సాయంత్రమైంది. కనకవల్లి కాలుగాలిన పిల్లి వలెనే హడావిడిగా తిరుగుతున్నా, పుట్టపర్తి మాత్రం, మేడ మీద తన గదిలో సారస్వతాలోకనంలో మునిగి ఉన్నారు. ఆయన ధోరణి తనకు తెలిసినా, వచ్చే వారి మర్యాద కోసమైనా ఆయన కిందికి వచ్చి, నిల్చోవచ్చు గదా??’ మనసులొనే అనుకుంటూ, పెళ్ళిచూపులకు వచ్చే పెద్దల కోసం ఎదురు చూస్తూ అప్పుడే ఇంట్లోకి వచ్చిన కనకవల్లికి, ముందుగా కృష్ణమాచార్యుల మాటలు వినబడ్డాయి,’ఆఆ..ఇదే ఇల్లు రండి రండి..అమ్మా కనకమ్మా??’ అంటూ!! పరుగున తళిహింట్లో నుంచీ (వంటిల్లు) కొంగు తుడుచుకుంటూ బైటికి వచ్చి, నవ్వు ముఖంతో, ‘రండి రండి..’ అంటూ ఆహ్వానించిందామె!! తరులతను మిద్దె మీదకు తరిమింది, ‘పెళ్ళివారు వచ్చారు, తొందరగా మీ అయ్యను పిల్చుకు రమ్మని..’ !!
వచ్చినవారిని లోనికి ఆహ్వానించి, మర్యాదలు చేసి అందరినీ కూర్చుండజేశారు పుట్టపర్తి దంపతులు. శ్రీమాన్ దేశికాచార్యులవారు, పుట్టపర్తి వారితో తన బాంక్ వివరాలు, కుటుంబ వివరాలూ చెబుతున్నారు. వారిది నిజానికి కృష్ణదేవరాయల నగరం, విజయనగరం. అంటే ప్రస్తుతం, బళ్ళారి జిల్లా, హొసపేట తాలూకా లో కమలాపుర అన్న పల్లెటూరు. దానికి కూతవేటు దూరంలోనే అలనాడు రాయలేలిన, నేడు శిధిలాలుగా మాత్రమే మిగిలిన విజయనగర సామ్రాజ్యం వున్నది. కమలాపుర దానికి దగ్గరలోనే వున్న పల్లెటూరన్నమాట!! అక్కడే వీరి పూర్వ వంశీకుల నివాసాలు వుండేవట!! వీరి కుటుంబం, ప్రస్తుతం, వీరి ఉద్యోగం కారణంగా కర్నూల్ లో ఉంటున్నది. అక్కడ వీరి పొలాలు, దాయాదుల పొలలు చాలానే వున్నాయట!!
వీరి మాటలు చాలా శ్రద్ధగా వింటున్నారు పుట్టపర్తి. విజయనగర సామ్రాజ్యం పేరు వినగానే, పుట్టపర్తి మనసు పురి విప్పిన నెమలైపోతుంది. భగవంతుని దయ వల్ల, ఈ సంబంధం కుదిరితే, మరి మరీ ఆ ప్రాంతాలకు వెళ్ళీ, అలనాటి ఆ రాజకుటుంబం కథలను, దసరా దినాలలో అక్కడ జరిగే వేడుకలను స్మరించుకునే మహద్భాగ్యం దక్కుతుందని మనసులోనే సంబర పడుతున్నారు వారు.
ఈలోగా దేశికాచార్యులవారి పెద్ద కుమారుడు (పెళ్ళి కుమారుడు) రాఘవా చార్యులు, అర్ధాంగి (పెళ్ళికొడుకు తల్లి) తంగమ్మ (తెలుగులో బంగారమ్మ) ఇంటి గోడలకు అమర్చిన ఫోటోలు ఎదురుగా టేబుల్ మీద వుంచిన కృష్ణ ప్రతిమ, దానికి వేసిన పూలమాల, అక్కడే పెట్టిన ఊదుకడ్డీలు (అగరొత్తులు) , ఇంకా, ఆ హాలులోని విశేషాలు చూసీచూడనట్టుగా చూస్తూ వున్నారు. రాఘవ, అప్పుడప్పుడు, లోపలికున్న తలుపు వైపూ దృష్టి సారిస్తున్నాడు. కనకమ్మ అతిథులకు ఉపాహారాది గౌరవాలు అమర్చిన తరువాత, లోపలికి వెళ్ళి, వెంకటగిరి చీరెలో ముస్తాబై వున్న కరుణాదేవిని తీసుకుని వచ్చి, అక్కడే వేసి వున్న చాప మీద కూర్చోబెట్టింది. బిడియంగా వంచిన తల ఎత్తకుండా కూర్చుని వున్న కరుణదేవిని తంగమ్మ, ఆమె చదువు గురించీ, చెల్లెళ్ళ గురించీ ప్రశ్నలు వేసి ఆమె సమాధానాలు చెప్పే తీరు చూస్తూ మనసులో ఆనందిస్తున్నారు. మాటల్లో, కరుణాదేవి, తరులతాదేవి ఇద్దరూ కలిసి సంగీతాభ్యాసం చేయటమూ, కచ్చేరీలు చేయటం, తిరువయ్యారుకు కూడా వెళ్ళి త్యాగరాజు సమాధి వద్ద పుట్టపర్తి సిస్టర్స్ పేరుతో కచ్చేరి చేయగా అక్కడివారు అభినందించటమూ వంటి విషయాలు తెలిసుకుంటూ వుండగానే,
రాఘవాచార్యులు, తండ్రి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే, దేశికాచార్యులు, ఏదీ.. అమ్మాయిని ఒక పాట పాడమనండి, మేమూ విని ఆనందిస్తాము.’ అన్నారు.
ఇంకేముంది, కనకమ్మ బిడియంగా కూర్చుని వున్న కరుణాదేవిని పాట పాడమని చెవిలో చెప్పారు. సమాధానంగా, కరుణాదేవి తల్లి చెవిలో ఏదో అన్నది. చిరునవ్వుతో, చెల్లెలు తరులతతో కలిసి పాడుతానంటున్నది వదినె గారూ..’ అన్నది తంగమ్మ తో! ఫర్వాలేదు, అట్లాగే..’ అన్నారు దేశికాచార్యులు.
ఇంకేముంది, లోపలి నుండీ తరులత కూడా వచ్చి అక్కయ్య పక్కన ఒద్దికగా కూర్చుంది. ఇద్దరూ తాళం వేస్తూ పుట్టపర్తి రచన వయ్యారముగ రారా శ్రీహరి అన్న కీర్తన చిట్టస్వరాలతో సహా పాడారు. పాట సాగుతున్నంత సేపూ అక్కడ మధురమైన భావ ప్రపంచం ఆవిష్కృతమైంది.ఈ కీర్తనలో, శ్రీహరిని, వయ్యాళి చూపులతో, వేణు నాదముతో రమ్మని ఆహ్వానించే క్రమంలో, ఖగేంద్ర వాహన గమనముతో రమ్మనీ, దాసుడిని నిరాదరణ చేయకుమని వేడుకునే భక్తుని హృదయం ఆవిష్కృతమైంది.
పాట పూర్తైన తరువాత, కృష్ణమాచార్యులు, పుట్టపర్తి వారి వైపు చూస్తూ అన్నాడు, ‘స్వామీ, ఇది మీ కీర్తన కదా, చివర అష్టాక్షరి అని వచ్చింది….’ !! పుట్టపర్తి అన్నారు, ‘ఔనురా!! ఇది నా రచన!!’ అంత వరకూ, ఇదేదో త్యాగరాజు కీర్తన అనుకుంటున్న దేశికాచార్యుల వారికి, ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి ముప్పిరిగొన్నాయి. వరుడు రాఘవాచార్యులకు, యీ పాట, పాట పాడిన కరుణాదేవి కూడా బాగా నచ్చినట్టే తెలిసిపోతున్నది.
దేశికాచార్యులవారు పిల్లల పాట విన్న తరువాత, తృప్తిగా తల ఊపూతూ, తాను ధరించిన, పొడుగు చేతుల జుబ్బాలో చేయి పోనిస్తూ, మెల్లిగా లేచి నిలబడి, కృష్ణమాచార్యులను తనతో రమ్మంటున్నట్టు సైగ చేసి, బైటికి అడుగులు వేశారు, పుట్టపర్తికి, ఇప్పుడే వస్తానని చెబుతూ!!
చాప మీద కూర్చుని వున్న తంగమ్మ ,’ ఏమీ అనుకోవద్దు వదినెగారూ, మా వారికి నశ్యం అలవాటు వున్నది. గంటలో రెండు మార్లైనా ఆ నశ్యం పీల్చనిది ఆయనకు తోచదు..’ అన్నది కనకమ్మతో!!
వాళ్ళీద్దరూ వెళ్ళగానే, మెల్లిగా పుట్టపర్తి కూడా లేచి, అటు పెరటి వైపుకు అడుగులు వేస్తుంటే, కనకమ్మ నవ్వు ముఖంతో అన్నది, ‘ఫరవాలేదు వదినెగారూ!! మా వారికి కూడా ధూమపానం అలవాటు వున్నది. బీడీ కాల్చకుండ ఇంతసేపు వారు కూర్చోవటం చూడటం, దాదాపు వుండదు. ఇదిగో, యీ రోజు, యీ పెళ్ళి చూపుల వల్ల!’ అనేసింది.
ఈ లోగా తంగమ్మ, ఇంకా బిడియంగా వంచిన కూచుని చాప ఈనెలు లెక్కబెడుతున్న కరుణాదేవితో ‘ఏదీ, కరుణమ్మా!! నువ్వొక్కతీ పాడితే వినాలని వుంది ఒక్క పాట పాడు, నీ ఒక్కర్తివే..’ అనేసింది. ఎందుకంటే, ఆమెకు అర్థమై పోయింది, యీ విషయం మాట్లాడేందుకే, తన భర్త కృష్ణమాచార్యులతో బైటికి వెళ్ళారని, ఇహ కుమారుడు, రాఘవునికి అమ్మాయి కరుణ, మాటా పాటా కూడా నచ్చేశాయని!!
కరుణాదేవి నెమ్మదిగా తలెత్తి కంటి కొసల నుంచీ, వరుడు కూర్చున్న వైపు దృష్టి సారించి చప్పున మళ్ళీ తల వంచుకుని, అమ్మ కనకమ్మ వైపు చూస్తూ, ఇబ్బందిగా ముఖం పెట్టింది. కనకమ్మ బిడ్డ తల మీద చేయి వేసి నిమిరి ,’పాడమ్మా!! వదినెగారు అడుగుతున్నారు కదా!!’
మళ్ళీ అమ్మ చెవిలో గుసగుసలు. ఆమె ఏదో చెప్పగానే నెమ్మదిగా తల ఊచి, గొంతు సవరించుకుని, మొదలు పెట్టింది కరుణాదేవి, బృందావన సారంగ రాగంలో రంగపుర విహార, ముత్తుస్వామి దీక్షితార్ కృతి.
రంగపుర విహారా !!
జయ కోదండ రామావతార రఘువీర శ్రీ..
అంగజ జనక దేవ
బృందావన సారంగేంద్ర వరద రమాంతరంగ
శ్యామలాంగ విహంగ తురంగ
సదయాపాంగ సత్సంగ..రంగపుర విహారా….
పంకజాప్త కుల జల నిధి సోమా
వర పంకజ ముఖ పట్టాభిరామ
పద పంకజ జిత కామా రఘురామా
వామాంక గత సీతా వర వేష
శేషాంక శయన భక్త సంతోష
ఏణాంక రవి నయన మృదు తర భాష
అకళంక దర్పణ కపోల విశేష ముని
సంకట హరణ గోవింద, వేంకట రమణ ముకుంద
సంకర్షణ మూలకంద శంకర గురుగుహానంద.. రంగపుర..
కరుణాదేవి గొంతు చాలా సుశిక్షితురాలైన కర్ణాటక సంగీత గాయని కంఠం. ఖంగుమని ఉన్నా, దానికి తగ్గ మాధుర్యం కూడా మిళితమై, స్పష్టమైన ఉచ్చారణ, భావ ప్రకటనతో, ఎంతో మధురమైన వాతావరణం కల్పించింది. తంగమ్మ ముఖం నిండా సంతోష తరంగాలు తాండవిస్తున్నాయి. ఆమె నిండు మనసుతో, తల నిమురుతూ, ‘ఎంత బాగా పాడావమ్మా!! కళ్ళముందు, ఆ శ్రీరంగేశుడే నిలిచేలా!! మనసు శ్రీరంగానికి వెళ్ళిపోయిందంతే!!’ అని, చటుక్కున, తన చీర కొంగుతో కళ్ళద్దుకుంది – ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ!!
బైటికి వెళ్ళిన దేశికాచార్యులు, కృష్ణమాచార్యులు, ఎప్పుడు వచ్చి కూచున్నారో కూడా గమనించే స్థితిలో లేరెవ్వరూ అక్కడ!!వాళ్ళ కళ్ళల్లోనూ, ప్రశంసలు!!
పాట ముగియగానే, నెమ్మదిగా పుట్టపర్తి కూడా, పెరటి వైపు నుంచీ, పడసాలలోకి వచ్చి, కరుణాదేవి కూర్చున్న దగ్గరే, నిలబడి, కుమార్తె వైపు మురిపెంగా చూస్తూ నిలబడ్డారు.
ఆ ఆనందకర వాతావరణంలో ముందుగా తేరుకుని, చప్పట్లు కొడుతూ నిలబడి గొంతు సవరించుకుంటూ కృష్ణమాచార్యులు అన్నాడు,’ అమ్మా, కనకమ్మా!! చక్కటి కూతురును కన్నారమ్మా మీ దంపతులు!! చదువూ, సంస్కారం, కలగలసిన సంప్రదాయ కుటుంబం మీది. సాక్షాత్తూ సరస్వతీపుత్రుడు పుట్టపర్తి వారు. ఇటు, బాణగిరి వంశోద్భవులు, లక్ష్మీసంపన్నులు దేశికాచార్యులవారు. ఇద్దరి కుటుంబాల మధ్యా బంధుత్వం ఏర్పడే శుభ సూచనలు కనిపిస్తున్నాయి..’ అనేశాడు.
పుట్టపర్తి దంపతులిద్దరి మనసుల్లో ఆనందం తాండవించింది. పుట్టపర్తి అన్నారు,’ధన్యోస్మి!! ఇది మా అదృష్టం కూడానయ్యా!! మరి వరుని మనసులోని మాట..??
తంగమ్మ అందుకుంది. ‘మావాడెప్పుడో సరే అనేశాడు చూపులతోనే!!’ అని!
*****
(సశేషం)