నిష్కల – 22

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: సారా, నిష్కల వర్థింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ కి  కాంపింగ్ కి వెళతారు.  నిష్కల తీస్తున్న కూనిరాగం విని ఈ పాట మా నాన్న కూడా హమ్ చేసేవాడని చెబుతుంది సారా.  వారి మాటల్లో సారా తండ్రి వాళ్లతో లేడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది నిష్కల.  తండ్రి లేని తనం మరచిపోయేందుకు, సాంత్వన పొందేందుకు తిరిగిన ప్రదేశాల గురించి చెబుతుంది సారా. తండ్రి గురించిన సందిగ్దాలలో  ఉంటుంది నిష్కల 

***

          రోజంతా తిరిగిన ఇద్దరు అలసిపోయారు. కాసేపు నడుం వాలిస్తే బాగుండు అనిపించింది నిష్కలకు.  మెదడుకు పని పెట్టడం తప్ప శరీరానికి ఇంత పని పెట్టింది చాలా తక్కువ. అలవాటు లేని శరీరం కాసేపు విశ్రాంతి కోరుతున్నది.  ఆ మాటే సారాతో అన్నది. 
 
          ముందు స్నానం చేసేయ్. అలసట తీరుతుంది. శరీరం తేలిక అవుతుంది. అని సలహా ఇచ్చింది సారా. 
 
          విడిచిన బట్టలు సెపరేట్ కవర్లో వేసి కారు డిక్కీలో పడేయ్. ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి బట్టలు ఉతుకేసు కోవడం మంచిది.  ఈ అడవుల్లోని  క్రిమి కీటకాలు పొరపాటున మన ఇంట్లోకి చేరి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం జాగ్రత్తలు.. నిష్కల చూపులను అర్థం చేసుకున్న సారా  వివరంగా చెప్పింది. 
 
          సరేనన్నట్టు తలూపింది నిష్కల.  
 
          స్నానం చేసొచ్చిన  నిష్కల క్యాంపింగ్ చైర్ లో కూర్చుని పారే నదిలో పెయింట్ చేసినట్లు కనపడుతున్న పడమటి రంగుల్ని చూస్తన్నది. 
 
          కొత్త ప్రపంచం.. ఇదివరకు ఎప్పుడు ఊహించని ప్రపంచంలోకి వచ్చింది. ప్రకృతి పై ప్రేమతో కాదు సారాతో కలిసి ఉండే సమయం కోసం, ఆమెతో తండ్రి వివరాలు , విషయాలు తెలుసుకోవడం కోసం వచ్చింది.  ఇంత వరకు ఆ విషయాలు తెలుసు కున్నది తక్కువ. కానీ సారా నుండి, ప్రకృతి నుంచి చాలా నేర్చుకున్నా అనుకున్నది నిష్కల. ఇటువంటి ప్రకృతిలో ఉంటే ఎటువంటి సమస్యల నుంచైనా కొంత స్వాంతన పొందవచ్చు.  ఎంతటి దుఃఖాన్ని అయినా కాలం మార్పు తెస్తుంది. ఇటువంటి ప్రదేశాల్లో ఉంటే మరింత త్వరగా ఆ మార్పు సాధ్యమవుతుంది. 
 
          అమ్మని కూడా ప్రకృతిలోకి నడిపించాలి.  కాలు చెయ్యి సరిగ్గా ఉన్నప్పుడే తిరగ గలిగినంత తిరిగెయ్యాలి. అమ్మకు కన్యాకుమారిలోని వివేకానంద రాక్, కేరళ బీచ్ లు చూడాలని కోరిక.  దాన్నలా మనసులోనే మడతపెట్టి దాచుకుంది. వెళ్ళమంటే కదలదు. నాన్నమ్మ కోసం తను చాలా త్యాగం చేసేస్తున్నది.  నాన్నమ్మ కొడుకులు కోడళ్ళు, కూతురు అంతా హాయిగా తమ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్లకు కావలసిన విధంగా వాళ్ళు ఉంటున్నారు.  
 
          అమ్మ ఒట్టి పిచ్చిది.  నాన్నమ్మ బాధ్యత తన నెత్తిన తానే వేసుకుంది.  అవతలి వాళ్ళు తప్పించుకుంటే నువ్వెందుకు తీసుకోవాలి అని వాదిస్తుంటాను. కానీ అమ్మ ఒప్పుకోదు.  
 
          ఈ సారి నేను వెళ్ళినప్పుడు అమ్మకి ఇష్టమైన ప్రదేశాలకు తీసుకుపోవాలి. నాన్నమ్మను అత్త ఇంటికి పంపిస్తే సరి అనుకుంటూ తీసిన ఫోటోలు చూసుకున్నది. తృప్తిగా నవ్వుకున్నది. 
 
          సారా ఫొటో చూస్తే అమ్మ, నాన్నమ్మ ఎలా ఫీలవుతారు .. ఒక్క ఫోటో వాళ్లకు  పంపిస్తే ,,  ఆలోచనలో పడింది .
 
          మనిషికి ఏ బంధంలోనైనా కోరుకునేది కావలసింది స్వేచ్ఛ , స్నేహం. మనసుకు ఏమనిపించినా అది పంచుకునే స్వేచ్ఛ కావాలి. తన వాళ్లతో తన భావాలు , ఆలోచనలు, ఇష్టాలు, ఎదురయ్యే ప్రతిదీ అది ఏదైనా పంచుకునే స్నేహం ఉండాలి.  ఆ స్నేహం ఇప్పుడిప్పుడే సారాతో మొగ్గ తొడుగుతున్నదని మదిలో తలపోస్తూ  నిశ్చలంగా కని పిస్తున్న నదిలో రెండు గులక రాళ్ళు వేసింది. 
 
          వలయాలు వలయాలుగా నీటిలో సన్నటి సుడులు.. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మాములుగా, ఏమీ జరగనట్లుగానే నీళ్లు. మనుషుల మధ్య ఉండే బంధాలు, అను బంధాల మధ్య పడే గులకరాళ్లు వారి జీవితాల్లో కలతల కలవరం కలిగిస్తాయి.  కానీ సర్దుకోవడానికి ఎందుకు ఆలస్యం ? అహం అడ్డు వస్తుంది. ఎదురు తిరుగుతుంది.  సుడులు మరింత పెరుగుతాయి. ఇటు నుంచి అటు నుండి వేసే గులకరాళ్లు  మరింత ప్రకంపనలు పెంచుతాయి. ఆ తర్వాత ఎప్పుడో కుయ్యో మొర్రో అంటే లాభం ఏమిటి ? 
 
          అంకిత్ నన్ను ఇష్టపడుతున్నాడు. నన్ను కోరుకుంటున్నాడు అంటే నాకు విలువ ఇచ్చినట్లా.. ఇవ్వనట్లా .. ? 
 
          ప్రేమను తాను అనుభూతి చెందడమే కాదు వీలైతే అప్పుడప్పుడు వ్యక్తీకరించాలి.  
అది తాను చేస్తున్నదా.. అతను అనుభూతి చెందేలా ప్రవర్తించాలి . అప్పుడు దాని ప్రభావం లోతుగా ఉంటుందని తెలుసు. అయినా ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నది? 
 
          వృత్తిపరంగా తాను వింటున్న పురుషుల నైజం వల్లనా?  
 
          అంకిత్ కి తన పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే అవి ఉత్త అనుమానాలు , అపోహలు అనుకుందాం.  మరి నాకు అతని పట్ల ఉన్నవి కూడా అనుమానాలు, అపోహలు అని ఎందుకు అనుకోలే పోతున్నది. ఎందుకు సరిపెట్టుకోలేక పోతున్నది? 
అంతటి సహృదయం నాకు లేదా .. 
 
          అసలు తనకి కావలసింది ఏంటి?  అతని ప్రేమ బంధం ముఖ్యమా .. లేక అహాన్ని చల్లార్చు కోవడం ముఖ్యమా .. 
 
          అతను అపోహలతో ఉంటే నేను, నేను అపోహలతో ఉంటే అతను మధ్యలో దూరిన ఆ అపోహల్ని, అనుమానాల్ని దూరం చేయాల్సిన బాధ్యత ఇద్దరిపై ఉంది. 
ఏ విషయమైనా సరే చెప్పాల్సింది స్పష్టంగా, సూటిగా సున్నితంగా  చెప్పినప్పుడు సమస్య ఉండదు. అనవసరపు  రాద్ధాంతాలు ఉండవు.  ఇద్దరం మా వ్యవహార శైలి మార్చుకుంటే, ఇద్దరం ఒకే ఉద్దేశంతో ఆలోచిస్తే ..  ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం అంత బలహీనం కాకుండా కాపాడుకోవచ్చు.. అది ఆడైనా మగైనా .. 
 
          అంకిత్ తో బంధం పటిష్టం చేసుకోవడం, సారాతో బంధం నిలబెట్టు కోవడం గురించి ఆలోచిస్తున్నది  నిష్కల. మనిషి జీవితం చాలా చిన్నది.  ఈ జీవితంలో సహచర్యం ఎంత అవసరమో ప్రేమ, స్నేహం, ఆత్మీయ అనుబంధాలు కూడా అంతే అవసరం. నిత్యావసరం.  
 
          ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడ్డ బంధంలోకి స్వార్ధం, దురాశ, అహంకారం ప్రవేశిస్తే .. బంధం బలహీనమై పోతుంది. అదేగా తమ మధ్య జరిగింది. ఏ బంధమైనా కొంత సర్దుబాటు ఉంటేనే నిలుస్తుంది. అందుకే పట్టువిడుపులు ఉండాలి.  ఆ సర్దుబాటు ఒక వైపు నుంచి కాకుండా రెండు వైపులా ఉండాలి. 
 
          అంకిత్ తనకు తానై వెళ్లిపోయి తనను అవమానించాడని బాధపడుతున్నది. అతనిలో ఉన్న స్వార్థం, ఆధిపత్య పోకడను అంగీకరించలేక పోతున్నది. అతను తన తప్పు తెల్సుకున్నాడో లేక సర్దుబాటు చేసుకుందామనుకున్నాడో తెలియదు కానీ కలలు సాకారం చేసుకునే దిశలో బంధాన్ని గట్టి పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంకిత్ విషయం ఇప్పటి వరకు ఎవరితో చర్చించలేదు. అది తమ ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం. మూడో వ్యక్తి ప్రమేయం మంచి కంటే చెడే ఎక్కువ అని నిష్కల నిర్దిష్ట అభిప్రాయం.  లోపల జరిగే ఘర్షణ ఎవరికీ చెప్పుకోలేక పోవడం వల్ల అప్పుడప్పుడు ఒంటరితనం అనుభవిస్తున్నది.  మళ్ళీ అంతలోనే నేను ఎన్నడూ వంటరి కాదు. విశాలమైన ప్రపంచంలో ఎవరున్నా లేకున్నా నాకు నేనున్నాను.  ఒంటరి ఎన్నటికీ కాదు. కడుపులో కష్టం, మనసులో సంఘర్షణ  చెప్పుకో గలిగే  ఆత్మీయులు, స్వాంతన కుదర్చ గలిగే  మిత్రులు ఎందరో ఉన్నారు. ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అందరికంటే అత్యంత ఆత్మీయ మిత్రురాలైన అమ్మకు కూడా విషయం చెప్పలేదు.   
వాళ్ళెవరికీ తమ విషయం చెప్పక పోవడానికి కారణం సమస్య తమది కాబట్టి అది పరిష్కరించుకునే ఓర్పు నేర్పు తమ మధ్య ఉన్నాయనే నమ్మకం ఉంది కాబట్టి ..
అంతే .. 
 
          అసలు అమ్మకి చెబితే ఏమంటుంది? ఎటువంటి సలహా ఇస్తుంది? మా ఎడబాటు గురించి తెలిస్తే అమ్మ తట్టుకోగలదా .. 
 
          తన జీవితంలో తాను జీవించడం మొదలు పెట్టాక అమ్మ తన పాత్రను అద్భుతం గా మలుచుకున్నది. అంతటి సాహసం తనకున్నదా..  ఉంటే అతని సహచర్యాన్ని నిత్య నూతనంగా మలుచుకోగలిగేది కదా .. 
 
          జీవనోత్సాహం తరుగుతున్న సమయంలో సారా పరిచయం కొత్త ఊపిరి పోసినట్లయింది. అంకిత్ పట్ల తనకి వచ్చిన కోపం, బాధ చప్పున చల్లారి పోవాలి. తాటాకు మంటలాగా చల్లారి పోవాలి. నిత్యాగ్నిహోత్రం లాగా మండకూడదు. అతని పై ద్వేషం లేదు. ప్రేమ ఉంది. అలాంటప్పుడు ఆ క్షణాల్లో వచ్చిన కోపాన్ని, బాధని జీవితమంతా మోసుకుపోవడం ఎందుకు?  
 
          మానవ మాత్రులం కదా.. 
 
          రంగులు మార్చుకుంటున్న ఆకాశంలోకి మేఘాలు దూసుకొస్తున్నాయి. స్వార్ధంతో కలుషితం అయిన బుద్దిని, రక్తాన్ని శుద్ధి చేసే వర్షం పడితే ..? తన ఆలోచనకు తానే నవ్వుకుంది నిష్కల 
 
          “నీలో నువ్వే నవ్వుకుంటున్నావంటే ఏదో విశేషం ఉన్నట్లే .. బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడా ..” కన్ను గీటుతూ నవ్వింది అప్పుడే వచ్చిన సారా .. 
 
          స్నేహాలు పెరిగే కొద్దీ ముగింపులు చూడడానికి ఏమంత బాగుండవు అని అనుభవం లో తెలుసుకున్నది. ప్రాంతాలు, కులాలు, మతాలు, అజెండాలు, లాభనష్టాల ప్రాతి పదికన అణువణువునా నిండిపోయిన సమాజంలో స్నేహం కృత్రిమంగా మారిపోవడాన్ని చాలా సందర్భాల్లో చూసింది.  మనిషిని దగ్గరగా చూసిన కొద్దీ కప్పుకున్న రంగులు వెలిసి పోయి అసలు రంగు బయటపడి అందవికారంగా కనిపిస్తుంది. అందుకే ఏ స్నేహాన్ని ఒక స్థాయికి మించి దగ్గరకు రానివ్వదు.  ఆ విధంగా రానిచ్చింది అంకిత్ ని మాత్రమే. 
 
          ఇప్పుడు సారా స్నేహాన్ని స్వచ్చందంగా ఆహ్వానిస్తున్నది.  ఆమెను ఆమోదిస్తున్నది. లోపాలు లేని నిఖార్సైన వ్యక్తులు ఎవరూ ఉండరేమో .. అనేక వ్యక్తిత్వ లోపాలు ఉంటాయేమో .. అంకిత్ లో ఉన్నట్లు సారాలో కూడా ఏవో కొన్ని వ్యక్తిత్వ లోపాలు ఉండే ఉంటాయి.  కానీ వాటితోనే ఆమె స్నేహాన్ని కాంక్షిస్తున్నది నిష్కల.
 
          అంకిత్ విషయం చెప్పాలా వద్దా అని కొన్ని క్షణాలు తటపటాయించి, ఏమీ లేదన్నట్లు తలూపి నెమ్మదిగా లేచి సారా దగ్గరకు వచ్చింది నిష్కల. 
 
          “నీ సంగతేమో నాకు తెలియదు కానీ నా బాయ్ ఫ్రెండ్ ని మాత్రం చాలా మిస్ అవుతున్నాను. ఈ సమయంలో ఇలాంటి వాతావరణంలో ఉంటే ఎంత రొమాంటిక్ గా ఉంటుందో..” అన్నది సారా. 
 
          “నిజమా.. అయితే నీ బాయ్ ఫ్రెండ్ ని ఎప్పుడు పరిచయం చెయ్యలేదు..”
         
          “గుప్పిట్లో  పెట్టి దాచేసా.. లేకపోతే ఎవరైనా ఎగరేసుకుపోతే.. “కళ్ళెగరేస్తూ గలగలా నవ్వింది సారా 
 
          “ఊహు .. అలాగా..” అంటూ ఆ నవ్వులో జత కలిపింది నిష్కల 
 
          “మరి నీ బాయ్ ఫ్రెండ్..” అంటూ ఆగి, “భారతదేశంలో జతగాడిని పెద్దలే ఎంపిక చేస్తారట కదా ..”అవునన్నట్లు తలూపిన నిష్కలను చూస్తూ “నీకు కూడా పెద్దలే ఎంపిక చేస్తారా .. “అడిగింది సారా 
 
          “లేదు. మా అమ్మకి ఆ అవకాశం ఇవ్వలేదు.  నా జతగాడిని నేనే ఎంపిక చేసుకున్నా..” అంకిత్ ని తలుచుకుంటూ నిష్కల 
 
          “నీ బాయ్ ఫ్రెండ్ అంత వరకేనా .. పెళ్లి లాంటిది .. “అంటున్న నిష్కల మనసు    అర్థం చేసుకున్న సారా
 
          “బంధాలు పది కాలాల పాటు నిలబడాలంటే కనీసం మూడు అంశాలలోనైనా ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉండాలి. ఇద్దరి భావాలు, విలువలు , అభిరుచులు ఏకీభావంతో లేకపోతే బంధాలు ముక్కలైపోతాయని నా భావన.  ఎదుటివారి భావాల్లో అభ్యంతరాలు ఉంటే చర్చల ద్వారా భేదాభిప్రాయాలు తొలగించుకోవచ్చు. ఒకరి అభిరుచులను ఒకరు అంగీకరిచ గలిగితే, మన్నించగలిగే పరిణతి ఉండాలి . 
 
          ఒకవేళ, నా అభిప్రాయంతో అతను ఏకీభవించకపోయినా, అతని అభిప్రాయంతో నేను ఏకీభవించకపోయినా నష్టం లేదు కానీ అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛను మాత్రం కాపాడుకోవాలి.  ఈ ప్రజాస్వామ్య సూత్రాన్ని  చాలా మంది ఆలోచించరు . పట్టించుకోరు. అందుకే మేమింకా పెళ్లి వరకు వెళ్ళలేదు.  ఒకరినొకరు అర్ధం చేసుకునే క్రమంలో ఉన్నాం.  మా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే  మా జీవిత ప్రయాణం అర్ధవంతంగా కొనసాగించగలం అనుకున్న రోజు సహజీవనం చేయడమా .. పెళ్లి చేసుకోవడమా అని నిర్ణయించుకుంటాం.”  గాలికి ఎగురుతున్న జుట్టును మధ్య మధ్యలో వేళ్ళతో సవరించుకుంటూ.. ఆకాశాన్ని, నదిని, నిష్కలను మార్చి మార్చి చూస్తూ నిష్కల 
 
          “అతనెక్కడ ఉంటాడు సారా.. ”  నిష్కల 
 
          “నా సోల్ మెట్ ఆ చివరి సియాటెల్ లో నేను ఇక్కడ. ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళం.  
వీలు చిక్కినప్పుడు అతను ఇటు రావడం లేదంటే నేను అటు వెళ్లడం చేస్తున్నాం.  త్వరలో ఒక నిర్ణయం ప్రకటిస్తాం ” అంటూ సారా తన రిలేషన్ గురించి చెప్పినప్పుడు ఉత్సుకత తో విన్నది నిష్కల 
 
          ” మీ అమ్మ.. “
 
          “మా అమ్మ అందరు అమ్మల్లాంటిదే.  పెళ్లి చేసుకొమ్మని పోరుతుంటుంది.  నాకేమో .. మనసులు కలిసిన తర్వాత పెళ్లి అనే తంతు అవసరమా అని ప్రశ్న.ఆడామగా కలిసి జీవించడానికి పెళ్లి లైసెన్స్ వంటిది అంటుంది అమ్మ.  నాకేమో అందులో అర్ధమే లేదనిపిస్తుంది. నీకు తెలుసా.. మా అమ్మమ్మ వాళ్ళ పెళ్లిళ్లు కూడా ఇండియన్స్ లాగే పెద్దలు చేసిన పెళ్లేనట. ఆస్తులు, అంతస్తులు చూసి పెళ్లి సంబంధాలు కుదుర్చు కుంటారట.  మా అమ్మ ఆ పద్దతిని బ్రేక్ చేసింది. ఇప్పటి తరం వారు తమకి నచ్చిన వాళ్ళని చేసుకుంటుంటే ఏమీ అనలేక పెద్దలు మౌనం వహిస్తున్నారట.  అమ్మ సంప్రదాయంగా చేసుకునే పెళ్లి చేసుకోలేదు. నాన్నతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండేది.  ఆమె లోపల లోపల సాంప్రదాయ పెళ్లి చేసుకోలేదని  వెలితి ఉంటుందేమో.. అంతే కాకుండా మా నాన్న తరపు వాళ్ళతో బంధుత్వం లేకపోవడం కూడా ఆమెకు పెద్ద లోటుగానే భావిస్తుంది. బహుశా.. అందుకే నన్ను పెళ్లి వైపు నడిపిస్తుందేమో అని నా సందేహం. 
 
          నేనంతా నాన్న పోలిక, నాన్న బుద్ధులే అంటుంది అమ్మ.  నాకే కాదు మా నాన్నకి కూడా ఆస్తులు, అంతస్తులు  చూసి పెద్దలు చేసే పెళ్లిళ్ల పై నమ్మకం లేదు. ఆయన మనసును అర్థం చేసుకోకుండా పెద్దలు ఒత్తిడి చేసి చేసిన పెళ్లిని కాదనుకుని మనసుకు దగ్గరైన అమ్మతోనే జీవించారు.”  చెప్పుకు పోతున్నది సారా 
 
          “మీ నాన్న మొదటి భార్య ఏమైంది? ఆవిడ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా ” సారా చెబుతున్న విషయాన్ని మౌనంగా వింటున్న నిష్కల అకస్మాత్తుగా అడిగింది.  ఆ గొంతులో తీవ్రతకు సారా ఆశ్చర్యంగా చూస్తున్నది. 
 
          “ఏమో .. అదంతా నాకు తెలియదు” అంటూ భుజాలెగరేసి ” కానీ మా నాన్నలో అతని మొదటి భార్య పైన సానుభూతి, జాలి తో పాటు పెద్దల మాటకు తలొగ్గి తప్పు చేసిన భావన ఉండేదని అమ్మ చెబుతుంది.” పక్కనున్న కాంప్ సైట్ లోంచి వస్తున్న చంటివాడి ఏడుపు చెవిన పడడంతో దృష్టి మరలిస్తూ 
 
          “అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఆ జింక పిల్ల లాంటి  అమ్మ స్వేచ్ఛా జీవితం లోకి పెళ్లి వచ్చి కాళ్ళకు అడ్డం పడింది. ఇంకా టీన్స్ దాటని అమ్మ  చిగురించే ఆశలతో కొత్త జీవితాన్ని కలగంటూ పెళ్లి బంధం లోకి వెళ్లింది. ఆ బంధం ఆమె ఆశలను సమూలంగా మాడ్చి మసి చేసేసింది. తీవ్రమైన మానసిక క్షోభను మిగిల్చింది. ఆ బంధ జ్ఞాపకాన్ని, ఆమె కంటూ మిగిలిన ఏకైక బంధాన్ని నేను. ఆమె శ్వాస, ధ్యాస నేను మాత్రమే.”
 
          మ్రాన్పడి పోయి వింటున్నది సారా . 
 
          “నిష్ .. ఏమన్నావు ”  చుట్టూ ముసురుకున్న చీకట్లలోంచి అన్నది సారా 
 
          “అవును, సారా .. నువ్వు విన్నదంతా నిజమే.. మా అమ్మానాన్నలది పెద్దలు చేసిన పెళ్లి.  నాన్న జీవితంలో ఉన్న అవతలి వ్యక్తికి చెక్ పెట్టే తెలివితేటలు లేవు అమ్మకి.  నాన్నతో తనకు ఏర్పడిన బంధం  పట్ల గొప్ప నమ్మకం. మేనత్త కొడుకుగానే కాకుండా చిన్నప్పటి నుండి నీ మొగుడు అనే బంధు మిత్రుల వల్ల అతనంటే ప్రేమ ఏర్పడ్డాయి. అతను ఉన్నత చదువుతో మంచి ఉద్యోగం విదేశాల్లో సంపాదించడం అప్పటి రోజుల్లో గొప్ప విశేషం. అందరూ నాన్నని గొప్పగా పొగుడుతుంటే అమ్మ ఆరాధన మరింత పెరిగి పోయింది. అదంతా తెలిసీ తెలియని వయసులో.  మనస్సుకు సంబంధించిన ప్రేమ గొప్పదని, అవసరానికి వాడుకునే వస్తువు కాదని అమ్మ భావన. 
 
          ఏదేమైనా అతని ప్రేమ బతికింది. అతని పట్ల అమ్మ నమ్మకం ఆమె మనసుకు సంబంధించింది. ఆ నమ్మకం ఎంత అంటే మీటర్లలో, కిలోల్లో కొలవలేనంత.  తన కోసం కాకపోయినా నా కోసమైనా నాన్న వస్తాడు అన్న నమ్మకం మా అమ్మది.  పిచ్చి అమ్మ, ఆయనకి బంధాల పట్ల, బంధుత్వాల పట్ల నమ్మకం లేదని, ఒట్టి స్వార్ధపరుడని నాకు అర్ధమైంది కానీ మా అమ్మకి అర్ధమైందో లేదో…”
 
          “మీ నాన్న పేరు ” ఏవో తెరలు పొరలు పొరలుగా విడిపోతుండగా  అడిగింది సారా 

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.