మిట్ట మధ్యాహ్నపు మరణం- 13
– గౌరీ కృపానందన్
మాధవరావు నేరుగా D.C. ఆఫీసుకి వెళ్ళినప్పుడు, గది బైట ఆ ఫోటోగ్రాఫర్ ఎదురు చూస్తున్నాడు.
మాధవరావును చూడగానే అతను లేచి సన్నగా నవ్వాడు. “మిస్టర్ మాధవరావు?”
“యెస్.”
“నా పేరు ఇంద్రజిత్. మీకు ఒక ఫోటో చూపించాలి.”
“ఏ ఫోటో?”
“నేను లోపలికి రావచ్చా?”
“కాస్త ఆగండి. నేను D.C.ని చూసి వస్తాను.”
“ఆయనే మీకు ఈ ఫోటో చూపించమన్నారు.”
“పది నిమిషాలు వెయిట్ చేయండి.”
“ఈ ఫోటో మీకు ఎంత వరకు ఉపయోగంగా ఉంటుందో తెలియదు.”
మాధవరావు కానిస్టేబుల్ ని పిలిచి లోపల D.C. ఉన్నారా అని చూసి రమ్మని పంపారు. అతను లోపలికి వెళ్లి వచ్చి పిలుస్తున్నారని చెప్పాడు.
మాధవరావు లోపలి వెళ్లి సెల్యూట్ చేశారు.
“కూర్చోండి మాధవరావ్. ఏమైనా తెలిసిందా?”
“తెలిసింది సార్.”
“అరెస్ట్ చేయడానికి వీలైనంత సాక్ష్యాధారాలు దొరికాయా?”
“లేదు సార్.”
“మరి?”
“అనుమానిస్తున్నాను సార్. దివ్య అనే అమ్మాయిని విచారణ జరిపినప్పుడు, ఆమె మూర్తికి స్నేహితురాలని, మూర్తి పెళ్లి వేరే అమ్మాయితో జరిగినందు వలన చాలా డిసప్పాయింట్ అయ్యిందని తెలిసింది. ఆమె, తన ప్రస్తుతపు బాయ్ ఫ్రెండుతో అదే హోటల్ లో ఐదో అంతస్థులో బస చేసినట్లు ఆధారం దొరికింది. తన బాయ్ ఫ్రెండును ఒక్కొక్క సారి కజిన్ బ్రదర్ అని, బాయ్ ఫ్రెండ్ అని మార్చి మార్చి చెబుతోంది.”
“ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారట?”
“ఆ బాయ్ ఫ్రెండును కాస్త ఎంక్వయిరీ చేయాలి. ఎలిబీ కాస్త వీక్ గానే ఉంది.”
“అనుమానాస్పదం క్రింద అతన్ని అరెస్ట్ చేయండి.”
“ఇప్పుడే వద్దు సార్. హోటల్ సర్వర్ ఒకతని వేలి ముద్రలు ఆ గది తలుపుల మీద దొరికాయి. అతగాడిని కూడా అడగాలి.”
“మణి, మూర్తి భార్య ఉమ, బంధువులు ఎవరినీ వదలకండి. అందరినీ అడగండి. ఎక్కడో ఒక చోట నిప్పు రాజుకుంటుంది. లాబ్ రిపోర్ట్స్ వచ్చాయా?”
“ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. చనిపోయిన వ్యక్తి తాలూకు ఫింగర్ ప్రింట్స్ వదిలేస్తే, భార్య ఉమ, హోటల్ సర్వర్ , ఇంకో కొత్త వ్యక్తివి ఉన్నాయి.”
“మణి?”
“ఊహుం. మణి ఫింగర్ ప్రింట్స్ లేవు. కానీ అతణ్ణి మనం ఎలిమినేట్ చేయలేం.”
“అతను కాస్త ముందు వెనుకగా జవాబులు ఇచ్చాడని మీరే అన్నారుగా. ఈ రిపోర్టును చూశారా?”
“ఏ రిపోర్ట్ సార్?”
“లాబ్ నుంచి వచ్చింది. పోస్ట్ మార్టం చేసేటప్పుడు మూర్తి చేతి గోళ్ళలో చిక్కుకు పోయిన ఒకే ఒక వెంట్రుకను తీసి పరిశీలించారు. దానితో పాటు మూర్తి వెంట్రుకను కూడా శాంపిల్ కి పంపించారు. అతని చేతిలో ఉన్న వెంట్రుకను పరిశీలించి నప్పుడు అది ఒక పురుషుడికి చెందినది అని తెలిసింది. కొద్ది రోజుల క్రితమే హెయిర్ కట్ చేయించిన వ్యక్తిది. ముఖ్యంగా ఆ వ్యక్తికి హెయిర్ డై ఉపయోగించే అలవాటు ఉంది. అది ఖచ్చితంగా మూర్తిది మాత్రం కాదు.”
మాధవరావు తలెత్తి చూశారు. “ఫరవాలేదు సార్. కొంచం కొంచంగా కేసు క్లియర్ అవుతోంది. హంతకుడు హేయర్ డై ఉపయోగించే వ్యక్తి. ఎత్తుగా ఉంటాడు. షూస్ సైజ్ తొమ్మిది.”
ప్రభాకరం కానిస్టేబుల్ ని పిలిచి, “బైట ఒక ఫోటోగ్రాఫర్ వెయిట్ చేస్తుంటాడు. లోపలికి పంపించు” అన్నారు.
““ఈ కేసు చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. మాధవరావ్! మాయా లేకపోతే మయ అని వ్రాసిన అక్షరాలను అనలైజ్ చేశారా?”
“అది కాపిటల్ లెటర్స్ లో ఉన్నందు వలన…”
మధ్యలోనే అందుకున్నారు ప్రభాకరం. “కాపిటల్ అక్షరాలలోనూ విషయాలను తెలుసుకోవచ్చు. రావయ్యా! నీ పేరేంటి?”
“ఇంద్రజిత్ సార్.”
“ఫోటోను చూపించు.”
“కాంటాక్ట్ ప్రింట్ తీసాను. ఎన్ లార్జ్ మెంట్ కి ఇచ్చాను. రేపు దొరుకుతుంది.”
ప్రభాకరం దాన్ని తీసుకుని మాధవరావుకి ఇచ్చారు. ఆ ఫోటోను చూసిన మాధవరావుకి నిరాశగా అనిపించింది. అందులో మూర్తి, ఉమ ఇద్దరినీ కలిపి పార్కులో తీసిన ఫోటో. బాక్గ్రౌండ్ లో చెట్లు, పార్కులో ఉన్న జనంలో ఒకరిద్దరు.
“ఆయన హత్య కాబోయే ముందు తీసుకున్న ఆఖరు ఫోటో ఇదే అయి ఉంటుంది సార్.”
“ఈ ఫోటోను ఎక్కడ తీసారు?”
“పార్కులో వాళ్ళు వస్తుండగా చూశాను. చాలా అందంగా, ఒకరికి ఒకరు తీసిపోనట్లుగా, జంటగా వాళ్ళని చూడగానే ఫోటో తీయడానికి రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఒప్పుకున్న ఆ క్షణం నాకు బాగా గుర్తు ఉంది సార్.”
“ఎప్పుడు తీసారు?”
“మొన్న సాయంత్రం.”
“వాళ్ళని చూస్తే మీకేమని అనిపించింది?”
“చాలా సంతోషంగా కనిపించారు. ప్రపంచంలోని ఆనందమంతా వాళ్ళ దగ్గిరే ఉన్నంత హ్యాపీగా కనిపించారు.”
“చాలా థాంక్స్ మిస్టర్ ఇంద్రజిత్.”
“ఈ ఫోటో మీకేమైనా ఉపయోగపడుతుందా సార్?”
“ఉపయోగ పడుతుందనే అనుకుంటున్నాను.”
“హంతకులు ఎవరని తెలిసిందా?”
“ఇంకా లేదు. బై ది బై… మీ పేరు ఇంద్రజిత్ కదా. ఈ పేరు మీకు ఎలా వచ్చింది?”
“మా నాన్నగారు పెట్టిన పేరు. ఎందుకు సార్ అడుగుతున్నారు?”
“ఏం లేదు. కాస్త వినూత్నంగా ఉంటేనూ.”
“వస్తాను సార్.”
అతను వెళ్లి పోయాక, “ఈ ఫోటో ఉపయోగ పడుతుందా?” అన్నారు ప్రభాకరం.
“ఊహుం. ఎన్లార్జ్ మెంట్ కూడా లేదు.”
“ఎందుకైనా మంచిది. ఉంచండి. అందరినీ ఎంక్వయిరీ చెయ్యండి. చిన్న విషయాన్ని కూడా వదలొద్దు. ఈ ఫోటోను ఎన్లార్జ్ చేయించి చూద్దాం. ఆ ఫోటో గ్రాఫర్ దగ్గర నెగటివ్ అడిగి తీసుకోండి.”
మాధవరావు లేచి సెల్యూట్ చేసి బయలు దేరారు. జీప్ లో ఎక్కి, “శాంతినగర్ కి పోనీయ్” అన్నారు. దివ్యని ఇంకోసారి చూడాలి. ఆమె బాయ్ ఫ్రెండును కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇంకా… ఇంకా ఆలోచించాలి. మాధవరావు ఫైలు మీద “మాయ” అని వ్రాశారు.
***
ఉమ పేపరు మీద MAYA అన్న అక్షరాలను జంబిల్ చేసి చూసింది. AYAM AAYM ఇలా…
ఆనంద్ ఓపిక నశించినవాడిలా అన్నాడు. “ఇవన్నీ ఎందుకు ఉమా?”
ఆమెను చూస్తూ ఉంటే బాధగా కూడా అనిపించింది. సరిగ్గా భోజనం చేయక పోవడం వల్ల కళ్ళు లోతుకి పోయి, గాజు కళ్ళలా నిస్తేజంగా ఉన్నాయి. రాత్రిళ్ళలో సరిగ్గా నిద్ర పోవడం లేదని తెలుస్తోంది. ఉన్నట్టుండి నవ్వుతుంది.
“ఏదైనా ఒక క్లూ దొరుతుందేమో నని చూస్తున్నాను ఆనంద్. పాత ఉత్తరాలన్నీ తిరగేసి చూస్తున్నాను. ఈ జానకి ఎవరు?”
“పెద్దక్కయ్య. పూనాలో ఉంటుంది. ఉమా! ఈ విషయాన్ని పోలీసులకి వదిలేద్దాం” అన్నాడు ఆనంద్.
ఇంట్లో పరిస్థితులు మారుతూ రావడం అతను గమనించక పోలేదు. ఉమ అతన్ని మాటి మాటికీ పిలవడం ఆ ఇంట్లో వాళ్లకి, ముఖ్యంగా అతని తల్లికి నచ్చలేదు. మూర్తి మరణపు తాలూకు శోకం ఇంకా మిగిలి ఉన్నందు వలన బైటికి చెప్పలేదు కాని అలా జరగడానికి ఇంకెన్నో రోజులు లేవు. ఆ లోగా ఉమ పుట్టింటికి వెళ్ళిపోతే ఏ సమస్యా ఉండదు. ఆ ఇంట్లో అందరూ ఉమను ఇప్పుడు పరాయి వ్యక్తిగా, ఏ బాంధవ్యమూ లేని మనిషిగానే చూస్తున్నారు.
క్రింద చిన్నత్తయ్య వచ్చినట్లుంది. ఏడుపులు, పెడబొబ్బలు సన్నగా వినబడు తున్నాయి.
“కోడలు పిల్ల ఎక్కడ ఉంది?”
“ఇంకా ఇక్కడే ఉంది. మనతోనే ఉంటానంటోంది.”
“అయ్యో పాపం! కడుపుతో ఉందేమో మరి.”
“ఏం ఖర్మనో! నాకు తెలియదు.”
సంభాషణ మేడ వరకూ వినబడింది.
ఆనంద్ ఉమ వైపు చూసి, “సారీ” అన్నాడు.
“ఆనంద్! వెళ్లి మీ అమ్మగారితో చెప్పు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నేను గర్బంతో లేనని చెప్పు.”
“ఉమా! ఐ యాం గ్లాడ్.”
“బట్ ఐ యాం నాట్! ఇంకా కొన్ని రోజులు గడిస్తే మూర్తి జ్ఞాపకాలు నాదగ్గర ఏమీ లేకుండా పోతాయి.”
“ఉమా! చెప్పడం మరిచి పోయాను. నీ కోసం వచ్చిన ఉత్తరాలను మీ వాళ్ళు తెచ్చి ఇచ్చారు. అల్మారలో ఉంచాను. ఇవిగో.”
“అన్నిటినీ చించెయ్యి. సంతాపాన్ని ప్రకటిస్తూ వచ్చిన ఉత్తరాలై ఉంటాయి. ఇప్పుడు నాకు కావాలిసింది సంతాపం కాదు.” నిర్లక్యంగా ఉత్తరాలను పక్కకి నెట్టేయ బోయిన ఉమ, ఒక ఉత్తరాన్ని చూసింది. ఫ్రం అడ్రెస్ లేకుండా, ఆకుపచ్చ రంగులో వ్రాసి ఉన్నచిరునామా. ఇంతకు ముందెప్పుడూ చూడని చేతివ్రాత. కవరును చింపి చూసింది. లోపల రెండే వాక్యాలు.
“జరిగినదాన్ని మరిచి పో. భగవంతుడు నీకు మేలు చేస్తాడు. మాయా”
*****
(ఇంకా ఉంది)