జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4
-కల్లూరి భాస్కరం
డేవిడ్ రైక్ పుస్తకం గురించి రాద్దామనుకున్నప్పుడు అదింత సుదీర్ఘమవుతుందనీ, ఇన్ని భాగాలకు విస్తరిస్తుందనీ మొదట అనుకోలేదు; ఏ అంశాన్నీ విడిచి పెట్టడానికి వీలులేని, అలాగని అన్ని విషయాలూ రాయడానికీ అవకాశంలేని ఒక సందిగ్ధారణ్యంలో చిక్కుకుంటాననీ ఊహించలేదు. ఓ మామూలు పుస్తక సమీక్షలా రాయచ్చని అనుకున్నాను. కానీ నేను తనను పట్టుకున్నంత తేలిగ్గా ఈ పుస్తకం నన్ను వదలిపెట్టేలా లేదు. ఇందులో రచయిత మధ్యమధ్య అనివార్యంగా ముందుకు తెచ్చిన పురామానవ చరిత్ర, పురాచరిత్ర, పురావస్తు అంశాల వంటి అనుబంధ విషయాలతో ఏ కొద్ది పరిచయమో తప్ప, కేంద్రాంశమైన జెనెటిక్స్ నాకు బొత్తిగా కొత్త విషయం కావడం కూడా నా అంచనా తప్పడానికి ఒక కారణమేమో తెలియదు. ఏ ఒక్క అంశాన్ని కదిపినా మొదలెక్కడో, తుదెక్కడో వెంటనే తోచని పెద్ద డొంకే కదులుతోంది. మొత్తానికి నా వైపు నుంచి చెప్పుకుంటే ఇది ఒక రకంగా దుస్సాహసమే. అలాగని ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితీ కాదు. పైగా ఇప్పటి నుంచి భారతీయులమైన మనకు సంబంధించిన జన్యు విషయాలు కూడా పరిశీలనకు వస్తాయి కనుక విషయం మంచి రసకందాయంలో పడబోతోంది కూడా!
మానసికంగా మనకే దగ్గర
డేవిడ్ రైక్ మానవ పరిణామ మూలాల విషయంలో తన పరిశీలనను అక్కడక్కడ ‘ఔట్ ఆఫ్ ఆఫ్రికా” వర్సెస్ యూరేషియాగా ముందుకు తెచ్చి, యూరప్ పక్షపాతాన్ని చూపుతున్నాడా అన్న అనుమానం నాకు రాకపోలేదు. వాస్తవానికి ఆయన పశ్చిమ యూరేషియాలోని ఒక పురాతన కులమైన(ancient caste అనే మాట ఆయనే వాడాడు) అష్కెనాట్సీ(Ashkenazi) యూదు తెగకు చెందినవాడు. ‘కులం ప్రాచీనత (The Antiquity of Caste)’ అనే శీర్షికతో మనదేశంలోని కులవ్యవస్థ గురించి, జన్యుపరమైన దాని ప్రభావం గురించి రాస్తున్నప్పుడు అష్కెనాట్సీ యూదు నేపథ్యం కలిగిన తన అనుభవాలకు, ఆలోచనలకు ఆయన ఎక్కువగా మనతోనే పోలిక తెచ్చుకున్నాడు, మనతోనే తనను ముడిపెట్టు కున్నాడు. అవకాశాన్నిబట్టి ముందుముందు చెప్పుకోబోయే ఆ సంగతుల్లో ఎన్నో ఆసక్తికరమైన ముచ్చట్లు దొర్లుతాయి.
కానీ, ఇతర అనేక విషయాలను చూసినప్పుడు ఆయన ప్రత్యేకించి యూరప్ పక్షపాతాన్నో, యూరప్ ఆధిక్యతనో చూపాడన్న భావన కలగదు. పశ్చిమాసియాయే వ్యవసాయానికి పుట్టిల్లు కావడం, వ్యవసాయమే నాటికి పురోగామి పరిశ్రమ కావడం, పశ్చిమాసియా వ్యవసాయజనాల ద్వారానే యూరప్ జనాలకు జన్యువారసత్వం అందడం, అంతకు ముందు యూరప్ జనాలు వేట-ఆహారసేకరణ దశలోనే ఉండడం -అనే విషయాలను ఆయన మరుగుపుచ్చ లేదు. అలాగని, ఇతర జన్యుశాస్త్రవేత్తల పరిశీలనలతో ఆయన పరిశీలనలను నేను పోల్చి చూడలేదు కనుక తొందరపడి ఈ విషయంలో ఆయనకు యోగ్యతాపత్రం ఇచ్చే ఉద్దేశమూ నాకు లేదు. వ్యక్తిగతంగా చెప్పాలంటే, శాస్త్రవిషయాల్లోనూ, శాస్త్రవేత్తల విషయంలోనూ పక్షపాతాన్ని ఆపాదించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని, అంతకన్నా ముందు నిర్దిష్ట విషయం మీద ఎంతో కొంత అవగాహన కలిగించుకోవాలనీ నేను భావిస్తాను.
***
‘The Making of Modern Europe’ అనే శీర్షిక కింద ఆధునిక యూరప్ జన్యు నిర్మాణం గురించి డేవిడ్ రైక్ చాలా విస్తృతంగా వివరించాడు. అందుకు సంబంధించిన పరిశోధన అపరాధ పరిశోధనను తలపిస్తూ ఒక క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఆ వివరణ వెళ్ళి వెళ్ళి మన దేశం తలుపు కూడా తడుతుంది కనుక, దాని గురించిన ఎదురుచూపుతో మరింత ఉత్సాహాన్నీ, ఆసక్తినీ పుంజుకుంటూ యూరప్ సంగతులు చెప్పుకుందాం:
మంచుమనిషి బయటపెట్టిన చిత్రమైన లింకు
1991లో, ఆల్ప్స్(Alps) పర్వతంలో కరగుతున్న ఒక హిమానీనదం(glacier)మీద సహజగతిలో మమ్మీగా మారిన ఒక పురుషుడి దేహం కనిపించింది. ‘మంచుమనిషి (Iceman)’గా పిలిచిన ఈ వ్యక్తి ఇంచుమించు 5వేల 3వందల సంవత్సరాల క్రితం జీవించినవాడు. అతను నేసిన గడ్డి దుస్తులు ధరించాడు, చక్కగా కుట్టిన షూ వేసుకున్నాడు, అతని ఒంటి నిండా డజన్ల కొద్దీ పచ్చబొట్లు ఉన్నాయి, అతని పక్కన రాగి అంచు కలిగిన ఒక గొడ్డలి, నిప్పురాళ్ళు ఉన్న ఒక సంచిలాంటిది ఉన్నాయి; అతని భుజం మీద ఒక బాణం దిగబడి ఉంది. అతను ఆ స్థితిలోనే కొండమీద ఒక చోటికి చేరుకుని కుప్పకూలాడు. 2012లో కొందరు జన్యుశాస్త్రవేత్తలు అతని జన్యుసంపుటి తాలూకు సీక్వెన్స్ ను రూపొందించారు. అందులో వారికి ఒక విచిత్రమైన లింకు కనిపించింది. జన్యుపరంగా అతని బంధువులు ఆల్ప్స్ పర్వతప్రాంతంవాళ్లు కాదు; అక్కడికి వెయ్యికి పైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న నేటి సార్డీనియాలో ఉన్న జనమని ప్రాచీన DNA వెల్లడించింది. సార్డీనియా ఇటలీలో మధ్యధరాసముద్రంలో ఉన్న ఒక దీవి.
స్వీడన్ లోనూ అదే కథ
అదే సంవత్సరం ఉప్సాలా యూనివర్సిటీకి చెందిన పాంటస్ స్కాగ్లండ్ (Pontus Skogland), మతియస్ జాకబ్ సన్(Mattias Jakobson), ఆయన సహచరులు స్వీడన్ లో అయిదువేల సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తుల జన్యుసంపుటి తాలూకు నాలుగు సీక్వెన్సులను ప్రచురించారు. ఈ కాలంలో స్వీడన్ లో నివసించిన వేట-ఆహార సేకరణజనం వ్యవసాయజనాలకు వారసులని, బాల్టిక్ సముద్రంలో లభించే పుష్కలమైన మత్స్య సంపదను వాడుకోవడం కోసం వేట-ఆహారసేకరణ జీవన విధానాన్ని అలవరచుకున్నారనీ; అంతే తప్ప, అంతకు ముందు వేల సంవత్సరాలుగా స్వీడన్ సహా ఉత్తర యూరప్ లో నివసించిన వేట-ఆహారసేకరణ జనానికి వీరు నేరుగా వారసులు కారనే సిద్ధాంతం అంతవరకు ప్రాచుర్యంలో ఉంది. కానీ ప్రాచీన DNA దీనిని తోసిపుచ్చింది. వ్యవసాయజనానికీ, వేట-ఆహారసేకరణ జనానికీ జన్యుపరంగా ఎలాంటి సాన్నిహిత్యం లేదనీ; నేటి యూరోపియన్లకు, తూర్పు ఆసియన్లకు మధ్య ఎంత తేడా ఉందో వీరి మధ్య కూడా అంత తేడా ఉందని తేలింది. మళ్ళీ వ్యవసాయజనంలో విచిత్రమైన పై సార్డీనియా లింకు కనిపించింది.
సార్డీనియా రహస్యాన్ని ఛేదించిన కొత్త ఆవిష్కారాలు
అంతవరకు ఎక్కువ ఆమోదం పొందిన సిద్ధాంతం ప్రకారం, పశ్చిమాసియా మూలాలు కలిగిన వ్యవసాయజనాలు యూరప్ లోకి వ్యాపించే క్రమంలో తమ వలస పొడవునా ఎదురైన వేట-ఆహారసేకరణజనంతో సాంకర్యం చెందారు. అయితే, పాంటస్ స్కాగ్లండ్ తదితరులు ముందుకు తెచ్చిన కొత్త సిద్ధాంతం ప్రకారం, వ్యవసాయజనానికీ, వేట-ఆహారసేకరణజనానికీ మధ్య చాలా తక్కువ సాంకర్యమే జరిగింది. ఈ విధంగా ఈ కొత్త సిద్ధాంతం అయిదువేల ఏళ్ల క్రితం స్వీడన్ లోని వేట-ఆహారసేకరణ జనానికి, వ్యవసాయజనాలకు మధ్య జన్యుపరమైన తేడా ఎందుకుందో వివరించడమే కాదు; ప్రాచీన వ్యవసాయజనానికీ, నేటి సార్డీనియాజనానికీ మధ్య జన్యుపరమైన పోలిక ఎందుకుందో కూడా చెప్పింది. నేటి సార్డీనియాజనం, ఎనిమిదివేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా నుంచి ఆ దీవికి వలసవచ్చి, అప్పటికే అక్కడున్న వేట-ఆహారసేకరణ జనానికి స్థానభ్రంశం కల్పించిన వ్యవసాయజనానికి వారసులు.
సార్డీనియాదీవి విసిరేసినట్లు దూరంగా ఉండడంవల్ల యూరప్ ప్రధాన భూ భాగంలో జనాభా మార్పులకు దారి తీసిన ఘటనల ప్రభావం ఈ దీవి జనంపై చాలా స్వల్పంగా పడిందని డేవిడ్ రైక్ అంటాడు. ఇంతవరకు ఈ కొత్త సిద్ధాంతం బాగానే ఉందనీ, అయిదువేల సంవత్సరాల క్రితం జీవించిన ఎక్కువ మంది యూరోపియన్ల జన్యు సమ్మేళనాన్ని ఇది సక్రమంగానే వివరించ గలిగిందని కూడా ఆయన అంటాడు. స్కాగ్లండ్, జాకబ్ సన్ లు మరింత ముందుకు వెళ్ళి, పైన చెప్పిన వేట-ఆహారసేకరణజనాలూ, వ్యవసాయజనాలే ఇప్పటి యూరోపియన్లందరికీ జన్యువారసత్వాన్ని అందించి ఉండచ్చని ప్రతిపాదించారు. ఇక్కడే అతి ముఖ్యమైన ఒక అంశాన్ని వారు గుర్తించలేదని డేవిడ్ రైక్ అంటాడు.
సమస్యను తిరగదోడిన కొత్త జన్యుమూలం
2012 నాటికల్లా, నేటి యూరోపియన్ల జన్యుమూలాలేమిటన్న అతి పెద్ద ప్రశ్నకు సమాధానం దొరికినట్టే అనిపించింది కానీ, అంతలో వెలుగు చూసిన ఒక కొత్త జన్యుమూలం ఆ ప్రశ్నను తిరగదోడింది. అదే-ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఏన్షియంట్ నార్త్ యూరేసియన్(ANE)జనాభా. నేటి ఉత్తర యూరప్ కు చెందిన జనానికీ, అమెరికా ఆదివాసు(Native Americans)లకూ మధ్యనున్న జన్యుసంబంధాన్ని బయట పెట్టే క్రమంలో నిక్ పేటర్సన్ (Nick Patterson)అనే జన్యుశాస్త్రవేత్త, 15వేల సంవత్సరాల క్రితం ఉత్తర యూరేసియా అంతటా వ్యాపించిన ఈ ANE జనాభా ఉనికిని ఊహించాడు. సైబీరియాలోని మాల్టాలో బయటపడిన, 24వేల ఏళ్ల క్రితం నాటి ఒక బాలుని అవశేషం ANE ఉనికిని(2013లో) ధ్రువీకరించిన సంగతిని ఇంతకు ముందు చెప్పుకున్నాం.
కొత్తగా ANE జన్యు ఆధారాలు
ఇలా ఒక పక్కనేమో, నేటి ఉత్తర యూరోపియన్లలో ANE జన్యుమూలాలు కనిపిస్తున్నాయి; ఇంకో పక్క, యూరప్ ఆదివాసులైన వేట-ఆహారసేకరణజనానికీ, అనటోలియా నుంచి వచ్చిన వ్యవసాయజనాలకూ మధ్య సవ్య-అపసవ్య రీతుల్లో సాంకర్యం(two-way mixture) జరిగినట్టు ప్రాచీన DNA అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రెండింటినీ సమన్వయించడం ఎలా?! ఎనిమిదివేల నుంచి-అయిదువేల సంవత్సరాల క్రితం జీవించిన వేట-ఆహారసేకరణజనానికీ, వ్యవసాయజనానికీ సంబంధించిన అదనపు DNA సమాచారం లభ్యమవడంతో ఇది మరింత చిక్కు ప్రశ్నగా మారిందని డేవిడ్ రైక్ అంటాడు. ఈ సమాచారం ANE ఉనికితో పని లేకుండానే సవ్య-అపసవ్య సాంకర్యం మోడల్ కు సరిపోతోంది. దీనిని బట్టి ఆ తర్వాతి అయిదువేల సంవత్సరాలలోనే అత్యంత ప్రభావం కలిగిన ఘటన ఏదో జరిగి ఉండాలనీ, ANE జన్యువారసత్వాన్ని (కొత్తగా) ప్రవేశ పెట్టడం ద్వారా జన్యుపరంగా యూరప్ మొత్తంలోనే పరివర్తన తెచ్చే కొత్త వలసలు సంభవించి ఉండాలనీ డేవిడ్ రైక్ అంటాడు.
కళ్ళకు కట్టిన 8వేల ఏళ్ల యూరప్ చరిత్ర
2014-15లో, జర్మనీ, స్పెయిన్, హంగేరీ, తూర్పు యూరప్ కు చెందిన స్టెప్పీ, అనటోలియా (నేటి టర్కీ, దాని పరిసరప్రాంతాలు)కు చెందిన వ్యవసాయజనాలతో సహా 200మంది ప్రాచీన యూరోపియన్ల తాలూకు సమాచారాన్ని ప్రాచీన DNA కమ్యూనిటీ, ప్రత్యేకించి తమ లేబరేటరీ వెల్లడి చేసిందని డేవిడ్ రైక్ చెబుతూ; తమ సహచరుడు ఇయోసిఫ్ లజరడిస్ ఈ ప్రాచీన యూరోపియన్లను నేటి పశ్చిమ యూరేసియన్ జనంతో తులనాత్మకంగా పరిశీలించి, గత 5వేల సంవత్సరాలలో (కొత్తగా) ANE వారసత్వం యూరప్ లోకి ఎలా అడుగుపెట్టిందో చెప్పగలిగాడంటాడు. ప్రాచీన DNA మచ్చులను అన్నిటినీ ఒకే ప్లాట్ లో ఉంచడం ద్వారా కాలగతిలో వాటి స్థానాలలో ఎలా మార్పు వచ్చిందో చూడగలిగామనీ, గత 8వేల సంవత్సరాల యూరోపియన్ చరిత్ర అంతా మా కళ్ల ముందు ఆవిష్కృతమైందనీ, తమలో చాలా మందికి చెందిన జన్యువారసత్వంతో పోలికలేని జన్యువారసత్వం కలిగిన జనాభా నుంచి ఇప్పటి యూరోపియన్లు ఎలా రూపొందారో టైమ్ లాప్స్ వీడియో చూపించినట్టు చూపించిందనీ ఆయన అంటాడు.
ఇదీ వలసల క్రమం
యూరప్ లోకి మొదట వేట-ఆహారసేకరణ జనం వచ్చారు. వీరు కూడా ఇంతకు ముందు చెప్పినట్టుగా, అప్పటికి 35వేల సంవత్సరాల వెనకటి కాలంలో సంభవించిన రకరకాల జనాభా పరివర్తనల నుంచి పుట్టినవారే. 14వేల సంవత్సరాల క్రితం ఈశాన్య యూరప్ నుంచి పెద్ద ఎత్తున వ్యాపించిన జనాలు ఈ క్రమంలో చివరివారుగా చెప్పుకోవచ్చు. వీరు అంతకు ముందు అక్కడున్న జనానికి స్థానభ్రంశం కలిగించారు. వీరు నేటి యూరోపియన్లకే జన్యువారసత్వం ఇచ్చారు తప్ప నేటి పశ్చిమాసియా జనానికి ఇవ్వలేదని పరిశోధనలు తేల్చాయి.
ఆ తర్వాత, 8,800-4,500 సంవత్సరాల మధ్య కాలంలో జర్మనీ, స్పెయిన్, హంగేరీ, అనటోలియాలలో నివసించిన తొలి వ్యవసాయజనం వచ్చారు. ఈ ప్రాచీన వ్యవసాయ జనాలు నేటి సార్డీనియా జనానికి జన్యురీత్యా దగ్గరగా ఉన్నారు. అంటే, వీరికి పూర్వీకులైన మార్గదర్శక వ్యవసాయజనాభా బహుశా అనటోలియా నుంచి గ్రీస్ లోకి అడుగు పెట్టి అక్కడి నుంచి పశ్చిమాన ఐబేరియా(Iberia: ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జిబ్రాల్టర్, ఆండోరా దేశాలను ఐబేరియా ద్వీపకల్ప దేశాలుగా పిలుస్తారు)కు, ఉత్తరాన జర్మనీకి వ్యాపించారన్నమాట. ఈ వ్యాపించే క్రమంలో కూడా వీరు 90 శాతం మేరకు తమ జన్యుమూలాలను నిలుపుకున్నారు తప్ప, తమ వలస మార్గంలో తారసపడిన వేట-ఆహారసేకరణజనంతో పెద్దగా సాంకర్యం చెందలేదు.
గ్రీస్ జనంలో ఇరాన్ జన్యువారసత్వం
అదే సమయంలో, దక్షిణ గ్రీస్ లోని పెలొపనీస్(Peloponnese)లో ఆరువేల సంవత్సరాల క్రితం జీవించిన వ్యవసాయజనం అనటోలియాలోని భిన్న జనాభా నుంచి జన్యువారసత్వం పొందారనీ; మిగతా యూరప్ లోని వ్యవసాయజనానికి జన్యు వారసత్వం కల్పించిన అనటోలియా వాయవ్య ప్రాంత వ్యవసాయజనానికి భిన్నంగా పెలొపనీస్ వ్యవసాయజనం ఇరాన్ తో సంబంధమున్న జనాల నుంచి అభివృద్ధి చెందిన జనాభా నుంచి వచ్చారనీ తమ పరిశోధనల్లో తేలిందని డేవిడ్ రైక్ అంటాడు. యూరప్ లో మొట్టమొదటగా వ్యవసాయాన్ని ప్రవేశపెట్టినది పెలొపనీస్ లోనూ, అక్కడికి దగ్గరలోని క్రీటు దీవిలోనే కనుకా, ఈ వ్యవసాయజనం కుండలు ఉపయోగించలేదు కనుకా వీరు వేరొక వలసకు చెందినవారు కావచ్చని కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు భావించారనీ, తమ ప్రాచీన DNA ఆవిష్కారాలు కూడా ఆ భావనకు అనుగుణంగానే ఉన్నాయనీ, ఈ జనం వేల సంవత్సరాలపాటు ఈ ప్రాంతంలోనే ఉండిపోగల అవకాశాన్ని ఇది సూచిస్తోందని కూడా ఆయన అంటాడు.
రెండు వేల ఏళ్ళు ఆలస్యంగా సాంకర్యం
ఆ తర్వాత 6వేలు-4,500 సంవత్సరాల మధ్య మరో కొత్త పరిణామం జరిగింది. ఈ కాలానికి చెందిన వ్యవసాయజనంలో, అంతకు ముందున్న వ్యవసాయజనానికి భిన్నంగా, వేట-ఆహారసేకరణజనం తాలూకు జన్యువారసత్వం 20శాతం మేరకు అదనంగా కనిపించింది. అంటే, అప్పటికే అక్కడ స్థిరపడి ఉన్న జనానికీ, వలస వచ్చిన జనానికీ మధ్య రెండువేల సంవత్సరాలు ఆలస్యంగా జన్యుసాంకర్యం మొదలైందన్నమాట. ఈ వ్యవసాయజనాలూ, వేట-ఆహారసేకరణజనాల సహజీవనం ఎలా సాధ్యమైందనే ప్రశ్నను డేవిడ్ రైక్ ముందుకు తెస్తూ, ఫన్నెల్ బీకర్ (Funnel Beaker Culture: పైన గరాటు ఆకారం కలిగిన అలంకృత పాత్రలను తయారు చేసినవారి సంస్కృతిని ఈ పేరుతో గుర్తించారు) సంస్కృతిలో దీనికి సూచన లభిస్తుందని అంటాడు.
6వేల 3వందల సంవత్సరాల క్రితం నాటి సమాధుల్లో ఇలాంటి పాత్రలు బయటపడ్డాయి. బాల్టిక్ సముద్రానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఈ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఎక్కువ మట్టి ఉండి, జిగురు జిగురు గా ఉండే ఉత్తర యూరప్ లోని భూములను సాగుచేయడానికి అవసరమైన పద్ధతులు అప్పటికి అందుబాటులో లేకపోవడంతో తొలి వ్యవసాయజనం ఆ ప్రాంతానికి వెళ్లలేదు. ఈ పరిస్థితి నుంచి రక్షణ పొందిన అక్కడి వేట-ఆహారసేకరణ జనం బాల్టిక్ సముద్రంలోని మత్స్యసంపద మీద ఆధారపడి జీవిస్తూ వెయ్యేళ్లపాటు వ్యవసాయానికి దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత దక్షిణాది జనం నుంచి పశుపోషణను, పంటసాగును తెచ్చుకున్నా తమ వేట-ఆహారసేకరణ జీవన విధానాన్ని చాలా వరకూ నిలుపుకున్నారు.
భారీ శిలానిర్మాణాలు
వీరే మెగాలిత్(భారీశిలలతో కూడిన నిర్మాణాలు)లను, ఉమ్మడి శిలాసమాధులను నిర్మించారు. ఈ నిర్మాణాలు దక్షిణాది వ్యవసాయజనానికి, తమకూ మధ్య ప్రాదేశిక విభజనకు, లేదా ప్రాదేశిక అధికారాన్ని చాటుకోవడానికి ఉద్దేశించి ఉండచ్చని కాలిన్ రెన్ ఫ్రూ(Collin Renfrew) అనే పురావస్తుశాస్త్రవేత్త అంటాడు. ఈ ఉత్తర, దక్షిణ జనాల మధ్య సంపర్కాన్ని జన్యుసమాచారం వెల్లడిస్తూ ఉండచ్చని, మొత్తానికి 6వేల నుంచి 5వేల సంవత్సరాల క్రితం నాటికి ఉత్తర యూరప్ జన్యుకోశాన్ని చాలా వరకు వ్యవసాయజనాల జన్యువారసత్వం ఆక్రమించుకుందని డేవిడ్ రైక్ అంటాడు. వేట-ఆహారసేకరణ జనం తాలూకు అతి తక్కువ జన్యువారసత్వమూ; అనటోలియా నుంచి వచ్చిన వ్యవసాయజనాల తాలూకు అత్యధిక జన్యువారసత్వమూ కలిగి, వేట-ఆహారసేకరణ సంస్కృతికి చెందిన కీలక లక్షణాలను నిలుపుకున్న జనాభాకే ఫన్నెల్ బీకర్ సంస్కృతి ప్రాతినిధ్యం వహిస్తోంది.
తూర్పు నుంచి ముంచెత్తనున్న జనాలు
చివరికి యూరప్ ఏ పరిస్థితికి వచ్చిందంటే, సాంకర్యం చెందని వేట-ఆహారసేకరణ జనం అనేక చోట్ల అదృశ్యమైపోయారు. దక్షిణ స్వీడన్ కు దగ్గరలో ఎక్కడో విసిరేసినట్టు ఉన్న కొన్ని దీవుల్లోనే మిగిలారు. ఆగ్నేయ యూరప్ లో స్థిరజీవనానికి అలవాటుపడిన వ్యవసాయజనం వర్గీకరణ లక్షణం, లేదా నిమ్నోన్నతాలు కలిగిన సమాజాలను( stratified societies), స్త్రీకేంద్రితమైన మతకర్మకాండను అభివృద్ధి చేశారు. మారుమూల బ్రిటన్ లోని జనం అప్పటికి, ప్రపంచమే కనీవినీ ఎరగని బ్రహ్మాండమైన మానవ నిర్మిత శిలాస్మారకాల నిర్మాణంలో మునిగి ఉన్నారు. స్టోన్ హెంజ్(Stonehenge) పేరిట ప్రసిద్ధమైన నిర్మాణం ఉన్నచోటు యాత్రాస్థలంగా మారింది. ఇంకోవైపు జనం తమ దేవుళ్ళకు పెద్ద పెద్ద ఆలయాలు, మృతులకు సమాధులు నిర్మించే పనిలో కూడా పడ్డారు. కానీ మరో అయిదు వందల సంవత్సరాలలో తమ వారసులు అంతరించి పోనున్నారనీ, తమ నేల ఆక్రమణకు గురి కాబోతోందనీ వారికి తెలియదు.
తూర్పు నుంచి ఒక వలస ప్రవాహం ముంచెత్తబోతోంది!
***
ఈ యూరప్ పరిణామాల అద్దంలో, ముఖ్యంగా స్థానిక వేట-ఆహారసేకరణజనం, బయటి నుంచి వచ్చిన వ్యవసాయజనాల సంబంధాలు, సాంకర్యాల అద్దంలో మనదేశ పురాచారిత్రక ప్రతిబింబాన్ని కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇంకా అనేక విషయాలలో యూరప్, భారత్ అనుభవాల సారూప్యాన్ని దర్శించవచ్చు. ఆ విధంగా యూరప్ పరిణామాల గురించి చెప్పుకోవడమంటే మన గురించి మనం చెప్పుకోవడం కూడా!
(యూరప్ లో అనంతర పరిణామాలు, భారత్ జన్యుచరిత్రల గురించి తర్వాత)
*****
(సశేషం)
సాహిత్య విమర్శకుడిగా, పత్రికా రచయితగా, రాజకీయ విశ్లేషకుడిగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, కథా రచయితగా కల్లూరి భాస్కరం తెలుగు పాఠకులకు పరిచితులు. ఆయన వివిధ తెలుగు పత్రికలలో పనిచేశారు. సాహిత్య విమర్శలోనే కాక, రాజకీయ సామాజిక అంశాలలోనూ కొత్త ఆలోచనలను పరిచయం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పురాచరిత్ర, మానవ పరిణామ చరిత్రల పై ప్రత్యేక ఆశక్తి, అధ్యయనంతో అనేక వ్యాసాలు రచించారు.
‘కాళికస్పృహ – మరికొన్ని సాహిత్య వ్యాసాలు’, ‘కౌంటర్ వ్యూ (ఆంధ్రప్రభలో రాసిన వీక్లీ కాలమ్)’, ‘అవతల’ (వార్తలో రాసిన రాజకీయ, సామాజిక వ్యాసాలూ), ‘గ్లోబల్ సందర్భంలో నగ్నముని కొయ్యగుర్రం’, ‘లోపలి మనిషి’ (భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు రచన ‘ది ఇన్సైడర్’కు తెలుగు అనువాదం), ‘మోహన్ దాస్’ (రాజ్ మోహన్ గాంధీ ఆంగ్లంలో రాసిన గాంధీజీ చరిత్రకు తెలుగు అనువాదం) కల్లూరి భాస్కరం ముద్రిత రచనలు. మహాభారతంలోని మన చారిత్రక మూలాలను తవ్వి తీసే ప్రయత్నంలో ఈ రచన తొలిభాగం మాత్రమే. మహాభారతం ఆధారంగా ఆయన రచించిన మరికొన్ని పుస్తకాలు త్వరలో ముద్రణ కాబోతున్నాయి.