మూతపడని రెప్పలు
-లక్ష్మీ సుహాసిని
‘‘అమ్మా రేపు రెండో శనివారం కదా, మేఘా వచ్చేస్తానందమ్మా. లంచ్ దానికీ కలిపి వండేసుకో’’ అంది వసంత. హడావిడిగా బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకుండానే ఆ ఉప్మా బాక్స్‌లో సర్దుకొని పరుగులాంటి నడకతో వెళ్తున్న వసంతని చూసి ‘‘ఏమి ఉద్యోగాలో – ఏమి పరుగులో’’ అనుకుంటూ నిట్టూర్చాను.
వసంత బంగారుతల్లి – ఏది పెడితే అదే తింటుంది. ఈ మేఘా గడుగ్గాయి గారాలు – సూకరాలూనూ అనుకుంటు దానికి నచ్చినవే వండాను. బంగాళ దుంపల వేపుడు, టమాటో పప్పుతో పాటు దానికోసమని కొబ్బరి పచ్చడి కూడా చేసి అన్నీ డిష్‌అవ్‌ట్ చేసి మూతలుపెట్టి బైటికొచ్చాను. ‘రైస్‌కుక్కర్ ఆన్ చేశానో లేదో’ – అప్పుడొచ్చింది అనుమానం. మళ్లా లోపలికెళ్లేసరికి కుక్కర్ అప్పటికే ఆవిర్లు చిమ్ముతోంది. తలమీదో మొట్టికాయ వేసుకుని ‘వెధవ మతిమరుపు’ అనుకుంటూ హాల్లోకి వస్తూండగా కాలింగ్‌బెల్ ట్రింగ్ ట్రింగ్ మంది. ‘‘వొస్తున్నా’’ అంటూ తలుపు తీశాను. ఎదురుగా బ్యాగ్‌తో మేఘా.
‘హాయ్ మమ్మీ’’ అంటూ తోసుకుంటూ లోపలికి వచ్చేసి మాస్క్ డస్ట్‌బిన్‌లో పడేసి కాళ్లూ చేతులు కడుక్కొని వచ్చింది.
‘‘చాల్రోజులై పోయిందమ్మా ఈ సారి. ఇంక ప్రోజెక్ట్ సబ్మిట్ చేస్తే అయిపోయినట్లే’’ అంది మేఘా.
‘‘ఏంటమ్మా ఇంతలా తగ్గిపోయావు’’ అంది ఉలిక్కిపడుతూ.
అన్నం తింటున్నంతసేపూ నన్నే గమనిస్తూ కూర్చుంది. అలసిపోయిందేమో అలాగే సోఫాలో వాలి నిద్రకుప్రకమించింది. నేను వంటగదిలో నా పనిలో పడ్డాను.
లేస్తూనే వేయింగ్ మిషన్ తీసుకుని నా దగ్గరకొచ్చి ‘‘నేను ఈ ఆరు నెలల్లో నాలుగు కేజీలు తగ్గాను మమ్మీ. నువ్వు చూసుకో’’ అంది.
‘‘ఇప్పుడు నాకెందుకమ్మా’’ అన్నా వినలేదు. చూస్తే నలభై రెండు కేజీలున్నాను. మేఘా గోల చేసింది.
‘‘నలభైరెండు కేజీలా. అదేంటమ్మా అంతలా ఎలా తగ్గావు’’ అంటూ ఒకటే ఆశ్చర్యం.
‘‘మా దగ్గర ఏమీ దాచలేదు కదా! ఇంకేమైనా బాలేదా’’ అంది. వసంతకి ఫోన్ చేసి అడిగింది.
విషయం విని తనూ ‘‘ఔనా ! అదేమిటీ? నేను గమనించలేదే మేఘా. అమ్మకి ఏం కాలేదు కదా’’ అంటూనే ఫ్యామిలీ డాక్టర్ శ్రీనిధికి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకుంది. సాయంత్రం ఆలస్యంగా వస్తానన్నది కానీ ఐదు గంటలకే వచ్చేసింది. వసంత గదిలోనే కూర్చున్న మేఘా – అక్క కోసం ఎదురు చూస్తూ రాగానే పెద్ద తగువుకి దిగింది.
‘‘అదేంటక్కా! అమ్మలో మార్పు నీ దృష్టికి రాలేదా. అంతగా తగ్గిపోతే ఎలా గమ్మునుంటావు. కంటికే తెలుస్తోందిగా, చూడు టీబీ పేషంటులా ఎలా ఎముకలు బైటేసుకుని వొంగిపోయి నడుస్తూంటే ఎలా ఊరుకున్నావక్కా’’ అంది.
నిజమే మేఘా పోస్ట్ కోవిడ్ తర్వాత మా బ్యాంకులో పని ఎక్కువై పోయింది. అస్సలు తీరటం లేదు. హైదరాబాద్ ట్రాఫిక్‌లో పడి తిండీ తిప్పలూ లేకుండా పరిగెట్టినా టైమ్‌కి వెళ్లడం గగనం. అలా అని రోజూ లేట్‌గా పోలేం కదా! రాత్రి చాలా అలిసిపోతాను. ఇంకే ఆలోచనా సాగదు. తినాలని కూడా అనిపించదు – నాది తప్పే. తెలీలేదు మేఘా. అమ్మ ఏమీ చెప్పదు. పనులన్నీ చకచకా చేసేసుకుంటోంటే పనెక్కువై సన్నబడింది అనుకుంటున్నానే తప్ప ఇంత మాసివ్ వెయిట్ లాస్ అనుకోలేదే. డాక్టర్ శ్రీనిధి ఆంటీ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకున్నాను ఆరున్నరకి. క్యాబ్ బుక్ చేసేశాను, వస్తుంది. ఈలోగా నువ్వు అమ్మని మెంటల్‌గా ప్రిపేర్‌చేసి – ‘ఆంటీ రమ్మంది అని చెప్పు’. అపాయింట్‌మెంట్‌కు అనకు’’ చెప్పింది వసంత.
వీళ్ల మాటలు నాకు వినిపిస్తూనే వున్నాయి. ఏమీ విననట్టు వంటగదిలోకి నడిచాను. మూడు టీలు, బిస్కెట్లు ఓ ట్రేలో పెట్టుకుని బైటికొచ్చి టీపాయ్ మీద పెట్టి – ‘‘పిల్లలూ టీ రడీ’’ అంటూ కేకేశాను వాతావరణాన్ని కాస్త తేలికపరుస్తు.
అప్పటికే రడీ అయిపోయిన మేఘా వచ్చి సోఫాలో నా పక్కన కూర్చుని టీ కప్పు అందుకుంది.
‘‘మిస్సెస్ మంగళా ఆనందన్! మీరు కూడా టీ తాగేసి రడీ అయితే మనం బైటికెళ్దాం. శ్రీనిధి ఆంటీనోసారి హాయ్ అనేసి వచ్చేద్దాం’’ అంది నాతో.
మౌనంగా వూరుకున్నాను. వాళ్లు ఒక నిర్ణయానికొస్తే ఇంక ఎవరి మాటా వినరు. ఈ తలనొప్పి గురించి ఓసారి ఫోన్ చేసి అడగాలను కుంటున్నాను. సరే కానీ ` అడిగి రావచ్చు అనుకున్నాను.
* * *
డాక్టర్ శ్రీనిధి నవ్వుతూ ముగ్గురికీ స్వాగతం చెప్పింది. పరిశీలనగా నన్నే చూస్తూ ‘‘చాలా తగ్గిపోయావ్ మంగళా. ఓ సారి నా దగ్గరికి రాకపోయావా’’ అంది.
‘‘లేదు శ్రీ! నాకు తెలిసి నాకు ఏ బాధాలేదు. కళ్లు మంటలు, విపరీతమైన తలనొప్పి. ఈ మధ్య అది పెరిగింది. అంతే. ఓసారి ఫోన్ చేద్దామనుకున్నాను. ఈలోగా వీళ్లే’’ అని అంటుండగా…
‘‘ఓకే ఓకే. వర్రీ ఏం లేదు. రేపు లాబ్ అసిస్టెంట్ పొద్దున్నే వచ్చి రక్తం తీసుకుంటాడు. రిజల్ట్స్ ఓసారి చూసి నిర్ధారించుకుందాం. అందాకా ప్రశాంతంగా కూతుర్లతో ఎంజాయ్ చెయ్’’ అంది.
నవ్వుతూ ముగ్గురం బైటికి వచ్చేశాం. మళ్లా వసంత లోపలికెళ్లి శ్రీనిధినడిగింది. ‘‘మా అమ్మకి…’’
‘‘మరే సింటమ్స్ చెప్పటం లేదు. చూద్దాం బ్లడ్ టెస్ట్‌లతోపాటు టోటల్ బాడీ చెకప్ చేయిద్దాం. కచ్చితంగా ఏదో రీజన్ వుంటుంది. అంత వెయిట్ లాస్ నార్మల్ కాదు. డేంజర్ కూడా. బాగా రక్తం తక్కువగా వున్నట్లుంది. ఎల్లుండి రిజల్ట్స్ చూసి కాల్ చేస్తాను వసంత. ఏం వర్రీ కాకండి’’ అంది.
ముగ్గురం బయలుదేరాం. రాఘవేంద్రా టిఫిన్ సెంటర్‌లో టిఫిన్లు తిని మంచి కాఫీ తాగి ఇంటికి వచ్చేశాం.
వంటగది గట్టు మీదే ఓ మూలగా సింక్ పక్క చిల్లుల ప్లేట్ మీద పెంచిన మెంతి మొలకలు, హాంగింగ్ పాట్ నిండా వొత్తుగా చిగుళ్లతో వున్న పుదీనా మొక్కలు, బాల్కనీలో రెండు తొట్లలో పాలకూర, రెండు తొట్లలో కొత్తిమీర, ఓ తులసి మొక్క, ఓ మూరెడు కరివేపాకు మొక్క – నేను ప్రేమగా పెంచే ఆ కిచెన్ గార్డెన్‌లో మొక్కలకు నీళ్లు పోస్తు – పిల్లల్ని తప్పించుకుని కాలం నెట్టాను.
నా పక్కన సోఫా దగ్గర మేఘా, కింద వసంత కూర్చుని… భుజం మీద ఒకళ్లు, ఒళ్లో ఒకళ్లు చేతులేసి అనునయంగానే అడగడం మొదలెట్టారు.
‘‘ఇంకేమైనా బాగా లేదామ్మా’’ మేఘా.
‘‘ఏమైనా వుంటే చెప్తే కదమ్మా తెలిసేది! మేం ఎన్ని పనుల్లోనో కొట్టుకుపోయి పట్టించుకోలేదనుకో. అంత పరాయివాళ్లమా అమ్మా. మాకైనా చెప్పుకోవా’’ వసంత నొచ్చుకుంటూ.
‘‘మీకు కాక ఎవరికి చెప్తానమ్మా. సరే పదండి – బ్లడ్ టెస్టుల్లో తేలుతుందిగా. ఏం లేదని అప్పుడు నమ్మండి’’ అన్నాను నేనూ నిష్ఠురపోతూ.
‘‘సరే సరే. పొద్దున్నే లేవాలి కూడా పడుకోండి’’ అన్నాను.
‘‘అమ్మా! పొద్దున కాఫీ తాగకు, టెస్టులు అయ్యేదాకా…’’ అంటూ కేకేసింది వసంత, తన గదిలోకెళ్లిపోతూ.
మంచం ఎక్కేసిన మేఘా – ‘‘గుడ్‌నైట్ అక్క’’ అంటూ అరిచి చెప్పింది.
‘‘రామ్మా నా పక్కన పడుకో’’ అంటూ నన్ను పిలిచింది. నేను లైట్లు ఆర్పేసి వచ్చే సరికే గురక పెడుతోంది. దానిపక్కనే పడుకుని ముఖంమీద వాలిన వెంట్రుకలు సవరించి ఫ్యాన్ చూస్తూ పడుకున్నాను.
పొద్దున్నే లేచి స్నానం చేసి వచ్చేలోగా డోర్ బెల్ మోగింది. వసంత తలుపు తీసి ‘‘లోపలికి రండి’’ అంటోంది.
లాబ్ బోయ్ వచ్చాడులా వుంది అనుకుంటు వెళ్లి కూర్చున్నాను. బ్లడ్ తీసుకుని వెళ్లాడు.
తరువాత రోజు పిల్లలకి డాక్టర్ శ్రీనిధి ఫోన్ చేసి ‘‘బ్లడ్ టెస్టుల్లో ఏమీ లేదు. ఐరన్ కాస్త తక్కువ వుంది. అయినా రేపు ఎమ్మారై, ఈసిజీ కూడా చేయించుకుని రిజల్ట్ తీసుకుని అమ్మతో వొచ్చెయ్యండి. చూద్దాం’’ అంది.
బ్లడ్ టెస్టుల్లో ఏం లేనందుకు సంతోషపడాలో, అంతకన్నా పెద్దది ఇంకేముందో అని భయపడాలో అర్థం కాలేదు – వసంతకి.
* * *
మర్నాడు అన్ని రిజల్ట్స్ తీసుకుని ముగ్గురం డాక్టర్ శ్రీనిధి దగ్గరికి వెళ్లాము. వసంత లోపలికెళ్లి రిజల్ట్స్ డాక్టర్ ముందుంచి, వచ్చి కూర్చుంది.
అన్నీ చూసిన శ్రీనిధి తలపట్టుకుంది. అందరూ వెళ్లాక నన్నొక్కదాన్ని పిలిచింది. పిల్లలిద్దర్నీ బైటే వెయిట్ చెయ్యమంది. నన్ను చాలా రకాలుగా అడిగింది కానీ ఆమెకు ఏమాత్రం క్లూ దొరకినట్టు లేదు. యథాలాపంగా ‘‘నిద్ర బాగా పడుతుందా మంగళా!’’ అని అడిగింది.
‘‘లేదు. ఎంత అలసిపోయినా అరక్షణం నిద్రపోలేను శ్రీ. ఎందుకో తెలీదు పగలైనా, రాత్రైనా నిద్రరాదు’’ అన్నాను.
అది ఏదో తీవ్రమైన మానసిక సమస్య అని గుర్తించింది శ్రీ. తన స్నేహితురాలి విజిటింగ్ కార్డు వెతుకుతూ ‘‘మంగళా నువ్వెళ్లి బైట కూర్చుని పిల్లల్ని పంపించు’’ అంది.
మెల్లగా బైటికి వచ్చి పిల్లలకి సైగ చేశాను లోపలికి రమ్మని. వాళ్లు లోపలికి వచ్చాక నేనివతలికి వచ్చేశాను.
ఐదు నిమిషాలలో చేతిలో ఏదో విజిటింగ్ కార్డు చూసుకుంటూ ‘‘పదమ్మా’’ అని ఇద్దరూ చెరో చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా లేపారు. వాళ్ల కేరింగ్ బాగుంది.
‘‘అయినా ఇప్పుడు నాకేమైందనే’’ అంటూ వాళ్ల వెనకే నడిచాను.
బైట రడీగా వున్న క్యాబ్ ఎక్కేశాం. క్లినికల్ సైకియాట్రిస్ట్ డాక్టర్ వరూధిని గారి దగ్గరకి తీసుకెళ్లారు. సాదరంగా ఆహ్వానించి పిల్లల్ని కూర్చోమని నన్ను లోపలి గదిలోకి తీసికెళ్లింది. గది ప్రశాంతంగా డిమ్ లైట్‌తో ` ఫుల్ ఏసీ వల్లనేమో చాలా చల్లగా వుంది. నాకు బాగా నచ్చింది. నా గురించి, పిల్లల గురించి… అవీ ఇవీ అడుగుతూ చాలా స్నేహ పూర్వకంగా మాట్లాడింది. ‘‘నిద్ర బాగా పడుతుందా?’’ అదే ప్రశ్న.
‘‘అస్సలు పట్టదండి’’
‘‘ఎప్పటి నుంచి?’’
‘‘చాలా ఏళ్లుగా’’
‘‘అదేం అలా?’’
‘‘భయమండి – చాలా భయం. నిద్రపడితే చమటలు పట్టేస్తాయి. గుండెదడ గంటైనా తగ్గదు’’
‘‘అయ్యో – అయినా ఏమని భయం’’
‘‘మా ఆయన కొట్టడానికి వచ్చేవాడు’’ అన్నాను.
‘‘ఎందుకు? నిద్రపోతేనా’’ ఆశ్చర్యం ఆపుకోలేక పోయింది.
‘‘ఔను. కళ్లు మూతపడుతున్నాయంటే బెల్టుతో కొట్టడానికి వచ్చేవాడు – పాపం నేను నిద్రపోతే ఆయనకి భయం. ఎర్రటి కళ్లు ఇంకా పెద్దవి చేస్తూ పెద్ద గొంతుతో అలా మీద మీద కొచ్చేస్తే చాలా భయం వేస్తుంది నాకు. ఆయనకేమో ‘ఈవిల్ స్పిరిట్స్’ తననేం చేస్తాయో అని భయం. అందుకు ఆయన పడుకున్నంత సేపు నన్ను కాపలా వుండమనేవాడు. నా కళ్లు మూతలుపడితే, ‘నీ మొగుడు చచ్చిపోతాడన్నా నీకేం బాధ లేదా? నిద్ర ఎలా వొస్తోందే? లే’ అంటూ అరిచేవాడు. ఆయన ఒక పారనోయి. ఎప్పుడూ ఏదో అయిపోతుందని భయపడిపోతూ పడుకోనిచ్చేవాడు కాదు’’
‘‘ఇప్పుడున్నాడా?’’
‘‘లేడు. చనిపోయి మూడేళ్లయింది. వసంతకి ఉద్యోగం వొస్తె దాన్ని దింపడానికి ఇక్కడికి వొచ్చాను. ఇల్లు అదీ వెతికి దానికి అన్నీ సెట్ చేశాను. అందాకా మా అక్క కూతురు ఇంట్లో వున్నాం. దాని ఇల్లు కాస్త అలవాటయ్యాక వెళ్దామనుకుంటూంటేనే కబురొచ్చింది – నిద్రలోనే పోయాడని. ఆయన భయాలే ఆయనని చంపేశాయి. ఆయన లేక పోయినా ఆ భయం పోలేదు నాకు. కళ్లు మూతపడితే ఆయన పెద్ద గొంతు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఉలిక్కిపడి లేస్తాను. రెండు, మూడు నిద్ర మాత్రలు వేసుకున్నా పని చెయ్యవు’’
డాక్టర్ వరూధిని ఎందరినో చూసి వుంటుంది. ఎందరి కథలో విని వుంటుంది. నా మాటలు విన్నాక ఆమె కళ్లల్లో నీళ్లను ఆపుకోలేక పోయింది. ‘‘ఒక పారనోయిడ్ మగవాడు మీ జీవిత కాలం నిద్రని హరించి, మిమ్మల్ని ఫియర్ ఫోబియాలోకి నెట్టేశాడా మంగళగారు’’ అంటూ నా తలని నిమురుతూ వుండి పోయింది.
మళ్లీ తనే ‘‘దిగులు పడకండి. కారణం తెలిసిందిగా. మార్గం వెతుకుదాం. మీకేం ఇద్దరు ప్రేమించే కూతుర్లున్నారు. నిశ్చింతగా వుండండి. మీరలా బైట కూర్చోండి. లేదా లాంజ్‌లో మొక్కలు చూస్తూండండి. పిల్లల్ని లోపలికి పంపండి’’ అంది మృదువుగా.
పిల్లలిద్దరూ లోపలికి వెళ్లారు. మేఘా కన్నీళ్లు కారుస్తూ, ‘‘మరి ఎలా! ఏం చేయాలి డాక్టర్’’ అంటోంది.
‘‘ఏదో మిరకిల్ జరగాలి. ఆ మిరకిల్ మీరే చెయ్యాలి. ఇది అని చెప్పలేను. ఏదో కొత్తగా. కొత్త లాంగ్వేజ్ నేర్పించడం, కొత్త పాటలు లేదా వాయిద్యాలు లేదా ఏదో ఏదో… టోటల్‌గా ఆమెని ఇన్వాల్వ్ చెయ్యగలగాలి. సరికొత్త ప్రేరణ కావాలి. ఐ పిటీ హర్. మీ కోసమే బతికేస్తున్నట్లు వుంది. టేక్ కేర్ ఆఫ్ హర్’’
ఇద్దరు ఒకళ్ల చెయ్యి ఒకళ్లు గట్టిగా పట్టుకుని, దుఃఖం ఆపుకుంటూ డాక్టర్‌కి కృతజ్ఞతలు చెప్పి బైటికొస్తున్నారు. వారి ముఖాలలో దృఢమైన నిశ్చయం ప్రస్ఫుటంగా కనిపించింది.
కానీ నన్ను చూడగానే వసంత ‘‘అమ్మా! అమ్మ’’ అంటూ ఏడ్చేసింది. ‘‘పుట్టినప్పటి నించి అలసిపోయిన కళ్లు, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు చూస్తున్నా ఏ రోజు నీకో సమస్య వుందని ఊహించలేదమ్మా. నిన్ను నా దగ్గరే పెట్టుకుని చూసుకుంటున్నాను కదా. నీకేం తక్కువ అనుకున్నానే కానీ నిద్రే పోవటం లేదని తెలీలేదమ్మా’’ అంటూ బాధపడింది.
రెండు మూడు రోజులు ఏదో ఒకటి ప్రయత్నించారు. కొత్త సినిమాలు పెట్టారు. ముభావంగా చూశాను. పిల్లలు ప్రేమగా జోకొట్టి పడుకోబెడితే కళ్లంట ధారగా నీళ్లు కారిపోతున్నాయి తప్ప రెప్పలు మూతపడలేదు. మూడు రోజులు విసిగిపోయిన మేఘా స్టేడియమ్‌కి బయలుదేరుతోంటే ఆసక్తిగా చూస్తున్న నన్ను చూసి ‘‘నువ్వూ రామ్మా’’ అంది. తనతో నన్ను తీసుకెళ్లింది.
అక్కడ నడుస్తుంటే చాలా ఉత్సాహంగా అనిపించింది. వెనక్కి వొస్తూ పానీపూరీ బండి దగ్గర ఆగి ఇద్దరం తిని ఇంటికొచ్చాం. మర్నాడు పిల్లలిద్దరు నన్ను స్టేడియమ్‌కి తీసుకెళ్లారు. చెరో చెయ్యి పట్టుకుని వాళ్లు నడిపిస్తూంటే – నాలో ఏదో కొత్త ఉద్వేగం. లోపల ఏదో బద్ధలైన భావం. నాలుగడుగులేస్తే అలసిపోతూ ఆయాసం అనుకునే నేను నడుస్తున్నాను. నడవ గలిగాను. నా కూతుర్ల ఆసరాతో నా భయాలలోంచి బైటపడాలి అని దృఢంగా అనుకున్న. అలా ఆరు రౌండ్లు నడిచేశాను. చాలా అలిసిపోయాను. ఇంటికొచ్చాక వసంత కాఫీ చేసుకొచ్చి ఇచ్చింది. జస్ట్ ఐదు నిమిషాలంటూ నా బెడ్‌రూమ్‌లోకెళ్లి బెడ్ మీద బ్లాంకెట్లు మార్చి నాకిష్టమైన గులాబిరంగు దుప్పట్లు వేసింది. తను డాక్టర్ గారి ఇంట్లోంచి కోసుకొచ్చిన రెండు నైట్‌క్వీన్ పూలకొమ్మలని ఒక బాటిల్‌లో పెట్టి బెడ్ పక్కన పెట్టి, పెద్ద లైట్ తీసేసి చిన్న బెడ్‌లైట్ వేసింది.
దామ్మా గదిలో మాట్లాడుకుందాం అంటూ మేఘా నన్ను గదిలోకి నడిపించింది. ఇద్దరూ నన్ను పడుకోబెట్టి ‘‘అమ్మా నువ్వు నిద్రపోవద్దు. జస్ట్ కళ్ల మీద చల్లగా ఉండటానికి ఈ కాటన్ పెడతా. కళ్లు మూసుకో’’ అని నా కళ్ల మీద చల్లటి దూది పెట్టింది. కళ్లు మూసుకున్నాను.
నా చెవిలో మేఘా అంది – ‘‘అమ్మా కళ్లు మూసుకున్నా ఏం కాలేదు చూశావా. భయపడకు – నేను ఇక్కడే వుంటా. పాట పాడనా’’ అంటూ నేను కళ్లు తెరవకుండా తన చెయ్యి ఆ కాటన్ మీద వేసి ‘‘అమ్మ దొంగా నిను చూడకుంటే నాకు బెంగా…’’ నేను నేర్పిన పాటే నా కోసం నా మేఘా పాడుతోంది.
వసంత నా చెయ్యి పట్టుకుని మెల్లగా జోకొడుతోంది. పాట ఒక్క చరణం పూర్తయ్యేలోగా నిద్ర పట్టేసింది. ఆరు రౌండ్లు నడిచాను కదా అలిసిపోయాను.
మళ్లీ ఉదయం వసంత వచ్చి లేపేదాకా ఇద్దరం లేవలేదు. అలా పది రోజులు రోజూ సాయంత్రాలు వాకింగ్‌కి తీసుకెళ్లారు. రెండు నెలల్లో తొమ్మిది రౌండ్లు చేస్తున్నాను.
ఆ రోజు నడుస్తున్న నాకు – నన్నే గమనిస్తున్న ఒకావిడ కనిపించింది. మేఘాతో చెప్పాను. కనుక్కొని వచ్చి, ‘‘ఆవిడ నీ నడక స్పీడ్ చూసి మెచ్చుకుంటున్నారు. వాళ్ల మాస్టర్స్ స్పోర్ట్స్ అసోసియేషన్‌లో చేరమంటున్నారు’’ అంది.
నాకూ ఆసక్తిగా అనిపించింది. తరువాత ఆమె సునంద అనీ, మేముండే లొకాలిటీ లోనే వుంటారనీ, ఇంటర్‌నేషనల్ వెటరన్ స్పోర్ట్స్ ఉమెన్ అని తెలిసింది. ‘‘ఇద్దరం స్టేడియంకి కలిసి వెళ్దాం’’ అంది.
పిల్లలు సంతృప్తిగా పనుల్లో పడ్డారు.
మా ఇద్దరి మధ్యా చక్కటి స్నేహం కలిసింది. సునంద గైడెన్స్‌తో ట్రాక్‌సూట్, స్పోర్ట్స్ షూలు కొనుక్కొని నడుస్తూంటే కాలమే తెలీటం లేదు. ఓ రోజు కొన్ని ఫాంలు తెచ్చి ‘‘స్టేట్ గేమ్స్ హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. నేషనల్స్ కేరళలోనట. నువ్వు ‘టూ కే వాక్’, ‘ఫైవ్ కే వాక్’కి పేరివ్వు. కాస్త ప్రాక్టీస్ చెయ్యి. ‘టూ కే’కి నీ స్పీడ్ చాలు. ‘ఫైవ్ కే’కి ఇంకో మూడు రౌండ్స్ పూర్తి చెయ్య గలగాలి. నువ్వు సెవెంటీ ప్లస్ ఏజ్ గ్రూప్‌లో ఆడొచ్చు’’ అని చెప్పింది.
మూడు నెలలు అలుపు లేకుండా రెండు పూటలా నడక ప్రాక్టీస్ చేశా. వేళకి తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ గట్రా తగ్గి వంగకుండా నడుస్తూ కొత్త వుత్సాహంతో ఆరోగ్యంగా తయారయ్యాను. ఇంట్లోనే వుండడం, సెడంటరీ లైఫ్ స్టైల్, తెలీని దిగులు, నిద్రలేమీ వల్ల వొచ్చిన అలసట ఒక్కోటిగా వదిలిపోయి నన్ను ఒక కొత్త వ్యక్తిని చేశాయి. రెండు పూటలా గ్రౌండ్‌కెళ్లి నడక ప్రాక్టీస్ చెయ్యడంతో పాటు శ్రీనిధి చెప్పిన మందులు క్రమం తప్పకుండా వాడటం, సునందగారి సజెషన్స్‌తో డైట్ తీసుకోవడంతో పాటు గోడకో తలుపుకో ఆనుకుని నడుముని స్ట్రైట్ చేసుకోడం, నడిచేటప్పుడు వంగకుండా నడవడం కూడా ప్రాక్టీస్‌లో భాగం చేసుకున్నాను.
మేఘా అయితే ఆ ప్రోజెక్ట్ ఇక్కడి నుంచి చేసేలా పర్మిషన్ తెచ్చుకుని తనూ నాతో గ్రౌండ్‌కి వచ్చి – టైమ్ పెట్టి నడవమని, ఇంకా కొంచం పుష్ చెయ్యమని మోటివేట్ చేస్తూ, నా డైట్ చూస్తు అదే పనిగా ఒక వ్రతంలా నన్ను బాగు చేసింది. వసంత పై నుండి అన్నీ చూసుకునేది.
స్పోర్ట్స్ రానే వొచ్చాయి. నేను ఉదయం వెళ్లిపోయా వాళ్లందరితోపాటు. టీమ్ అంతా ఒకే డ్రస్‌లో నడుస్తోంటే పిల్లలు మురిసిపోయారు. శ్రీనిధికి, డాక్టర్ వరూధినిలకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది వసంత.
నేను నడక మొదలెట్టిన దగ్గర నుంచి చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తూ ఒక్కో రౌండ్‌కి ‘‘మంగళా… కమాన్’’ అని అరుస్తూ నేనెక్కడా ఆగిపోకుండా ప్రేరణనిచ్చారు. ‘టూ కే వాక్’లోను, ‘ఫైవ్ కే వాక్’లోను నేను గోల్డ్ గెలుచుకుని – ఈవెంట్ పూర్తి చేసేసరికి వొచ్చి చుట్టేశారు.
నా పేరు పిలుస్తోంటే, విక్టరీస్టాండ్ దగ్గరికి వెళ్తుంటే ఇంక కన్నీళ్లు ఆపుకోలేక పోయారు. అనూహ్యమైన ఆ మలుపుని, ఆ విజయాన్ని గర్వంగా ఆస్వాదిస్తూ విక్టరీస్టాండ్ ఎక్కి నిలబడి పిల్లల్నే చూసుకుంటున్నాను. గోల్డ్‌మెడల్ వేసి అభినందిస్తోంటే తెలీని ఆనందం.
‘పిల్లలు ఈ విజయం ఒక బైప్రోడెక్ట్ మాత్రమేనమ్మా. అసలు విజయం మూతపడని నా రెప్పలకి విశ్రాంతి తీసుకోడం నేర్పారు. నన్నో బతికున్న మనిషిగా మార్చారు. నా కళ్లని మచ్చిక చేసుకుని వాటికి నిద్రనీ, నా మనసుకు ధైర్యాన్ని నేర్పిన గురువులు మీరు. ఈ విజయం మీ ఇద్దరిదే తల్లీ. అదే నా జీవితానికి ఇంతకన్నా పెద్ద బహుమతి’ అను కుంటూ చెమ్మగిల్లిన కళ్లతో నేను.
*****
లక్ష్మి సుహాసిని – 5 దశాబ్దాలు నడుస్తున్న తెలుగు సాహిత్య చరిత్రలో ఒక భాగం. రచయిత్రి, కవయిత్రి, పత్రిచిత్రకారిణి, పాటల కవయిత్రి, స్వరమేళకర్త. మార్కిస్టు దృక్పధంతో స్త్రీల జీవితాలకి అద్దంపట్టే కవిత్వం వ్రాస్తూ, అన్ని రకాల అసమానతలకి వ్యతిరేకంగా గొంతెత్తిన మహిళ. జానపద సేకర్త, పరిశోధకురాలు, క్రీడాకారిణి.
‘మూత పడని రెప్పలు ‘ కథ చాలా బావుంది. తమ తండ్రి అసామాన్య మానసిక ప్రవర్తన వల్ల తల్లి కూడా మానసిక రుగ్మత కు గురి అయిందని తెలిసి పిల్లలు క frda సంకల్పంతో తల్లి నీ మామూలు కాదు ఒక అసాధారణ స్త్రీ గా మార్చిన తీరు చాలా inspiring గా ఉంది.అభినందనలు.
చాలా బావుందండీ సుహాసిని మేడమ్..మాస్టర్స్ అథ్లెటిక్స్ గురించి ప్రస్తావన కూడా బావుంది..చాలా హృద్యంగా ఉందండీ..
చాలా బాగుంది మేడం