పేషంట్ చెప్పే కథలు – 7

జ్వాల

ఆలూరి విజయలక్ష్మి

          వేపపువ్వు, మామిడికాయలు, మల్లెమొగ్గలు, పరిమళాలు, సుందర స్వప్నాలు, సిగ్గు దొంతరలు… ఆకాశం జాలితలచి జారవిడిచిన వెన్నెల తునక రూపం దిద్దుకుని తన ముందుకు నడిచి వచ్చినట్లనిపించింది శృతికి హాసంతిని చూడగానే. హాసంతి చేతిలో హార్లిక్స్ సీసానిండా ఉగాది పచ్చడి. 

          “ఆంటీ! అమ్మ యిచ్చి రమ్మంది.” 

          “నాక్కావలసింది ఉగాది పచ్చడి కాదు” అర్ధవంతంగా చూసింది శృతి. 

          “మరేమిటి ఆంటీ?” అమాయకంగా అడిగింది హాసంతి. 

          “నీపెళ్ళి భోజనం”, హాసంతి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. కళ్ళు వాలిపోయాయి. 

          “అప్పుడే యెక్కడాంటీ? మా బావ ఐ.ఏ.ఎస్. పరీక్షవ్వాలి. తాను తప్పకుండా సెలెక్ట్ అవుతాడనుకోండి. కానీ… తరువాత అదేదో ట్రైనింగ్ ఉందట కదా. అదికూడా అయి పోవాలి. హాసంతి పెదవుల మీద చిరు హాసాలు. కనుపాపల్లో కలల దీపాలు.

          “అప్పటిదాకా పెళ్ళి వద్దంటున్నాడు మా బావ” హాసంతి కంఠంలో నిరాశ. 

          “ప్చ్! అయితే ఇప్పుడప్పుడే నీ పెళ్ళి భోజనం తినే అదృష్టం నాకు లేదన్న మాట!” తమాషాగా నిట్టూర్చింది శృతి. 

          “భోజనం దేముంది ఆంటీ!…”

          “అలా నాకు మరి. పెళ్ళి భోజనం. అదీ కలెక్టర్ గారి పెళ్ళి భోజనమంటే… ఆ గ్రేస్. ఆ హోదా, ఆ గొప్ప వేరు” శృతి హాస్యం చేస్తూంటే గర్వంతో మెరుస్తున్నాయి హాసంతి కళ్ళు.

          “మా బావా చాలా మంచాడు ఆంటీ! ఆ టెక్కులు, నిక్కులు అంటే చిరాకు. మనుషు లంటే ప్రాణమిస్తాడు. ఈ సారొచ్చినప్పుడు బావని మీకు పరిచయం చేస్తాను. మీరే చూస్తారు తనెలాంటివాడో?” ఆనందంగా బావ గుణాల్ని వర్ణించసాగింది హాసంతి. బావంటే ఆ అమ్మాయికున్న అనురాగాన్నీ, అవధుల్ని మించిన ఆరాధనను ముచ్చటగా గమనిస్తూంది శృతి. 

          హాసంతి ఆనందాన్ని హరించివేసి, ఆమె కలల్ని, కోరికల్ని చెల్లాచెదురుచేసే సంఘటన జరిగింది కొన్ని మసాలా తరువాత. ఆమె బావ తన తోటి ఐ.ఏ.ఎస్. ఆఫీసరొకామెను పెళ్ళాడాడు. మౌనంగా, పెదవి విప్పకుండా, రెప్ప వాల్చకుండా, నిశ్చలంగా, శూన్యంలోకి చూస్తూ కూర్చున్న హాసంతి రూపం విభ్రాంతిని కలిగిస్తూంది. రేయింబవళ్ళు నిద్రపోకుండా, చలనం లేకుండా కూర్చుంటున్న హాసంతిని చూస్తే గుండె చెరువవుతోంది ఆమె తల్లిదండ్రులకు. ఆమెలో కదలిక నెలా తీసుకురావాలో, మామూలు లోకంలోకెలా తేవాలో పాలుపోక శృతి సలహా అడిగారు. 

          బుజ్జగించి, నచ్చచెప్పి, ప్రతీ ఆదివారం బలవంతాన ఏటో అటు తీసుకువెళ్ళి హాసంతి మనసు మళ్ళించి మనుషుల్లో పడేలా చేసింది శృతి. 

          “థాంక్యూ డాక్టర్! మీరు మా అమ్మాయికి చేసిన మహోపకారాన్ని జన్మలో మరిచిపోలేం” కృతజ్ఞతతో ఒణికింది హాసంతి తండ్రి స్వరం.

          “నాదేముందండి, టైం-టైంకి ఎంతటి లోతైన గాయాల్నీ మాన్చడానికి శక్తి ఉంటుంది”

          హాసంతి హాసిస్తూంది. నలుగురితో మాట్లాడుతూంది. అందుకేన్తో పొంగిపోయిన ఆమె తల్లిదండ్రులు హాసంతి అంటే మక్కువ చూపుతున్న శ్రీనివాస్ కిచ్చి వైభవంగా ఆమె వివాహం జరిపించారు. 

          “ఏమ్మా? ఏమైంది? ఎందుకలా వున్నావు? రెందు మాసాల తరువాత విపరీతమైన మనఃక్లేశంతో తన దగ్గరి కొచ్చిన హాసంతిని అడిగింది శృతి. 

          “ఆంటీ! రోజురోజుకీ నాకు నేను అర్ధం కాకుండా పోతున్నాను. కొన్నేళ్ళుగా నేను పెంచుకున్న కోరికల్ని, కలల్ని ఒక్కసారిగా మరచిపోలేక పోతున్నాను. బావ ప్రాణంలో ప్రాణంలా బ్రతకాలని, బావ ప్రేమలో స్వర్గాన్ని చూడాలనీ, బావ భార్యగా అతని జీవితాన్ని, హోదానీ, కీర్తినీ పంచుకోవాలనీ, ఎన్ని అందమైన ఊహలు!! ఎన్నెన్ని బంగారు స్వప్నాలు!! అన్నిటినీ ఒక్కక్షణంలో కూలదోసి వెళ్ళిపోయాడు బావ. బ్రతుకులో అన్నీ మనం కోరుకున్నట్లు జరగవు… ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతూంటాయి. దెబ్బలు మాన్చుకుని నిలబడాలి. రెట్టింపు వేగంతో నడవాలని నాకు తెలుసు. కానీ… అలా తెలుసుకోడానికీ ఆచరణలో పెట్టడానికి ఎంత భేదముందో అనుభవమవుతూంది. ఆంటీ! శ్రీనివాస్ ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ, జరిగిపోయిన వాటిని మరిచిపోవాలని నా ప్రయత్నం’ గద్గద కంఠంతో నెమ్మదిగా చెప్పుకు పోతూంది హాసంతి. 

          “ఆంటీ! నా ప్రయత్నంలో నేనెంత ఘోరంగా ఓడిపోతున్నానో తెలుసా? శ్రీనివాస్ నా దగ్గరకు వస్తేచాలు. బావ నా కళ్ళముందు నిలుస్తాడు. శ్రీనివాస్ నన్ను ముట్టుకుంటే చాలు. నాకెంతో ప్రియమైన బావ స్పర్శ గుర్తుకొచ్చి శ్రీనివాస్ నుంచి దూరంగా జరిగేదాకా నాకు కంపరంగా ఉంటోంది. ఒకవైపు అతనికి దగ్గర కాలేని అశక్తత, మరోవైపు అతనికి మానసికంగానూ, శారీరకంగానూ ఏ అందమైన అనుభూతిని యివ్వలేక పోతున్నానన్న బాధ, నా మానసిక దౌర్బల్యాలతో, నిగ్రహించుకోలేని సెంటిమెంట్స్ తో అతన్ని బాధించడం అమానుషం అన్న స్పృహ… చిత్రహింస అనుభవిస్తున్నాను ఆంటీ!… ఆంటీ…! నాకేమైనా మందివ్వండి. గతాన్ని పూర్తిగా మరిపించ గల మందు, పూర్వపు జ్ఞాపకాల్ని, అనుభవాల్నీ నా హృదయంలో నుండీ తుడిచేయగల మందిచ్చి పుణ్యం కట్టుకోండి. ఆంటీ!… నాకు బ్రతకాలనుంది. సుఖంగా బ్రతకాలనుంది. బ్రతుకును సంపూర్తిగా అనుభవించాలని వుంది.” ఉద్వేగ భరితమైన స్వరంతో చెపుతూంది హాసంతి

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.