రంగుల్లో బొమ్మలు ఎలా వెయ్యాలో, ఎలాంటి రంగులు కొనాలో, ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని రోజుల్లో “కావలి” అనే చిన్న టౌన్ లో మా పెంకుటింట్లో టీనేజ్ లో వేసిన బొమ్మలే అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నా బొమ్మల్లోని మధుర జ్ఞాపకాలు.
ఎండాకాలం మధ్యాహ్నం 12 దాటితే మా ఇంటి “మెష్ వరండా” లోకి సూటిగా దూసుకొచ్చే ఎండవేడికి తాళలేక పక్కనే ఉన్న నారాయణవ్వ పూరి గుడిసెకి షిఫ్ట్ అయ్యే వాడిని, నా బొమ్మల సరంజామా అంతా పట్టుకుని.
సరంజామా అంటే పెద్దగా ఏమీ ఉండేది కాదు. ఒక పెద్ద అట్ట ప్లాంక్ (తాతయ్య దగ్గరి నుంచి తెచ్చుకున్నది), బ్రిల్ బ్లాక్ ఇంకు బుడ్డి, ఒక మగ్గులో నీళ్ళు, ఒక్కటంటే ఒక్కటే బ్రష్ (బహుశా అన్న 6వ తరగతి పాత డ్రాయింగ్ బాక్సులోదయ్యుండాలి), ఒక నాసిరకం నోట్ బుక్ నుంచి చింపిన తెల్లకాయితం. అంతే. అలా అప్పుడు ఆ పెయింటింగ్ సరంజామాతో వేసిన నా “పెయింటింగ్” ల వెనక “పెన్సిల్ లైన్ స్కెచ్” అనే “సీక్రెట్ కాన్సెప్ట్” ఉండేది కాదు. అసలలా ప్రొఫెషనల్ గా పెన్సిల్ స్కెచ్ వేసుకుంటే పెయింటింగ్ బాగా వస్తుందన్న ఇంగితం కూడా లేదు, ఇంకా రాలా. ఆర్ట్ లో ప్రముఖ పాత్ర పెన్సిల్ దే అని నా పెన్సిల్ డ్రాయింగ్స్ తో తెలుసుకున్నా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవ్వరూ అసలు పెన్సిల్ వాడరనుకునే వాడిని. అలా వేస్తేనే అది పెయింటింగ్ అన్న భ్రమలోనే ఉండేవాడిని.
అసలు ఇంకుతో వేస్తే దాన్ని పెయింటింగ్ అంటారా, ఏమో అదీ తెలీదు. నాకున్న అపోహల్లా ఒక్కటే, పెయింటింగ్ అంటే బ్రష్ తోనే వెయ్యాలి. ఒక బ్రష్ ఎలాగూ నాదగ్గరుంది కాబట్టి దాంతో పెయింటింగ్ లు వెయ్యాలి. రంగుల ముఖచిత్రం తప్ప లోపలంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉండే పత్రికల్లో కథలకి కొందరు ఆర్టిస్ట్ లూ వేసే బొమ్మలు పెయింటింగుల్లా అనిపించేవి. అలా వెయ్యాలనీ, వేసిన ప్రతి ఇంకు బొమ్మా పెయింటింగే అని ఉప్పొంగిపోయే వాడిని. నీళ్ళు కలిపి ఇంకు ని పలుచన చేస్తే నలుపు తెలుపులో చాలా షేడ్స్ తెప్పించొచ్చన్న “రహస్యం” పట్టుకున్నా. ఆ రహస్య (పరి)శోధనే చిట్కాగా చాలా పెయింటింగ్ లు వేశాను. అలా వేసిన వాటిల్లో సినిమా స్టార్ లే ఎక్కువగా ఉన్నారు. వాటిల్లో “కొల్లేరు సరస్సు”, “స్టాట్యూ ఆఫ్ లిబర్టీ” లాంటి అతి క్లిష్టమైన పెయింటింగులు కూడా ఉన్నాయి.
అప్పట్లో నేనే (పరి)శోధించి కనిపెట్టాననుకొంటూ, నాకై నేను తెలుసుకున్న, నాకు తెలిసిన ఒకే ఒక్క పెయింటింగ్ రహస్యం అదే- ఇంకు లో నీళ్ళు కలిపి వెయటం. ఇదే అనుకరిస్తూ రంగులతో “మంచిరకం ప్రొఫెషనల్ వాటర్ కలర్ పేపర్” మీద వేస్తే దాన్ని “వాటర్ కలర్ పెయింటింగ్” అంటారని చాలా లేట్ గా తెలుసుకున్నా…