!! సంబంధాలు కుదర్చటం కూడా ఒక కళేనని ఒప్పుకునేటట్టు మధ్యవర్తుల పాత్ర చాలా ప్రధానంగా ఉండేది. కృష్ణమాచార్యులు ఇటు వంటి పనులలో మాంచి ప్రవేశము, మాట నేర్పరి తనము, హాస్య స్ఫూర్తితో ఆకట్టుకునే గుణాలున్న మంచి వ్యక్తి.

          హైద్రాబాద్ లో చదువుకుంటున్న కరుణాదేవికి కూడా యీ విషయం లేఖ ద్వారా తెలిపింది తల్లి కనకవల్లి. కానీ, ఆమెకు ఇంకా చదువుకోవలెననే ఉంది. ‘ఇంకా డిగ్రీ పూర్తి కాలేదు, అప్పుడే పెళ్ళా??అమ్మా!!’ అని ఆమె బేలగా వ్రాసిన ఉత్తరానికి సమాధానంగా, ‘నీవు ఫలానా రోజుకు కడపకు చేర రావలసినదే..’అని వ్రాసి పోస్ట్ చేసినా, తల్లిగా కాస్త బాధ కలుగనే కలిగింది. రోజులు మారుతున్నాయి నిజమే, దానికి తగ్గట్టు, తమ ఇంటి పరిస్థితి కూడా మారినప్పుడే కదా, ఫలితం ఉండేది??

          అనుకున్నట్టుగా కడపలోనే నిర్ణయించబడిన పెళ్ళి చూపుల తేదీకి నాలుగైదు రోజుల ముందే కరుణాదేవి హైద్రాబాద్ నుంచీ వచ్చేసింది. పెళ్ళి చూపుల తేదీ దగ్గర పడే కొద్దీ, ఏర్పాట్లలో లోపం రాకుండా చూసుకోగలనో లేదో అన్న భయం మొదలైంది తల్లిగా కనకవల్లిలో!! భగవంతుని మీద భారం వేసి, ఏడుకొండలవానికి ముడుపుకట్టి మొక్కుకుంది, ఎలాగైనా కరుణాదేవికి యీ సంబంధం కుదిరేటట్టు చేయమని!!
ఇవన్నీ పట్టని కాలం, తన వంతు బాధ్యత నెరవేర్చుకున్నట్టు, పెళ్ళిచూపుల తారీఖు ఉదయాన తొలి సూర్య కిరణాలతో శుభోదయం పలికింది. సాయంత్రం జరుగబోయే పెళ్ళి చూపుల కోసం, ఉదయం నుంచే తయారీ మొదలైంది. ఇంట్లో, తక్కిన ఆడపిల్లలు, తరులత, తులజ, పడసాలను (పెద్ద హాలు) తమకు తోచిన రీతిలో సర్ది పెట్టారు. (నాకు అప్పుడు ఏడేళ్ళు పైన ఐదారు నెలలు) ఇంటి సరంజామాలోకి కొత్తగా చేరిన రెండు చెక్క కుర్చీలను దుమ్ము లేకుండా తుడిచి పెట్టారు. టేబుల్ మీదున్న పెన్ స్టాండ్ లాంటి వస్తువులను, చిన్న రేడియోను కూడా మళ్ళీ ఒకసారి అటు ఇటుగా జరిపి చూసి, తృప్తి చెందారు. తులజమ్మ ముచ్చట పడి కొన్న ఫ్లవర్ వేజ్లో పూలను కూడ నీటితో కడిగి, బాగా కనపడేలా సర్దారు. కనకవల్లి వచ్చేవారి కోసం వేడి వేడీ ఉప్మా, కాఫీలు తయారు చేసి సిద్ధంగా వుంచింది.

          సాయంత్రమైంది. కనకవల్లి కాలుగాలిన పిల్లి వలెనే హడావిడిగా తిరుగుతున్నా, పుట్టపర్తి మాత్రం, మేడ మీద తన గదిలో సారస్వతాలోకనంలో మునిగి ఉన్నారు. ఆయన ధోరణి తనకు తెలిసినా, వచ్చే వారి మర్యాద కోసమైనా ఆయన కిందికి వచ్చి, నిల్చోవచ్చు గదా??’ మనసులొనే అనుకుంటూ, పెళ్ళిచూపులకు వచ్చే పెద్దల కోసం ఎదురు చూస్తూ అప్పుడే ఇంట్లోకి వచ్చిన కనకవల్లికి, ముందుగా కృష్ణమాచార్యుల మాటలు వినబడ్డాయి, ‘ఆఆ..ఇదే ఇల్లు రండి రండి..అమ్మా కనకమ్మా??’ అంటూ!! పరుగున తళిహింట్లో నుంచీ (వంటిల్లు) కొంగు తుడుచుకుంటూ బైటికి వచ్చి, నవ్వు ముఖంతో, ‘రండి రండి..’ అంటూ ఆహ్వానించిందామె!! తరులతను మిద్దె మీదకు తరిమింది,’పెళ్ళివారు వచ్చారు, తొందరగా మీ అయ్యను పిల్చుకు రమ్మని..’ !!

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.