అమ్మసంచి
-బంగార్రాజు కంఠ
నువ్వు పుట్టక ముందు
అమ్మ ఒక నాజూకుతనం
నువ్వు పుట్టక ముందు
అమ్మ ఒక చలాకీ చిరునామా
నువ్వు పుట్టక ముందు
అమ్మ ఒక ఆశల తేనెపట్టు
నువ్వు పుట్టక ముందు
అమ్మ ఒక ఉరికే వాగునీరు
నువ్వు పుట్టాక
తన సమస్తం గాలికి గిరాటుకొట్టాక
ఇక నువ్వే తన బంగరుకొండ
తప్పో ఒప్పో
పదినెలలు ఈ భూమిని మోసిన అమ్మకు తప్ప
ఎవరికీ వుండదు ఆ చారికల సంచి
ప్రపంచం మొత్తం మీద
అమ్మకి తప్ప ఎవరికీ నచ్చవు
కడుపు మీది ఆ బాధానంద ముద్రలు
పొత్తికడుపు మొత్తం కత్తితో చీరినట్టు
నువ్వూ నేనూ చీరే వుంటాం
పొట్టలో పిండం పెరిగేకొద్దీ
పచ్చి పుండ్లు కుక్కుకున్న సంచిలా పిగిలి
అచ్చులు దేరుతుంది
నువ్వు తెలియక చేసిన గాయాల మచ్చల్ని
దాచుకోవాలన్న ధ్యాసేలేని అమ్మ
నీ తప్పుల్ని మాత్రం
ఆ కడుపు సంచిలో దాచుకుంటుంది
తన క్షణకాలం సుఖం కోసమే
అమ్మ ఈ లోకాన్ని కనలేదు
తన లోకమైన నిన్ను కనడం కోసం
పదిమాసాల కాలం
క్షణానికో యుగాన్ని మోసిందని నీకెలా తెలుస్తుంది
నీకోసం ఇన్ని త్యాగాలు చేసిన బంధం
ఈ నేల మీద ఇన్ని యుగాలైనా
ఇంకొకటి కనపడిన జ్ఞాపకం వుందా !!?
మనం పుట్టింది
బ్రమ్మలకు కాదు మనిషీ !
అమ్మలకే !!
*****
చక్కటి పొయెమ్ సర్..
కవిత చాలా బావుంది సార్