అన్నా మే వాంగ్
అమెరికన్ కరెన్సీ పై స్థానం దక్కించుకున్న అన్నా మే వాంగ్
-నీలిమ వంకాయల
హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల కరెన్సీ నాణెం మీద ముద్రించబడే తొలి ఏషియన్ అమెరికన్ వ్యక్తి గా చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు.
పెన్సిల్ తో చెక్కినట్లున్న సన్నని కనుబొమ్మలతో ఉన్న వాంగ్ చిత్రం, అమెరికా క్వార్టర్ నాణెం మీద వెనుక భాగంలో కనిపించనుంది. వివిధ రంగాల్లో అగ్రగాములై ఉన్న మహిళలకు సముచిత గౌరవం కల్పించాలనే లక్ష్యం తో “అమెరికన్ క్వార్టర్స్ ప్రోగ్రాం” ఈ నిర్ణయం తీసుకుంది.
అన్నా మే వాంగ్ మొదటి ఆసియా అమెరికన్ హాలీవుడ్ నటి. ఆమె మూడవ తరం అమెరికన్. 1905లో లాస్ ఏంజిల్స్‌లో జన్మించిన అన్నా మే వాంగ్ 14 సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించింది. ఆమె అడుగుపెట్టేసరికి హాలీవుడ్ లో స్వర్ణయుగం నడుస్తున్నప్పటికీ వాంగ్ బాట మాత్రం బంగారు బాట కాదు. 1922లో “ది టోల్ ఆఫ్ ది సీ”లో తొలి ప్రధాన పాత్ర పోషించింది. రెండు సంవత్సరాల తరువాత, ఆమె “ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్”లో మంగోల్ బానిసగా నటించింది. ఆ సమయంలో, ఆసియా వ్యతిరేక విద్వేషాలు విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. వాంగ్ ఆసియాకు చెందిన తొలి వ్యక్తి కావటంతో హాలీవుడ్ లో ఎంతో వివక్షకు గురి అయ్యింది. హాలీవుడ్‌లో మూస పాత్రల నుండి బయటపడేందుకు పోరాడుతూ జాత్యహంకారాన్ని ఎదుర్కొంది. చాలా సంవత్సరాలు, ఆసియన్ “డ్రాగన్ లేడీ” పాత్రలకు మాత్రమే ఆమె పరిమితం కావలసి వచ్చింది.
తర్వాత ఆమె అనేక యూరోపియన్ ఫిలిమ్స్ లో నటించి, 1930ల ప్రారంభంలో U.S.కి తిరిగి వచ్చారు. అప్పుడు ఆమె “డాటర్ ఆఫ్ ది డ్రాగన్” లో ప్రతినాయకి గాను,”షాంఘై ఎక్స్‌ప్రెస్”లో సెక్స్ వర్కర్ వంటి పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేశారు. చైనీస్ వ్యవసాయ కుటుంబం గురించిన నవల ఆధారంగా 1937లో వచ్చిన “ది గుడ్ ఎర్త్”లో ఆమె తెల్లజాతి నటుడు లూయిస్ రైనర్ తో నటించినప్పుడు మాత్రం విజయానికి దూరంగా నిలబడవలసి వచ్చింది.
హాలీవుడ్‌లో జాత్యహంకారాన్ని ఎదుర్కోవడం కోసం, వాంగ్ ఒక ‘న్యాయవాదిగా’ స్థిరంగా ఆసియా-అమెరికన్ నటులకు ప్రాతినిధ్యం వహిస్తూ పోరాడింది. ఆమె డిమాండ్లు చివరికి ఫలించడం ప్రారంభించాయి: ఫలితంగా 1938లో, ది కింగ్ ఆఫ్ చైనాటౌన్‌లో చైనీస్ అమెరికన్ డాక్టర్‌గా ఆమెకు మరింత సానుభూతి గల పాత్ర ఇవ్వబడింది. ఆమె ఆ పాత్ర లో తన అద్భుతమైన నటన తో మెప్పించింది.
వాంగ్ నటనకు గుర్తింపుగా మొదటి ఆసియా-అమెరికన్ నటిగా 1960లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో “స్టార్” ని అందుకుంది. అయితే వాంగ్ తన జీవిత పథంలో ఏ మైలురాయి కూడా కష్టాలు లేకుండా చేరుకోలేదు. ఈమె తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 60కి పైగా సినిమాల్లో నటించింది.
1950ల నాటికి, వాంగ్ టెలివిజన్ పరిశ్రమ కు మారింది. రోడ్జర్స్ -హామర్‌స్టెయిన్ నిర్మించిన “ఫ్లవర్ డ్రమ్ సాంగ్” చలన చిత్రంతో ఆమె వెండి తెరపైకి తిరిగి రావాల్సి ఉంది, కానీ అనారోగ్యం కారణంగా నిష్క్రమించవలసి వచ్చింది.
ఆమె “స్టార్” గుర్తింపు పొందిన మరుసటి సంవత్సరం, అంటే 1961లో ఫిబ్రవరి2 న మరణించింది. అన్నా మే వాంగ్ అనేక ప్రతినాయకి పాత్రలు పోషించి ‘వేయి మరణాలు పొందిన వ్యక్తి” గా గుర్తింపు పొందారు. ఆమె తన అందముతో “ఓరియంటల్” గా పిలవబడుతూ హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలిచింది.
వాంగ్ హాలీవుడ్‌కే పరిమితం కాకుండా ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో పాటు న్యూయార్క్, లండన్ వేదికలపై కూడా నటించారు.
వాంగ్ కు లభించిన ఈ అరుదైన గౌరవం చిత్ర వినోద పరిశ్రమ లోపల, వెలుపల ఆసియా అమెరికన్లను ఉత్తేజపరిచింది.
“అన్నా మే వాంగ్ అమెరికాలో ఆసియా నటీనటుల రహదారిని సుగమం చేసారు. అది ఎంత కష్టమో మనం తెలుసుకోవాలి” అని ఆమె మేనకోడలు అన్నా వాంగ్ వానిటీ ఫెయిర్ పత్రికతో అన్నారు. “ఆమె దృఢత్వం నా పై చెరగని ముద్ర వేసింది. నేను ఆమెకు బంధువుని కాగలిగినందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆమె వారసత్వపు వెలుగు ఎప్పటికీ నిలవాలని కోరుకుంటాను. అదే నా జీవిత లక్ష్యం” అన్నారు.
నవంబర్ 4న లాస్ ఏంజిల్స్‌లోని పారామౌంట్ స్టూడియోస్‌లో యునైటెడ్ స్టేట్స్ మింట్‌తో నిర్వహించబడే కార్యక్రమంలో వాంగ్ నటించిన చిత్రాలలో ఒకటైన “షాంఘై ఎక్స్‌ప్రెస్” ప్రదర్శించబడుతుంది.
“హాలీవుడ్ చైనీస్” రచయిత ఆర్థర్ డాంగ్ మాట్లాడుతూ, “ఈ క్వార్టర్ కేవలం వాంగ్ కు మాత్రమే గుర్తింపు కాదు, మొత్తం ఏషియన్ అమెరికన్లందరికీ లభించిన గుర్తింపు. U.S. కరెన్సీలో ముద్రించబడటం అనేది గర్వించదగ్గ విషయం. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆమె ముఖాన్ని, పేరును చూడడమే కాకుండా, ఆసక్తి గా ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటారు” అని అన్నారు.
అన్నా మే వాంగ్ తరచుగా తన చేతిని ముఖానికి ఆనించుకుని ఆకర్షణీయమైన భంగిమలో కనిపిస్తూ ఉండేది. ఆమె తన చేతిమీద గడ్డాన్ని ఆనించి, ఒక వేలుతో తన పేరు వైపు దృష్టిని మళ్లిస్తూ ఉన్న భంగిమలో యునైటెడ్ స్టేట్స్ నాణెం మీద ముద్రింపబడడం చూస్తే “తనకు ఎలాంటి గుర్తింపు వస్తుందా అని ఆమె వేచి చూస్తున్నట్టు అనిపిస్తుంది” అని డిజైనర్ ఎమ్మా S.దంస్ట్రా ఆమె గురించి తన బ్లాగులో రాశారు.
ఈ క్వార్టర్ పై వాంగ్ చిత్రం ముద్రించబడటం వల్ల ఆమె చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అంతేకాకుండా గ్రాహం రస్సెల్ గావో హోడ్జెస్ రాసిన అన్నా జీవిత చరిత్ర “అన్నా మే వాంగ్: ఫ్రమ్ లాండ్రీమ్యాన్స్ డాటర్ టు హాలీవుడ్ లెజెండ్” త్వరలో బయోపిక్ గా నిర్మితం కానుంది . అందులో గెమ్మా చాన్ వాంగ్‌గా నటించబోతూంది.
*****
నీలిమ వంకాయల స్వస్థలం అమలాపురం. M.Sc., M.A., B.Ed. చేశారు. వృత్తి రీత్యా టీచర్. కథలు, అనువాదాలు రాయడం ప్రవృత్తి. బాలల్లో విలువలు పెంపొందించే ఆటలు, ఆడియో విజువల్స్ తయారు చేశారు.