నడక దారిలో-22

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లోనే తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం , సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజుపేరు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. పరీక్షలు కాగానే హైదరాబాద్ లో కొత్తకాపురం, నాలుగు నెలల అనంతరం విజయనగరం వెళ్ళాను. మేలో పరీక్షలు ముగించుకుని హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. కొత్త కాపురం. తర్వాత—

***

          డిసెంబర్ 20 వతేదీన మా పెద్ద ఆడబడుచు కుటుంబం ఎల్.టీ.సీ మీద నెల రోజుల సెలవులతో భువనేశ్వర్ నుండి హైదరాబాద్ వస్తుంటే అమ్మ నా డెలివరీ కోసం వారితో బాటూ హైదరాబాద్ వచ్చింది.
 
          అప్పట్లోనే మా పెదనాన్న కొడుకు లక్ష్మణ రావు విద్యాశాఖ లో అధికారిగా పదోన్నతి పొంది హైదరాబాద్ కి కుటుంబం తో వచ్చాడు. మల్లేపల్లిలో ఇల్లు తీసుకున్నారు. బుచ్చిబాబు గారు వివాహానంతరం అనంతపురం లో ఉన్నప్పుడు బుచ్చిబాబు గారూ, వీళ్ళు ఇరుగు పొరుగు ఇళ్ళల్లో ఉండేవారట. ఒకసారి లక్ష్మణరావుగారి కుటుంబంతో కలిసి శివరాజు సుబ్బలక్ష్మిగారి ఇంటికి మేము వెళ్ళాము. సుబ్బలక్ష్మిగారు నా చెయ్యి పట్టుకొని వదల లేదు. ఎందుకో గానీ సుబ్బలక్ష్మి గారి స్పర్శ, ఆమె ఆత్మీయత నా అలసిన హృదయానికి ఎంతో ఉపశమనం కలిగించింది. అప్పటి నుండి వారితో గత నలభై ఏళ్ళకు పైగా ఆమె చివరి రోజులు వరకూ మా దంపతులకు ఆత్మీయ స్నేహ బంధం ఏర్పడింది. మల్లాపురం లో అబ్బాయి తో బాటు ఉన్నప్పుడు కూడా వెళ్ళి కలిసే వాళ్ళం. బెంగుళూరు వెళ్ళిపోయాక కూడా సుబ్బలక్ష్మి గారు తరుచూ ఫోన్ చేసి మాట్లాడే వారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ముందుగా ఫోన్ చేయటం వలన తప్పక ఆమె ఉండే హొటల్ కి వెళ్ళి కొంతసేపు గడిపి వచ్చేవాళ్ళం. తొంభై ఏళ్ళ వయసులో కూడా పెయింటింగ్ లు వేస్తూ సుబ్బలక్ష్మిగారు నిరాశకు తావివ్వకుండా జీవితాన్ని, కాలాన్ని రంగుల మయం చేసుకొంటూ గడపటం ఇప్పటి తరం నేర్చుకోవాలి.
 
          తరుచూ లక్ష్మణరావు గారి కుటుంబం మా ఇంటికి వస్తుండే వారు. అప్పడప్పుడు మా వాళ్ళు వెళ్ళేవారు. వాళ్ళే కాకుండా మా మరుదుల మిత్రులూ మా వారి మిత్రులు, మా ఆడబడుచు కుటుంబం ఇంత మందితో మా యింట్లో సత్రంలా వంటలూ వార్పులూ జరిగేవి. మా పెద్ద మరిదికి  ఆ ప్రాంతంలోనే  ఒక సంబంధం కుదరటంతో వాళ్ళు కూడా తరచూ రావటం మా మరిది వెళ్ళటం జరుగుతుండేవి. ఆ అమ్మాయి, మా మరిది పెళ్ళయిన వాళ్ళలాగా సినీమాలూ, షికార్లకు వెళ్ళేవారు. మాకు వెనుకబడి తప్పని సరిగా వచ్చే మా యింట్లో వాళ్ళు ఆ జంటని హాయిగా వెళ్ళనివ్వటం ఆశ్చర్యంగానే కాక ఒకింత అసూయ కూడా కలిగేది. 
 
          మా అమ్మ ఇది చూసి గాభరా పడేది.’ ఎప్పుడూ పొయ్య దగ్గరికి రాని చిన్న పాపాయి(నేనే ) ఇంత సంసారాన్ని ఎలా మోస్తుందా’ అని దిగులు పడేది.
“పురిటికి విజయనగరం తీసుకు వెళ్ళాల్సింది. ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నారు అని వీర్రాజు ఒప్పుకోలేదు. ఇన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు మధ్య నువ్వెలా బతుకుతున్నావో” అమ్మ ఒకింత బాధతో ఆశ్చర్యపోయింది.
 
          మాటిమాటికీ మా ఆడబడుచులు నడుము నొప్పి, తల నొప్పని పడకేస్తే నా చేత పనంతా చేయించ లేక అమ్మే చేసేది. అది నాకు చాలా బాధ కలిగించేది.
 
          సంక్రాంతి రోజు కూడా అదే పరిస్థితి. ఆ రోజు చనిపోయిన పెద్దలకు పూజచేసి అక్కడ వండిన అన్ని వంటకాలు పెడతారు. ఆడబడుచులకు ఆటంకం రావటంతో అమ్మా, నేనూ చేయాల్సి వచ్చింది. పొంగడాలు, గారెలూ సరిగా కుదరలేదు. ‘ఇటువంటి వాటిపై నమ్మకం లేకుండా చేయటం వలన కుదరలేదా? లేకపోతే నా చేతి వంట వాళ్ళ పెద్దలకి తినటం ఇష్టం లేక కుదరలేదా? ‘నాలో నేను నవ్వుకున్నాను.
 
          హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమం కాస్త చల్లారింది. కానీ ముల్కీ నిబంధనలకు ఆందోళన పడటం వలన ఆంధ్రా ప్రాంతంలో ఉద్యమం తీవ్రంగానే సాగుతోంది. జనవరి 17న  జైఆంధ్రా ఉద్యమకారులను, ఆనందగజపతిగారినీ, మరో ముగ్గురు కాలేజీ లెక్చరర్ లనూ అరెస్టు చేశారని వార్తాపత్రిక లో వచ్చింది.. జనవరి 16న గుంటూరులో కాల్పులలో 12 మంది చనిపోయారుట. ఇక సెపరేటు కాక తప్పదు అని అందరూ భావించారు.
 
          ఒకరోజు పొద్దున్నే వీర్రాజు గారు “బాబు కాకుండా పాపాయి పుట్టినట్లు ఈ రోజు కల వచ్చింది. నువ్వు అన్నట్లుగా పల్లవే మన ప్రేమలతకు చిగురిస్తుందేమో” అన్నారు. నేను ముసిముసిగా నవ్వాను 
 
          మా యింటికి వచ్చిన రత్నం ” మీకు పుట్టే పాపాయి ఆంధ్రా పాపా, తెలంగాణా పాపా” అని అడిగింది. పుట్టేలోపున విభజన జరుగుతే ఎక్కడ పాపగా పెరుగుతుందో తెలుస్తుంది అని మనసులో అనుకుంటూనే  నవ్వి ” తెలుగు పాపాయి” అన్నాను.
 
          జనవరి 20 న గుంటూరులో పోలీసుల కాల్పుల్లో 12మంది చనిపోయారని పేపర్లో చదివి వీర్రాజు” రాష్ట్రం విడిపోక తప్పదేమో. బహుశా విజయవాడకి బదిలీ అవుతుందేమో” అంటూ “అలా ఐతే మనతో బాటు కృష్ణుని మనతో తీసుకువెళ్దాం “అనేసరికి స్వర్గానికి వెళ్ళినా సవతి పోరు తప్పకపోవటమంటే ఇదేనేమో అనుకున్నాను.
 
          ప్రధాని ఇందిరా గాంధీతో తెలంగాణ, ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు సంపద్రింపులు మొదలయ్యాయి. ఉద్యమం ఆగిపోయింది. 18 న ముఖ్యమంత్రి పీ.వీ.నరసింహారావు రాజీనామా చేయటంతో విధించిన రాష్ట్రపతి పాలన మరొక ఆరు నెలలు కొనసాగించారు.
 
          ఎన్జీవో స్ట్రైక్ వలన వీర్రాజు గారికి జీతంలేదు. కానీ అనుకోకుండా యువభారతి వారి ముఖచిత్రాలకు డబ్బు ఇచ్చారు. అంతకు ముందు తెలుగు అకాడమీ వారికి వేసిన వాటికీ, ప్రభుత్వం సావనీర్లకు వేసిన వాటికీ డబ్బు అందటంతో కొంత ఊపిరి పీల్చు కున్నాము.
 
          తొమ్మిదో నెల వచ్చేసింది. అమ్మని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే” నువ్వు అసలు బరువు పెరగలేదు. పొట్టలో బిడ్డ పెరగటం లేదు. తినటం లేదా “అని కోప్పడింది. ఇంటి నిండా జనం. అలవికాని ఆర్ధిక భారం. దీనికి సమాధానం ఎక్కడ వెతుక్కోవాలి. మౌనం వహించాను.’ కనటానికైనా నీకు బలం వుంటుందా’ అని అమ్మ కళ్ళల్లో నీళ్ళు.
 
          “నువ్వు ఫేషనబుల్ గా ఫ్రాక్స్ కుడతావట కదా “పెద్దాడబడుచు అనే సరికి పొంగి పోయి అమ్మ మందలిస్తున్నా వినకుండా సంక్రాంతికి తొమ్మిది నెలల గర్భంతో పిల్లలిద్దరికీ ఫ్రాకులు కుట్టాను.
 
          సంక్రాంతి వెళ్ళిన నాలుగు రోజులకి ఆడబడుచు కుటుంబం తిరుగు ప్రయాణం కట్టారు. కానీ వీర్రాజు “సుభద్రకు మరో రెండు రోజుల్లో డెలివరీ డేట్ అని డాక్టరు అంది కదా మరో వారం రోజుల సెలవు పొడిగించండి” అనటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెలవు పొడిగించారు.
 
          తెల్లవారుజామున నాలుగు గంటలకు మెలకువ వచ్చింది ఎందుకో అనుమానం వచ్చింది. చూసుకుంటే రక్తస్రావం అవుతుంది. అమ్మని లేపాను. అప్పటికప్పుడు అమ్మ వేడి నీళ్ళతో స్నానం చేయించింది పెద్దవాంతి అయ్యి నొప్పులు ప్రారంభం అయ్యాయి. కానీ ఇంట్లో ఎవ్వరూ హడావిడీ చూసైనా లేవలేదు. అమ్మ, నేను వీర్రాజు హాస్పిటల్ కి వెళ్ళాం. వెంటనే జాయిన్ చేసుకున్నారు. ఒకవైపు వాంతులు, మరోవైపు నొప్పులు భరించలేక ఏడ్చేసాను. మూడు నిమిషాల సుఖం కోసం ఇంత యాతన అనుభ విస్తున్నానే అనిపించింది.
 
          డాక్టర్ దేవయానీ డంగోరియా దేవదూతలా నిర్మలమైన చిరునవ్వుతో ఆత్మీయంగా మాట్లాడుతూ ఓదార్చింది. నిజానికి ఆమెని చూస్తుంటేనే సగం రోగాలు తగ్గిపోతాయనేలా ఆమె ఉంటుంది.
 
          పగలంతా బాధ పడుతూనే ఉన్నాను. సాయంత్రం మందుకొనాలని వీర్రాజు బయటకు వెళ్ళారు. అకస్మాత్తుగా కరెంటు పోయింది. అంతలో నొప్పులు తీవ్రం కావటంతో నన్ను లేబర్ రూం లోకి తీసుకు వెళ్ళారు. అయ్యో ఆయన్ని చూడలేదు. నేను తిరిగి బయటకు వస్తానా అని భయం వేసింది.
 
          నేను రూంలోకి వెళ్ళగానే కరెంట్ వచ్చింది. అంతలో నాతో నేను చేస్తున్న పోరాటం పూర్తి అయ్యింది. ఎండిన పెదాల మీద చిరునవ్వు చిగిరించింది.
 
          “అంతగా మురిసి పోతున్నావు. పాప కావాలను కుంటున్నావా? బాబు అనుకున్నావా?” అంది డాక్టర్.
 
          “ఎవరైనా పర్వాలేదు డాక్టర్. కానీ పాపాయి పుట్టాలని కోరుకున్నాను” అన్నాను.
 
          డాక్టర్ నవ్వి “నీ కోరికే తీరిందిలే” అన్నారు.
 
          ఓ గంట తర్వాత రూంకి చేర్చారు. వీర్రాజు ముఖం నిండా ఆదుర్దా కదులుతోంది. నన్ను చూడగానే ముఖం వెలిగింది.” నువ్వు కోరుకున్నట్లు పల్లవే పుట్టింది” అన్నారు నవ్వుతూ.
 
          నాముఖం మీద గర్వ వీచిక మెరిసింది.
 
          ‘ నేను అమ్మనై పోయాను. ఇంక మరిన్ని అనుభూతులు, మరిన్ని బాధ్యతలు అవన్నింటికీ నాకు మనోబలం కావాలి’ కళ్ళు మూసుకుని మనసును కూడగట్టుకున్నాను.
 
          ఏమి తిన్నా ఇమడకపోవటంతో నీరసంగా పడుకున్నాను. మర్నాడు ఆడ బడుచులు పాపని చూడటానికి హాస్పిటల్ కి వచ్చి “పాప నల్లగానే ఉంది” అని నొక్కి వక్కాణించారు. నేనేమీ మాట్లాడలేదు.
 
          అంతలో డాక్టర్ రౌండ్స్ కి వచ్చి ” ఏమంటుంది నీ లిటిల్ బేబీ” అని నవ్వుతూ పలకరించారు. బరువు బాగా తక్కువగా ఉంది, తర్వాత పెరుగుతుంది. భయపడకు” అన్నారు.    
 
          ‘హమ్మయ్య ‘ అని నిట్టూర్చాను.
 
          హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు హాస్పిటల్లో వాళ్ళిచ్చిన బట్టలే పాపాయికి వేయాలి. ఇంటికి వచ్చాక వేయాలంటే రెడీ మేడ్ బట్టలు కొనాలంటే అంత ఖరీదు పెట్టలేము. అందుకని తెల్లని గ్లాస్కోబట్ట కొని పెద్దాడబడుచుని చిన్నజుబ్బాలు కుట్టమంటే నాకు చాతకాదు అంది. బట్టకొని తెమ్మని వీర్రాజు తో చెప్పి అమ్మా, నేను హాస్పిటల్ మంచం మీదే పాప కోసం చేత్తోనే జుబ్బాలు కుట్టాము. 
 
          నేను ఇంటికి రాగానే ఆడబడుచు వాళ్ళు వెళ్ళి పోయారు. పురిటి స్నానం కాగానే యథావిధిగా ఇంటి పనులు మొదలెట్టాను. పాపకి స్నానం చేయించటానికి ఒక అవ్వని కుదుర్చుకున్నాను
 
          పాపని ఉయ్యాలలో వేసి వేడుక చేయాలని ముచ్చట పడ్డారు వీర్రాజు గారు. ఇరవై ఒకటోరోజున ఎక్కడి నుండో ఉయ్యాల తెచ్చి మిత్రులను పిలిచి పార్టీ ఇచ్చాము.’ ఎస్.పి.బాలసుబ్రమణ్యం  కూతురు పేరు పల్లవి. మళ్ళీ మీపాపే పల్లవి’ అని అందరూ అనేసరికి సంతోషంతో పల్లవిని ముద్దులాడేను.
 
          పాపకి నెలనిండక ముందే విజయనగరంలో పెద్దన్నయ్య భార్య వదిన అమ్మని పంపించేయమని ఉత్తరం రాసింది.
 
          అమ్మ నన్ను పాపని తీసుకు వెళ్తానంది. కానీ ఇప్పుడిప్పుడే ఈ ఇంట్లో నా స్థానాన్ని పదిలపరచు కుంటున్నాను. అందులోనూ పెళ్ళికాక ముందే కాబోయే తోటి కోడలు మాటిమాటికీ వచ్చి పెత్తనం చేస్తోంది. ఈ పరిస్థితి లో రానని అమ్మతో చెప్పాను.
 
          అమ్మ మరేమీ అనలేక పలు జాగ్రత్తలు చెప్పింది. వీర్రాజు అమ్మని విజయనగరంలో దించి వచ్చారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.