ఆకాశవాణి

కర్ణాటక సంగీత మార్గదర్శి – వింజమూరి వరదరాజ అయ్యంగార్

(ఆకాశవాణి కర్నాటక సంగీత వినూత్న ప్రక్రియావిష్కర్త)

(1939 – 1966)

సంధ్యా వింజమూరి

గ్రంథ సమీక్ష

 

          ఈనాడు మనం ఆకాశవాణీ, రేడియోల పేర్లతో పిలిచే ప్రసార కేంద్రం భారత దేశంలో మొట్టమొదటిగా  “ది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెని” పేరిట జులై 23, 1927 న బ్రిటీష్ వారి పాలన సమయంలో ఆరంభించబడింది. కానీ ఆ కంపెనీ 3 సంవత్సరాలలోనే మూతబడింది. ద్వితీయ ప్రయత్నంగా 1930వ సంవత్సరంలో ఇండస్ట్రిస్ అన్ద్ లేబర్ మత్రిత్వశాఖ ద్వారా  మళ్ళి పునరుద్ధరించబడి, మే 1932 న ఆల్ ఇండియా రేడియో గా రుపాంతరం చెందింది. 1957వ సంవత్సరంలో అధికారికంగా “ఆకాశవాణి” అనే పేరుతో స్థిరపడింది. 16 జూను 1938న మదరాసులోను, 1948వ సంవత్సరంలో విజయవాడలోను కేంద్రాలు ఏర్పడటం, అనేక ప్రసారాలు జరగటం ఆరంభమయ్యాయి.  ఇది క్లుప్తంగా “ది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెని”  చరిత్ర.

          హైద్రరాబాదు నిజాం పాలనలో, మీర్ ఉస్మాన్ అలీఖాన్ చే “దక్కన్ రేడియో” పేరిట మొదటి ప్రసారకేంద్రం 3 ఫిబ్రవరి 1935 న ఆరంభించబడింది. కానీ,  ఈ కేంద్రంలో ముఖ్యంగా ఉర్దు కార్యక్రమాల ప్రసారాలు జరుగుతూ ఉండేవి. 1 ఏప్రెల్ 1950వ సంవత్సరమున ఈ దక్కన్ రేడియో కేంద్రాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది.  1956వ సంవత్శరంలో అది ఆల్ ఇండియా రేడియోతో విలీనమై AIR హైదరాబాదు గా పిలవబడింది. అప్పటి నుండి ఈ కేంద్రంలో ఉర్దు తో బాటు తెలుగు, హింది, సంస్కృతము, మరాఠీ, కన్నడ భాషలలో ప్రసారాలను నిర్వర్తించడం మొదలయింది. కానీ, శాస్త్రీయ సంగీతానికి మాత్రం తగిన ప్రొత్సాహం లభించేది కాదు. 

          ఆ సమయంలో, అంటే 1956 లో, భారతదేశ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ సంగీతాన్ని అభివృద్ధి పరచాలనే ఆకాంక్షతో ఆ నాటి కేంద్ర మంత్రివర్గం ప్రతి కేంద్రంలోను ఒక ఉన్నతాధికారిని నియమించ నిశ్చయించింది. 

          ఆ విధంగా హైదరాబదు కేంద్రంలో ప్రథమ “కర్ణాటిక్ మ్యూసిక్ ప్రొడ్యుసర్” గా వింజమూరి వరదరాజ అయ్యంగార్ నియమింపబడ్డారు. ఆయన 1956లో  కర్ణాటక సంగీత విభాగంలో పదవి చేపట్టి తనవంతు సేవ చేశారనటం నిర్వివాదాంశం. కాని, ఆ సేవ తాలూకు జాడ కూడా అక్కడ మిగలలేదు.  అన్ని ప్రసారాలు స్పూల్ లలో పదిలపరచినట్లు తెలిసినా వారి ఒక్క ప్రసార నమూనా కూడా మిగలక పోవటం విచారకరం – అది భావి తరానికి పునరుద్ధరించలేని నష్టం!

          ఈ విషయాన్ని గమనించడం వలన, ఆయన చేసిన కార్యక్రమాల ప్రాముఖ్యతను గ్రహించి వాటిని సాక్షాధార పత్రాలతో పుస్తక ప్రచురణ చెయ్యడం భావితరాల వారికి ఆనాటి రేడియో వైభవం, కార్ణాటక సంగీతాభివృద్ధి, దానికై వరదరాజ అయ్యంగార్ గారి తపన, నిరంతర కృషి, ప్రోత్సాహ సహకారాలు, సంపూర్ణంగా కాకపోయినా, కొంత వరకు స్పష్టం అవవచ్చనే ఆలోచన ఈ సంకలనాత్మక గ్రంథ ప్రచుణకు నాంది అయ్యింది.

          ఈ పుస్తక ప్రచురణ విశ్లేషణ, పరిశోధన, సంకలనము, సంపాదకత్వం వలన వెలసింది. సుమారు 10 సంవత్సరాల పరిశోధనా ఫలితం ఈ గ్రంథరాజంలో ప్రచురింపబడిన ప్రతి విషయానికి తగిన ఆధారం సమకూర్చటం. దొరికినంత వరకు 1939 నుండి ఆకాశవాణి  కార్యక్రమ వివరణ ప్రచురించిన ఏ ముద్రణ వదల లేదు. వివిధ దిన, వార, మాస, పక్ష్య పత్రికలు తెలుగులోనూ, ఆంగ్లంలోను వెతికి పట్టుకొని, వాటిలోని ప్రతి పుట, ప్రతి కాలమ్, ప్రతి శీర్షిక గమనించి, సంగీతానికి, ఆకాశవాణీకి, వరదరాజ అయ్యంగారికి సంబంధించిన విషయాలను గమనించి,  ఆ పుటను గ్రహించి (డౌన్ లోడ్ చేసి) వాటిలో సంబంధిత విషయాలని క్రమబద్ధీకరించి ప్రచురించటమైనది.  ఈ విధమైన ఆధారబద్ధమైన  గ్రంథం ఇదివరలో ప్రచురింపబడలేదు. ప్రసార విషయాలను సేకరించిన తరువాత వరదరాజ అయ్యంగారి వ్రాత ప్రతుల సంకలనము, వాటిలోని అసంపూర్ణ విషయ సేకరణ, క్రమబద్ధీకరణలు ఈ గ్రంధానికి ప్రాణాలు!

          ఈ గ్రంధంలో ప్రచురింపబడిన విషయాల వివరణ కొంత వరకు “నా మాట” అనే ప్రధమ భాగంలో ఉంది. అంతే కాక ఆ నాటి పరిస్థితులు, సంఘటనలు మొదలైన వివరాలు శాస్త్రీయ సంగీతాభివృద్ధి ఏ విధంగా ఆరంభమై అంచెలంచెలుగా వృద్ధి చెందినదీ విశధమౌతుంది.

          ఈ గ్రంధరాజం సుమారు 670 పుటలు కలిగి, భక్తిరంజని, సంగీత ప్రసంగాలు, సంగీత రూపకం, సంగీత రచయితలు, సంగీత పరిచయము అను సంగీత సంచికా కార్యక్రమము, విశేష సంగీత కచ్చేరీలు, రాగలక్షణం, అనుబంధం అనే ఎనిమిది భాగాలతో కూడి ఉంది. ప్రతిభాగానికి ఆ భాగంలో ఎదురయ్యే విషయ వివరణ – ముందుమాట చేర్చబడింది. ఈ విధంగా, ఆయా భాగాలలో ఉన్న ప్రక్రియల సృజనాత్మక విధానము పేర్కొనటం వలన చదువరికి తాను ఎదుర్కొనబోయే విషయానికి ముందుమాట నాందిగా నిలుస్తుంది.

          1956 వ సంవత్సరం వరకు అంతకు ముందు ఆరంభింపబడిన ఆకాశవాణి కేంద్రాలలో “భక్తిరంజని” అనే ప్రసారం లేదు. ఇది వింజమూరి వారి సృజనాత్మకమునకు నిదర్శనము.  1956-57 ప్రాంతంలో ఆరంభించిన ఈ ప్రక్రియలో వారు ప్రతిదినము ఉదయం 6ఘంటల 30 నిముషముల ప్రాంతంలో సుమారు 20 నిమిషాల పాటు వివిధ శ్లోకాలకు సంగీతం గూర్చి, తను పాడి, ఇతరులకు నేర్పి పాడించేవారు. ఆయా పండగల సమయంలో ఆయా మూర్తులకు తగిన కృతులను, భక్తిరస కీర్తనలను ప్రసారం చేసేవారు. ఈ విధమైన ప్రసారాలలో సుమారు 50 ప్రసార వివరాలు మాత్రం లభ్యమయ్యాయి. వాటిలో ఏర్చి కూర్చి,  అతి సులభంగా లభ్యంకాని సుమారు 10 ప్రసారాల మూలాలను మాత్రం “భక్తిరంజని” భాగంలో ఇవ్వడమైనది.

          వింజమూరి “సంగీత ప్రసంగాలు” 1950 నాటి నుండీ ఇచ్చేవారు.  రాగం – తానం- పల్లవి, స్వర కల్పన వంటి సంగీత శాస్త్ర పరమైన విషయాలే గాక, సంగీతము-సాహిత్యము, సంగీతోత్పత్తి వంటి ప్రాధమిక విషయాలను, వాగ్గేయకార పరమైన ప్రసంగాలను కూడా చేసేవారు. ఈ ప్రసారము కనీసం నెలకి ఒకటి చొప్పున ఉండేది. ఈ సంగీత ప్రసంగాలు కొన్ని 1992 లో ప్రచురించబడిన వారి పుస్తకము “సంగీత వాహిని  – 1 ” లో ప్రచురించబడినవి. (ఆ పుస్తకము లభ్యము) . ఆ పుస్తకంలో ప్రచురణకాని 10 ప్రసంగాలు ఈ విభాగంలో ఇవ్వడమైనది.

          “సంగీత రూపకం” చిత్రణతో వింజమూరివారి సృజనాత్మకత పరాకాష్ట నందిందని చెప్పవచ్చును. ఈ విభాగంలో వివిధ వాగ్గేయకార కృతులను, శేషాచలదాస ధర్మపురి రామాయణం (1880) వంటి అతి ప్రాచీన గ్రంధాల నుండి సేకరించిన ఘట్టములను, రామదాసు, క్షేత్రజ్ఞ ల వంటి భక్తుల చరిత్రలు వారి కీర్తనలు, వంటి వివిధ శైలులతో కూడిన విభాగాలను తీసుకొని, వాటిని రేడియో సమయ, సందర్భాలకు తగినట్లు రచించి, సంగీతం కూర్చి, నేర్పి ప్రసారం చేశారు. ఈ విభాగంలో 19 అపూర్వమైన రూపకాలు ఉన్నవి. పురాణేతిహాస సంబంధమైనవే కాక తంజావూరు నేలిన సాహాజి మహారాజ రచనలైన విష్ణు, శివ పల్లకి సేవా ప్రబంధాలు, త్యాగరాజ ప్రబంధ కావ్యాలపై చేసిన రూపక మూలాలుగూడా చూడవచ్చును.

          “సంగీత రచయితలు” విభాగంలో అన్నమాచార్యులు, పట్నం సుబ్రమణ్యఅయ్యర్, మైసూరు సదాశివరావ్, వీణ కుప్పయ్యర్, పల్లవి గోపాలయ్యర్ ల వంటి 10 మంది సంగీత దిగ్గజాల చరిత్రలు, వారి కృతులు, విషయ విశేషాలతో గూడిన ఉపన్యాస-ప్రదర్శనా విధానాల మూలాలు ఇవ్వబడినవి.

          “సంగీత పరిచయము” ఒక సంగీత సంచికా కార్యక్రమము. దీనిలో సంగీత పరమైన వివిధ విషయాల ప్రస్తావన ఉంటుంది.  సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రిగారి వంశీయులైన సుసర్ల గంగాధర శాస్త్రి గారితో, మదరాస్ బాలకృష్ణయ్యర్ గారీతో, విస్సా అప్పారావుగారి వంటి ప్రముఖులతో ప్రసంగ చర్చలు, లయ విన్యాసము, లయచిత్రముల వంటి కార్యక్రమాలలో లయకారులతో పరిచయ ప్రదర్శనలు, ఆపూర్వ రాగ లక్ష్య లక్షనాదులతో ఉదాహరణాత్మక వివరణలు, కైవార ప్రబంధరచనల వంటి అపూర్వ సంగీత రచనల వివరణలు, వంటి అనేక ప్రక్రియలు ఈ సంగీత సంచికా కార్యక్రమంలో భాగాలు. ఈ విభాగంలో 25 వివిధ కార్యక్రమాల మూలాలు ఇవ్వడమైనది.

          వింజమూరి వివిధ ఆకాశవాణి కేంద్రాల ద్వార కొన్ని వందల కచ్చేరీలు చేశారు. వాటిలో కొన్ని అపూర్వమైనవి, విశిష్టమైనవి మాత్రము “విశేష సంగీత కచ్చేరీలు” భాగంలో ఇవ్వడమైనది. ఈ విభాగంలో చేర్చిన అపూర్వ రచనలు; దక్షిణ భారతదేశం చిదంబరం నగరానికి చెందిన రాజ గణేశ దీక్షితర్, స్వర్ణ వెంకటేశ దీక్షితర్ ల రచనలను పాడి, వారిని ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేశారు. అదే విధంగా, రామస్వామి శివన్, మహా వైద్యనాథ అయ్యర్ ల తండ్రిగారైన పుళియూర్ దొరైస్వామి అయ్యర్ల వంటి ప్రముఖ వాగ్గేయకార రచనలను కూడా పరిచయం చేశారు. ఈ విభాగంలో అపూర్వ కృతులు గల 6 కచ్చేరీల మూలాలు మాత్రం ఇవ్వబడినవి.

          “రాగలక్షణం” సామాన్య సంగీతజ్ఞులకి కొరుకుపడని సంగీత లక్ష్య, లక్షణ వివరణా ప్రక్రియ. వెంకఠమఖి, గోవింద మరార్ ల వంటి లాక్షణికులు సంగీతంతో అవినాభావ సంబంధం గల రాగానికి లక్ష్యాన్ని, లక్షణాలని ధృవీకరించి, వాటిని పటిష్టం చేసి తరువాతి తరం సంగీతజ్ఞులకి నిశ్చితమైన స్పష్టత నిచ్చారు. ఈ రాగ లక్షణాల వివరణతో కూడిన అనేక గ్రంధాలు వెలువడినప్పటికీ, వాటిని చదివి అర్ధం చేసుకొని, ఆచరించడం చాలా కష్టతరం. ఈ రాగ లక్ష్య లక్షణాలను సులభతరం చేసి వివరించేందుకు సృజించిన ప్రక్రియే “రాగలక్షణం”.  ఈ విభాగంలో  వింజమూరి ప్రతివారం 15 నిమిషాల కార్యక్రమంలో అనేక, అపూర్వ రాగ లక్షణాలు ఉదాహరణ పూర్వకంగా శ్రోతలకు అందించారు. ఇక్కడ దొరికిన 65 రాగాల లక్షణాలు మాత్రం ఇవ్వబడినవి.

          చివరిగా, “అనుబంధం” విభాగంలో మరికొన్ని విశేష విషయాల ప్రస్తావన జరిగింది. ఆ నాటి వింజమూరివారి కచ్చేరీ వివరాలు, వారితో , వారి క్రింద పనిచేసిన కొందరి చిత్ర పఠాలు, మరికొన్ని వివరాలు ఇవ్వబడ్డాయి.

          ఈ గ్రంధం పండితులకీ, పామరులకీ; విజ్ఞులకీ, విజ్ఞాన అన్వేషులకీ; సంగీతజ్ఞులకీ, సాహితజ్ఞులకీ, నృత్య, నాటకోత్సాహులకీ, జ్ఞానాన్వేషులకీ – అందరికి ఉపయోగకరమైన ఉద్గ్రంథం! ప్రతి ఇంట ఉండ దగిన గ్రంధరాజం!!

గ్రంథపరిశోధన – సంకలనము – సంపాదకత్వము – సంధ్యా వింజమూరి – గిరి

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.