కాళరాత్రి-15
ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్”
అనువాదం : వెనిగళ్ళ కోమల
చలికాలం వచ్చింది.
పగటి వేళలు తగ్గాయి. రాత్రిళ్ళు భరించలేనట్లున్నాయి. చలిగాలులు మమ్మల్ని కొరడాలతో కొట్టినట్లు బాధిస్తున్నాయి. కాస్త బరువుగా ఉన్న చలికోట్లు యిచ్చారు.
పనికిపోతున్నాం. బండలు మరీ చల్లగా ఉండి మా చేతులు వాటికీ అతుక్కు పోతున్నాయన్నట్లు ఉండేది. అన్నిటికీ అలవాటుపడ్డాం.
క్రిస్మస్, నూతన సంవత్సరం రోజు మేము పని చేయలేదు. సూపు మరీ అంత నీళ్ళగా యివ్వలేదు.
జనవరి మధ్యలో నా కుడిపాదం చలికి వాచి బాగా నొప్పి పెట్టసాగింది. నిలబడలేక పోతున్నాను. డాక్టరు మంచి యూదు. మా లాగే ఖైదీ. ‘‘ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే వేళ్ళూ, కాలూ తొలగించాల్సిరావచ్చు’’ అన్నాడు.
ఇక నాకప్పుడు వేరే గత్యంతరం ఏమున్నది గనుక? నిర్ణయం ఆయనది గనుక సంతోషించాను. తెల్లటి దుప్పట్ల మీద పడుకో బెట్టారు నన్ను. అలా దుప్పట్ల మీద పడుకోవడం ఏనాడో మరచిపోయాను. అక్కడ రోగులకు కొంచెం మంచి రొట్టె, గట్టి సూపు ఇచ్చేవారు. గంట, హాజరు పట్టీ పని లేదు. మధ్య మధ్య నాన్నకు కూడా కొంచెం రొట్టె పంపించగలిగాను.
నా పక్క రోగి హంగేరీ యూదు. తనకు డిసెంట్రీ పట్టు కున్నది. ఎముకల గూడు చర్మంతో కప్పినట్లు ఉన్నాడు. కళ్ళలో చావు కళ కనిపించింది. అతని గొంతు వినిపించేది, ‘‘ఇంకా మాట్లాడే శక్తి అతనికి ఎక్కడ నుండి వస్తున్నది’’ అని అనుకునే వాడిని.
‘‘ఆట్టే సంతోషించబోకు నాయనా ఇక్కడ బయట కంటె ఎక్కువ సెలక్షన్ ఉంటుంది. జబ్బుపడ్డ యూదులు జర్మనీకి అవసరం లేదు. తొందరలోనే మరో కొత్త వ్యక్తి నీ పక్కన కనిపిస్తాడు. అందుకే తొందరగా ఈ హాస్పిటల్ నుండి బయటపడు’’ అని అతను చెప్పే మాటలు సమాధిలో నుంచి వచ్చినట్లు అనిపించి నాకు చాలా భయమేసింది. ఆ రోగశాల బహు చిన్నది. ఇంకా రోగులు వస్తే ఉన్నవాళ్ళు కొంత ఖాళీ చేయవలసి వస్తుంది.
అతను నన్ను గమనిస్తున్నాడేమో, నా పక్క ఖాళీ అయితే బాగుండునను కుంటున్నాడేమో, ఏమో! అతను నిజమే చెపు తున్నాడేమో, అలా సాగాయి నా ఆలోచనలు.
మరురోజు నాకు ఆపరేషన్ చేస్తానన్నాడు డాక్టరు. ‘‘భయపడబోకు, నయమవుతుంది’’ అన్నాడు. పదిగంటలకు ఆపరేషన్ రూములోకి తీసుకుపోయారు. మా డాక్టరు అక్కడ కనిపించగానే నాకు ధైర్యం వచ్చింది. అతని చూపులూ, మాటలూ ఎంతో ఓదార్పునిచ్చేవిగా ఉన్నాయి. ‘‘కొంచెం నొప్పి అనిపించినా తగ్గిపోతుంది, ధైర్యంగా ఉండు’ ’అన్నాడు.
గంట పట్టింది. మత్తు ఇవ్వలేదు గనుక అంతసేపూ డాక్టరు వైపే చూస్తూ ఉన్నాను. తరవాత తెలియ లేదు. మెలకువ వచ్చేసరికి మొదలు తెల్లని దుప్పట్లు తప్ప మరేమీ కనిపించలేదు. నెమ్మదిగా డాక్టరు ముఖం చూడగలిగాను.
‘‘అంతా సరిగా జరిగింది. ఇక్కడ రెండు వారాలుంటావు విశ్రాంతి నిమిత్తం. సరిగా తిని శక్తి కూడగట్టుకో’’ అన్నాడు.
అతను చెప్పేది బోధపడలా, అతని పెదవుల కదలిక గమనిస్తున్నా. అతని గొంతు నాకు ఓదార్పు కలిగించింది. చెమటలు పట్టాయి. కాలు ఉన్నట్లు అనిపించలేదు. కాలుగాని తీసేసారా? అని అనుమానం వచ్చింది. ‘డాక్టర్, డాక్టర్’ అని పిలిచాను. ‘ఏమిటి నాయనా’ అన్నాడాయన. అడగలేకపోయాను. దాహంగా ఉన్నదన్నాను. నీళ్ళు అందాయి. అతను నవ్వుతూ మిగతా రోగులను చూడబోతున్నాడు.
‘‘నా కాలు పనికొస్తుందా’’ అని అడిగాను. ఆయన ఆగి, ‘‘నన్ను నమ్ము’’ అన్నాడు. ‘‘తప్పకుండా డాక్టర్’’ అన్నాను.
‘‘రెండు వారాల్లో బాగయిపోతావు. నీ మడమ చీము పట్టి ఉన్నది. కట్ చేసి తీయ వలసి వచ్చింది. నీ కాలుకేమీ ఢోకా లేదు. అందరిలాగే నడవగలుగుతావు రెండువారాల్లో’’ అన్నాడు. నేను వేచి చూడటం తప్ప చేయగలిగేదేమీ లేదు.
నాకు ఆపరేషన్ అయిన రెండు రోజులకే వదంతులు వ్యాపించాయి. ‘‘యుద్ధం దగ్గర పడుతున్నది. ఎర్రసేనలు బ్యూనా వైపుకు వస్తున్నాయి కొన్ని గంటల్లో’’ అని.
ఇలాంటి వదంతులు మామూలైపోయాయి మాకు. ఊహా గానాలు ` ‘‘శాంతి నెలకొనబోతున్నది, రెడ్‌క్రాస్ మా విడుదలకై మంతనాలు చేస్తున్నది’’ అని నమ్మేవాళ్ళు ఆశగా. అలాంటి వార్తలు మత్తుమందులా పనిచేసేవి. అందుకని నమ్మాము.
దూరంగా కేనన్ శబ్డాలు రాత్రుళ్ళు వినిపించేవి. నా ప్రక్క రోగి ` ‘‘భ్రమపడబోకు, హిట్లర్ 12 గంటలలోపు యూదులందరినీ మట్టు పెడతానని శపథం చేశాడు’’ అన్నాడు. నాకు ఒళ్ళు మండింది ‘‘అయితే ఏమంటావు, హిట్లర్ ప్రవక్తా ఏమన్నానా’’ అన్నాను కోపంగా.
‘‘నేను హిట్లర్‌నే నమ్ముతున్నాను, మరెవరినీ నమ్మటం లేదు. అతను అన్న మాటలు నిలబెట్టుకుంటున్నాడు యూదుల విషయంలో’’ అన్నాడతను బలహీనమైన గొంతుతో.
సాయంత్రం నాలుగు గంటల వేళ గంట మోగింది. బ్లాకల్ టెస్ట్‌లు ఆ రోజు రిపోర్టు ఇవ్వాలి.
వాళ్ళు తిరిగి వచ్చారు, నోటమాట లేదు వాళ్ళకి. ‘‘ఇక్కడ నుండి ఖాళీ చేయాలి’’ అన్నది ఒక్కటే మాట వారి నోటి నుండి వెలువడింది.
క్యాంపు ఖాళీ చేయించి మమ్మల్ని జర్మనీలో ఏదో మారుమూల ప్రాంతానికి పంపుతారట. వాళ్ళకు ఎన్నో క్యాంపులున్నాయిగా! ‘‘రేపు రాత్రికే జరగాలి’’ అన్నారు. ‘‘ఈ లోపల రష్యన్ సేనలు వస్తాయేమో’’ ‘‘రావచ్చు’’ అన్నారు. మాకు తెలుసు ఆ సేనలు రావని.
క్యాంపులో హడావిడి. అన్ని బ్లాకుల్లో జనం ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ఒక డాక్టరు వచ్చి యిలా ప్రకటించాడు. ‘‘రేపు రాత్రి క్యాంపు ఖాళీ మొదలవుతుంది. బ్లాకుల వారీగా కవాతు జరుగుతుంది. రోగులను కదిలించరు. వాళ్ళు ఇక్కడే ఉంటారు’’ అన్నాడు. నేను నా కాలి సంగతి మరచిపోయాను.
ఆ వార్త వింతగా ఉన్నది. ‘‘ఎస్.ఎస్‌లు వందల కొలది రోగులను వెనక వదలి వెళతారా? వారిని విముక్తుల్ని చేసేవారు వచ్చేదాకా ఉంచుతారా? యూదులను రాత్రి 12 గంటలు మోగటం విననిస్తారా? అలా అవనివ్వరు. అందర్నీ ఫర్నేసుల్లోకి తోసి కాలుస్తారు’’ అన్నాడు నా పక్క రోగి.
‘‘క్యాంపు ఖాళీ చేసిన తరువాత కూల్చేస్తారు మందు పాతరతో’’ అన్నారు మరొకరు.
నేను చావుని గురించి ఆలోచించడం లేదు. నాన్న గురించి ఆలోచిస్తున్నాను. విడిపోతామేమో అని దిగులు. ఇద్దరం కలసి ఎన్నో కష్టాలు పడ్డాం. బాధలను భరించాం, విడిపోలేదు.
నాన్నకోసం బయటకు పరుగెత్తాను. ఒక బూటు వేసుకో లేను గనక చేతిలో పట్టుకున్నాను. బయట మంచు (స్నో) గుట్టలుగా పడుతున్నది. నొప్పిగాని, చలిగాని అనేది అలోచించవలసిన విషయాలు కావిప్పుడు.
‘‘ఏమి చేయాలిప్పుడు నాన్నా?’’ అన్నాను. నాన్న పలకలేదు. మరలా అడిగాను. నాన్న ఆలోచనలలో మునిగి ఉన్నాడు. మా భవిష్యత్తు మా చేతుల్లోనే ఉన్నది యిప్పుడు. ఇద్దరం రోగశాలలోనే ఉండిపోవచ్చు. డాక్టరు రోగిగా గానీ, డాక్టరుగా గానీ అక్కడ ఉండవచ్చు.
‘ఏం చేద్దాం నాన్నా?’ అని మరోసారి అడిగాను. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ‘‘అందరితో పాటు వెళ్ళటమా?’’ అన్నాను. నాన్న నా కాలి వైపు చూస్తున్నాడు. ‘‘నడవగలనను కుంటున్నావా?’’ అన్నాడు. ‘‘అవుననే అనుకుంటున్నా’’ అన్నాను. ‘‘మన ఈ నిర్ణయం సరైనది కాదని విచారించవలసి వస్తుందేమో ఎలైజర్’’ అన్నాడు.
యుద్ధం తరువాత తెలిసింది రోగశాలలో వాళ్ళందరినీ క్యాంపు ఖాళీ అయిన రెండు రోజులకు రష్యన్లు విముక్తుల్ని చేశారని!
నేను రోగశాలకు తిరిగి పోలేదు. తిన్నగా నా బ్లాక్‌లోనికి వెళ్ళాను. నా గాయం తెరచుకొని రక్తం కారసాగింది. నా కాళ్ళ కింద మంచు నా రక్తంతో ఎర్రబడింది.
బ్లాకుల్ టెస్ట్‌లు మాకు రేషన్ పెంచారు. రోడ్డు ప్రయాణానికి పనికి వస్తుందంటూ. ఇష్టమైన బట్టలు వెంట తీసుకు పోనిచ్చారు.
బాగా చలిగా ఉన్నది. బ్యూనాలో ఆఖరు రాత్రి, పశువుల రైలులో ఆఖరు రాత్రి. ఇంకెన్ని ఆఖరు రాత్రుళ్ళు చూడాలో.
నాకు నిద్ర పట్టలేదు. కేనన్ చప్పుళ్ళు వినవస్తూనే ఉన్నాయి. రష్యన్లు ఎంత దగ్గరలో ఉన్నారో? వారికీ, మాకూ మధ్య? ఈ రాత్రి ఆఖరు రాత్రి. బంకుల్లో గుసగుసలు ` అదృష్టం ఉంటే ఖాళీ చేయించే లోపలే రష్యన్లు రావచ్చు. మేము బ్రతికి పోవచ్చు ` అవే అందరి ఆశలు అక్కడ. ఎవరో గట్టిగా అన్నారు ` ‘‘నిద్రపోండి, ప్రయాణానికి శక్తి కూడగట్టు కోండి’’ అని!
*****
(సశేషం)
వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.