జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-3 

   -కల్లూరి భాస్కరం

మరో ప్రపంచం

మరో ప్రపంచం

మరో ప్రపంచం పిలిచింది

పదండి ముందుకు

పదండి తోసుకు

పోదాం పోదాం పైపైకి

***

బాటలు నడచీ

పేటలు కడచీ

కోటలన్నిటిని దాటండి

నదీనదాలూ

అడవులు కొండలు

ఎడారులా మన కడ్డంకి

***

ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి

ఎనభై లక్షల మేరువులు

తిరిగి తిరిగి తిరిగి సముద్రాల్

జలప్రళయనాట్యం చేస్తున్నవి

***

శివసముద్రమూ నయాగరా వలె

ఉరకండీ ఉరకండీ ముందుకు

***

          నిజమే, ‘మరోప్రపంచం’ అనే శ్రీశ్రీ ప్రసిద్ధ కవితలోని ఈ చరణాల సందర్భం వేరు. ఆధునిక కాలంలో తిరుగుబాట్లు, విప్లవాల నేపథ్యంలో అసమానతలు, అణచివేతలు లేని మరోప్రపంచాన్ని నిర్మించుకునే దిశగా మానవాళికి స్ఫూర్తి నివ్వడం ఈ కవిత లక్ష్యం. అలుపెరుగని మనుషుల అనంత భూభ్రమణంలో, పేటలు, కోటలు కాకపోయినా; అడవులు, కొండలు, ఎడారులు అడ్డంకిగా మారే ఉంటాయి. ఎనభై లక్షల మేరువులు ఎగిరి ఎగిరి పడుతున్న దృశ్యాన్ని, తిరిగి తిరిగి సముద్రాలు చేస్తున్న జలప్రళయ నాట్యాన్ని వారు ఎన్నోసార్లు ప్రత్యక్షంగా చూసే ఉంటారు. శివసముద్రమూ, నయాగరా వలె ముందుకు ఉరకండని తమకు తెలిసిన భాషలో తమకు తామే చెప్పుకుని ఉంటారు. శ్రీశ్రీ ఉద్దేశించినది -పీడన, తాడన మూర్తీభవించిన ఆధిపత్య శక్తులతో మనిషి పోరాటాన్నయితే, ఆదిమానవుడు  ముఖాముఖి తలపడినది అంతకన్నా బలవత్తరమైన అనిశ్చితమైన అంతుబట్టని ఆనవాలు చిక్కని ప్రకృతి శక్తులతో!

ముంచిన మంచునదాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు

          ఒక పెద్ద భూ ఖండం మొత్తాన్నే మంచునదాలు ముంచేయడాన్ని, అగ్నిపర్వతాలు బద్దలై వందలాది క్యూబిక్ కిలోమీటర్ల మేర భూమిని బూడిదతో కప్పేయడాన్ని మనిషి ఎరుగును. వెనకటి 25వేల నుంచి-19వేల సంవత్సరాల మధ్యకాలంలో చివరి మంచు యుగం గరిష్ఠస్థాయికి చేరి, యూరప్ ఉత్తర, మధ్య అక్షాంశాలను మంచునదాలు కప్పేశాయి. దాంతో జనం దక్షిణ ద్వీపకల్పాలలో ఆశ్రయం పొందారు. ఏకంగా ఒక కిలోమీటర్ మందం గల మంచుపలక కింద కెనడా కప్పడి పోయింది. యూరేసియాకు సంబంధించి, 45 వేలనుంచి-7వేల సంవత్సరాల మధ్యకాలానికి చెందిన అతి తక్కువ మానవ అవశేషాల నుంచే జన్యు సమాచారం లభ్యమైందనీ, ఆ సమాచారం కూడా ఎక్కడిదక్కడే ఉండిపోయిందనీ, తమ పరిశోధనలలో భాగంగా 2016లో ప్రాచీన ఘోస్ట్ జనాభాలు అనేకం బయట పడడంతో ఈ సమాచారం కొత్త పుంతలు తొక్కిందనీ డేవిడ్ రైక్ అంటాడు.

45వేల నుంచి 7వేల సంవత్సరాల మధ్యలో…

          హార్వర్డ్ లోని ఆయన ప్రయోగశాల యూరేసియాకు చెందిన 51 మంది ప్రాచీన మానవుల తాలూకు జన్యుసమాచారాన్ని కూర్చింది. వీరిలో ఎక్కువ మంది 45వేల నుంచి 7వేల సంవత్సరాల మధ్యకాలానికి చెందినవారు. ఇన్ని వేల సంవత్సరాలలో జరిగిన జనాభా పరివర్తనలు, వలసలు, సాంకర్యాలు ఎలాంటివో; ఒక జనాభా స్థానాన్ని ఇంకో జనాభా ఎలా ఆక్రమించుకుందో డేవిడ్ రైక్ బృందం చూపించగలిగింది. ఈ బృందంలోని కియోమీ ఫు(Qiaomei Fu) అనే సభ్యురాలు, పశ్చిమ యూరేసియాలోకి అడుగు పెట్టిన ఆధునిక మానవుల తొలి చరిత్రను అయిదు కీలక ఘట్టాలు(events)గా విడగొట్టింది. ఈ ప్రాంతంలోకి ఆధునిక మానవులు వ్యాపించడమే వాటిలో మొదటి ఘటన. పశ్చిమ సైబీరియాలో 45 వేల ఏళ్ల క్రితం, రుమేనియాలో 40వేల ఏళ్ల క్రితం జీవించిన ఇద్దరు వ్యక్తుల అవశేషాలు ఈ వ్యాప్తికి సంబంధించిన జన్యుసాక్ష్యాన్ని అందించాయి. ఈ ప్రాంతంలోకి మొట్టమొదట అడుగుపెట్టిన ఆధునిక మానవుల బృందంలో వీరు సభ్యులు. అయితే, ఇదే ప్రాంతం(యూరప్)లో ఆ తర్వాత జీవించిన వేట-ఆహారసేకరణ జనానికీ, వీరికీ ఎలాంటి సంబంధమూ లేదు.

          దీనిని బట్టి డేవిడ్ రైక్ బృందం ఒక ముఖ్యమైన సూచన చేసింది. ఈ తొలి ఆధునిక మానవుల వారసులు ఆ తర్వాత చాలా వరకు అదృశ్యమై పోయారు. గతం అనేది కచ్చితంగా వర్తమానానికి దారి తీస్తుందని చెప్పలేమనీ, మానవ చరిత్ర అంతా మూసుకుపోయిన మార్గా(dead ends)లతో నిండినదేననీ, ఇప్పుడు ఒక ప్రదేశంలో నివసిస్తున్నవారు, గతంలో ఆ ప్రదేశంలో నివసించిన వారికి వారసులని కచ్చితంగా చెప్పడానికి వీల్లేదనే కీలక వ్యాఖ్యను డేవిడ్ రైక్ ఈ సందర్భంలోనే చేశాడు.

యూరప్ ను కప్పేసిన బూడిద

          పశ్చిమ యూరేసియాలో ఇలా ఆధునిక మానవుల తొలి బృందానికి చెందినవారు అంతరించి పోవడానికి కారణం, ఒక ప్రకృతి ఉత్పాతం. 39 వేల ఏళ్ల క్రితం, నేటి ఇటలీలోని నేపుల్స్ కు సమీపంలో ఒక సూపర్ అగ్నిపర్వతం బద్దలై యూరప్ లో 300 క్యూబిక్ కిలోమీటర్ల మేర బూడిదతో కప్పేసింది.  ఈ పొరకు పైన నియాన్డర్తల్ అవశేషాలు కానీ, పరికరాలు కానీ దాదాపు కనబడలేదు. దాంతోపాటు, ఈ అగ్నిపర్వతం పేలుడు వల్ల కలిగిన వాతావరణ విధ్వంసం అనేక సంవత్సరాలపాటు శీతల వాతావరణాన్ని సృష్టించి ఉండచ్చని, ఆధునిక మానవులతో ఏర్పడిన పోటీ దానికి తోడై  నియాన్డర్తల్ జనం అంతరించే పరిస్థితి కల్పించి ఉండచ్చనే ఊహకు ఆస్కారం ఏర్పడింది. అయితే, ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నది నియాన్డర్తల్ జనం ఒక్కరే కాదు, ఆధునిక మానవులకు చెందిన అనేక పురావస్తు సంస్కృతులు కూడా ఆ బూడిద పొర కింద అణగిపోయాయి.  నియాన్డర్తల్ జనంలానే, అంతే నాటకీయంగా, అనేక మంది ఆధునిక మానవులు కూడా ఆ ప్రాంతం నుంచి అదృశ్యమైపోయారు.

37వేల నుంచి 14వేల సంవత్సరాల మధ్యలో…

          తర్వాతి కాలంలో యూరప్ లో జీవించిన వేట-ఆహారసేకరణ జనం తాలూకు పూర్వీకుల వ్యాప్తి -కియోమీ ఫు గుర్తించిన రెండవ ఘటన. 37వేల సంవత్సరాల క్రితం నేటి రష్యా యూరప్ భాగంలో, 35వేల సంవత్సరాల క్రితం నేటి బెల్జియంలో జీవించిన ఇద్దరు వ్యక్తులు ఆ తర్వాతి కాలంలో, నేటి కాలపు వారితో సహా, యూరప్ జనాలకు జన్యు వారసత్వం అందించిన జనాభాలో భాగమని ఆమె జరిపిన వారి అవశేషాల పరీక్షలో తేలింది. 37వేలు-14వేల సంవత్సరాల మధ్యకాలానికి చెందిన యూరప్ జనాభా అంతా ఒకే ఉమ్మడి జనాభా నుంచి వచ్చిందనీ, అప్పటికి యూరప్ జనం యూరప్ బయటి జనంతో సాంకర్యం చెందలేదని కూడా ఆమె పరీక్షలు వెల్లడించాయి. నేపుల్స్ సమీపంలోని అగ్నిపర్వతం బద్దలైన తర్వాతి కాలంలో యూరప్ అంతటా ఆరిగ్నేషన్ (Aurignacian) రకంగా గుర్తించిన రాతి పరికరాలు వ్యాపించినట్టు పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా ధ్రువీకరించారు. ఈ పరికరాలు అంతకు ముందునాటి పరికరాలకు భిన్నమైనవి. యూరప్ లోకి ఆధునికమానవులకు చెందిన తొలి బృందాల వలసలు బహుముఖాలుగా జరిగినట్టు జన్యు సమాచారమూ, పురావస్తు సాక్ష్యాలూ కూడా ధ్రువీకరించాయి. ఈ బృందాలలో కొన్ని అంతరించిపోగా, కొన్నింటికి, ఆ తర్వాత వచ్చిన జనాల వల్లా, సంస్కృతి వల్లా స్థానభ్రంశం కలిగింది.

ఆరిగ్నేషన్ జనాలకు స్థానచలనం కలిగించిన గ్రేవిషియన్లు

          33వేలు-22వేల సంవత్సరాల మధ్యకాలంలో గ్రేవిషియన్(Gravettian) పరికరాలకు చెందిన జనాలు యూరప్ లో ప్రాబల్యం వహించారు. నగ్నస్త్రీ ప్రతిమలు, వాద్య పరికరాలు, గుహా చిత్రాలు(cave art) వీరికి చెందిన కొన్ని సాంస్కృతిక అవశేషాలు. బెల్జియం, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్ లలోని సమాధులలో బయటపడిన ఈ జనం తాలూకు అవశేషాల నుంచి డేవిడ్ రైక్ బృందం సేకరించిన DNA, వీరు భౌగోళికంగా వేర్వేరు చోట్లకు చెందినా ఒకే జన్యుమూలం నుంచి  వచ్చిన వారని వెల్లడించింది. 37వేల సంవత్సరాల క్రితం నేటి రష్యా యూరప్ భాగంలో లభించిన వ్యక్తికిలానే వీరిది కూడా చాలా వరకు యూరప్ వేట-ఆహారసేకరణ జనానికి చెందిన జన్యు వారసత్వమే. అంటే, ఆ కుదురుకు చెందినవారే పశ్చిమానికి వ్యాపించి, 35వేల సంవత్సరాల క్రితానికి చెందిన బెల్జియం మనిషి ప్రాతినిధ్యం వహించిన ఆరిగ్నేషన్ జనానికి స్థానభ్రంశం కలిగించారన్నమాట. గ్రేవిషియన్ సంస్కృతి ఈ కొత్తజనాల వ్యాప్తిని సంకేతించింది.

          నేటి స్పెయిన్ లో 19వేల సంవత్సరాల క్రితానికి చెందిన ఒక అస్థిపంజరం బయటపడింది. మేగ్దలీనియన్(Magdalenian) సంస్కృతికి చెందిన తొలివ్యక్తులలో ఒకడికి చెందినదిగా దానిని గుర్తించారు. ఇది కియోమీ ఫు గుర్తించిన నాలుగవ ఘటనకు నాంది. ఈ సంస్కృతికి చెందిన జనాలే ఆ తర్వాతి అయిదువేల సంవత్సరాలలో, అంత వరకు తాము ఆశ్రయం పొందిన ఉష్ణవాతావరణం నుంచి బయటికి వచ్చి తిరోగమిస్తున్న మంచుపలకల వెంబడే నేటి ఫ్రాన్స్, జర్మనీలలోకి వలస కడుతూ వచ్చారు. వీరు తమకు ముందు అక్కడున్న గ్రేవిషియన్ జనానికి ప్రత్యక్ష వారసులు కారు. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే, ఈ మేగ్దలీనియన్ జనం అంతకు ముందు ఆరిగ్నేషన్ రకానికి ప్రాతినిధ్యం వహించిన బెల్జియం వ్యక్తితో చాలావరకు జన్యువారసత్వాన్ని పంచుకున్నారు. అదే ప్రాంతంలోకి ఆ తర్వాత అడుగు పెట్టిన గ్రేవిషియన్ పరికరాలకు చెందిన జనాలు ఈ ఆరిగ్నేషన్ జనానికి స్థానచలనం కలిగించారని పైన చెప్పుకున్నాం. ఈ గ్రేవిషియన్ జనం, తూర్పు యూరప్(రష్యా యూరప్ భాగంలో బయటపడిన వ్యక్తిలా)సంస్కృతితో ముడిపడిన జనాల DNAనే పంచుకున్నారు. దీనిని బట్టి, ఆరిగ్నేషన్ జనాలు పూర్తిగా అంతరించలేదనీ, మంచు యుగం చివరన తిరిగి పెద్ద ఎత్తున వ్యాపించడానికి ముందు బహుశా పశ్చిమ యూరప్ లోని  కొన్నిప్రదేశాలకు పరిమితమై ఉండిపోయారనీ డేవిడ్ రైక్ అంటాడు. ఆ తర్వాత ఈ గ్రేవిషియన్-ఆరిగ్నేషన్ జనాభా మిశ్రమం యూరప్ తొలి ఘోష్టు జనాభాలలో ఒకటైంది.

14వేల సంవత్సరాల క్రితం…కరిగిన ఆల్పైన్ మంచుగోడ

          ఇక అయిదవ ఘటన 14వేల సంవత్సరాల క్రితం సంభవించింది. అప్పటికి మంచుయుగం ముగిసి భూమి తొలిసారి వేడెక్కడం మొదలైంది. అంతకు ముందు మంచు యుగంలో ఆల్పైన్ పర్వతాల నుంచి మంచుగోడ, నేటి ఫ్రాన్స్ నగరమైన నీస్(Nice)కు సమీపంలో మధ్యధరా సముద్రం వరకూ వ్యాపించి ఉండేది. అది 10వేల సంవత్సరాలపాటు తూర్పు, పశ్చిమ యూరప్ లను విడదీసిన తర్వాత, 14వేల ఏళ్ల క్రితం కరగడం ప్రారంభించింది. దాంతో ఆగ్నేయ యూరప్(ఇటాలియన్, బాల్కన్ ద్వీపకల్పాలు) నుంచి నైరుతి యూరప్ లోకి మొక్కలు, జంతువులతో పాటు మనుషులు కూడా వలస కట్టినట్టు ప్రాచీన DNA పరీక్షలు వెల్లడించాయి. ఇదే కాలంలో వేట-ఆహార సేకరణజనానికి చెందిన ఒక బృందం యూరప్ అంతటా విస్తరించారు. అంతకుముందు అక్కడున్న మెగ్దలీనియన్ సంస్కృతికి చెందిన జనాల జన్యువారసత్వమూ, వీరి జన్యువారసత్వమూ ఒకటి కాదు. ఈ జనమే మెగ్దలీయన్ సంస్కృతీ జనాలకు చాలా వరకు స్థానచలనం కలిగించారు. 37వేల నుంచి 14వేల సంవత్సరాల మధ్యకాలంలో యూరప్ లో నివసించిన జనాలు, ఇప్పటి పశ్చిమాసియాలోని జనాలకు చెందిన వివిధ పూర్వీకుల శాఖల నుంచి వేరైన ఉమ్మడి జనాభాకు వారసులు. అదే 14వేల సంవత్సరాల క్రితానికి వచ్చేసరికి, పశ్చిమ యూరప్ లోని వేట-ఆహారసేకరణ జనానికి, నేటి పశ్చిమాసియాజనానికి మధ్య  మరింత ఎక్కువ సన్నిహిత సంబంధం ఉన్నట్టు తేలింది. ఇదే కాలంలో పశ్చిమాసియా-యూరప్ ల మధ్య కొత్త వలసలు సంభవించాయనడానికి ఇది రుజువు.

రివర్స్ మైగ్రేషన్

          14వేల సంవత్సరాల క్రితం నాటి ఆగ్నేయ యూరప్, పశ్చిమాసియాలకు చెందిన ప్రాచీన DNA మనకింకా లభ్యం కాలేదు కనుక, ఈ కాలానికి చెందిన జనాభా వలసలను ఊహించవలసిందే నంటాడు డేవిడ్ రైక్. ఆల్పైన్ మంచుగోడ కరగగానే మొత్తం యూరప్ మీద దక్షిణ యూరప్ ప్రాబల్యం మొదలైంది. బహుశా ఈ జనమే తూర్పున అనటోలియా లోకి విస్తరించారు. వీరి వారసులు పశ్చిమాసియాలో  మరింత దూరానికి  వ్యాపించారు. ఇది జరిగిన మరో అయిదువేల సంవత్సరాల తర్వాత, అంటే తొమ్మిది వేల సంవత్సరాల క్రితం తిరిగి పశ్చిమాసియా నుంచే జన్యువారసత్వం వ్యవసాయ జనాల రూపంలో తిరిగి యూరప్ కు చేరింది. అంటే, ఈసారి అపసవ్య దిశలో వలసలు(reverse migration)జరిగాయన్నమాట.

పశ్చిమ యూరేసియా జనంలో అత్యధిక జన్యుసారూప్యం

          యూరప్, పశ్చిమాసియా, చాలావరకు మధ్యాసియా భాగంగా ఉన్న సువిశాలమైన పశ్చిమ యూరేసియాలోని జనాల మధ్య జన్యుపరంగా అత్యధిక సారూప్యముందని డేవిడ్ రైక్ అంటాడు. పశ్చిమ యూరేసియాలోని జనాభా మధ్య శారీరక ఆకృతి రీత్యా ఉన్న సారూప్యాలను 18వ శతాబ్దిలోనే గుర్తించిన పండితులు, వారిని తూర్పు ఆసియాకు చెందిన ‘మంగొలాయిడ్ల(Mongoloids)’ నుంచి, సబ్ సహారన్ ఆఫ్రికాకు చెందిన ‘నెగ్రాయిడ్ల (Negroids)’ల నుంచి, ఆస్ట్రేలియా, న్యూగినీకి చెందిన ‘ఆస్ట్రలాయిడ్ల (Australoids) నుంచి వేరు చేసి చూపడానికి  ‘కాకసాయిడ్ల(Caucasoids)’న్నారు. నేటి జనాభాను శారీరక ఆకృతుల కన్నా ఎక్కువ లోతుగా చూసి వర్గీకరించే అవకాశాన్ని 2000 సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన జన్యుసమాచారం కల్పించింది. ఇది పాత వర్గీకరణలని కొన్నింటిని ధ్రువీకరిస్తున్నట్టు కూడా కనిపించింది.  తూర్పు ఆసియన్లతో పోల్చితే పశ్చిమ యూరేసియా జనాల మధ్య సారూప్యం ఏడురెట్లు ఎక్కువ కనిపించిందని డేవిడ్ రైక్ అంటాడు.

9వేల ఏళ్ల క్రితం సింధులోయకు చేరిన వ్యవసాయం

          పశ్చిమ యూరేసియాలో అత్యంత సుదూర గతంలో ఉన్న జనాభా నిర్మాణం నుంచి ఇప్పటి జనాభా నిర్మాణం ఎలా జరిగిందో డేవిడ్ రైక్ వివరించాడు. ఈనాటి పశ్చిమ యూరేసియన్ జనాభా వ్యవసాయజనాల విస్తరణ ద్వారా రూపొందినట్టు 2016లో తమ ప్రాచీన DNA లేబరేటరీ, ఇతర లేబరేటరీలు కనుగొన్నాయని ఆయన అంటాడు. వ్యవసాయం 12-11వేల ఏళ్ల క్రితం ఆగ్నేయ టర్కీలోనూ, ఉత్తర సిరియాలోను ప్రారంభమైంది. అక్కడున్న వేట-ఆహారసేకరణ జనం మొక్కలు, జంతువుల పెంపకాన్ని ప్రారంభించడం దీనికి నాంది. వీరు పెంచిన అనేక మొక్కలు, జంతువుల పైనే ఈరోజుకీ పశ్చిమ యూరేసియన్లలో ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. గోధుమ, బార్లీ, వరి, బటానీ, గోవులు, పందులు, గొర్రెలు వీటిలో ఉన్నాయి. ఆ తర్వాత 9వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం తూర్పుకు వ్యాపించడం ప్రారంభించి నేటి పాకిస్తాన్ లో ఉన్న సింధులోయకు చేరింది. యూరప్ లో మధ్యధరాసముద్ర తీరం వెంబడి పశ్చిమంగా వ్యాపించి స్పెయిన్ కు; వాయవ్యంగా డాన్యూబ్ నదీలోయ మీదుగా జర్మనీకి, ఆ తర్వాత ఉత్తరంగా స్కాండినేవియాకు, పశ్చిమంగా బ్రిటిష్ దీవులకు చేరింది.

జన్యువైవిధ్య స్థలి పశ్చిమ యూరేసియా

          వ్యవసాయానికి పుట్టిల్లు అనదగిన ప్రాంతంలో 44 మంది ప్రాచీన పశ్చిమాసియా జనానికి చెందిన ప్రాచీన DNA ను తాము సేకరించామని డేవిడ్ రైక్ చెబుతూ, 10వేల సంవత్సరాల క్రితం వ్యవసాయ విస్తరణ ప్రారంభమైనప్పుడు పశ్చిమ యూరేసియా జనాభా ఇప్పటిలా జన్యుపరంగా ఏకశిలా సదృశంగా లేదని అంటాడు.  ఇరాన్ లోని పడమటి కొండలకు చెందిన వ్యవసాయజనం, ఆ ప్రదేశంలో అంతకుముందు నివసించిన వేట-ఆహారసేకరణ జనం నుంచి నేరుగా జన్యువారసత్వాన్ని పొందారు. గొర్రెల పెంపకాన్ని తొలుత ప్రారంభించినది వీరే నంటారు. నేటి ఇజ్రాయిల్, జోర్డాన్ లకు చెందిన తొలి వ్యవసాయదారులు కూడా తమకు ముందు ఈ ప్రాంతాలలో ఉన్న వేట-ఆహారసేకరణ జనాలైన నతూఫియన్ల నుంచి చాలా వరకు నేరుగా జన్యు వారసత్వాన్ని పొందారు. అయితే ఈ జనాలు జన్యుపరంగా ఒకరికొకరు చాలా భిన్నులు. నేటి యూరోపియన్లకు, తూర్పు ఆసియన్లకు మధ్య జన్యుపరంగా ఎంత తేడా ఉందో; పశ్చిమాసియాలో, ఫెర్టైల్ క్రెసెంట్ (fertile crescent) గా పిలిచే ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇరాక్, సిరియా, లెబనాన్, ఈజిప్టు, జోర్డాన్; అనటోలియాలలోని తొలి వ్యవసాయ జనాలకు; తూర్పు(ఇరాన్)కు చెందిన తొలి వ్యవసాయ జనాలకు మధ్య కూడా అంతే తేడా ఉన్నట్టు తామూ, మరో పరిశోధక బృందమూ కనుగొన్నట్టు డేవిడ్ రైక్ అంటాడు.  పశ్చిమాసియాలో వ్యవసాయ విస్తరణ యూరప్ లో జరిగినట్టు కేవలం వలసల రూపంలోనే కాకుండా; జన్యుపరంగా అత్యంత భిన్నత్వం ఉన్న జనాలు ఒకే విధమైన ఆలోచనలను పంచుకోవడం రూపంలో కూడా జరిగిందని ఆయన అంటాడు.

నాలుగు రకాల ప్రధాన జనాభా

          10వేల ఏళ్ల క్రితం పశ్చిమాసియా జనాభాలో ఉన్న అత్యధిక వైవిధ్యం, పశ్చిమ యూరేసియా అంతటా ఉన్న విస్తృత వైవిధ్యసరళికి నిర్దిష్ట ఉదాహరణ. ఇందుకు సంబంధించిన జన్యు విశ్లేషణకు సారథ్యం వహించిన ఇయోసిఫ్ లజరిడీస్ అనే జన్యు శాస్త్రవేత్త ప్రకారం అప్పట్లో పశ్చిమ యూరేసియాలో  నాలుగు రకాల ప్రధాన జనాభా ఉన్నారు: 1. ఫెర్టైల్ క్రెసెంట్ కు చెందిన వ్యవసాయ జనాలు 2. ఇరాన్ కు చెందిన వ్యవసాయ జనాలు 3. మధ్య, పశ్చిమ యూరప్ లకు చెందిన వేట-ఆహారసేకరణ జనం 4. తూర్పు యూరప్ కు చెందిన వేట-ఆహారసేకరణ జనాలు. నేటి యూరోపియన్లకు, తూర్పు ఆసియన్లకు మధ్య ఎంత తేడా ఉందో; ఈ నాలుగు రకాల జనాల మధ్య అంత తేడా ఉండేది. పూర్వీకుల ఆధారంగా జాతుల వర్గీకరణ మీద ఆసక్తి గల పండితులు 10 వేల ఈల క్రితం ఉండి ఉంటే, వీరిని “జాతు”లుగానే వర్గీకరించి ఉండేవారు. అయితే ఈరోజున ఈ నాలుగు రకాల జనాలలో ఎవరూ సాంకర్యం చెందని వెనకటి స్థితిలో లేరు.

జనాభా వృద్ధికి దోహదం చేసిన వలసలు

          మొక్కలు, జంతువుల పెంపకంలో వచ్చిన విప్లవాత్మకమైన సాంకేతికతను అందిపుచ్చుకున్న పశ్చిమాసియా  వ్యవసాయ జనాలు వలసలు ప్రారంభించి తమ పొరుగు జనాలతో సాంకర్యం చెందుతూ వచ్చారు. వేట-ఆహారసేకరణ కన్నా వ్యవసాయం ఎక్కువ జనాన్ని పోషించగలగడం దీనికి కారణం. అయితే, ఈ వలసలలో ఒక తేడా ఉంది. అంతకు ముందు యూరప్ కు చెందిన వేట-ఆహారసేకరణ జనం ఇతర చోట్లకు వ్యాపించిన కొన్ని సందర్భాలలో, అక్కడి జనానికి స్థానభ్రంశం కలిగించి, వారిని అంతరించే పరిస్థితి వైపు నెట్టేవారు. ఇందుకు భిన్నంగా పశ్చిమాసియాకు చెందిన అన్ని జనసముదాయాలవారూ ఇతర చోట్లకు వలస పోయే క్రమంలో ఇతర జనాల వృద్ధికి దోహదం చేశారు.

కొత్త ఆర్థికతగా పశుపోషణ

          నేటి టర్కీ కి చెందిన వ్యవసాయ జనాలు యూరప్ కు విస్తరించారు. నేటి ఇజ్రాయిల్, జోర్డాన్ లకు చెందిన వ్యవసాయజనాలు తూర్పు ఆఫ్రికాకు విస్తరించారు. వీరి జన్యువారసత్వం నేటి ఇథియోపియాలో అత్యధికంగా కనిపిస్తుంది. నేటి ఇరాన్ లో ఉన్న వ్యవసాయజనాలు భారత్ లోకి; నల్లసముద్రానికి, కాస్పియన్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న స్టెప్పీల లోకీ విస్తరించారు. వీరంతా స్థానికజనాలతో సాంకర్యం చెంది పశుపోషణ మీద ఆధారపడిన కొత్త ఆర్థికతను స్థాపించారు. అది అంతవరకు వ్యవసాయానికి అనుకూలంగా లేని ప్రాంతాలలోకి కూడా వ్యవసాయ విప్లవం వ్యాపించడానికి దోహదం చేసింది.

కంచుయుగం నాటికి తగ్గిపోయిన జన్యువైవిధ్యం

          ఆ తర్వాత వేర్వేరు ఆహారోత్పాదక పద్ధతులను అనుసరించే జనాల మధ్య కూడా సాంకర్యం జరిగింది. అయిదు వేల ఏళ్ల క్రితం కంచుయుగపు సాంకేతికతాభివృద్ధి ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. దాంతో, అంతవరకూ పశ్చిమ  యూరేసియాకు స్వభావసిద్ధంగా ఉంటూ వచ్చిన (వైవిధ్యవంతమైన)జన్యు ఉపరి నిర్మాణం స్థానంలో, కంచుయుగం నాటికి, ఇప్పుడు కనిపించే అత్యల్ప జన్యువైవిధ్యం అడుగుపెట్టింది. సాంకేతికత (ప్రస్తుత సందర్భంలో పశువులు, మొక్కల పెంపకం) సాంస్కృతికంగానే కాక, జన్యుపరంగా కూడా ఏకరూపతకు ఎలా దారితీయగలదో తెలుసుకోవడానికి ఇదొక అసాధారణ ఉదాహరణ అనీ,  మన కాలంలో సంభవించిన పారిశ్రామిక విప్లవం కానీ, సమాచార విప్లవం కానీ మానవాళి చరిత్రలో అపూర్వమైనవేమీ కావనడానికి ఇదే నిదర్శనమనీ ఈ సందర్భంలోనే డేవిడ్ రైక్ అంటాడు.

నీలి కళ్ళు, బ్లాండ్ హెయిర్ రహస్యం

          ఒకప్పటి పశ్చిమ యూరేసియాలోని అత్యంత వైవిధ్యం కలిగిన జనాల మధ్య జరిగిన సాంకర్యం తీరును ఇప్పుడు ఉత్తర యూరప్ జనంలో కనిపించే నీలి కళ్ళు, లైట్ స్కిన్, బంగారు లేదా లేత పసుపు రంగు జుట్టు (బ్లాండ్ హెయిర్) పట్టిచూపుతాయని ఆయన అంటాడు. ఎనిమిది వేల ఏళ్లక్రితం పశ్చిమ యూరప్ లోని  వేట-ఆహారసేకరణ జనం నీలి కళ్ళతోనూ, డార్క్ స్కిన్ తోనూ, నల్ల జుట్టుతోనూ ఉండేవారు. ఇలాంటి సమ్మేళనం ఈ రోజున చాలా అరుదు. యూరప్ లోని తొలి వ్యవసాయజనం చాలా వరకు లైట్ స్కిన్ తోనూ, నల్ల జుట్టుతోనూ, గోధుమరంగు కళ్ళతోనూ ఉండేవారు. యూరప్ జనాలలో కనిపించే లైట్ స్కిన్ అక్కడికి వలస వచ్చిన వ్యవసాయజనం ద్వారా సంక్రమించింది. యూరోపియన్లలో బంగారు లేదా లేత పసుపు రంగు జుట్టు రూపంలో వచ్చిన మార్పునకు తొలి సాక్ష్యం, 17వేల సంవత్సరాల క్రితం తూర్పు సైబీరియాలోని బైకాల్ సరస్సు వద్ద ఒక ఏన్షియెంట్ నార్త్ యూరేసియన్(ANE) లో కనిపించింది. ఈ ANE జన్యువారసత్వం కలిగిన జనాలు పెద్ద ఎత్తున వలస వచ్చిన కారణంగానే నేటి మధ్య, పశ్చిమ యూరప్ లలో  బంగారు లేదా లేత పసుపురంగు జుట్టుకు సంబంధించి లక్షల కాపీలు తయారై ఉంటాయని డేవిడ్ రైక్ అంటాడు.

 (ఆధునిక యూరప్, భారతదేశాల జన్యుచరిత్రకు సంబంధించిన విశేషాలు తర్వాత)

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.