ఓసారి ఆలోచిస్తే-2

ఆలంబన

-డి.వి.రమణి

(“ఆలంబన “ అనగానే మనకి ఒక కొమ్మ పెరగటానికి ఆధారం గా నాటే కట్టెపుల్ల గుర్తొస్తుంది , నదిలో కొట్టుకు పోయేవాడికి ఒక చిన్న దుంగ దొరికితే ఒడ్డుకు రాగలుగుతాడు అలాగే కష్టం లో ఉన్న వాళ్లకి ఒక “ఆలోచన” ఒక “ఆలంబన” అవసరం అది ఇవ్వగలగటం కూడా ఒక వరం .

డబ్బుతో కొనలేనివి ఇలాంటివి . మార్పు ఈ విధంగా ..రావాలి అనే నమ్మకం తో రాసిన కధ …)

***

          “జీవితం ఇలా  తలకి మించిన భారమవుతుంది అనుకోలేదు , కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే  ఉన్నాను …. పొద్దున్నే ఇంటి ఓనర్ వచ్చి చాలా గొడవచేసాడు, అద్దె కట్టమని , ఆలా చెప్పినప్పటినించి దుఃఖం ఆగటల్లేదు …

          కోటిగాడు స్కూల్ నించి వచ్చే వరకు  ఏడుస్తూనే ఉన్నాను , “ మమ్మి ఏమైంది ? ఎందుకు ఏడుస్తున్నావ్?” చిన్న చేతులతో కళ్ళు తుడుస్తూ అడిగాడు. అమాయకంగా బెదురు కళ్ళతో.  

          వీడు లేక పోతే ఎప్పుడో  చచ్చి పోయేదాన్ని కదా! వెర్రి నాన్న వాడేమి తప్పు చేసాడని ? నా తప్పుకి, వీడిని బలి చెయ్యలేను!

          “అమ్మా , ఆ క … లి … గా ఉంది , పోనిలే మంచినీల్లు తాగుతాలే  “ అని లోపలికి  వెళ్ళిపోయాడు, వాడు వెళ్లిన వైపు కళ్ళ నీళ్లతో చూస్తూ ఉండిపోయాను …

          పక్కనుండే, శివన్న వచ్చాడు ,” అమ్మాయ్ , అంజలి ,లే తల్లి , ముందు కాస్త ఎంగిలి పడు , పిల్లాడికి పెట్టు , ఇదిగో మీ ఒదిన చీర తెచ్చిన కట్టుకో, ఓ చోట పనుంది తీసుకపోతా “ అన్నాడు

          ఒక పళ్లెం లో అన్నం, పక్కన కూర, ఓ గిన్నెలో పప్పు చారు, పల్చటి మజ్జిగ ఒక గ్లాస్ లో తీసుకుని నా ముందుంచాడు …

          తొడ బుట్టలేదు కానీ  బాధ్యత తీసుకుంటున్నాడు ? ఈ శివన్న లేకుంటే ఎప్పుడో గంగలోకలిసి పోయేది , “అన్నా నీ ఋణం ఎలా తీర్చుకునేది?”  ఎంత ఆపినా ఏడుపు ఆగటం లేదు …

          ‘ఫర్లేదు తల్లి నా సెల్లినీ ఇట్లనే పంతానికి పోయి సంపేసుకున్నం … ఇంకేమి సొంచాయించకు “ అని లోపలికెళ్ళి కోటిగాడిని తీసుకొచ్చాడు

          పక్కన కూచోబెట్టుకుని ముద్దలు తినిపిస్తూ చెప్తున్నాడు , “ బిడ్డ అమ్మంటే దేవత లెక్క మంచిగా చూసుకోవాలే , మంచిగా చదువుకో నేను చదివిస్తా సరేనా?….. “ ఇలా ససుద్దులు  చెప్తున్నాడు , లేచి మొహం కళ్ళు చేతులు  కడుక్కుని అన్న తెచ్చిన చీర కట్టుకున్న.

          కోటిగాడిని శివన్న ఇంట్లో దింపి వచ్చాడు , ఇద్దరం బయలుదేరాము, బస్సు ఎక్కి యాదగిరిగుట్ట తీసుకు వెళ్ళాడు . 

          అక్కడేదో షూటింగ్ జరుగుతోంది … ఇద్దరం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాము అక్కడ ఎవరి, దగ్గరకో వెళ్లి శివన్న మాట్లాడాడు , నన్ను లోపాలకి రమ్మన్నారు,

          “ఈ అమ్మాయా ? ఇదవరుకు ఎక్కడన్నా ఆక్ట్ చేసిందా ?’ అని అడిగారు , “ లేదండి “ అన్నట్టు తల తిప్పాను అదొక ప్రపంచం లా ఉంది …

          ఇక్కడ నేను చెయ్యగలిగింది ఏముంది ? అనిపించింది.. 

          “హీరోయిన్ తో ఒక డైలాగ్ ఉంది డాక్టర్ రోల్ చేస్తావా ఏ? నా వెనక చెప్పగలవా?” మేనేజర్ అడిగాడు ,

          “ ఆ సర్ నేను టెన్త్ వరకు చదివాను సర్ “ బిక్క మోహమేసి అన్నాను …

          “ ఆ హీరోయిన్ విషం తీసుకుంటుంది హాస్పటల్ కివస్తుంది , మీరు చెప్పాలి ,” మీకు బి.పి. డౌన్ అయింది మీరు జాగ్రత్తగా ఉండాలి…ఎందుకంటే మీరిప్పుడు ప్రెగ్నెంట్ …” అని మందులు రాయాలి …రెండు రోజులు షూట్ ఉంటుంది , రోజుకి 1000 ఇస్తాము ఒకే నా “ అన్నారు

          నేను శివన్న వైపు చూసాను , తలూపమన్నట్టు సైగ చేసాడు .

          సరే అని వాళ్ళిచ్చిన తెల్ల కోటు వేసుకుంటూ ఉంటె అయ్య గుర్తొచ్చాడు, “ నా తల్లి డాక్టర్ అవుతుంది చూడు “  అని తెగ మురిసిపోయాడు ఇప్పుడెత్తున్నాడో పాపం నా గురించి దిగులు పడి పడి మంచం ఎక్కాడేమో … అనుకోగానే ఒక్కసారి నిస్సత్తువ ఆవరించింది …

          నన్ను నేను కూడ గట్టుకుని సాయంత్ర వరకు ఉన్నాను పాపం శివన్న కూడా నాతోనే ఉన్నాడు , సాయంత్రం 7 అయింది వెయ్యి రూపాయలు కవర్ లో పెట్టి ఇచ్చారు,” రేపు 7;30 కల్లా ఇక్కడుండాలి” అని చెప్పిన వాళ్ళు ఒక రోజులో అయిపొయింది రేపు రానక్కర్లేదు అని మరో 500 చేతిలో పెట్టి వెళ్లిపోయారు .

          ఇద్దరం ఇంటికి బయలుదేరాం దారి పొడుగునా దునియాదారి గురించి చెప్తూనే ఉన్నాడు .

***

          ఇంటి దగ్గరే ఉన్న ఓనర్ అంకుల్ కి 500 అద్దెకట్టి కొన్ని సరుకులు, కోటిగాడికి ఒక బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కుని ఇల్లు చేరాను. మల్లి ఇలా పనుంటే  పిలుస్తాము అన్నారు    

          ఆడుకుని, కాసేపు హోమ్ వర్క్ చేసుకుని , కాస్త తిని పడుకుని నిద్రపోతున్న వాడిని చూస్తూ , వాడి ఉంగరాల జుట్టు నిమురుతూ , “ ఎందుకురా ఈ పేదరాలి కడుపునా పుట్టావ్? ఇంకెక్కడా పుట్టిన నీకు భవిష్యత్తు ఉండేది … నువ్వు నా ప్రాణం రా నీ కోసం బతికాను నిన్ను చూస్తూ చూడటం కోసమే బతుకుతాను రా …మీ నాన్నొక దగుల్బాజీ అనుకోలేదు రా ఇంత మోసం చెయ్యగలుగుతాడని కూడా అనుకోలేదు ఎంత నమ్మించాడో రా… “ వాడు నిద్ర లో కదిలాడు …

          నేనే పక్కకి జరిగి పడుకున్న…  గతం వెంటాడుతూనే ఉంది …..

          అవి నేను మా పల్లెలో  టెన్త్ చదువుతున్న రోజులు … చదువు అంతగా అబ్బని నాకు 10 కొచ్చేసరికి 18 ఏళ్ళు వచ్చేసాయి.  అమ్మ వండిన వంట తినటం తప్ప వంట గదిలోకి వెళ్ళలేదు నాన్న తో ఎప్పుడన్నా పొలానికి వెళ్లేదాన్ని, ఆ పొలాలు చూడటం ఇష్టం దూరంగా కనిపించే రాములోరి గుడికి  గంటలు వినిపిస్తుంటే మెట్లు ఎక్కుతూ ‘శ్రీరామ జయరామ సీతా రామ” అని పాడుకుంటూ వెళ్ళటం ఇష్టం , మా ఊరు కొబ్బరిచెట్లు పంట చేలు చూస్తూ ఉంటె ఎంతో ఆనందం గా ఉండేది.

          మా పెదనాన్నగారికి మొగ పిల్లలే , బాబయ్యకి పిల్లలేరు ఇంట్లో అందరికి నేనే ఆడపిల్లని , ఎంతో గారంగా చూసేవారు .

          మేనత్త కొడుకు కూడా వ్యవసాయమే అంతగా చదువుకోలేదు … గోపాలం బావ నాకన్నా 10 ఏళ్ళు పెద్ద , అయినా అతనికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆస్తి ఇంకొకరికి పోనివ్వకూడదని మంతనాలు జరుగుతున్నాయి . టెన్త్ అవగానే పెళ్లి అనుకుంటున్నారు . మా ఊర్లో సినిమాకి వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్ తో అక్కడ మేనేజర్ ఇదిగో మన వీర్రాజు , ఎక్కడకి వెళ్లిన కనిపించేవాడు , చూడటానికి దొరబాబుల స్మార్ట్ గా ఉండేవాడు , మంచిగా మాట్లాడేవాడు  అప్రయత్నం గా చూసేదాన్నిపెద్దగా గుర్తించ లేదు, నేనంటే… ఇష్టమేమో నేనే భ్రమలో బతికాను.

          ఒక 6 నెలల నించి కొత్త సినిమా వస్తే మా కోసం నాలుగు సీట్స్ ఉంచి పెట్టేవాడు.

          అవి ఇస్తూ చూసిన చూపు బాగుండేది …

          కాస్త మాట్లాడుతూ క్రమంగా కొంచెం దగ్గరవడం కాకతాళీయమే … నాకు పరీక్షలు రాయటానికి రాజోలు సెంటర్ ఇచ్చారు, ఇంటికొచ్చి నాన్న తో చెప్పి ఆటో లో పరీక్షలు రాయటానికి తీసుకు వెళ్ళేవాడు అప్పుడు కొంత దగ్గరయ్యాము … పెళ్లి గురించి చెప్పి చాలా ఏడ్చేసాను నన్ను ఓదారుస్తూ నన్నొక అందలం ఎక్కించటం తెలీలేదు …

          నాకొక అందమైన భవిష్యత్తు చూపించాడు , హైదరాబాద్ వెళ్లి పెళ్లి చేసుకుందాము ఆ పెద్దతన్ని చేసుకుని పల్లెలో ఉండిపోతావా? నాతో రా , మనం పెళ్లి చేసుకుందాము … “ అంటూ రోజు రకరకాలుగా చెప్పేసరికి నిజమే అనిపించింది …

          ఆ మాటలు మత్తు జల్లటం ఎప్పుడు మొదలైందో తెలీదు … ఒకలాంటి తెగింపు వచ్చేసింది … ఈ పల్లెలో, వ్యవసాయం చేసుకుంటూ అదే బతుకు ఆ మొరటు భర్తతో బతకలేను అనే భావం వచ్చేసింది …

          వీర్రాజు తో చాల ధైర్యంగా హైదరాబాద్ బస్సు ఎక్కేసాను … నగలు ఇంట్లో డబ్బు తీసుకుని ఒక ఉత్తరం రాసి ! అంత ధైర్యం ఎలా వచ్చిందో ? ఏ నమ్మకమో తెలీలేదు ఆ క్షణాన తెలీదు ఒక ఊబిలో కాలు పెడుతున్నానని !

          హైదరాబాద్ లో ఎక్కడో వాళ్ళ దూరపు చుట్టం ఇంటికి తీసుకు వెళ్ళాడు  ఓ నలుగురు పెద్దల సమక్షం లో … అష్టలక్ష్మి గుళ్లో పెళ్లి చేసుకున్నాము .  అక్కడ ఒక 4 రోజులున్నాము ఆ ఇల్లు వాతావరణం నాకర్ధం కాలేదు … నేనెందుకొచ్చాను అని మొదటిసారి నన్ను నేను ప్రశ్నించుకున్నాను … వాళ్ళింట్లో పనులు చేశాను…అంతవరకు అలవాటు లేని పనులు ….

          మొత్తానికి ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాడు, కర్మాంఘాట్ ఏరియా లో రెండు గదుల ఇల్లు … నేను తెచ్చిన డబ్బు తో ఇంట్లోకి కావలసినవి కొనుక్కున్నాము మొదట్లో స్వర్గం అంటే ఇదియే అన్నట్టు ఉన్నాడు .

          అతని తో జీవితం లో సుఖ సంతోషాలున్న అప్పుడవి కనిపించలేదు … అమ్మ నా మీద బెంగ చెప్పలేదని గిల్ట్ ఇలా ఒకలాంటి స్థితి లో ఉండేది.

          క్రమంగా కోటి పుట్టే వరకు బాగానే ఉన్న సంసారం క్రమంగా చీకటి అవటం మొదలైంది సడన్ గా వెళ్లిపోయేవాడు ఏ పనీ చేసేవాడు కాదు , అడిగితే ఎదో దాటేసేవాడు … అర్ధం కాలేదు వారానికో సారి ఏటో వెళ్లిపోయేవాడు …ఏక్కడకెళ్లాడో తెలీదు ఎప్పుడొస్తాడో తెలీదు …. కొన్నాళ్ళకి వచ్చేవాడు … పిల్లాడికి రెండేళ్లోచ్చే సరికి నగలు డబ్బు హారతి కర్పూరం అయిపోయాయి , ఇంక ఇల్లుగడవటం మానేసింది దగ్గరే ఉన్న స్కూల్ లో ఆయాగా చేరాను … అక్కడకి పిల్లాడిని తేవొద్దు అన్నారు , కొద్దిరోజుల తర్వాత అది మానేసాను .

          దుఃఖం , అవమానం , బాధ ఏమిచెయ్యలేని పరిస్థితి పోనీ ఇంటికి వెనక్కి వెళ్లి అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుదామనుకున్నాను … పరువుకు ప్రాణం పెట్టె రైతు కుటుంబం మాది … లోపలికి రానిస్తారా? రానివ్వరు …

***

          ఒక వారం గడిచింది , ఆ డబ్బులు వచ్చాయి, శివన్న చెప్పాడు శాంతినికేతన్ స్కూల్ ఇక్కడకి దగ్గరే వెళ్లి అడుగు  జాబ్ ఇస్తారేమో నని , ఇంటర్ వరకు చదివానుగా ఇస్తారేమోనన్న  కొండంత ఆశతో వెళ్ళాను ,

          ప్రిన్సిపాల్ అడిగింది ,”టీచర్ ట్రైనింగ్ అయిందా? ఎక్స్పీరియన్స్ ఉందా? కిండర్ గార్టెన్ ట్రైనీ అయ్యావా?…. “ ఇలా  ప్రశ్నలడుగుతుంటే జస్ట్ ఎల్ .కే.జి .చదివించేందుకు ఇన్ని కావాలా??? అనిపించింది .

          “లేదు మేడం , నాకు చాలా అవసరం దయచేసి జాబ్ ఇప్పించండి పిల్లవాడిని చూసుకోవాలి” ఇంచుమించు ఏడుస్తూ అడిగాను.

          “నీ భర్త చూసికోడా ?” అనడిగింది ఆమె

          తల అడ్డంగా తిప్పేసాను …ఇంకేమి చెప్పలేక కళ్లనించి నీళ్లు జారీ పడుతున్నాయి తుడుచుకుని ప్రయత్నం కూడా చెయ్యట్లేదు .,” సరే ఏడవకు ఆయా జాబ్ ఉంది చెయ్యి 4000 ఇస్తాము “ అంది ఆమె . ఏమి చెయ్యలేక అదే భాగ్యమనుకుని ఒప్పుకున్నాను .

          అక్కడ వాళ్ళు చెప్పే పనులు చూసే చూపులు భరించటం నా తరం కాలేదు … కంటికి మంటికి ఏక ధారగా ఏడుస్తూనే ఉన్నాను. ఇంకా లాభం లేదు అనిపించి పురుగుల మందు తాగేసాను , కోటిగాడి కి చెప్పి శివన్న దగ్గరకి వెళ్లి ఉండు అని , వదిన శారద ఇంటికొచ్చే సరికి కోటిని చూసి ,”మీ అమ్మ ఎక్కడరా? “ అని అడిగింది” ఇంట్లో ఉంది అత్త , మీ దగ్గరే ఉండ మంది రావొద్దు అంది” ఆ మాట కి ,’ఓఓఓ శివయ్యో మీ చెల్లి ఎదో చేసిందిరో” అని అరుస్తూ తలుపు తోసుకుని వచ్చింది కొన ఊపిరి తో ఉన్ననన్ను ఆసుపత్రి కి వేసుకెళ్ళటం గుర్తుంది ఆ తర్వాత కళ్ళు ముతలు పడిపోయాయి ….

***

          మల్లి బతికినందుకు చాలా అంటే చాలా నా మీద నాకు కోపం వచ్చేసింది ఇంత చేతకాని తనం ఏమిటి? చావటం కూడా రాలేదా????

          మాములుగా స్కూల్ కి వెళ్ళటం మొదలు పెట్టాను … ఇన్స్పెక్షన్ జరుగుతోంది అని స్కూల్ అంతా శుభ్రం చేయించారు .

         ఇన్స్పెక్టర్లు ముగ్గురోచ్చారు …అంతా నిలబడి ఉన్నాము రాగానే అంతా నమస్కారం చేస్తున్నారు అంతవరకు తలొంచుకుని నిలబడ్డాను దగ్గరగా రాగానే నమస్కారం అని చేతులు జోడిస్తూ తలెత్తి చూసే సరికి … బాబయ్య !!!! నన్ను చూసి అలా ఆగిపోయాడు తాను కూడా!

          లంచ్ హౌర్ లో నన్ను పిలిపిస్తే వెళ్ళాను. నన్ను చూస్తూనే ప్రిన్సిపాల్ మేడం కుర్చీ చూపించి “కూచోండి .,”  అంది “వద్దు మేడం “ అన్నాను .

          బాబయ్య నన్ను తీసుకుని బయటకొచ్చాడు మిగతా అంతా కూడా నా వైపు క్యూరియస్ గా చూస్తున్నారు .

          రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కెళ్ళి అక్కడ కూచున్నాము. బాబయ్య ని చూడగానే దుఃఖం ఆగలేదు..

          “ఏంట్రా తల్లి ఇది? ఎంత వెతికినా దొరకలేదు పేపర్ లో వేయించాము పోలీస్ రిపోర్ట్ ఇచ్చాము మనుష్యుల్ని పంపిన ప్రయోజనం లేక పోయింది “

          “తప్పు చేశాను బాబయ్య మొహం చూపించలేక దాక్కుండిపోయాను “ ఏడుస్తూ అన్నాను .

          “తప్పు చేస్తే చేసావ్ ఎదుర్కోవద్ద? ఆ గొట్టంగాడు దమ్మిడీకి తికానా లేని వాడు ఎలా వాడి తో వచ్చేసావ్? తాతయ్య నీకిచ్చిన ఆస్తి ఎంతో తెలుసా? అది తీసుకుని దర్జాగా స్కూల్ పెట్టుకో ఎమన్నా చెయ్యి , అమ్మా నాన్నా ఎంత బెంగ పడ్డారో తెలుసా? నాన్నకి పరాలిసిస్ స్ట్రోక్ వోచ్చి 2 ఏళ్లుగా మంచం లోనే ఉన్నాడు, అమ్మ ఆయన్ని చూసుకుంటూ ఉండింది , నీకు గోపాలం వద్దు అంటే వేరే వాళ్ళని చూసేవాళ్ళం కదా?”

          అలా చాలాసేపు నచ్చ చెప్పాడు , శివన్న ని చూపించి నన్నెలా ఆదుకున్నాడో చెప్పాను .

          తర్వాత నెల రోజులు చాలా తర్జనలు తర్కాలు పెద్దవాళ్ళతో మంతనాలు అన్నీ అయ్యాకా … నాలా దగా పడిన వాళ్ళకోసం ఒక ఎన్ .జి.ఓ తెరిచాను అక్కడ కుట్టు నేర్పి వేరే పనులు నేర్పి జీవించటానికి ఒక మార్గం చూపించే సంస్థని ప్రారంభించాము నేను శివన్న ఓదిన  బాబయ్య ఇంకొక నలుగురు కలిసి .

          ఆ పనులన్నీ బాబయ్య చూసి సరూర్ నగర్ మసీద్ వెనక స్థలం తీసుకుని సొంతంగా కట్టించి చక్కగా ప్రారంభించాను .

          ఇంకా వీర్రాజు వచ్చినా రానివ్వద్దు అని బాబయ్య చెప్పాడు , వచ్చినా డబ్బు కోసమే వస్తాడు తప్ప నా కోసం నా కొడుకు కోసం రాడు అని అర్ధం అయిపొయింది.

          నా లా దగా పడ్డ వాళ్ళు ఎందరో? వాళ్ళకి ఆశ్రయం ఇస్తుంటే కలిగిన సంతృప్తి ముందు నా కష్టం తెలీలేదు ఒక 5 ఏళ్ళు పట్టింది. కాస్త తగిలిన గాయం మానటానికి , ఊపిరి తీసుకుని ఆ సెల్ఫ్ పిత్య్ లోంచి బయటకి వచ్చి ప్రపంచాన్ని చూస్తే పెద్ద గీత ముందు చిన్న గీతాలా నా దుఃఖం తగ్గిపోయింది .

          కుల మతాలతో సంబంధం లేకుండా కేవలం మానవతా దృఖ్పదం తో చేర్చు కోవటం జరుగుతోంది .

          బాబయ్య ఇంటికి రమ్మన్నా వెళ్లాలనిపించ లేదు …కొన్నాళ్ళు గడిచాక చూద్దాం అని ఊరుకున్నాను .

          బాబయ్య పేపర్ వర్క్ అంతా చేస్తే శివన్న గ్రౌండ్ వర్క్ చేసాడు ఆ చిన్న  డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోకి మార్పించాడు బాబయ్య అన్ని కొనిపెట్టి కొత్త మనిషిని చేసాడు బాబయ్య కనక లేకపోతే ఎదో లా ప్రాణాలు తీసుకునేదానిని .

          కోటి ని మంచి స్కూల్ లో చేర్పించాడు , శివతో బాటు ఇంకొక ఇద్దర్ని మేనేజర్ లని పెట్టాడు , కేటరింగ్ పని శివ తీసుకున్నాడు , వదిన మరో ఇద్దరు ఆడవారు ఇంకొక అతను ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు జరిగాయి అనుకున్నాక మొదలు పెట్టటానికి 4 నెలలు పట్టింది ముగ్గురితో మొదలైన సంస్థ ఏడాది తిరిగేసరికి 150 మంది చేరారు.

          మొదటిసారి జీతాలు ఇస్తుంటే ఒక 500 రూపాయాల కోసం నేను పడ్డ పాట్లు గుర్తొచ్చాయి.

          ఆ రోజు చనిపోతే ఏముంది ? ఒక నింద మిగిలేది ….ఇప్పుడు ? ఒక గౌరవ స్థానం లో ఉండగలిగినందుకు నలుగురికి ఉపయోగ పడుతున్నందుకు ఆనందం గా ఉంది .

          బాబయ్య కి పిల్లలేరు నన్నే కూతురిలా చూసాడు ఇప్పుడు మార్గదర్శి కూడా అయ్యాడు .

          ఒక విషయం అర్ధం అయింది , అందరికి బాగానే బతకాలి అని ఉంటుంది , ఎలాగో తేలినప్పుడు చేయూత కావాలి … ఆ తోడు ఎటునించి వచ్చినా మనిషి ఆ చేయిపట్టుకుని ఏటికి ఎదురీదగలుగుతాడు అనిపించింది .

          మార్గం చూపించినందుకు మౌనంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను …. ఒకటి భగవంతుడికి, బాబయ్యకి శివన్న కి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.