యాదోంకి బారాత్-1

-వారాల ఆనంద్

కళానికేతన్= కవితా చిత్ర ప్రదర్శన 

          ఇటీవల మా కరీంనగర్ ఇంట్లో నేను జరిపిన తవ్వకాల్లో బయట పడ్డ ఒక చిన్న ఫోటో ఇవ్వాళ ఈ నాలుగు వాక్యాలు రాసేందుకు కారణమయింది. చారిత్రకంగా రికార్డ్ చేయాల్సిన విషయమనిపించి ఈ జ్ఞాపకాల్ని పంచుకుంటున్నాను.

***

          మా వూరు కరీంనగర్ అయినా చిన్నప్పుడు బడికి సెలవులోస్తే అమ్మగారింటికి చెక్కేయడం, స్వేచ్చా గాలుల్ని పీల్చేయడం ఆనవాయితీగా వున్న కాలానికి చెందిన వాడిని గనుక మా అమ్మ వాళ్ళ వూరయిన వేములవాడతో నాకు విపరీత అనుబంధం. ఫలానా రోజు నుంచి సెలవులొస్తున్నాయననీ,  మీరొచ్చి నన్ను తీసుకెళ్లాలని నాన్నకు తెలీకుండా తాతయ్యకు పోస్ట్ కార్డులు రాసిన కాలమది. ఆ ఊరంటే నాకెంతో అభిమానం ఆప్యాయత. జీవితంలోనూ సృజనాత్మక రంగం లోనూ నాకు  మొదటి అడుగులు వేయడం నేర్పింది వేములవాడనే . ఆ వూరు  నా బతుకులో ఇచ్చిన ఆనందం, నేర్పిన పాఠాలూ ఇన్నీ అన్నీ కావు.  అలాంటి వూర్లో 1976 లో ఏర్పడ్డ నటరాజ కళానికేతన్  సంస్థ ఆధ్వర్యంలో 1978-79 లో  మొట్ట మొదటి సారిగా ఏర్పాటు చేసిన కవితా చిత్ర ప్రదర్శన ఆలోచన నాదే.

“నిప్పులు చిమ్ముకుంటూ

నింగికి నేనెగిరిపోతే

నిబిడాశ్చర్యంతో వీరు

నెత్తురు కక్కుకుంటూ

నెలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే”

          లాంటి శ్రీ శ్రీ కవితలతో ప్రభావితం అయిన యువ కాలమది. కవితా ఓ కవితా లాంటివి ఎంతగా ఇష్టపడ్డా బుల్లెట్లనూ(దూరంనుంచయినా), బుల్లెట్లా పేలే మినీ కవితల్ని ప్రేమించిన కాలమది. మినీ కవితా కాలం. కానీ కుందుర్తి లాంటి వాళ్ళు దీర్ఘ కవితలే కవిత్వమని మినీ కవిత్వం దాదాపు కవిత్వమే కాదనే వాదన చేస్తున్న సందర్భమది. ఈ నేపధ్యంలో మనం మినీ కవితలతో కవితా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేద్దాం కుందుర్తి గారితోనే ఓపెన్ చేపిద్దమనగానే జింబో, వఝల శివ కుమార్, పి.ఎస్.రవీంద్ర లు ఎంతో ఉత్సాహంగా చేద్దామన్నారు. అప్పుడు టైపింగ్ డిటిపి లాంటి సౌకర్యాలు లేవు గనుక మంచి రాత గీత వున్న యువకులయిన ప్రతాప చంద్ర శేఖర్, ఫై.ఎస్.కిషన్ లు చార్టులు రాయాలి, బొమ్మలు వేయాలి లేదా రవీంద్ర, రాజ్ ఫోటో స్టూడియో వెంగయ్య లు తీసిన ఫోటోలని వాడాలని నిర్ణయానికొచ్చాం. అట్లా భీమేశ్వర సభా మందిరంలో సభాకార్యక్రమం కవితా చిత్ర ప్రదర్శన నిర్వహించాలనుకున్నాం. అప్పుడు మాకు చొప్పకట్ల  చంద్రమౌళి గారు పెద్దదిక్కు. ఇంకేముంది కుందిర్తి గారిని సంప్రదించడం ఆయన ఎంతోపెద్ద మనసుతో మినీ కవితలతో కూడిన కవితా చిత్ర ప్రదర్శనను ప్రారంభించడానికి అంగీకరించడం జరిగింది. తనకు అంతగా అంగీకారం కాని ప్రక్రియలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి రావడంలో కుందుర్తి ఎంత గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తి కనబరిచారో కదా. ఆ రోజు ఏర్పాటు చేసిన కవితా చిత్ర ప్రదర్శనలో జింబో, అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివ కుమార్, ఫై.ఎస్.రవీంద్ర, వారాల ఆనంద్, మధు రవీంద్ర, జూకంటి జగన్నాథం, ఇంకా అనేకమంది యువకుల కవితలతో కూడిన కవితా చిత్రాల్ని చూసి కుందుర్తితో సహా చొప్పకట్ల, మధు  మృత్యుంజయ శర్మ, కే.రాజ శర్మ లాంటి పెద్దలు, పండితులు ఎంతగానో అభినందించారు. ఆ రోజు సాయంత్రం జరిగిన సభలో కుందుర్తి తో నేరుగా వచ్చీ రాని మాటలతో మినీ కవితయినా, దీర్ఘ కవితయినా కవిత్వం ప్రధానం కదా అని నేనే నేరుగా ప్రశ్నించడంతో అలాంటి వాదన వస్తుందని ముందుగానే అనుకున్నారేమో కుందుర్తి వివరంగా తన వాదన వినిపించారు. అప్పుడు వసతుల్లేక కాని నిజానికి  ఆ మాటల్ని రికార్డ్ చేయాల్సింది. ఆయన్నేదో ప్రశిస్తున్నామను కున్నాను కాని ఆయన చెప్పిన అంశాలు కవిత్వం పట్ల గొప్ప స్పూర్తి దాయకమయినవి.

***

ఆనాడు ప్రదర్శించిన కవితా చిత్రాల్లో కొన్ని

“బతుకు” 

నే చచ్చిపోతాననే కదూ

నీ బాధ

పిచ్చివాడా

ఈ వ్యవస్థలో మనం బతికింది

తొమ్మిది మాసాలే”

-జింబో

***

“గుండె బాయిలర్”

చల్ల గాలి ఎంత పీల్చినా

లోని కేల్లోస్తే

నైరాశ్యం లాంటి నిశ్వాస

చల్లని నీరెంత తాగినా

లోనికేల్లోస్తే వెచ్చగా

కళ్ళంబడి ఒల్లంబడి

కారణం

నిరంతరం

రగులుతున్న బాయిలర్ గుండె

-వజ్జల శివకుమార్

***

“రాత్రి చనిపోయింది”

వర్షం భోరున ఏడుస్తోంది

అప్పుడే వెళ్ళిపోయాడు చంద్రుడు

నాకేమిటని

గాలి వీస్తోంది

నేనున్నాని

సూర్యుడు తొంగి చూస్తున్నాడు

మబ్బుల తెర అడ్డం వస్తుంది

నేను అప్పుడే లేచి చూసాను

చనిపోయింది ఎవరా అని

ఆలోచిస్తే తెలిసింది

చనిపోయింది రాత్రేనని

-పి.ఎస్.రవీంద్ర

***

“రీప్రింట్”

ఈ సమాజం
అచ్చు తప్పులున్న
ఓ గొప్ప పుస్తకం
ఇప్పుడు కావాల్సింది
తప్పొప్పుల పట్టిక
తయారు చేయడం కాదు
ఆ పుస్తకాన్ని
సమూలంగా
పునర్ ముద్రించడం జరగాలి

-వారాల ఆనంద్

***

“ఉనికి”

అలా

సమాధిలా

అంగుళం మేరకన్నా

కదలకుండా పడి వుంటే ఎలా

కొనాళ్ళు పోతే

నీ మీద నానా గడ్డీ మొలిచి

నీ ఉనికే నీకు తెలిసి చావదు

-అలిశెట్టి ప్రభాకర్

***

          ఇంకొంతమంది రాసిన కవితా చిత్రాల ప్రదర్శన అది. దాని స్ఫూర్తి తోనే అలిశెట్టి ప్రభాకర్ తర్వాతి కాలంలో తన అద్భుత కవితలు, గొప్ప చిత్రాలతో జగిత్యాల మొదలు డిల్లీ జవహార్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం దాకా తన కవితా చిత్ర ప్రదర్శనలతో గొప్ప ప్రస్థానాన్ని కొనసాగిచాడు.

          ఇట్లా వేములవాడలో పుట్టిన ఒక ఆలోచన, ఒక ప్రదర్శన కవితా చిత్రప్రదర్శనా ప్రక్రియకు దారితీసింది.

          అందుకే అన్ని సృజనాత్మక ప్రక్రియలూ భావ వ్యక్తీకరణ మాధ్యమాలే, కావలసిందల్లా ఆర్తీ ఆర్ద్రతే. అది కవిత్వమయినా, చిత్రమయినా, సంగీతమయినా లేదా అన్నింటి సమన్వయమయిన సినిమా అయినా సరే.వాటిల్లో మనిషి మనసు వున్నప్పుడు అవి జీవితంతో అవిభాజ్యమవుతాయి.

***

వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు

          నా అరవై రెండేళ్ల జీవనయానంలో వేములవాడది ఒక ప్రధాన భూమిక. అనేక అనుభవాలకు,ఆనందాలకు,కొన్ని అవమానాలకు వేదికయిన ఆ వూరు మా అమ్మను కన్న వూరు,అమ్మమ్మ వూరు,తాతయ్య జోరు, గొప్ప జాతర హోరు.

          వేములవాడ లో నేను అమ్మ గారింటి తోనే ఐడెంటిఫై అయినప్పటికీ మా వారాల వంశం మూలాలు వేములవాడలోనే వున్నాయి.తరతరాలుగా మిఠాయిలోల్లం. అది తర్వాత ఎప్పుడయినా రాస్తాను.

నేను పుట్టింది వేములవాడలోనే అయినా పెరిగింది చదివింది కరీంనగర్. సెలవులకు, పండగలకు,పబ్బాలకు,అమ్మ గారింటికి వచ్చేవాడిని. అమ్మమ్మ సత్తమ్మ, తాతయ్య డాక్టర్ సుబ్రహ్మణ్యం,మామయ్యలూ, అత్తమ్మలూ, అందరిలో ఒక్కడినై కలగలిసి పోయి వేములవాడ వాడినే అయిపోయాను.

          నా సృజనాత్మక జీవితంలో నటరాజ కళానికేతన్ ఒక ప్రధాన మూల మలుపు. ఆ మలుపు వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపించి జాతీయ అంతర్జాతీయ స్థాయి సినిమాల్ని ప్రదర్శించడం దాకా సాగింది.1983 దాకా నా ప్రధాన వేదిక భూమిక ఆ వూరే.

          ఆ వేదిక గురించి విస్తృతంగా రాయాల్సివుంది. రాస్తాను ఎప్పటికయినా.

***

          ఇప్పటికి గత అయిదు దశాబ్దాలుగా నన్ను వెంటాడుతున్న కొన్ని images గురించి రాస్తాను.

SOME Haunting images :

1 ) తిప్పాపురం బస్ స్టాండ్ :

          చిన్నప్పటి నుండి దశాబ్ద కాలం వీక్షించిన దృశ్య మిది. జనంతో క్రిక్కిరిసి పోయి నిండు గర్భిణీ లా మెల్లిగా స్టాన్డ్ కు చేరుకున్న బస్సు చుట్టూ పొలోమంటూ పూజార్లూ వేద పండితులూ చేరి దేవుని దర్శనానికా అని పలకరిస్తూ పోటీలు పడి తలా ఒకటో రెండో కుటుంబాల్ని వెంట తీసుకెళ్లి. వారికి వసతి దర్శన తదితర బాధ్యతలు చూసే వారు. వేదపండితులు,విజ్ఞులు అయినా వారిని అలాంటి స్థితిలో చూడ్డం తీవ్రంగా కలత పెట్టేది.ఆ ఇమేజ్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది.

2 ) ధర్మ గుండం

అప్పట్లో దేవాలయ ధర్మ గుండానికి చెరువుకి నడుమ కేవలం చిన్న రాతి కట్టడం ఉండేది, ఇంకా కట్టడాలేవీ లేవు. యాత్రికులు దేవునిమీది విశ్వాసం తో గుండం లోకి పైసలు వేసేవాళ్ళు. అప్పుడేన్నని ఒకటో,రెండో, ఐదో పైసల బిళ్ళలు వేసేవాళ్ళు వాటి కోసం కొంత మంది నీళ్ళల్లోకి దూకి మునిగి వెతికి కరుచుకుని మరీ తెచ్చు కునే వాళ్ళు. ఎన్ని సంపాదించే వాళ్ళో కానీ ఆ ఇమేజ్ ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే వుంది.

3 ) మిఠాయి దుకాణాలు

          గుడి ముందు కాలువ పక్కన కేశన్నగారి ఇంటి వరుసలో పొందికగా వున్న మిఠాయి,గాజుల దుకాణాలు నాకిప్పటికీ గొప్పగా అనిపిస్తాయి. రంగు రంగుల చిలుకలు బత్తీసలు బెండ్లు శక్కరి పుట్నాలు, అందంగా పేర్చిన పేడాలు ఎంత కళాత్మకంగా ఉండేవో. గొప్ప దృశ్యాలవి పిల్లలు మెడలో చిలుకల పేర్లు వేసుకోవడం ఎంత అందంగా ఉండేదో.

4 ) బిచ్చ గాళ్ళు

          జాతరలు ఆలయాల ముందు వీళ్ళు సాధారణం. కానీ వేములవాడ వీధుల్లో ముళ్ల కంపల పై పడుకుని కొందరు, ఇంకొందరయితే భూమిలో గోతి తవ్వి అందులో తల పెట్టి మట్టి తో కప్పుకుని పక్కనే ఒక ప్లేటు పెట్టుకుని గంటల తరబడి అట్లా వుండే వాళ్ళు. వాళ్లకు శ్వాస ఎట్లా ఆడేదో ఇప్పటికీ అర్టంకాని విషయమే.ఆ దృశ్యాలు నన్ను వెంటాడు తూనే వున్నాయి. అప్పుడు కెమెరాల్లేవు ఇమేజెస్ మనసులోనే ఉండి పోయాయి

5 ) తూము

          చెరువు కింది తూములోంచి నీళ్లు వదిలి నప్పుడు ఉప్పొంగి కాలువలోకి వచ్చే నీటి దృశ్యం పట్నం లో పెరిగే నాకు అబ్బురంగా కనిపించిన ఇమేజ్ .

6 ) పోచమ్మ

          పోచమ్మ బోనాలు వాటికి ముందు మోగే డప్పుల చప్పుడు శివాలూగే భక్తులు ఓహ్ చూడాల్సిందే.మరీ చిన్నప్పుడు భయమేది కానీ ఆ ఇమేజ్ మామూలుది కాదు

7 ) జైన శిల్పాలు

          ప్రధాన దేవాలయం నుండి తరలించిన వందలాది శిల్పాల్ని అనాధలుగా భీమన్న గుడి పక్క తోటలో పడేసిన దృశ్యం వెరీ మచ్ హాంటింగ్. కొంచెమయినా చారిత్రిక దృష్టి లేని తనం దుఃఖం కలిగిస్తుంది.వేదనగా ఉంటుంది.

8 ) తాతయ్య దవాఖానా

          సుబ్రహ్మణ్యం తాత దవాఖానా రోజంతా పేషంట్ల తో క్రిక్కిరిసి ఉండేది. కషాయం దగ్గు పొట్లాలతో బిజీగా ఉండి సేవ చేసేది. సాయంత్రమయితే చాలు దవాఖానా ముందు ఊడ్చి శుభ్రం చేసి చాపలు వేసేవాళ్ళు. ఆప్పుడు తాతయ్య, ఠాకూర్ సాబ్, సాంబయ్య సారూ ఇంకా అనేక మంది పెద్దలు ఒక్కోసారి ఎం.ఎల్ ఏ  రాజేశ్వర్ రావూ కూర్చుని దేశం గురించి రాజకీయాల గురించీ చర్చించే వాళ్ళు. ఆ దృశ్యం ఎంత గొప్పగా ఉండేదో

9 ) దవాఖాన్ల అమ్మమ్మ రాజేశ్వరి అమ్మమ్మ

          నా చిన్నప్పటి నుండి మనసులో అట్లా నిలిచి పోయిన స్త్రీ రూపం దావాఖాన్ల అమ్మమ్మ. ఒకింత నిండుగా ముక్కు పుడక, చెవులకు గంఠీలు సహా ఒంటినిండా ఆభరణాలతో కళకళ లాడేది.నోట్లో పాన్ ఎంత అందంగా ఉండేదో. దసరాకు జాతరాకో మా పిల్లలందరికీ ఒక్కో రూపాయి ఇచ్చేది. తను నాకయితే గొప్ప గ్రామ దేవతలా అనిపించేది. చాలా గొప్ప స్త్రీ మాత్రమే కాదు గొప్ప మనిషి కూడా.

          ఇట్లా నన్ను హాంట్ చేసిన ఇమేజెస్ ని కొన్నింటిని నా ‘శివ పార్వతులు’ డాక్యుమెంటరీ లో పొందు పరిచాను.

          ఆ ఫిలిం Slovenia ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు గెలుచుకుంది.ఇంకా భూటాన్, మెక్సికో లాంటి చోట డాక్యుమెంటరీ ఫెస్టివల్స్ లో పాల్గొంది. ఆ వివరాలు మరో సారి.

          ఇవన్నీ నన్ను వెంటాడిన ఇమేజెస్ మాత్రమే. నా ఫిలిం చూడాలనిపిస్తే చెప్పండి లింక్ ఇస్తాను.

సెలవు, మళ్ళీ కలుద్దాం 

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.