నోబెల్ సాహితీ పురస్కార గ్రహీత ఆనీ ఎర్నా
మగువల నిషిద్ధ జ్ఞాపకాల స్వేచ్ఛా గీతిక
-వి.విజయకుమార్
ఆనీ ఎర్నాకి ఇప్పుడు ఎనభై రెండేళ్ళు. ఆమెను నోబెల్ వరించడంతో సాహిత్య లోకమంతా ఆమె వైపు ఒక్కసారిగా అవాక్కయి చూట్టానికి పెద్ద కారణమే ఉంది, “తన అంతః చక్షువుతో వైయక్తిక స్మృతిపథంలోని మూలాల, ఎడబాట్ల, సమిష్టిగా ఎదురొడ్డే అడ్డుగోడల్ని ఛేదిస్తూ శోధించే స్పష్టతకూ, సాహసానికీ” నీరాజనాలు పడుతూ ఈ తొలి ఫ్రెంచ్ మహిళామణికి స్వీడిష్ అకాడమీ నోబెల్ కిరీటాన్ని అందిస్తున్నట్టు ప్రకటించింది ఇటీవలే!
అకాడెమీ భావించినట్టు, తన జ్ఞాపకాల దొంతరల్లో, పొరలు పొరలుగా పేరుకుపోయి ఘనీభవించిన, ప్రోటోప్లాజపు జీవకణ మాతృకల క్రోమాటిన్ వలపదార్థాల్ని యే జీవజాల శాస్త్రవేత్తో మైక్రోస్కోపిక్ అంతర్దృష్టితో చొచ్చుకెళ్లి, జీవ రహస్యాల్ని ఛేదించినట్టో, శోధించినట్టో, మానవ మస్తిష్కపు రాగాల్నీ, ద్వేషాల్నీ తడుముతూ ఎర్నా చేసిన అంతర్మధనం నిజానికి ఒక అసాధారణ రచనా వైభవం.
ఎర్నా ఒక సజీవ ఎక్స్ రే దర్పణం, అది మెరిసే చర్మ సౌందర్యపు ప్రతిబింబాలనే కాదు, ఎముకల ఛాయల్నీ, మజ్జల్లో దాగుండి పోయిన ప్రచ్ఛాయల్ని సైతం వెలికి తీసేందుకు వెనుకాడని ఒకానొక రచనా సంవిధానం.
నార్మండీ లో పచారీ కొట్టు నడుపుకునే ఒక సాధారణ శ్రామిక కుటుంబంలో పుట్టి పెరిగిన ఎర్నా ఇరవైయేళ్ళకి లండన్ చేరి ఒక ఆయా లా జీవితాన్ని ప్రారంభిస్తుంది. కొంత కాలానికి మళ్ళీ తను పుట్టిన దేశానికే వెళ్ళిపోయి, ఆధునిక సాహిత్యంలో డిగ్రీ చేసి స్కూల్ టీచర్ అవుతుంది. ఎ గాళ్జ్ స్టోరీ తన ఆయా జీవితపు అనుభవాల గనుల ఫోటో గ్రాఫిక్ మెమరీ. 1974 లో రాసిన తొలి నవల క్లీన్డ్ ఔట్ క్లీన్ బౌల్డ్ చేయక పోయినా సాహిత్య రంగంలో తనకొక సంతకాన్ని చేసుకునే అవకాశ మిచ్చింది. కాల్పనికత కంటే జీవితానికీ, జీవితంలో ఎదురయ్యే అనుబంధాలకూ, అనుభవాలకూ, సవాళ్లకూ విలువనిస్తూ, అనుభూతుల మడతల్ని ఒక్కొక్క పొరగా విప్పుతూ, జ్ఞాపకాల దొంతరల్ని పేర్చిన ఈ నవల ఎర్నా సాహితీభవితకు బాటవేసింది.
(లే యానీస్ ) ది ఇయర్స్ యార్నా రాసిన అన్ని రచనల్లోనూ అత్యుత్తమమైనదిగా భావిస్తారు విమర్శకులు. తృతీయ పురుష లో రాసిన ఈ చారిత్రక స్మృతుల కథా కథనం ఒక అంతర్గత మథనం, ఒక అంతర్లోకపు జీవనయానం, తాను జీవిస్తూ వచ్చిన వైవిధ్య భరితమైన వెలుగునీడల తడుములాట, ఒక అంతః శోధన, ఒక లోజూపు, ఒక చింతన, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రెంచ్ సమాజంలో తనని తాను ఆవిష్కరింప జేసు కుంటూ నడచిన ప్రతి అడుగులోనూ ఎదిగిన ప్రతి అనుభవాన్నీ గుది గూర్చి అందించిన అనుభూతుల స్మృతి దర్పణం ది ఇయర్స్ ఇవ్వాళ ప్రపంచ అత్యున్నత సాహితీ గవాక్షంలో కాలుమోపి నోబెల్ కిరీటం కోసం అర్హమైంది.
ఆమెను ఎంపిక చేయడంలో రాజకీయ అంశం ఉందా అనే ప్రేక్షకుల ప్రశ్నకు సమాధానంగా, సాహిత్య రంగంలో నోబెల్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించే అండర్స్ ఓల్సన్, “మేము సాహిత్యమూ, సాహిత్య నాణ్యతపైనే దృష్టి పెడతామనీ, ఇది ప్రతి ఒక్కరి సాహిత్యమనే సందేశాన్ని గుర్తుపెట్టుకోవాల్సి వుందని ఘాటుగానే వ్యాఖ్యానించాడు. సెవెన్ స్టోరీస్ ప్రెస్ ప్రచురణకర్త డాన్ సైమన్, పబ్లిషర్స్ వీక్లీ కి పంపిన ఇమెయిల్‌లో బహుమతి కమిటీని అభినందిస్తూ, ‘తన లైంగిక జీవితం గురించీ, స్త్రీల హక్కులూ, ఆమె అనుభవమూ, భావోద్వేగాల గురించీ నిర్ద్వంద్వంగా రాసే వ్యక్తిని ఎంచుకోవడం ఒక సాహసోపేతమైన ఎంపికే- మరీ ముఖ్యంగా రచనే జీవితమైన స్త్రీ మూర్తికి’ – అంటూ శ్లాఘించాడు. “మరుగున పడిన, మగువల స్వేచ్ఛకు ఎలుగెత్తి విచ్చి మ్రోసిన గొంతుక” ఎర్నా అంటూ ఫ్రెంచ్ దేశాధ్యక్షుడు మేక్రన్ అభినందనలతో ముంచెత్తాడు. యేల్ యూనివర్శిటీ ప్రెస్ డైరెక్టర్ జాన్ డొనాటిచ్, “అనీ ఎర్నా ఒక అసాధారణ రచయిత్రి, ఆమె గొప్ప ఆరాధకుడిగా, ఆమె ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్ ఫిక్షన్ రచనల్లో ఆమె గుర్తింపు ఒక గొప్ప విజయం, ఈ బహుమతి మరింత విస్తృత పాఠకుల్ని ఆకర్షించేందుకు పూర్తిగా అర్హమైనది. కొత్త పాఠకులెందరో ఆ అద్భుతమైన ఆవిష్కరణని స్వయంగా అనుభూతి పొందుతారు.” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
మెమోవార్ నే ఒక జాన్రా గా, ఒక ప్రక్రియగా, యావత్తూ సార్వత్రిక మహిళా లోకపు అనుభవాల్ని అందించే అరుదైన ప్రక్రియలో ఎర్నా అన్ని ఛందో సర్ప పరిష్వంగాల్నీ, పొరలుగా పేరుకున్న కవితాత్మక కుబుసాల్నీ వలిచేసి, వదిలేసి శుద్ధమైన గద్యంతో, భావోద్వేగాల్ని విదిలించి, జ్ఞాపకాల తెరల్ని తొలిగించి, బాల్యం నుంచి మొదలు పెట్టి, హర్ష, విషాదాల అనుభూతుల్ని గుది గూర్చింది. బంధాలూ, బాంధవ్యాలూ, రాగ ద్వేషాలూ, ఎడబాట్లూ, పొరపాట్లూ, వివక్షతలూ, జీవన పయనంలో ప్రతిదీ ఒక జ్ఞాపకం, ప్రతిదీ ఒక అక్షరంగా తీర్చి దిద్దుకుంది. లిండా ఆస్బర్న్ అనే రచయిత్రి, ఎర్నా గురించి ఇలా అంటుంది, ” ఆధునిక కళ, వీక్షకుల్లో ఎటువంటి భావాన్ని రేకెత్తిస్తోందో ఇంచుమించు అలాంటి అనుభవాన్నిస్తుంది ఎర్నా రచన, ఒక ఆలోచించే దృక్కోణాన్ని, ఎందుకంటే అది సరళంగా ఉండటమూ, లేదంటే డొంక తిరుగుడు లేకుండా నేరుగా చెప్పడంతో, తేలిగ్గా అర్థమైపోయేలా, ఎవరైనా గానీ సులభంగా అందుకుపోయే రూపాల్లో, ఇంప్రెషన్స్ తో వుంటుంది, ఒక సాధారణ అనుభవపు అసంగతాల్ని ఒలిచేసి, వక్రతల్ని సరిచేసి, ఇరవయ్యో శతాబ్దపు ఆత్మని ఆవహించుకున్న ఐకనోగ్రఫీకి తగినట్టుగా చిత్రిక పట్టి అందించే శైలి అమెది” అంటూ అభినందనలతో ముంచెత్తించింది.
“ఐ రిమైన్ ఇన్ డార్క్‌నెస్” నిజంగా ఒక నిశి రాత్రి జ్ఞాపకం. అల్జీమర్స్ అనే విస్మృతి తాలూకూ ఒక భయానక పీడకల అమ్మని మెల్లిమెల్లిగా కబళించడం ఇతి వృత్తం. ఇతి వృత్తం కాదిది, వృద్ద తలిదండ్రుల్ని క్రమంగా కోల్పోతూ అందరి అనుభవంలోకి వచ్చే ఒక జీవితపు సత్యం, భక్తీ, విరక్తీ కలగలిపి మేళవించిన చేదైన కషాయం అంటూ ఈ పుస్తకాన్ని 2000లో ఆంగ్లంలో అనువదించిన తాన్యా లెస్లీ వాషింగ్టన్ పోస్ట్ ఒక సమీక్షలో ఘనంగా శ్లాఘించింది.
అయితే, ఎర్నా జ్ఞాపకాలు, సార్ధకమైన జీవితపు మధురమైన జ్ఞాపకాలు కావు, అడుగడుగునా మెలితిప్పే బాధాకరపు ఆనవాళ్లు. ఎర్నా రాసిన ఎ మ్యాన్స్ ప్లేస్ (1983), ఎ ఉమెన్స్ స్టోరీ (1987) లేదా షేమ్ (1996) వంటి లోతైన రచనల్లో తన గతాన్ని పునర్నిర్మించుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఎథ్నోగ్రాఫిక్ రియాలిటీతో సాగిపోతుందామె. ఎర్నా ను ఒక నవలా రచయిత్రి గానో ఒక మెమాయిరిస్ట్ గానో పిలవడం కంటే అక్షరాల్లో అప్పటికే పొదిగి వున్న బాధల్ని స్వస్థత కోసమో, ఓదార్పు కోసమో కాకుండా మనని గాయం చేసే భావనల లోతుల్లోకి తీసుకెళ్లే రచయితగా పేర్కోవడం ఎక్కువ ఔచిత్యాన్ని కలిగివుంటుందేమో! 1960 లో రాసిన హ్యాపెనింగ్ రచన నిజానికి తన అబార్షన్ స్టేట్మెంట్. తనకు స్ట్రెచర్ మీద జరిగిన ఆ భీకర వైయక్తిక అనుభవాన్ని యధాతధంగా చెప్పేస్తుంది. ఒక స్త్రీ లోకపు విషాదానుభవ తంత్రిని మీటి తెలుగు పాఠక లోకాన్ని ఒక్కసారిగా కనెక్ట్ అయ్యేలా చేసిన ఎబార్షన్ స్టేట్మెంట్ లాంటి స్వీయానుభవాన్ని హాపెనింగ్ లో గుర్తుకు తెస్తుంది ఎర్నా. ఎర్నా “హ్యాపెనింగ్” ఆడ్రీ దివాన్ దర్శకత్వం వహించిన 2021 వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ ని అందుకుందన్నది వేరే విషయం.
ఎర్నా రచనలన్నీ వైయక్తిక అనుభవాల పుటలు, ప్రతీ వాక్యం పుణికి పుచ్చుకున్న వైయక్తిక అనుభవం, వ్యక్తివాద రచనల్లో హెచ్చుగా కనిపించే నార్సిసిజమ్ మచ్చుకు కూడా వుండదు! స్వోత్కర్ష వూసే వుండదు, ఒక పర్పజ్, అనివార్యంగా రాయాల్సిన అవసరం, ఒక అగత్యం, ఒక ప్రార్థన, ఒక తాత్వికచిత్తవృత్తి, పూనుకోవాల్సిన ఒక సందర్భం! అందుకే అంటుంది తను, రాయడం నాకొక నైతికానుభవమని!
ఓ సారి ఇలా అంటుంది గెట్టింగ్ లాస్ట్ లో అనుకుంటా, “నా భర్త ఆనందాన్వేషణని క్షమించేశా, ఎందుకంటే ఆయన రాయడు. నువ్వు రాయడమే లేనప్పుడు ఇంకేం వుంటుంది? తిండం, తాగడం, రమించడం తప్ప.” అంటూ. హాపెనింగ్ లో అంటుంది ఇంకో చోట, ఇవన్నీ జరగబట్టే అనుకుంటా వాటిని నేను రాస్తూ పోయా. నా జీవిత లక్ష్యం బహుశా నా దేహం, నా స్పందనలూ ప్రతిస్పందనలూ, నా ఆలోచనలూ నా రాతలేనేమో; వేరేలా చెబితే, ఇతరుల జీవితాల్లో, బుర్రల్లో చొరబడి కలగలిసిపోయే సార్వత్రిక, అర్థం చేసుకోగలిగే నా అస్థిత్వ కారకాలే అనిపిస్తుంది.”
ఈ సంవత్సరం సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి గ్రహీతగా ఎంపికైన ఫ్రెంచ్ స్మృతి పథాల రచయిత్రి ఎర్నా, జీవిత పుటల అంతర్గత అన్వేషణా, సామాజిక, రాజకీయ జీవితపు ఎగుడు దిగుళ్ళ జ్ఞాపకాల విశ్లేషణా, ఆమెను చాలాకాలంగా ఒక ఛాంపియన్‌గా మార్చాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఈ ఘనమైన విజయపతాకాన్ని ఎగరేసిన సందర్భంగా ఎర్నా ను ప్రశంసిస్తూ, ఫ్రాన్స్ దేశపు “సమిష్టి, సన్నిహిత జ్ఞాపకం” అని ట్వీట్ చేసినప్పటికీ, 82 ఏళ్ల ఎర్నా తన దేశం కోసం మాత్రమే రాయలేదామె. ఇటీవలి సంవత్సరాలలో, ఆమె అత్యంత ప్రసిద్ధ రచనల అనువాదాలు, యావత్తూ ఆంగ్లభాష మాట్లాడే ప్రపంచంలో సైతం సమానమైన ప్రమాణాలతో, జ్ఞాపకాల సార్వజనీన శైలిగా ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచాయి.
ఈ సంశ్లేషణాత్మక అస్థిత్వపు అపరూప మేలి కలయికే ఆమె ఆలోచనాత్మక కథన సంవిధానం, అదే ఎవరినైనా కట్టి పడవేసే సమ్మోహన శైలీ విన్యాసం. ఒక నిర్దిష్ట కాలంలో, ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉన్న వ్యక్తుల నిజ జీవితాలు ఆసక్తికరంగా చదవడానికి ఒక కారణం ఉంది. ఇది పాఠకుడికి గందరగోళపు గజిబిజి జీవితాల మసకబారిన లోతుల్లోకి వెళ్లి సహాయాన్ని వెతుక్కునేందుకు దోహదం చేస్తుంది. ఇది స్వస్థత నిస్తుంది, ఆశనీ అందిస్తుంది, ఎర్నా విజయం ఆమె పాఠకుల్ని వారెక్కడి నుండి వచ్చారో, వారి స్వంత అనుభవాల పరిస్థితుల వైపుకి వారిని మరల్చి ఒక స్పష్టత నివ్వడంలో, ఒక ఓదార్పు నివ్వడంలోనే దాగి ఉందన్నది ఒక నిర్ద్వంద్వ సత్యం.
*****
నేను ఆంగ్ల సాహిత్యం మరియు అర్ధశాస్త్రం లో ఎం.ఏ చేశాను. అయిల సైదా చారి గారి రెండు కవితా సంపుటాలూ, అందెశ్రీ గారి కొన్ని పోయెమ్స్, దెంచె నాల గురితప్పిన పద్యం కవితా సంపుటి ఇంగ్లీష్ అనువాదాలు చేశాను. అంగార స్వప్నం లో కూడా కొన్ని అనువాదాలు చేశాను. రంగనాయకమ్మగారూ, గాంధీ గారు సంకలనం చేసిన వర్గాల గురించి పుస్తక అనువాదం ఇటీవల విడుదల అయింది. మరికొన్ని అనువాదాలు పుస్తకాలు గా వెలువడ్డాయి.నా సమీక్షలూ, కవితలూ, వ్యాసాలూ, తెలుగు పత్రికల్లో వస్తుంటాయి. సారంగ లో, కౌముదిలో ఒకటీ రెండూ వచ్చాయి. మీ పత్రికకి పంపడం ఇదే ప్రథమం. సాహిత్య ప్రపంచానికి నాది పూర్తిగా కొత్త మొహం.