మా కథ (దొమితిలా చుంగారా)- 37

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

మళ్ళీ గనిలో

          ఒరురో వెళ్ళిన కొన్ని నెలలకే మేం మళ్ళీ సైగ్లో -20కి తిరిగి వెళ్లిపోగలిగాం.

          బారియెంటోస్ చనిపోయాక అప్పటికి ఉపాధ్యక్షుడుగా ఉన్న సైల్స్ సాలినాస్ గద్దె ‘నెక్కాడు. కాని ఆయన పాలన మూన్నాళ్ళ ముచ్చటే అయింది. అదే సంవత్సరం జరిగిన ఓ సైనిక తిరుగుబాటులో జనరల్ ఒవాండో, సాలినాస్ ను తన్ని తరిమేసి అధికారానికొచ్చాడు.

          అప్పుడు 1965లో బారియెంటోస్ ప్రభుత్వం తొలగించిన గని కార్మికులందరూ గనుల్లో తమ ఉద్యోగాలు తమకిమ్మని ఒవాండోను కోరారు. ఒవాండో వాళ్ళ మాట ఖాతరు చెయ్యలేదు. అప్పుడా గని కార్మికులందరూ తమ కుటుంబాలతోసహా నిరాహార దీక్ష పూనాలనే ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య ఫలితంగా ఎంతో మంది తిరిగి పనిలోకి పోగలిగారు. మేం కూడా అలా వెళ్ళిన వాళ్ళమే. ఒరురోలో నేనో పత్రికలో తిరిగి పనిలో చేరవలసిన కార్మికుల జాబితాలో రెనె పేరుండడం చూసి లాస్ యుంగాస్ కి కబురు చేశాను. మేం అప్పుడు సైగ్లో-20కి వెళ్ళిపోగలిగాం. మాకప్పుడు కొండెక్కినంత సంతోషమైంది.

          ఒవాండో, బారియెంటోతో కలిసి పనిచేసినవాడే. కొన్నాళ్ళు సహ ఉపాధ్యక్షుడుగా కూడ ఉన్నాడు. ఆయన గద్దె ఎక్కగానే తనను తాను వామపక్ష వాదిగా ప్రకటించుకొని, తన ప్రభుత్వం “జాతీయ విప్లవ” ప్రభుత్వమని ప్రకటించాడు. ది బొలీవియన్ గల్ఫ్ ఆయిల్ కంపెనీ అనే ఒక అమెరికన్ భాగస్వామ్య కంపెనీ స్థావరాలన్నింటినీ జాతీయం చేశాడు. కాని త్వరలోనే ఆయన అసలు రంగు బైటపడి పోయింది. ఎంతో మంది మంత్రులు ఆయన ప్రభుత్వం నుంచి వైదొలిగారు.

          సరే – మేం సైగ్లో-20 చేరాక నా భర్త నన్ను దేనితోనూ సంబంధం పెట్టుకోవద్దని కోరాడు. ఇప్పటికి ఎన్నో బాధలు అనుభవించామనీ, ఎంతో త్యాగం చేసిం తర్వాత గాని సైగ్లో-20కి తిరిగి రాలేకపోయామనీ, కనుక ఇకనైనా కుదురుగా పిల్లల్నీ ఇంటినీ చూసుకుంటూ ఉండడమే నా బాధ్యత అని ఆయన నాకు చెప్పాడు. కాని నేనప్పటికే వేరే రకంగా ఆలోచిస్తున్నాను. ప్రజానీకాన్ని ఇంకా బాగా సంఘటితం చేయాలనీ, కార్మికులతో ఇంకా ఎక్కువగా మమేకం కావాలనీ నేను కోరుకున్నాను.

          మేం వచ్చిన కొద్ది రోజులకే గని కార్మిక సమాఖ్య సైగ్లో -20లో ఒక సమావేశానికి పిలుపిచ్చింది.

          గృహిణుల సంఘంలోని నా మిత్రులు అప్పటికే తమ కొత్త నాయకుల్ని ఎన్నుకొని ఉన్నారు. అయినా నేను మాత్రం అప్పటికీ ప్రధాన కార్యదర్శినే. వాళ్ళు మళ్ళీ నా స్థానం నాకిచ్చారు గనుక నేనా సమావేశంలో పాల్గొన్నాను. దీని తర్వాత రెనె నన్ను కచ్చితంగా ఇలాంటి వాటిలో పాల్గొననివ్వనని తెగేసి చెప్పేశాడు. ఈ నిర్ణయం ఇష్టం లేకపోతే తనను వదిలేసి వెళ్ళిపోవచ్చని కూడ అన్నాడు.

          ఇంటికి సాయపడడానికే గృహిణుల సంఘంలో పాల్గొంటున్నానని నేను చెప్పాను. ఆయన జీతంతో మా అవసరాలు తీరడం లేదు గనుక, తనను కష్ట పెట్టడం ఇష్టం లేక నేనెన్నో ఇష్టమైనవి వదులుకున్నాననీ, ఇప్పుడు సంఘంలో చేసేపని తనతో పాటే మంచి బతుకు కోసం పోరాడడమనీ చెప్పాను. ఆ రకంగా మనకో తృప్తికరమైన, సంతోషకరమైన జీవితం ఉంటుందని చెప్పాను. తానెట్లా స్నేహితులతో కలిసి ఉండడం ఇష్టపడతాడో, సినిమాలకు వెళ్తాడో, షికార్లు తిరుగుతాడో అలాగే నాకూ ప్రజలతో మాట్లాడడమూ, వాళ్లకు సాయపడడమూ ఇష్టమని చెప్పాను. తాను గనుక ఇంటికి అవసరమైనవన్నీ తెచ్చి పడేస్తే నేనింక దేంట్లోనూ జోక్యం చేసుకోనని గూడ చెప్పాను. అలా మేమో ఒప్పందానికొచ్చాం. తాను తన కాలాన్ని వృధా చేయడు, నేను సంఘాన్ని వదిలేస్తాను.

          కాని ఆయన స్నేహితులతో కలిసి తాగడం, సినిమాలకు వెళ్ళడం మానేయక పోవడం వల్ల మా ఒప్పందం నిలవనే లేదు. కనుక ఆ తర్వాత కొన్ని రోజులు నేనాయనకు చెప్పకుండానే సంఘం సమావేశాలకు వెళ్ళాను. ఆయనోరోజు “ఏమిటి సంగతి?” అని అడిగాడు. “నువ్వే చెప్పాలి” అన్నాను నేను. ఒప్పందంలో ఒక వైపున ఉన్న తాను ఒప్పందాన్ని పాటించలేదు గనుక మరో వైపున ఉన్న నేను నా ఇష్టం వచ్చింది చేసుకుంటానన్నాను. చివరికి నేను తలచుకున్నదేదో మొండిగా చేసేస్తానని ఆయనకు అర్థమైంది. గతంలో యజమానులు ఆయనతో నీ భార్య ఇలా, అలా అని అబద్దాలు చెప్పినప్పుడు బాధపడేవాడు. వాళ్ళకేమీ జవాబిచ్చేవాడు కాదు. ఇప్పుడైతే ఆయన వాళ్ళ వ్యాఖ్యలను పట్టించుకోకపోవడమే కాదు, “అది ఆమె జీవితం – నీకేమీ సంబంధం లేదు గదా!” అంటున్నాడు. అంటే మేం చాలా సర్దుకుపోయాం కదూ?

          1970లో బొలీవియాలో టేపోంట్ గ్రూప్ అనే గెరిల్లా దళం ఉండేది. ఆ గ్రూపులో చాలా మంది, డెబ్బైమంది అనుకుంటాను యూనివర్సిటీ విద్యార్థులు ఉండేవారు. వాళ్ళందర్నీ పోలీసులు అమానుషంగా కాల్చేశారు.

          ఈ రెండో గెరిల్లా గ్రూపుతో మాకేమీ సంబంధాలు లేకుండేవి. దాని గురించి మేం పత్రికల్లో చదివాం.

          నేను గెరిల్లాలనేమీ చిన్న చూపు చూడడం లేదు. అలా జీవితాన్ని అర్పించడం కోసం ఏ క్షణమైనా మృత్యువు కోరలకెరగావచ్చునని తెలిసి కొండల్లోకి వెళ్తున్న ఆ సాహసులు గౌరవానికీ, అభిమానానికి అర్హులే. మాకు నిజంగానే వాళ్ళలా చేయడానికి సాహసం లేదని మాలో చాలా మంది అంటూ ఉంటారు. అందుకే గెరిల్లాలను నేనెంతగానో గౌరవిస్తాను. ఐతే మరొక విషయం కూడ తెలుసుకోవలసి ఉంది. ప్రజల తోడ్పాటు లేకుండా కొండల్లోకి వెళ్లి ఎవరూ ఏమీ సాధించలేరు. ప్రజల తోడ్పాటు చాల ముఖ్యం, చాల అవసరం. ఆ గెరిల్లాలు చేసిన పొరపాటు ప్రజలతో దగ్గరి సంబంధాలు పెట్టుకోక పోవడమే అని నాకనిపిస్తుంది. సోషలిజం నిర్మించడానికి కార్మికవర్గమూ, రైతాంగమూ రెండూ రెండు స్తంభాలనే విషయాన్ని మనమెప్పుడూ మరిచిపోకూడదు.

          నేను ఫొకిస్తా(ఫొకో అనే గెరిల్లా ఎత్తుగడను సమర్థించే వాళ్ళని ఫొకిస్తాలంటారు. గెరిల్లాదళ బలాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో ఉత్సాహాన్ని, రాజకీయ చైతన్యాన్నీ, విస్తృత రాజకీయ లక్ష్యాల్నీ సాధించడం శత్రు బలగాన్ని యుద్ధంలోకి దించడం ప్రయోజనాలుగా గల ఈ ఎత్తుగడ క్యూబన్ విప్లవంలో అనుసరించబడింది. చేగువేరా బొలీవియాలో దీన్ని అనుసరించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు)ను కాను. ఏ విషయాన్నైనా అకస్మాత్తుగా మార్చేయలేమని నేను నమ్ముతాను. మనిషి నడవడానికి ముందు పాకడం, అంబాడడం నేర్చుకోవాలి. తర్వాత రెండు కాళ్ళమీద నిలబడడం నేర్చుకోవాలి. తర్వాత తప్పటడుగులు వేయడం నేర్చుకోవాలి. క్రమ క్రమంగా నడక నేర్చుకోవాలి. అలా చిట్ట చివరికి మాత్రమే పరుగు పందెంలో పాల్గొనడం సాధ్యమవుతుంది. అలా ఒక విప్లవోద్యమం కూడా కన్నుమూసి తెరిచేంతలోనో, నిద్రలేచి చూసేసరికల్లానో వచ్చేది కాదు. అందుకే ఒంటరి ఉద్యమాలు వాటంతటవి ఎందుకూ పనికిరావు. ప్రజలు తమను తాము విముక్తి చేసుకోవాలి. ఒక గ్రూపు మిగిలిన గ్రూపుల కంటె మౌలిక చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రధాన విషయం దానికి ప్రజా సహకారం అవసరమనేదే.

          మొత్తానికి టేపోంట్ గెరిల్లా దళం ఒవాండో నిజస్వరూపాన్ని బహిర్గతం చేసింది. ఒవాండో తాను వామపక్షీయుణ్నేనని ఎన్ని గప్పాలు కొట్టుకున్నా సమయం వచ్చేసరికి ఆ యువకులందర్నీ నిర్దాక్షిణ్యంగా చంపించి తన రంగు బైట పెట్టుకున్నాడు. ఆయనకది అలవాటే. నాన్ కా హువాజులో ఆయనేం చేశాడో గుర్తులేదూ?

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.