విజయవాటిక-14
చారిత్రాత్మక నవల
– సంధ్య యల్లాప్రగడ
విజయవాటిక నావోత్సవం
విజయవాటికలో జరిగే నావోత్సవం ఎంతో పేరు గాంచింది. దేశవిదేశాల ఆటగాళ్ళు పాల్గొంటారు దానిలో. వారిలో ఎందరో ముఖ్యులు కూడా ఉన్నారు. వచ్చినవారు నగరంలో మధుశాలలలో, కళామందిరాలలో కాలక్షేపం చేస్తారు. విజయవాటికలో విలాస మందిరాలలో మదనిక మందిరం పేరెన్నిక గలది. ఆమె రంభా, ఊర్వసి, తిలోత్తమలను మించినదని, ఆమె నృత్యం చూడకపోతే జన్మ వృధాయని ఊరిలోని విలాసవంతులు అనుకుంటూ ఉంటారు. ఆమె అందం ముందు రాజ నర్తకి అందం దిగదుడుపేనని పొగుడుతారు రసికులు. నావోత్సవాల వంకన కొందరు రసికులు ఆమె నృత్యము చూడటానికే నగరానికి వస్తారు.
చంద్రోదయమైంది. అష్టమి వెన్నెల ఊరంతా పరుచుకున్నది. ఊరంతా సద్దుమణిగింది. విలాస మందిరాల వద్ద మాత్రం సంగీతం మిన్నంటుతున్నది. రక రకాల సంగీతాలతో మందిరాలు, ఆటలతో క్రీడా మందిరాలు, సురను పంచుతూ మధిరా మందిరాలు రసికులతో కిటకిటలాడుతున్నవి. మదనిక మందిరం వద్ద విలాసవంతులు, ధనవంతులు ఎందరో రసికులు చేరారు. మదనిక బృందం నృత్యం చేస్తున్నారు వేదిక పై.
ఆ మందిరానికి ఒక యువకుడు వచ్చాడు. అతనిని ద్వారపాలకుడు ఆపాడు.
“ఎవరు మీరు?”
“నా పేరు భానుడు. నావికోత్సవానికి వచ్చాను. నేడు మదనిక నృత్య ప్రదర్శన చూడటానికి వచ్చాను…”
“ఇలా ఈ సోపాన పంక్తి నుంచి పైకి వెళ్ళండి…” దారి చూపాడు ద్వారపాలకుడు.
ఆ సోపానపంక్తిని అధిరోహించి పైకి వెళ్ళాడు భానుడు.
అక్కడ గుండ్రని వేదిక పై స్వర్గ లోకపు నృత్యాలను మించి అద్భుత నృత్యం చేస్తున్నారు మదనిక బృందం. వారు క్షీరసాగర మధనం నర్తిస్తున్నారు. నర్తకీమణుల వేషధారణా, వారి ఆభరణాల మెరుపులు ఆ ప్రదేశాన్ని కాంతివంతం చేస్తున్నాయి. వారి నృత్యం దేవ నృత్యాన్ని మించి ఉంది. ఆ నృత్యమే మత్తు కలిగిస్తోంది. దానికి ధీటుగా సంగీతం మైమరపిస్తోంది.
అక్కడ సేవకులు మధిరను పంచుతున్నారు. నగరంలోని ధనవంతులు సగం మంది అక్కడే ఉన్నారు. నావికోత్సవానికి వచ్చిన విదేశీ ఆటగాళ్ళు చాలా మంది అక్కడ మధిర త్రాగుతూ, ఆ నృత్యాని చూస్తూ కనిపించారు. ఆ మందిరం ప్రక్కనే క్రీడా మందిరం ఉంది. అక్కడ జూదం నడుస్తోంది. మరో చోట ఘోష్టి నడుస్తోంది. ఎవరికి కావలసిన సంతోషం వారు చూసుకుంటున్నారు. అందరూ మదనిక నృత్య విన్యాసాలు చూస్తూ మైమరచి పోతున్నా, భానుడు వచ్చిన వారిని చూస్తున్నాడు.
వారిలో విదేశీయులతో పాటూ కళింగ ఆటగాళ్ళూ, పల్లవ ఆటగాళ్ళూ కూడా ఉన్నారు. ఆటగాళ్ళు ఈ దేశ అతిథులు. వారినేమనటానికీ లేదు. మహారాజుకు శత్రువులు అలా రాజధానిలో తిరగటం ఇష్టం లేకపోయినా, ఆటగాళ్ళను యధేచ్ఛగా తిరగనిస్తారు ఆ సమయంలో. వారిలో గూఢచారులు కూడా ఉండవచ్చు. ఆటగాళ్ళు మధిర మత్తులో తూగుతున్నారు. భానుడు కూడా వెళ్ళి మధిరను తెచ్చుకున్నాడు.
ఆ మధిర వాసనకే మత్తు కలుగుతున్నదతనికి. అది ప్రక్కన పడవేసి త్రాగినట్లుగా మత్తుగా ఊగుతున్నాడు, ఓరకంట కళింగులను చూస్తూ…
ఆ కళింగ ఆటగాళ్ళు తెలుగుల గురించి హాస్యంగా మాట్లాడుకుంటూ నవ్వు కుంటున్నారు. మదనిక నృత్యం చూస్తూ.. “కొద్ది కాలమాగు..మా రాజ నర్తకిగా మారవచ్చు మదనిక…నీకు మీ రాజ్యంలో గౌరవము కలగదు. మా రాజ్యానికి రా…” అన్నాడొకడు.
“అవును మన అనంతవర్మ మాహారాజులకు నెచ్చెలి కావటానికి అట్టే సమయం లేదులే…” నవ్వుకుంటున్నారు ఇద్దరూ. నాట్యం ముగిసింది. మధిర త్రాగిన మత్తులో ఉన్న రసికులు ఒక్కొక్కరూ నిష్క్రమిస్తున్నారు. కళింగ ఆటగాళ్ళు మాత్రం కదలలేదు. భానుడు కూడా ఒక మూలన కూర్చొని మత్తులో జోగుతున్నాడు. సేవకులు వచ్చి అందరినీ బయటకు పంపుతున్నారు. వారు కళింగ ఆటగాళ్ళను కూడా పంపేసారు. భానుడి వద్దకు వచ్చి “మందిరము మూసివేస్తున్నాము. మీరు దయచెయ్యవచ్చు…” అన్నారు.
“నేను వెళ్ళను. వెళ్ళలేను. నేను మదనికను ప్రేమించాను…” అని తూగుతూ ఊగుతూ అల్లరి మొదలుపెట్టాడు.
ఆ గొడవ మదనిక చెవిన వేసిందో పరిచారిక. ఆమె బయటకు వచ్చింది. ఆ గదిలో ఆమె కాలు పెట్టిన వెంటనే మెరుపులు మెరిసినట్లుగా భానుడు ఉలిక్కిపడ్డాడు. అటుపై ఆమెతో ప్రేమ కబురులు మొదలుపెట్టాడు. “సుందరీ…సుందరీ… నీ కోసము బహు దూరం నుంచి వచ్చాను. నావోత్సవము నిను చూడటానికి వంకే… నిన్ను ప్రేమించాను. నీ దాసుణ్ని…” అంటూ తూలటం మొదలుపెట్టాడు భానుడు.
“నేటికి ఈ ప్రేమ చాలు…రేపు రా రసికా!” అన్నదామె.
“రేపటి వరకూ సమయము లేదు. నేను విరహం భరించలేను. నీవు ఈ రోజే నన్ను సత్కరించాలి…” ఊగటం పెంచాడు భానుడు.
“ఇతగాడికి మధిర ఎక్కువైయింది…” అన్నదామె. అతని వైపు తిరిగి “సరే నిన్ను సత్కరిస్తాను ఈ రోజుకు వెళ్ళిరావాలి…” అన్నది. తన చెలికత్తెను చూసి సైగ చేసింది. చెలికత్తె లోపల నుంచి ఒక మాల తెచ్చి ఇచ్చింది. మదనిక ఆ మాలను భానుడి మెళ్ళో వేసి, “నేటికి పోమ్ము రసికా. రేపు రావచ్చును…” అంటూ పరిచారికలకు సైగ చేసి “తలుపులు అన్ని ముయ్యండి. ఇతనిని బయటకు పంపండి…” అంటూ మందిరం విడిచి లోపలికి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిన తరువాత సేవకులు అన్ని తలుపులూ మూసి వేసారు. కొంత సేపటికి భానుడు లేచి ఊగుతూ బయటకు నడిచాడు. బయటకు వెళ్ళాక అతను వేగంగా చెట్లమాటుకు వెళ్ళి అక్కడ దాచిన పేటికను తెరచి తన మెడలోని పూలహారాన్ని పెట్టి మూసివేసాడు. ఆ పేటికను అక్కడే తన కోసం ఎదురు చూస్తున్న అంతరంగికునికి, ఇచ్చి చీకట్లో మాయమైనాడు. ఆ పేటిక అరఘడియకల్లా శ్రీకరునికి చేరింది. అతను తెరచి ఆ మాలను పరిశీలించాడు. ఆ హారములో పువ్వులన్నీ ఎర్రని పువ్వులు. ఎర్రని పువ్వులు కళింగుల గుర్తు. ఆ పూల మధ్య నున్న పత్రంలో వేసిన గుర్తులను చదివాడు. దాని భావము “కళింగుల గురి సింహాసనమే… ఏ మార్గమైనా…” ఆ సందేశాన్ని గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రను దూరం చేసుకున్నాడు శ్రీకరుడు.
***
కృష్ణానది ఉరుకులు పరుగులుగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది బయటకు చూడటానికి మాములుగా ఉన్నా ఎక్కడ సుడిగుండాలుంటాయో, ఎక్కడ మెరకో తెలియదు. ఆ నది మీద అనునిత్యము ప్రయాణించే సరంగులు కూడా అప్పడప్పుడూ ప్రమాదాలు ఎదుర్కుంటూనే ఉంటారు. కృషా జలాలు దీర్ఘమైన నీలము. ఆ నీలము నలుపులోకి తిరిగి ఉంటుంది, అందుకే కృష్ణానది అన్నారు. నదిలో మొసళ్ళ బెడద చాలా ఎక్కువే ఉంటుంది. మాములు రేవులలో హాడావిడికి అవి కనపడవు కాని, నది మధ్యలో కోకొల్లలు.
నందికొండ నుంచి విజయవాటికకు నది ప్రవాహంకి ఎదురీదాలి. విజయవాటిక వద్ద నది విశాలమై తదనంతరం మళ్ళీ చీలిపోతుంది. నందికొండ వద్ద ఆనాడు హడావిడి ఎక్కువగా ఉంది. దేశవిదేశ ఆటగాళ్ళు వాళ్ళ నౌకలతో సిద్ధంగా ఉన్నారు. కళింగ ఆటగాళ్ళ అల్లరి ఎవ్వరూ పట్టలేక పోతున్నారు. నౌకకు ఇద్దరు చొప్పున ఆటగాళ్ళు సర్దుకు కూర్చున్నారు. కొంత సేపటికి మహారాజు కుమారుడు, వీరాధివీరుడు, మహాదేవ వర్మ వస్తున్నట్లుగా వందిమాగధులు జయజయధ్వానాలు చేశారు.
‘శ్రీపర్వత పాదసేవకుడు, రాజాధిరాజు, పరాక్రమవంతుడు, ధీశాలి, మహారాజ పుత్రుడు శ్రీ శ్రీ మహాదేవవర్మకు జయం’ అంటూ పాడుతున్నారు. అందరూ జయ ధ్వానాలు చేశారు.
మహాదేవవర్మ ఆ జయధ్వానాల మధ్య ఆట ప్రారంభమైనదని గంట మ్రోగించినాడు. ఆటగాళ్ళు సర్రున నీటిని కోస్తూ నౌకలను నడుపుతున్నారు. గుప్తుల నౌక ముందుకేగుతున్నది. చీనా వారు తక్కువ లేరు. వారు మునుముందుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. తెలుగుల నౌక అందరి కన్నా ప్రథమంలో ఉంది. దానిపై సరంగు కాకుండా శ్రీకరుడు కూడా ఉన్నాడు. వారిని ఎవ్వరూ దాటలేక పోతున్నారు. కళింగులు ఇంతలో దాటుకు ముందుకు వచ్చేశారు. వారు వెనక నుంచి శ్రీకరుని నౌకను వారి నౌక ముక్కుతో కొట్టారు. శ్రీకరుని నౌక ముందుకు పెద్దగా ఊగి ప్రక్కకు పడిపోయింది. సరంగు, శ్రీకరుడు వేగంగా నౌకను తోశారు. నౌక మళ్ళీ ఊగి సమతలంగా అయింది. అప్పటికే కళింగ ఆటగాళ్ళు నవ్వుతూ, వెకిలి చేష్ఠలు చేస్తూ దూసుకుపోయారు ముందుకు. శ్రీకరుడు, సరంగు నౌకలో కొంత సర్దుకున్నారు. అప్పటికే వారిని చాలా నౌకలు దాటి వెళ్ళి పోయాయి. శ్రీకరుడు ఒడ్డుకు చేరుకున్నాడు. కళింగులు ప్రథమ బహుమతి తీసు కున్నారు. వారు నవ్వుతూ వెకిలిగా శ్రీకరుని చూస్తూ వెళ్ళిపోయారు. శ్రీకరుడు ఒడ్డుకు వచ్చి మహాదేవవర్మతో కలసి రాజభవనం చేరుకున్నాడు. మహాదేవవర్మతో అంతర్మందిరంలోకి వచ్చాక అడిగాడు మహాదేవవర్మ” అదేమి కారా? కళింగులెలా గెలిచారు?”
“వారు నా పడవను వెనక నుంచి కొట్టారు. పడవ ప్రక్కకు ఒరిగిపోయింది. నేను, సరంగు నారుడు వెనకకు తోసి సర్దుకు వచ్చే సరికే వారు గెలిచారని జయధ్వానాలు చేస్తున్నారు…”
“ఆటలో ఇది తప్పు కదా. నీవు ఎందుకు ఊరుకున్నావు?”
“వారు యుద్ధానికి సందు చూస్తున్నారు రాజకుమారా! అందుకే కావాలని కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మనము సమన్మయం చూపాలి. మనము గొడవ చెయ్యటము వారికి కావలసినది. మనం అల్లరి చేస్తే వారు గెలిచినట్లు అవగలదు…”
“వారు అన్యాయం చేసినా… మనము తెలిసీ మిన్నుకుండాల్సిందేనా?”
“లేదు వారు క్షేమమని, గెలిచారని వార్తను పంపనిద్దాం… తరువాత మీకు తెలుసు. నే చెప్పనక్కర్లేదు…”
“సరే నీ ఇష్టం…”
“మీరు ఆ నర్తకికి మనసిచ్చారని తెలిసింది. నిజమేనా?”
“నీవు నా మీద కూడా గూఢచర్యం చేస్తున్నవా కారా?”
“లేదు మిత్రమా! మన జాగ్రత్తలో మనముండాలి కదా. మీ మీద పెద్ద కుట్ర జరుగు తున్నట్లు నాకు బలంగా అనిపిస్తున్నది. కళింగులు చాలా పెద్ద కోరిక కోరుతున్నారు…”
మహాదేవవర్మ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మనసులో మాత్రము ‘ఈ శ్రీకరునికి తెలియనిది ఉంటుందా’ అనుకున్నాడు…
***
కళింగ ఆటగాళ్ళు విజయోత్సాహాల మధ్య మధిర సేవిస్తూ విశ్రాంతిగా ఉన్నారు. మరుసటి రోజే వారి ప్రయాణం. వారిద్దరూ కళ్ళతో సైగలు చేసుకున్నారు. వారిలో ఒకడు అక్కడ్నుంచి మాయమయ్యాడు. రెండవవాడు ఏమీ ఎరుగని వాడిలా మధిర త్రాగు తున్నాడు.
మాయమైన ఆటగాడు ఆ మందిరం బయట చెట్టు చాటున ఎవరితోనో గుసగుసలాడి లోపలికొచ్చాడు. చెట్టు చాటున ఉన్న వ్యక్తి చీకటిలో కలిసిపోయాడు. చీకటిలో కలిసిన అతని మెడ మీద దెబ్బపడింది. అతను వెనుకకు చూసే లోపలే స్పృహతప్పి పోయాడు.
***
శ్రీకరుని చారులు కళింగ గూఢచారిని బంధించారు. కళింగుల పన్నాగము తెలుపమని …కానీ ఆ చారుడు తన పళ్ళ మధ్య ఉంచుకున్న విషపు పన్నును కొరికి మరణించాడు. కళింగులు తెలుగుల సింహాసనమే గమ్యముగా ప్రయత్నాలు ఉధృతము చేశారని రూఢీ అయింది శ్రీకరునికి .
* * * * *
(ఇంకా ఉంది)
తెలంగాణలో పుట్టి పెరిగారు. వివాహాంతరము అమెరికా వచ్చారు. గత పదహరు సంవత్సరాలుగా అట్లాంటా నగరములో నివాసముంటునారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం. బి. ఎ డిగ్రి పొందారు. శ్రీవారు కొండల నల్లజర్ల టీ మొబైల్ లో పని చేస్తున్నారు. కుమార్తె మేఘన. స్టాంఫోర్డ్ లో రెసెర్చు అసిస్టెంట్ గా సైకాలజీ ల్యాబ్ లో పనిచేస్తున్నది. సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా అట్లాంటా తెలుగు సంఘములో పని చేశారు. తానా, అమెరికన్ రెడ్‌క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్, అట్లాంటా హిందూ టెంపుల్, వీ.టీ. సేవ ఇత్యాది సంస్థల్లో స్వచ్ఛంద సేవ సేవలందించారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసము సేవలందించే ‘రక్షా’ సంస్థ వారి “Ramesh Bakshi Leadership” అవార్డును, ‘పాడుతా తీయగా’ వారి సహకార అవార్డును, సిలికానాంధ్రవారి అవార్డును అందుకున్నారు. “నేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు” అన్న పుస్తకం ప్రచరించబడింది. కౌముది, సంచిక, మాలిక, దర్శనం వెబ్ మ్యాగజైన్స్ లో వీరివి ప్రతినెలా ప్రచురితమౌతున్నవి. ఊహలుఊసులు అన్న తెలుగు బ్లాగు రచయిత.